S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాస్తవాలను ప్రతిబింబించే ‘బయోపిక్’లకే జనాదరణ

‘బయోపిక్’ అన్నది ఆంగ్ల పదం. బయో అనగా జీవిత స్వభావాన్ని గురించి తెలుసుకోవడం అని అర్థం. ఆంగ్లంలోని బయోగ్రఫీ పద ప్రయోగ ప్రయోజనార్థ సాధనకు పుట్టిన పదము ‘బయోపిక్’. సమాజంపై చెరగని ముద్రగా జీవన సరళిని శాసించిన వారు, ప్రభావితం చేసిన వారు మన మధ్య లేని మరిచిపోలేని ప్రపంచ దేశాల పురాణ, చారిత్రక వ్యక్తుల గ్రంథస్థ చరిత్రకు బయోగ్రఫీ అని అర్థం చెప్పవచ్చు. బయోగ్రఫీకి చలనచిత్ర తెరపై దృశ్యీకరణముగ బయోపిక్ పదం వాడబడుతోంది.
ప్రపంచంలో మనిషిని పోలిన మనిషి ఏడుగురుంటారుట. అచ్చు నాలాగే ఉన్నాడు. అతనిలా ఉన్నాడు అని పోలికలు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. పురాణ, చారిత్రిక వ్యక్తుల రూపాలు మదిలో మెదిలించగల వ్యక్తులు మాత్రం బయోపిక్ పాత్రధారులుగా రంగస్థల, చలనచిత్రములలో అచ్చు అలాగే ఉన్నాడు, ఉంది అని నేడు బయోపిక్ చిత్ర పాత్రధారులుగా లబ్దప్రతిష్టులవుతున్నారు.
చారిత్రక విభాతసంధ్యల అట్టడుగున పడి కాన్పింపని కథలన్నీ కావాలన్నాడు శ్రీశ్రీ. అందుచేత పురాణ కాలము మొదలు, ఊహకందని నాగరికతల కాలము నుంచి చరిత్రకెక్కినా ఎక్కకపోయినా చరిత్రకందిన నేటి కాలము వరకు ప్రభావితము చేసి కారణజన్ములే మన మధ్య ఉన్నారనిపింపచేసే పాత్రోచిత కథావస్తువుల నిడివి చలనచిత్రము బయోపిక్. ఆటోబయోగ్రఫీ అర్థముగా స్మరణీయుల స్వీయ చరిత్రలున్నాయి. స్వీయచరిత్ర రాసుకోకపోయినా కవులు, పండితులు, గాయకులు, రచయితలు అటువంటి స్మరణీయులను గురించినవి పురాణాలతోపాటు గద్య పద్య కథలుగా కావ్యములుగా తీర్చిదిద్దారు. ఆధునిక యుగంలో నవల, కథ, నాటకము వంటి సాహిత్య ప్రక్రియలు బయోపిక్ పదముగా వాస్తవ జీవితగాథ అధ్యయన చలనచిత్రాలుగా ప్రచారమవుతున్న చలనచిత్ర ‘స్క్రీన్‌ప్లే’లు.
‘ఈ పల్లె చోటట లోకాద్భుత దివ్యదర్శనమట! ఆ భోగమేలాటిదో’ అన్నారు విశ్వనాథ వేంగీ క్షేత్ర దర్శనములో. భావనాస్ఫుట మూర్తిత్వము పొందితే బాగుండునని ప్రత్యక్ష క్షేత్రదర్శనం చేయించారు. క్షేత్ర దర్శనము కావచ్చు, స్థల పురాణ ప్రదేశము కావచ్చు భావనాస్ఫుట మూర్తిత్వము పదమునకు సమానార్థకముగ బయోపిక్ ప్రచారమవ్వాలని నాకనిపించింది. బయోపిక్ పద ప్రయోగ ప్రయోజనాన్ని వివరించడానికి ముందు స్థల పురాణ ప్రదేశములు గురించిన నా అవగాహనను వివరిస్తాను.
