S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రేపు రూపు

నాకు సినిమా రంగంలో పనిచేసే అవకాశాలు వచ్చాయి. కానీ నేనే వద్దని నిర్ణయించుకున్నాను. ఒక సందర్భంలో ఒకటి రెండు కథలు చెప్పాను. బాగున్నాయి, వీటిని మీ దర్శకత్వంలోనే సినిమాలు తీయవచ్చు కదా అని సీరియస్‌గానే ప్రతిపాదన వచ్చింది. ఎందుకు మానుకున్నానో, నాకు తెలియదు. ఈ మధ్యన ఒక నవల రాశాను. అది సినిమాకు బాగా పనికి వస్తుందని ఒకరికి ఇద్దరు అన్నారు. సినిమా ప్రపంచం వాళ్లను పరిచయం చేస్తాము అని కూడా అన్నారు. నేను నిజానికి ఆ విషయం గురించి పట్టించుకున్నట్టు లేదు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఈ మధ్యన సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం కథ తోచింది. ఆ కథ నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి అన్నది ప్రశ్న.
మనిషి చేస్తున్న రకరకాల పనుల కారణంగా ప్రళయం వచ్చేసింది. ప్రపంచం నాశనం అయింది. కానీ ఎక్కడో మూలన కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్లకు పాత పుస్తకాలు, ఫొటోలు దొరికాయి. వాటి ఆధారంగా ప్రపంచాన్ని మళ్లీ నిర్మించుకోవాలని వాళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది సినిమాకు కథ. ఇక అది ముందుకు నడిచే పద్ధతి గురించి చెప్పాలంటే కొన్ని మాటల్లో కుదరదు. వచ్చిన ప్రళయం ఎటువంటిది అని నిర్ణయించుకోవాలి. దాని తరువాత ఏం మిగిలింది అని నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మంటలు పుట్టి అని అనుకుందాము. ప్రపంచంలో చాలా చోట్ల ఇళ్లను చెక్కతో కట్టుకుంటారు. మంటల్లో ఆ నిర్మాణాలు కాలిపోతాయి. వాటిలోని పుస్తకాలు, వస్తుజాలం కూడా కాలిపోతాయి. అదే మరి సిమెంట్‌తో కట్టిన భవనాలు అయితే కొంతవరకైనా మిగులుతాయి. కొన్ని వస్తువులను కాపాడతాయి.
చిత్రంగా ఎటువంటి వస్తువులు మిగులుతాయి అన్నది కూడా బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు గుడ్డలు అన్నీ కాలిపోతాయి. కాగితాలు కూడా కాలిపోతాయి. చెక్క వస్తువులు కూడా కాలిపోతాయి. చెపితే నమ్ముతారో లేదో కానీ, ప్రపంచం నిండా ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయి ముద్దలుగా మిగిలిపోతాయి. పింగాణి మిగులుతుంది. గాజు ముద్దలుగా మిగులుతుంది. వజ్రం లాంటి గట్టి వస్తువులు కూడా మిగలవచ్చు. కానీ అవి చాలా చిన్నవి. ఏం చూసి మరి మిగిలిన మనుషులు కొత్త ప్రపంచాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తారు? అంత సులభంగా చెప్పేస్తే మీరు ఈ కథను తీసుకుపోయి, సినిమా వాళ్లకి ఇస్తారు. నాకు నిజానికి నష్టం లేదు. నేను ఇటువంటి ఆలోచనలు చాలా మందికి చెప్పాను. నా ఆలోచన నిజమైతే చాలు, అది నేనే చేయవలసిన అవసరం లేదు అని గట్టిగా నమ్ముతాను కనుక నేను అంతగా పట్టించుకోను.
రేపు ఏమవుతుంది అన్న విషయానికి మనం ఇచ్చే ప్రాముఖ్యత నిజానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఈ వ్యాసం రాస్తున్నాను. అది తప్పకుండా పత్రిక వారికి చేరుతుంది. ఆదివారంనాడు మీ చేతికి అందుతుంది. మీరు చదువుతారు అని కదా నా నమ్మకం? ఇక పత్రిక చేతికందగానే చాలామంది వారఫలాలు చూస్తారు. ప్రపంచంలోని మనుషులు అందరిని కేవలం పనె్నండు రాశుల కింద విభజించి వారికి వచ్చే వారంలో ఏం జరుగుతుంది అని చెపుతారు. ఆ చెప్పిన పది వాక్యాలలో ఒకటి రెండు నిజం అనిపిస్తాయి. ఇంకేముంది మన భవిష్యత్తు చాలా బాగుంది అని, లేక బాగోలేదు అని సంతోషించడం, కుంగిపోవడం ఆ తర్వాతి కార్యక్రమం. రానున్నది రాక మానదు, కానున్నది కాక మానదు, అని ఇది పట్టకుండా బతికేవాళ్లు కూడా కొంతమంది ఉంటే ఉండవచ్చు. ఉండే ఉంటారు. అంతేకాని పది సంవత్సరాల తర్వాత, వంద సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉంటాము? ఈ ప్రపంచం ఎలాగ ఉంటుంది? మన పరిస్థితులు ఎలా ఉంటాయి? అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మనమంతా ప్రస్తుతం మనుషులం. గతం గురించి మర్చిపోతాము. భవిష్యత్తు గురించి పట్టించుకోము. నిజానికి వచ్చే కొన్ని దశాబ్దాలలో జరగబోయే మార్పులు ఈ ప్రపంచం భవిష్యత్తును నిర్ణయిస్తాయంటే నమ్మగలరా?
