S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సునాద వినోదులు - సుస్వర బేహారులు

జీవనది ఎప్పుడూ ఎండిపోదు. సంగీత ప్రవాహం ఎప్పుడూ నిండుకోదు. అందులో ఎవరు మునిగినా ధన్యులే. స్నానం చేసే ఓపిక లేనివారు చెంబుతో కాసిన్ని నీళ్లు చల్లుకున్నా సంగీత గంగ అనుగ్రహిస్తుంది. ఈదడం తెలిసినవారు నది మధ్యకు వెళ్లి పరమ తృప్తిగా స్నానం చేసినట్లుగా, సంగీతపు లోతుల్ని చూసి పరవశించి గానం చేస్తూ నాదమయ లోకాల్లో విహరించగలిగిన గాన గంధర్వులెందరో ఈ భూమీద పుట్టారు. పాడేశారు, వెళ్లిపోయారు. సిరిసంపదలతో మూట కట్టుకుని కాదు. శ్రోతల హృదయాల్లో శాశ్వతులై తలుచుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చేలా సార్థక జీవులై, కీర్తి శరీరంతోనే ఉండిపోయారు. సంగీతానికదే సార్థకత.
కాలానికి మించిన ఉత్తమ బోధకుడు, జీవితానికి మించిన ధ్యాన మందిరం ఉండదు. కొత్తగా ఏదీ తెచ్చిపెట్టకుండా మనిషిలోని ప్రజ్ఞకు ప్రకాశాన్నిచ్చేది దేవుడే. సంగీత జ్ఞానం విధాత ఇవ్వవలసినదే. ఒకప్పుడు మన ఇళ్లల్లో సంగీతం నేర్చుకునే పిల్లలకు హార్మోనియం పెట్టె కొనిచ్చేవారు. ఆ పెట్టెలో మెట్లుపై వ్రాసిన 12 అంకెలూ, ఒక స్థాయిలోని 12 స్వర స్థానాలూ వుంటాయి. క్రింద రాసిన అంకెలు 1 నుంచి 7 వరకూ, మన గాయకులు సాధారణంగా మాట్లాడుకునే ఒకటి శృతి, రెండు శృతీ అని తెల్ల మెట్లు శృతులూ, ఆధార శృత్తిగా పాడేప్పుడు, ఒకటీ, ఒకటిన్నర, రెండున్నర అంటూంటారు. ఈ శృతుల్ని సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్‌గా, పాశ్చాత్య సంగీత పరిభాషలోని మాటల్ని వాడతారు.
శృతికీ, అపశృతికీ తేడా తెలుసుకున్న వారికి సంగీతం తొందరగా వస్తుంది. మిగిలిన వారు తపస్సుగా భావిస్తేనే సిద్ధిస్తుంది. సంగీతం నేర్చుకునే పిల్లలకు నిజానికి ‘హార్మోనియమ్’ పెద్ద దిక్కు. షడ్జ పంచమాలు గొంతులో పలికించినంత తేలికగా, మిగిలిన స్వరాలు, పిల్లలు పలికించటం కష్టం. హార్మోనియం శృతిలో పాడితే స్వరాల ఉనికి ఇట్టే తెలిసిపోతుంది. కానీ, ఒక స్వరానికి, మరో స్వరాన్ని కలిపి పాడటంలోని రహస్యం మాత్రం ఎదురుగా గురువు చెప్పాలి. లేదంటే అస్సలు తెలియదు. గమక సౌందర్యం తెలిసేది అది తెలిసి పాడే సద్గురువుకే. హార్మోనియంలో గమకాలు పలికించటం చాలా కషటం. కాబట్టి, దాన్ని క్రమంగా వెనక్కు నెట్టేశారు. కానీ ఉత్తరాది సంగీతజ్ఞులకు పెన్నిథి లాంటిది హార్మోనియం.
హిందూస్థానీ గాయకులకు, ముఖ్యంగా ఘజల్ ప్రియులను, ఆనంద లోకాల్లో విహరింపచేస్తూ, మనోధర్మానికి మార్గాన్ని చూపించే సుస్వర వాద్యం హార్మోనియం ఒక్కటే.