భారతదేశంలోని పల్లెపట్టులు వ్యవసాయ జీవనము కలవి. జీవన సరళి ఒక్కటే. మహాభారతం, రామాయణం మొదలైన పురాణ గాథలు తమతమ ప్రాంతాలలో జరిగినట్లు భావిస్తారు. గుడులు, గోపురాలు వెలిశాయి. ఒకేగాథ భిన్నభిన్న ప్రాంతాలు తమ గ్రామంలో లేదా తమ ప్రాంతంలో జరిగాయని చెప్పడం నమ్మకంతో కూడుకున్నది. విమర్శిస్తే కనె్నర్ర తప్పకపోవచ్చు. నా ఉద్దేశ ప్రకారం తీరిక సమయాల ఒకప్పటి రంగస్థల వినోద ప్రదర్శనలుగా ఆరుబయట నటులు ప్రదర్శించిన కథాఘట్టన స్థలాలవి. పురాణ కథలను ప్రదర్శించిన ప్రాంతాలు స్థల పురాణాలుగా మెచ్చువడి వాసికెక్కి నిలద్రొక్కుకున్నాయన్నది ఆలోచన దిశగా మాత్రమే ఈ వ్యాసంలో పరిమితం.
రామాయణ, భారత పాత్రధారులుగా సంచార కళాకారులతో ఊరూరా ప్రదర్శనలు జరిగేవి. వారాగిన ప్రదేశాలలో ఆకట్టుకున్న ప్రతిభా ప్రదర్శన ఘట్టము ప్రజల స్మృతిపథంలో స్మరింపబడేది. భాపూరమణీయము ముత్యాలముగ్గు, బుద్ధిమంతుడు వంటి చిత్రాలకు వేసిన సెట్టింగులు ఆనవాళ్లు నేటికీ కొన్నిచోట్ల గోదావరి ప్రాంతంలో సరదా కబుర్లలో ఇక్కడే అని చూపించి ఆనందపడడముంది.
ఊహకందని కాలం నుంచి భారత, రామాయణ గాథలు, ఇతర చారిత్రిక ప్రదర్శనలూ ప్రదర్శిస్తూ రంగస్థల కళాకారులుగా ఊరూరా తిరగడము ఉందని వాటిలో నాటక ప్రదర్శన రంగస్థల ప్రదర్శనగా సాహిత్య ప్రక్రియల అధ్యయనంలో నిరూపణ చేయవచ్చు. తిట్టుకవిగా ప్రసిద్ధికెక్కిన వేములవాడ భీమకవి చాటువులలో రాజాకళింగగంగు కథ ప్రసిద్ధము. అచ్చు రాజు కళింగ గంగులాంటి వ్యక్తిని ప్రవేశపెట్టాలని రాజ్యము కోల్పోయి తిరుగుతున్న రాజకళింగ గంగుకు వేషమిచ్చిన ఉదంతము బయోపిక్ ఎప్పటినుంచ ఉందని చెబుతున్నట్లనిపిస్తుంది. పురాణ సంచార కళాకారులు మహారాజ పోషణగల వసతి భోజనాలు గల దేవాలయాలలోనే బస చేసేవారేమో ననిపిస్తుంది. ఆ సమయంలో వారు ప్రదర్శించే కథా భాగానికి ముఖ్యమైన దేవాలయము స్థల పురాణానికి అనువై జీవం పోసి నిలద్రొక్కుకుందా అన్నది లోతుగా అధ్యయనం జరగాలి.
కోనసీమలో సఖినేటిపల్లి అనే గ్రామముంది. శకునాలపల్లి సఖినేటిపల్లిగా పలకబడిందట. కాని శ్రీరామచంద్రుడు అయోధ్యకు పుష్పకములో తిరిగి వెళుతూ కోనసీమ గ్రామాలలో బస చేసేవాడు. అలా బస చేసిన ప్రతి గ్రామంలో ఒక శివాలయం శివభక్తుడైన రావణ వధకు దోష పరిహారార్థం ప్రతిష్టించేవాడని ప్రతీతి. ఆ శివాలయ ప్రతిష్టకు ‘సఖీ! నేటిపల్లి’ అని రాముడు సీతకు చెప్పిన ప్రదేశం సఖినేటిపల్లి. వానరులున్న ఊరుగా వానపల్లి ప్రసిద్ధి. అక్కడి ఫలాలమ్మ పల్లాలమ్మ తల్లిగా సీతాదేవి ప్రతిష్ఠ అని నమ్ముతారు. రాముడు, సీత, వానరులు గల వనవాస ఘట్టముల పాత్రధారులు ఇక్కడ రమణీయముగా సంచార సమయాలలో గుర్తు తెచ్చుకోబడి కథాఘట్టానికి వనె్న తెచ్చారా?