బీ బీ సీలో రేపటి ప్రపంచం అని అర్థం వచ్చే ఒక కార్యక్రమం కనిపించేది. టీవీలో అన్నమాట. అందులో సైన్స్‌లో జరుగుతున్న ఇటీవలి పరిశోధనల గురించి చూపిస్తారు. అంటే రేపు ఈ ప్రపంచమంతా సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని వాళ్లు భావించినట్లున్నారు. నాలాంటి వారికి అది నూటికి నూరు పాళ్లు నిజంగా కనిపిస్తుంది. నాకు ఈ ప్రపంచమంతా సైన్సు అన్న భావన గట్టిగా ఉంది. అటువంటి భావన అందరికీ కలగాలని నేను చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాను. కనుక సైన్సును నమ్ముతాను. చదువు చెబుతున్నారు. అవసరము ఉండనీ లేకపోనీ చరిత్ర గురించి మాత్రం బాగా చెబుతున్నారు. ఆ చరిత్ర వలన ఎవరికి ఏం ప్రయోజనం ఉంటుందో నాకు అర్థం కాదు. ఇక సైన్స్ చెప్తున్నారు. అందరికి ఆదియందు వాక్యముండెను దగ్గర మొదలుపెట్టి వౌలికమైన అంశాలు మాత్రమే చెబుతున్నారు. ప్రస్తుత ప్రపంచం మీద సైన్స్ ప్రభావం గురించి ఎక్కడా చెబుతున్నట్టు కనిపించదు. ఫిజిక్స్ మూల సూత్రాలను చదువుకున్న వారికి ఆ సూత్రాలు పని చేస్తున్న తీరు అర్థం అవుతుంది అని నేను అనుకోను. రసాయనాల గురించి అయినా అంతే. ఈ చదువు తీరు మారుతుందా అన్నది ఇక్కడ అంశం కాదు. మొత్తానికి ప్రపంచం ప్రస్తుత పరిస్థితి గురించి చదువు చెప్పే సంస్థలు ఎక్కడా కనిపించవు. ఇక రానున్న కాలం గురించి చెప్పేవారు ఎవరైనా ఉంటారా? ఎక్కడైనా అటువంటి కోర్సులు ఉంటాయా? ఉంటే నా సినిమా గురించిన ఆలోచనలు మరింత సులభంగా సాగుతాయి. సినిమా గురించి, సంగీతం గురించి, సాహిత్యం గురించి ఆసక్తి కనబరచడం చాలా గొప్ప విషయమే. సైన్స్ గురించి ఆసక్తి కనబరచడం అంతకన్నా గొప్ప విషయం. అప్పుడు మనం మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం. సైన్స్ బాగా పెరిగింది. మనకు తెలియకుండానే కావలసిన సదుపాయాలను ఎన్నింటినో మనకు అందిస్తున్నది. ఎన్నో అవకాశాలను కలిగిస్తున్నది. ఒకప్పుడు కేవలం కల్పనలలో ఉండిన విషయాలను నిజం చేసి చేతికి అందిస్తున్నది. వాట్సాప్‌లో మాట్లాడుకునే వాళ్లను చూస్తే, మా అబ్బాయి, మాయాబజార్ సినిమాలోని ప్రియదర్శిని బాక్స్ గురించి జ్ఞాపకం చేస్తాడు. నీవేనా నను తలచినది అంటూ పాట మొదలుపెడతాడు. అంతకన్నా మరింత ముందుకు ఆలోచించగలిగితే, ఇప్పుడు ఒకప్పుడు వీలుకాని ప్రశ్నలను అడిగి జవాబులను పొందగలిగే అవకాశం కలుగుతున్నది. వాతావరణ సూచనలు వారం రోజులు ముందుగా కూడా ఇవ్వగలుగుతున్నారు. అదే రకంగా రానున్న కాలంలో జరుగబోయే అంశాలను గురించి ఊహకు అందని ప్రశ్నలను అడుగుతున్నారు జవాబులు చెబుతున్నారు. ఉదాహరణకు ఏదో కారణంగా హిమాలయాలు మొత్తంగా కరిగిపోతే, సముద్ర మట్టం పెరుగుతుందా? అప్పుడు తీరంలో ఏ ప్రాంతాలు మునిగిపోతాయి? అన్న ప్రశ్నకు కంప్యూటర్ మోడలింగ్ సాయంతో జవాబులు చెబుతున్నారంటే ఆశ్చర్యపడక తప్పదు.