దీని స్థానంలో కామధేనువు, కల్పతరు వృక్షంలా ఈ వేళ ‘కీబోర్డ్’ వచ్చి కూర్చుంది. కానీ హార్మోనియంలోని సహజ మాధుర్యం కీబోర్డు ఇవ్వలేదు. ఈ హార్మోనియంలో వినిపించే సునాదం ముందు, అత్యంత ఆధునికమైన ఏ కీ బోర్డైనా దిగతుడుపే.
హార్మోనియం పేరు చెప్పగానే నేను తలుచుకునే సినీ సంగీత దర్శకుడు మాస్టర్ వేణుగా ప్రసిద్ధుడైన మద్దూరి వేణుగోపాల్.
నేను విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసే రోజుల్లో కల్పలత, శ్రోతలు కోరిన సినిమా పాటలైనా చిత్రతరంగిణి కార్యక్రమమైనా ప్రారంభించేది మాస్టర్ వేణు పాటతోనే. కారణం ఏ పాటైనా ఆయన పాట పియానోతో మొదలౌతుంది. పాటకు మెలొడీ ఎలా వస్తుందో తెలిసిన అతి తక్కువ మందిలో వేణు ముందు వరుసలో వుంటాడు. మెలొడీ అంటే సునాదం. ఏయే స్వరాలు కలిపితే నాదం ఏర్పడుతుంది? ఏయే వాద్యాలు కలిపి వాయిస్తే సుస్వరంతో కూడిన నాదం ఏర్పడుతుందో అనుభవంతో నేర్చుకున్న వేణు పాటలే దీనికి నిదర్శనం.
ఏ రాగంలో ఏ స్వరాలకు ఆ మాటలు నప్పుతాయో తెలిసేది సంగీత దర్శకులకే. యజమాని కంటే ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ వేసే ఇంజనీర్‌కు ఆ ఇంటి రూపం కనిపించేస్తుంది.
అలాగే సినీ సంగీత దర్శకుల సంగీతానుభవం అద్భుతమైన పాటలకు కారణవౌతుంది. మాస్టర్ వేణుది కృష్ణా జిల్లా మచిలీపట్నం. గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కవులు, రచయితలు, నటీనటులు, సంగీత విద్వాంసులు పుట్టారనిపిస్తుంది. పుట్టిన ఊరుని వాళ్లు వదిలేసి పొట్టచేత్తో పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయినా, వాళ్లను పట్టుకుని, మా వాడు, మా జిల్లా వాడని చెప్పుకోవటంలో ఆనందాన్ని పొందుతాం. సహజమేగా?
పియానో, గిటార్, దిల్‌రుబా, మాండొలిన్, ఎకార్డియన్, ఫ్లూట్, సెల్లో, వుడోఫోన్, జలతరంగిణి, హేమండ్ ఆర్గన్ మొదలైన పది పదిహేను వాద్యాలు అలవోకగా వాయించగల సమర్థుడు వేణు. పాటల్లోని మాటలు, అందులోని ప్రతి అక్షరం, చక్కని జిలుగులతో రవ్వ జాతి పలుకులతో పాడించటంలో హార్మోనియమే ఆయనకు ఆధారం. ఈయన హార్మోనియం వాద్యం గమక శుద్ధంగా కనిపించడమే విశేషం. క్లారియొనెట్, వేణువు కలిపితే వెన్నముద్దలా మధురంగా ఉంటుందనే వారు. వాద్య ధర్మం తెలియటం వల్ల ఆయన పాటల్లో, నిండుతనం కనిపించి షడ్రసోపేతమైన భోజనం తిన్నంత హాయిగా ఉంటుంది.
ఏ గురువు సహాయం లేకుండా అద్వితీయంగా హార్మోనియంపై పట్టు సాధించిన వేణు వాద్యం, చెన్నైలో ‘గిరీస్ మ్యూజియం’ నడిపే ఓ సంగీతాభిమాని, ఓ రోజు వేణు వాద్యం విని పరవశించిపోయి ఆ రోజుల్లో ప్రసిద్ధుడైన బిఎన్‌ఆర్ ( భీమవరపు నరసింహారావు)కు పరిచయం చేయటంతో సంగీతరంగ ప్రవేశం చేశారు.