ఆత్రేయపురంలో ఒక రావి చెట్టు కింద సీతారాములు ముచ్చట్లు చెప్పుకున్నారు. చిందాడగరువు అనే గ్రామంలో అర్జునుడు మత్స్య యంత్రం కొట్టాడు. అసలు అమలాపురమే పాంచాలపురంగా భావిస్తారు. ప్రతి దేవాలయం అగస్త్య ప్రతిష్ఠ అనడం ఇష్టం. ఈ అగస్త్యుడే తాపేశ్వరం వెళ్లి వాతాపిని అంతం చేసి శివాలయ ప్రతిష్ఠ చేశాడు. దక్షుడు ద్రాక్షారామంలో యజ్ఞం చేశాడు. విఘ్న వినాశనానికి ఐనవిల్లి గ్రామంలోని గంపతి దేవాలయంలో పూజ చేశాడు.
వాస్తవ గాథల ప్రదర్శన అనిపించే కల్పిత ప్రదర్శనలకు సంచార నటుల భావనాస్ఫుట మూర్తిత్వ ప్రదేశాలు స్థల పురాణాలుగా మనం భావించడం సమంజసమే కావాలని నా భావన. ఇప్పటిలా ప్రత్యేక రంగస్థలంలా నేడు లేవు. ఆరుబయట వీధి నాటకాలుగా ప్రదర్శనలు. నట పోషణలో ఖ్యాతికెక్కి ఆ పాత్ర పేరుతోనే ప్రజా హృదయాన్ని చూరగొన్న వ్యక్తులు ప్రదర్శించిన కథాభాగ ప్రాంతాలు జ్ఞాపకాలుగా కొంతకాలం ఆ పేరుతోనే పిలువబడ్డవి. మరుగున పడినవి పోగా కొన్ని మాత్రం శాశ్వత ముద్ర వేసిన ప్రదేశాలు ఇతర ప్రాముఖ్య కారణాల వల్ల స్థల పురాణాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రాంతంలో తిరుపతి అనే గ్రామముంది. అక్కడ శృంగార వల్లభ నామధేయంతో గుడి విష్ణు దేవాలయం ఆది తిరుపతిగా ప్రసిద్ధి. శ్రీ వేంకటేశ్వరుని తిరుపతికన్న ప్రాచీనమని భావిస్తున్న ఈ ప్రాంతంలో ధ్రువుడు తపస్సు చేయడముగ కథ స్థల పురాణం. ధ్రువ చరిత్ర కథ ఇక్కడ జరిగిందనడముకన్న ఈ పురాతన దేవాలయ ప్రాంగణం ఊహకందని కాలం నాటికే ధ్రువచరిత్ర వంటి స్థల పురాణాలు ప్రదర్శన గాథకు అనువుగా ఉండి ఉండవచ్చు అనే నమ్మకాన్ని కలిగిస్తాయి.
తెలుపు నలుపు మాయాబజారు చలనచిత్ర విడుదల కాలం నాటికి నేనింకా ఉన్నత తరగతులలో ప్రవేశించలేదు. ఆ బాల్యంలో శ్రీకృష్ణుడిగా రామారావుగారి చిత్రపటానికి పూజలు జరగడం నేను చూశాను. నేను సైతం విచిత్ర వేషధారణలో వివాహ భోజనంబు పాట పాడుతూ ఘటోత్కచుడినే అనిపించానని మెప్పు పొందడం పులకలు కలిగిస్తుంది. రాజమహేంద్రవరము పుష్కరాల రేవులో రామారావుగారి కృష్ణ విగ్రహం, కాటన్ బ్యారేజీ సమీపంలో రంగారావుగారి ఘటోత్కచ విగ్రహం వ్యక్తులుగా కాదు పురాణ పురుషులుగా శాశ్వతం. ఇలా భావనాస్ఫుట మూర్తిత్వ ప్రదేశానికి బయోపిక్ అర్థమును స్థిరపరుస్తున్నా రనిపించడంలో నా బాల్య జ్ఞాపకాలు దోహదపడ్డాయి.
లబ్దప్రతిష్ట కీర్తిశేషులు లేదా పురాణ లేక కల్పిత పాత్రల సజీవిత చరిత్రగా నటుల హావభావ ప్రదర్శనగా దృశ్య కావ్యములుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఆ పాత్రధార నటులు కూడా ప్రజాభిమానం చూరగొంటున్నారన్నది నేటి బయోపిక్.