రేపు గురించి ప్రశ్నలు అడిగాము. రానున్న పది సంవత్సరాలు, వంద సంవత్సరాలు గురించి అడుగుతున్నాము. ఆ తరువాత ఏమవుతుంది అని కూడా అడుగుతున్నాము. ప్రపంచంలోని పరిశోధన సంస్థలు అన్నీ కలిసి ఒకే ప్రశ్న గురించి పనిచేసి, వచ్చిన ఫలితాలను ఒకచోట చేర్చి, అందులో తప్పులను గుర్తించి, మంచి జవాబులను అందించ గలుగుతున్నారు. మరి ఈ క్రమంలో, మన ప్రపంచం రానున్న కాలంలో ఏ రకంగా మారబోతున్నది? అని కూడా అడుగుతున్నాము.
నా సినిమాకు సబ్జెక్ట్ ఇదే కదా? అందుకనే నాకు ఈ విషయంలో ఆసక్తి ఉండాలి. అదేమీ కాదు. నాకు నిజంగానే ఈ ప్రపంచం గురించి బెంగగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మన పూర్వీకులు మనకు అనుభవించడానికి అరువు ఇచ్చాడు అంతేకాని, ఇష్టం వచ్చినట్టు వాడుకుని సర్వనాశనం చేయడానికి మాత్రం ఇవ్వలేదు. ఈ మాట నేను ఎప్పుడు అన్నాను. నేను అన్న మాట నిజం కాబట్టి, ఇటువంటి మాటలే ప్రపంచంలో చాలామంది అన్నారు. మనం దురాశ కొద్ది అవసరం లేని చాలా విషయాలను చేసినట్టు ఉన్నాము. కనుక ప్రపంచం పరిస్థితి మన చేతిలో లేకుండా మారిపోతున్నది. అనుకోని విషయాలు జరుగుతున్నాయి. అనుభవం ప్రకారం ఒక పద్ధతిలో వర్షాలు వస్తాయి అనుకుంటే, అవి ఇప్పుడు ఆ పద్ధతిలో రావడం లేదు. వచ్చినప్పటికీ జనం ఎక్కువ ఉన్న నగరాల మీద వర్షం కురిసి సర్వనాశనం జరుగుతున్నది. చాలా మందికి ఈ విషయం అర్థం అయింది. పరిశోధకులు దీన్ని గురించి గట్టిగా పట్టించుకుంటున్నారు. కానీ పరిస్థితి చేయి జారింది అని కూడా వాళ్లే చెబుతున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితం, ప్రపంచ దేశాల వారు చాలామంది ఒకచోట చేరి జరగవలసిన కార్యక్రమాల గురించి కొన్ని నిర్ణయాలు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో బీదరికం సమస్య పోవాలి, అన్నారు. అందుకుగాను చేయవలసిన పనులను గుర్తించినట్టు కూడా ఉన్నారు. ఈ ప్రపంచం తనకు తానుగా నిలదొక్కుకుని, స్థిరమైన మార్గంలో ముందుకు కదలడానికి అనువైన ప్రణాళికలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో అన్ని దేశాల వారు తప్పకుండా పాల్గొనాలి, ఎవరు వెనుకబడిపోయే పరిస్థితి ఉండకూడదు అని కూడా అన్నారు. వినడానికి చాలా బాగుంది. కానీ ఆ తరువాత కొంత కాలానికే వాతావరణం మార్పు గురించి మరో అంతర్జాతీయ సదస్సు జరిగింది. అక్కడ కూడా నిర్ణయాలు చేశారు. కానీ అక్కడి ప్రతిపాదనలు, పద్ధతులు కొంచెం నిరాశాజనకంగా ఉన్నాయి. ఎక్కడ మొదలుపెట్టాను? ఎక్కడికి వచ్చాను? నా సినిమా ఏమైంది? ఇది కదా ప్రపంచం పరిస్థితి? కేవలం సరదాగా మాట్లాడుకుందామంటే కూడా అందులో ఏవో భయంకరమైన ఆలోచనలకు ఆధారాలు కనబడుతున్నాయి. నిజంగానే ఈ ప్రపంచం భవిష్యత్తు గురించి అందరూ ఆలోచించాలి అన్నది మాత్రం సత్యం. ఇంత ముఖ్యమైన అంశం గురించి, సరదాగా చెప్పుకునే పద్ధతిలో సినిమా కూడా తీయగలిగితే మరింత బాగా ఉంటుంది. అందుకు నిజంగానే గట్టి ఆలోచన జరగాలి. అంటే ప్రపంచంలో ప్రళయం వస్తుందా? వస్తే ఈసారి ప్రళయం ఏ రకంగా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు మొట్టమొదట చాలామంది బుర్రలకు పదును పెట్టాలి. ఇక్కడ మళ్లీ ఒకసారి 2015లో వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించవచ్చు. సైన్స్ గురించి సినిమాలు వస్తే అందులో అభూత కల్పనలు తప్ప, అర్థం కలిగి ఉండి అందరికీ పనికివచ్చే రకం సినిమాలు రానే లేదు. ఇతర గ్రహాలకు యాత్రలు, లేదా ఇతర గ్రహాల నుండి ఎవరో వచ్చి మన మీద దాడి చేయడం, మరమనుషులు చేసే ఘాతుకాలు లాంటి అంశాలను మాత్రమే సినిమాలకు విషయాలుగా వాడుకున్నారు. గతంలోకి వెళ్లిన సందర్భాలలోనూ, రానున్న కాలంలో ఊహించిన చోట్ల కూడా వాస్తవికతకు చోటివ్వలేదు. వరల్డ్ సైన్స్ మీద ఆధారపడలేదు. కనుకనే ఇక్కడ పరిస్థితిని మనం కొంచెం మార్చవచ్చు.
