S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరమాత్మను గుర్తిస్తేనే ఆత్మసిద్ధి (రాస క్రీడాతత్త్వము-9)

పరీక్షిత్సందేహాలు :-
ఇంత చెప్పినా పరీక్షిత్తుకు సందేహం తీరలేదు. ఆయన ఇలా అడిగాడు- ‘‘గురుదేవా! తత్త్వదృష్టితో చూస్తే, సృష్టిలోని ప్రతి అణువూ పరమాత్మే. ఇంట్లో వున్న భర్తా, భార్యా, తండ్రీ, పిల్లలూ, అన్నీ పరమాత్మ రూపాలే, కాదనను. కానీ, ఒకడు తన భార్యను అతిగా ప్రేమిస్తే, అది పరమాత్మను ప్రేమించినట్లే అవుతుందా? కావడం లేదు గదా? ఎందుకు కావడం లేదంటే, వాడు తన భార్యను భోగవస్తువుగానే చూశాడు తప్పితే, పరమాత్మగా చూడలేదనీ, అందుకే వాడికి ముక్తి రాదనీ, మీబోటి పెద్దలు చెపుతున్నారు. ఇక్కడ గోపికలకు ఆ క్షణంలో కృష్ణుడే పరమాత్మ అనే భావం పరిపూర్ణంగా లేదని మీరే చెపుతున్నారు. ఆ గోపికల దృష్టిలో కృష్ణుడు అందగాడు; అంతే గానీ, పరబ్రహ్మ కాదు. వాళ్ళు ఈ రకమైన దృష్టితోనే శ్రీకృష్ణుడి దగ్గరకు చేరారు. మరి వీళ్ళకు దేహబంధం ఎలా వదిలిపోయింది?’’ - అని
శ్రీశుకులవారు ఇలా చెప్పారు-
(i) రాజా! నీకు పూర్వమే ఒక మాట చెప్పాను. ‘‘జీవులు ద్వేషభావంతో భావన చేసినా సరే, ఆ భావన పరమాత్మ గురించి చేస్తే, వాళ్ళు ఆత్మసిద్ధిని పొందుతారు’’ అని. దీనికి మంచి ఉదాహరణ-శిశుపాలుడు. ద్వేషంతో పరమాత్మను భావనచేసినవారికే మోక్షం వస్తే, ప్రేమతో భావన చేసినవారికి రాదా?
(ii) అయితే, ‘‘ఒకడు ప్రేమతో పొద్దుగూకులూ తన భార్యనే భావన చేస్తే, వాడికి మోక్షం ఎందుకు రాదు?’’ - అంటావేమో! ఇతర జీవులకూ, పరమాత్మకూ ఒక భేదం ఉంది. ఏమిటంటే-లోకసామాన్య జీవులంతా ఇంద్రి యాలకు దాసులు. అందుచేత వారిలో వున్న పరమాత్మతత్త్వం మాయచేత ఆవరింపబడి వుంటుంది. అలాంటివారిని ఎవరు భావన చేస్తున్నారో, వారు సూటిగా మాయనే భావన చేసినవారవుతున్నారు. అందుకే వీరి మాయ మరింత పెరిగిపోతోంది.
(iii) పరమాత్మంటావా, ఆయన హృషీకేశుడు. అనగా ఇంద్రియాలకు అధిపతి. ఇంద్రియాలు ఆయన చెప్పుచేతల్లో వుంటాయి. అందువల్ల, మాయ ఆయనను కప్పజాలదు. అందుచేత, ఆయనను గురించి ఉపాసించేవారు ఆయన పరమాత్మ అనే జ్ఞానం లేకుండా ఉపాసన చేసినా సరే, వారికి తప్పకుండా బంధవిమోచనం జరుగుతుంది.
iv) ‘‘ఆయన కూడా దేహధారే కదండీ. ఈ దశలో ఉండగా ఆయన చుట్టూ మాయావరణ ఎందుకుండదు?’’- అని అడుగుతావేమో. మామూలు దేహధారులందరూ తమ తమ కర్మఫలాలను అనుభవించటానికి దేహాలను స్వీకరిస్తారు. అందువల్ల, వారి శరీరాలు త్రిగుణాలకూ, ఇంద్రియాలకూ, లోబడి వుంటాయి.