సంప్రదాయ సంగీత వాద్యాలతో చేసే వాద్య బృందంలోని మాధుర్యం తెలియాలంటే అలనాటి సంగీత దర్శకులైన ఎస్. ఎం.సుబ్బయ్య నాయుడు, సిఆర్ సుబ్బరామన్, పామర్తి, ఘంటసాల, పెండ్యాల, దక్షిణామూర్తి, రాజేశ్వర్రావు, అశ్వత్థామ, కె.వి. మహదేవన్ వంటి వారి పాటల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. పాతికేళ్ల క్రితం వేణుని విజయవాడ రేడియో కోసం ఇంటర్వ్యూ చేశాను. ఆ జ్ఞాపకాలింకా నా మనస్సులో వున్నాయి.
సంగీతం కంపోజ్ చేసే వారందరూ పాడలేరు. గాయకులందరూ పాటలను ట్యూన్ చేయలేరు. పాడగలిగే ప్రజ్ఞ కలిగిన సంగీత దర్శకుల పాటల్లో సహజత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో బాగా పేరున్న వసంత్ దేశాయ్, నౌషద్, ఎస్.డి. బర్మన్ వంటి అగ్రశ్రేణి సంగీత దర్శకులతో బాగా సాన్నిహిత్యాన్ని పెంచుకున్న మాస్టర్ వేణు హెచ్‌ఎంవి రికార్డింగ్ కంపెనీలో, సంగీత దర్శకుడుగా కొనే్నళ్లు పని చేశారు.
ఘంటసాల వెంకటేశ్వర్రావు పాడిన ‘కుంతీకుమారి’, ‘పుష్పవిలాపం’ జాషువాగారి పాపాయి పద్యాల రికార్డింగ్‌లో ప్రతి పద్యానికీ మధ్యమధ్య వాద్య బృందం సృష్టించినది వేణూయే.
ఆ పద్యాలకు లభించిన ఖ్యాతి వల్ల స్వయంగా ఘంటసాల మాటతో వేణుని విజయా సంస్థకు ఆర్కెస్ట్రా కండక్టర్‌గా తీసుకున్నారు. పివిపి రాజారాం అని ఆ రోజుల్లో విజయవాడలో ఒకే ఒక హార్మోనియం ప్లేయర్ వుండేవాడు. ఆయన తరచూ రికార్డింగులకు వస్తూ మాస్టర్ వేణు తనకు శిష్య వాత్సల్యంతో బహూకరించిన జర్మన్ హార్మోనియంని చూపిస్తూ మురిసిపోయేవాడు.
సింధుభైరవిలో ‘రావోయి రావోయి రా చందమామ’ అనే ఒక లలిత గీతం, మిశ్రమోహన రాగంలో ‘ఓహో! సుందరీ’ అనే పాటలతో వున్న 78 ఆర్‌పిఎం రికార్డు మాత్రం విజయవాడ రేడియో కేంద్రంలో పదిలంగా ఉంది.
సహజమైన సంగీత వాద్యాల మాధుర్యానికి దూరమై పోయాం. తలుపు చెక్కల మీద బాదినట్లు డబ్బాల్లో గులకరాళ్లతో, కీచురాయి శబ్దాలతో చేసే వింతవింత ధ్వనులకు చెవులు అలవాటు పడిపోయి, సుస్వరం, సునాదాల జాడ కాస్తా ఆమడ దూరంలో ఉండిపోయింది. గ్రామఫోన్ రికార్డుల పుణ్యమాని వినగలిగే సంస్కారం కలిగిన శ్రోతలింకా ఉన్నారు. ఎప్పుడు విన్నా నిత్య నూతనంగా భాసిల్లే ఆ పాటలు వింటున్నారు.

- మల్లాది సూరిబాబు 90527 65490