S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రపంచంలోనే ఎతైన పోస్టాఫీసు

హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయ పర్వతాల నడుమ మారుమూల స్పితి లోయలో ఉన్న హిక్కిం పోస్టాఫీసు అది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన పోస్టాఫీసు ఇది. సముద్ర మట్టానికి దాదాపు 4, 400 మీటర్ల ఎత్తులో ఉంది ఈ పోస్టాఫీసు. ఇక్కడి నుండి ప్రపంచంలోని నలుమూలలకూ ఉత్తరాలు వెళుతుంటాయి. భూగోళంపై అత్యంత ఎత్తులో ఉన్న నివాస ప్రాంతాల్లో స్పితి లోయ ఒకటి. ఇదో కొత్త ప్రపంచం. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే ఎతైన పర్వతాలు, మధ్యలో పెద్ద పెద్ద పాముల్లా పారే నదులు, అత్యంత ప్రమాదకరమైన దారులు, ఎముకలు కొరికే చలి.. వంటివన్నీ ఈ లోయ ప్రత్యేకతలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడికి వెళితే ఓ కొత్త ప్రపంచానికి వెళ్లినట్లుగా ఉంటుంది. వీటి మధ్యన అత్యంత ఎత్తులో.. అంటే సముద్ర మట్టానికి దాదాపు 4, 440 మీటర్ల ఎత్తులో ఒక చిన్న పోస్ట్ఫాసు ఉంది. 1983లో భారత తపాలా శాఖ ఈ పోస్టాఫీసు ను ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఇక్కడ ఒకే పోస్ట్‌మాస్టర్ పనిచేస్తున్నాడు. అతని పేరు రించెన్ చెరింగ్. స్పితి లోయలో ఉన్న మరికొన్ని చిన్న ఊళ్లవాళ్లు కూడా ఈ పోస్ట్ఫాసుకే వస్తుంటారు. ఉత్తరాలు పంపేందుకు, సేవింగ్స్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులందరూ ఈ పోస్టాఫీసుకే వస్తుంటారు. ఇక్కడి నుండి ఉత్తరాలను బట్వాడా చేయాలంటే చాలావరకు కాలినడకనే వెళ్లాలి. చలికాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. దాంతో అప్పుడప్పుడూ పోస్టాఫీసును మూసేయాల్సి వస్తుందని చెబుతాడు పోస్ట్‌మాస్టర్ రించెన్. స్పితి లోయకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా పట్టణానికి ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలను తీసుకెళతారు. అందుకు రోజూ ఇద్దరు పోస్ట్‌మ్యాన్‌లు కొండ కోనలను దాటుకుంటూ రానుపోను కలిపి దాదాపు 46 కిలోమీటర్లు నడుస్తారు. కాజా నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ఇతర ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో ఉత్తరాలను పంపుతారు.
ఇక్కడ నాలుగైదు గ్రామాలకు కలిపి ఇదొక్కటే పోస్టాఫీసు. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ కూడా చాలా తక్కువ. ఇక ఇంటర్నెట్ ఊసే లేదు. సముద్ర మట్టానికి 4,587 మీటర్ల ఎత్తులో కోమిక్ అనే పల్లె ఉంది. భూమిపై అత్యంత ఎత్తులో ఉండి, రోడు మార్గంలో అనుసంధానమైన ఊరు ఇదొక్కటే.. ఈ ఊరిలో కేవలం 13 నివాసాలు, ఒక పురాతన మఠం, ఒక స్కూలు ఉంది. ఈ స్కూలులో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ బార్లీ, బఠానీ పంటలు పండిస్తారు. దట్టమైన మంచు కారణంగా ఇక్కడి గ్రామాలకు ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు ఇతర ప్రాంతాలతో రవాణా మార్గాలు మూసుకుపోతాయి. దాంతో ఇక్కడి వాళ్లు బయటకు వెళ్లడమే కష్టంగా మారుతుంది. స్పితి లోయలో చాలా ప్రసిద్ధ బౌద్ధ మఠాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వెయ్యేళ్లక్రితం నిర్మించినవి కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రజల్లో బౌద్ధమత స్ఫూర్తి కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 4, 166 మీటర్ల ఎత్తులో ఉన్న 3కీ2 అనే మఠం ఈ లోయలో అతి పెద్ద మఠం. ఎతైన పర్వతాల నడుమ నెలకొని ఉన్న ఈ మఠం పక్కనుంచే నది ప్రవహిస్తుంది. స్థానికుల మతం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక బాంధవ్యాలకు నెలవుగా ఈ మఠాలు నిలుస్తున్నాయి. ఇక్కడ శతాబ్దాల కిందటి సంస్కృతి, సంప్రదాయాలు సజీవంగా కనిపిస్తాయి. అందుకే ఈ లోయను, లోయ అందాలను తిలకించడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఇలా వచ్చే పర్యాటకులు అత్యంత ఎత్తులో ఉన్న ఈ పోస్టాఫీసు నుండి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చే సందర్శకులు ఇక్కడి నుండి సొంతూళ్లకు, సన్నిహితులకు, స్నేహితులకు ఉత్తరాలను పంపిస్తుంటారు.

-మహి