(v) పరమాత్మ దేహాలను ధరించే విధానం అది కాదు. ఆయన స్వయంగా అవ్యయుడు, అప్రమేయుడు, నిర్గుణుడు, గుణాలను అదుపులో పెట్టేవాడు, అయివుండి కూడా, మానవుల శ్రేయస్సు కోసం, మోక్షం కోసం, శరీరధారి లాగా వ్యక్తమవుతున్నాడు. అందువల్ల ఆయన ఇతర దేహధారుల వంటివాడని భావించడం తగదు.
vi) అందువల్లే, పరమాత్మను మనం గుర్తించి ఉపాసిం చినా, గుర్తించకుండా ఉపాసించినా, ఫలితం ఒకే రీతిగా వుంటుందని చెప్పాను. ఏదో ఒక రకంగా పరమాత్మ మీద తదేక భక్తి వుంటే, అదే చాలు. ఆ భక్తి ఎటువంటిదా? అనే విచారణ మనకు అక్కర లేదు.
(vii) కామము, క్రోధము, భయము, స్నేహము, భక్తి, వీటిలో ఏ మార్గాన్ని పట్టుకుని పరమాత్మ మీద ఏకాగ్రతను సాధించినా ఫలితం ఒక్కటే. ఆ ఫలితమేమంటే, ఆయనతో తన్మయత్వాన్ని పొందటమే.
(viii) రాజా! ‘‘ఇంత పని చేయటం ఆ పరమాత్మకు భారమైపోదా?’’-అని నీవు ఆశ్చర్యపోకు. ఎందుకంటే, ఆయన భగవంతుడు, అజుడు, యోగేశ్వరుడు. ఆయన తలచుకుంటే స్థావరాలైన చెట్లూ చేమలకు కూడా ముక్తిని ప్రసాదించగలడు - అని.
కలికాలంలో మానవులకు రాబోయే సందేహాలను కూడా ఈ సంభాషణ ద్వారా వ్యాసభగవానుడు తొలగించేశాడు.
ఆ విధంగా శుకమహర్షి పరీక్షిత్తు మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి, ఆ రాజు తృప్తిపడినాక, పై కథలోకి సాగాడు.
గోపికలకు పరీక్ష :-
ఆ విధంగా శ్రీకృష్ణ ధ్యానంతో దేహబంధాలను వదిలించుకుని పరమాత్మ వైపు పరుగులు తీస్తున్న ప్రతి గోపికా, తనకు ఒక్కతెకే ఆ గానం వినిపించిందనీ, తను ఒక్కతెనే ఆ స్వామి పిలుస్తున్నాడనీ, తాను ఒక్కతే ఆ స్వామి వద్దకు పోతున్నాననీ, భావించుకుంటూ పరుగులు తీసింది. తీరా స్వామి సన్నిధికి చేరే సరికి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల కొలది గోపికలు స్వామి చుట్టూ మూగారు. అయినా ఎవరికీ ప్రక్కవారి మీద అసూయ గానీ, ద్వేషం గానీ, కలగటంలేదు. అసలు ప్రక్కవారి సంగతి పట్టనే పట్టటంలేదు. వారి దృష్టంతా ఆ స్వామి మీదనే వుంది.
ఇన్ని వేల గోపికలు అలా ఉరుకులు పరుగుల మీద వస్తే, వారందరినీ చూసి, ఆ స్వామి వింతగా మాట్లాడాడు-
(i) ఆయన మున్ముందుగా- ‘‘్భగ్యవతుల్లారా! మీకు స్వాగతం’’ అన్నాడు.
(ii) ఒక్క క్షణం ఆగి, ‘‘గ్రామాలన్నీ క్షేమమే గదా!. మీరొచ్చిన పనేమిటి? మీకు నేనేం చెయ్యాలి?’’- అన్నాడు.

(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060