మహానటుడు లేదా మహానటి మహామహుడు లేదా మహామహురాలు కవి గాయక పురాణ పాత్రధారణ సజీవమై మన ముందు నిలుస్తాయి. పురాణ కాలమైనా, నేటి కాలమైనా ఔరా! నిజమే అచ్చు అలాగే ఉన్నాడు లేక ఉన్నది అనిపింపచేసే దృశ్యకావ్యము భావనాస్ఫుట మూర్తిత్వముగా బయోపిక్. బయోపిక్ తెలుగులోకి చేరిన అన్యభాషా పదం. బ్రతికున్న శరీరంలో పరకాయ ప్రవేశ వ్యక్తిగా తెలుగులో జీవించి లేని ఒకప్పటి నటి సావిత్రిని మహానటిగా విజయవంతంగా జీవింపచేసిన చలనచిత్రముదాహరణగ చెప్పవచ్చు. వీధి నాటకము కావచ్చు. చలనచిత్రము కావచ్చు. ఒకప్పటి రంగస్థల నటులు బయోపిక్ అనలేము కాని పురాణ పాత్రధారణకదే ఆవేశము కల్పించారు.
రామాయణ, భారతాది పురాణ గాథలలోని కథలు చలన చిత్రీకరణకు ముందే రంగస్థలం నటుల హావభావ ప్రదర్శనలుగా పురాణ పాత్రల బయోపిక్‌కు జీవం పోసింది. ధిక్కారమును సైతునా, దుష్టజన ధిక్కారమును సైతునా అని వేమూరి గగ్గయ్య వంటి వారి హావభావ వైఖరి తరువాతి నటులకు కూడా వొరవడిగా చలనచిత్ర ఆహార్యమునకు సజీవమై సాగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముని పురాణ పాత్ర ఆహార్యము బయోపిక్ రూప చిత్రణము గర్వకారణమైన అనుకరణమే అవుతుంది.
ఇలా నటులు కావచ్చు లేదా మహాత్మాగాంధీ వంటి జాతిపిత చరిత్ర కావచ్చు శ్రవ్య గాథలుగా కూడా గ్రంథస్థమై ఉంటాయి. కానీ పఠన కావ్యముగాకన్న సజీవ మూర్తులుగా తెర మీద దృశ్యకావ్యముగా కలిగించగల అనుభూతి వేరు. త్యాగరాజ కీర్తన ఎంత ఆనందదాయకమో ఆయన పరోక్ష జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా పంచుకో గలుగుతున్న అనుభూతితో చూడగలగడం అంతే ఆనందదాయకం. త్యాగరాజును చూడని మనకు ఆ నటుడు పాత్రధారిగా త్యాగరాజే అనిపిస్తాడు.
త్యాగరాజుగా, శంకరాచార్యులు, వేమన వంటి మహామహులుగానే కాదు గుర్తుండిపోయే రామకృష్ణ, దుర్యోధన, ఘటోత్కచ, పురాణ పాత్రలుగా, కందుకూరి, ఆంధ్రకేసరి వంటి యుగపురుషుల, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయ వంటి చారిత్రిక పురుషుల పాత్రధారణ చేసిన, చేస్తున్న వారిని, మన మధ్య ఉన్నట్లే చేస్తున్నారు. ఆ పాత్రధారుల నిజ పరోక్ష జీవిత గాథ కూడా బయోపిక్ ప్రయోగాలుగా ప్రదర్శించగల నటీనటుల ప్రయోజనం బయోపిక్‌గా ఆహ్వానింపదగ్గదే!
బయోపిక్ వాస్తవికతలో అవాస్తవ విషయము చొప్పింపబడకపోతే మంచిదే. విమర్శ వచ్చినా నివాళిగా మారి వినోద ప్రధానంగా పౌరాణిక, సాంఘిక, చారిత్రిక ఇతివృత్త వ్యక్తులకు, పాత్రధారులకు మన మధ్య గుర్తింపు తేగల ప్రయోజనం బయోపిక్ సాధించగలగాలి. రాజాకళింగ గంగు బయోపిక్ వాస్తవ, అవాస్తవ విశేషాలు పక్కకు పెడితే స్ఫూర్తికోసమే రంగస్థల బయోపిక్ వినియోగించుకున్నదన్నది నిజం. ఆ బయోపిక్ వ్యక్తుల పాత్రధారణ చేసిన బయోపిక్‌లు స్తుతిపాత్రముగా నిలదొక్కుకుంటే బయోపిక్ పదం పరమార్థం సాధిస్తుంది.

-డా. జొన్నలగడ్డ మార్కండేయులు 94402 19338