ప్రపంచ దేశాల వారు అందరూ కలిసి చేసిన ప్రతిపాదనలు మూడు కోణాలుగా ఉన్నాయి. ముందుగా ప్రజల సంగతి. పేదరికం, ఆకలి అన్న సమస్యను గట్టిగా పట్టించుకోవాలి. అందరూ గౌరవంగా, సమాన ప్రతిపత్తితో బతికే పరిస్థితి రావాలి అంటున్నారు. ఇది వినడానికి బాగుంది. ఇక భూగ్రహం గురించి ఆలోచించినప్పుడు, జరుగుతున్న వినాశనాన్ని అరికట్టాలని, అందరికీ పనికివచ్చే విధంగా వనరులను వాడుకోవాలని, వాతావరణం మార్పులను గురించి గట్టి పరిశోధనలు జరిపి, అవసరమైన ప్రణాళికలను వెంటనే తయారుచేసుకోవాలని కూడా ప్రతిపాదించారు. దానికి భూమిని కాపాడాలి. ఇది నిజంగా బాగుంది. చివరగా ప్రపంచంలోని మనుషులందరూ ఆనందంగా బ్రతకడానికి అవకాశాలు కల్పించాలి. అది ఆర్థికపరంగా కూడా ఉండాలి. అంటే సాంకేతిక సదుపాయాలు, ఆర్థిక వనరులు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి అన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఇది అన్నిటికన్నా బాగుంది. కానీ వీలవుతుందా అన్నది అనుమానం. మనిషికి అనుమానం రావడం చాలా సహజం. సినిమాకు ఈ విషయాలన్నీ పనికిరావు. సినిమాలో కొత్త ప్రపంచాన్ని కట్టడం వరకు మాత్రమే చూపించవచ్చు. అంటే ఇప్పుడున్న ప్రపంచం ఏం మిగిల్చి వారికి దారి చూపుతుంది అన్నది అసలైన ప్రశ్న. చిత్రంగా తోచవచ్చు. కానీ నేను ఈ అంశాలను సీరియస్‌గా చెబుతున్నాను. సరదాగా మాత్రం చెప్పడం లేదు. అందరూ ఆలోచించండి. నీళ్లు సరిపోవడం లేదు. తిండి సరిపోవడం లేదు. చివరకు గాలి పీల్చి బతకవచ్చు అన్నప్పటికీ ఆ గాలి కూడా బాగుండడం లేదు. అంతా అస్తవ్యస్తం అయింది. అడవులు పోయినయి. అన్ని వ్యవసాయ క్షేత్రాలు అయితే రానురాను పరిస్థితి మారుతుందని అందరికీ తెలుసు. నేను భయపెట్టాలని ఈ సంగతులు చెప్పడం లేదు. కేవలం వాస్తవాలను మళ్లీ ఒకసారి లెక్కపెడుతున్నాను. అయినా సరే సంగతులను ఒక నవల ద్వారా, ఒక సినిమా ద్వారా చెప్పగలిగితే, అప్పుడైనా తలకెక్కుతుంది ఏమో అని నా ఆశ. మనకు మంచి జరుగుతున్నదా చెడు జరుగుతున్నదా తెలుసుకునే జ్ఞానం లేకుండా పోయింది. ఏది పట్టకుండా బతుకుతున్నాము. కనీసం ఈ ఒక్క ముక్క అయినా ఒప్పుకుంటారా?

-కె.బి.గోపాలం