S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలుపెరుగని ‘అక్షర యజ్ఞం’

కొండకోనల్లో అభివృద్ధి జాడే తెలియని గిరిజన బాలలను బడిబాట పట్టించేందుకు ఆమె నిత్యం అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు.. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిరోజూ నదిని దాటుతూ, కొండలను ఎక్కుతూ ఆమె బోధన సాగిస్తున్నారు.. కేరళలోని తిరువనంతపురం జిల్లా ఆంబూరి గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు కేఆర్ ఉషాకుమారి ప్రతిరోజూ ఉదయం ఏడున్నర గంటలకు తన ‘బడి ప్రయాణం’ ప్రారంభిస్తారు. స్కూటీపై కొంత దూరం ప్రయాణించి ఆ తర్వాత పడవపై నదిని దాటుతారు. అనంతరం కొండలపై నడుచుకుంటూ పాఠశాలకు చేరుకొంటారు. చిరుతలు, ఏనుగులు సంచరించే కొండలపై ఆమె రెండు కిలోమీటర్లు ఒంటరిగా నడచి వెళ్తుంటారు. కున్నతుమల ప్రాంతంలోని ‘కన్ని’ గిరిజన ప్రాంతానికి ఆమె ఒక్కరే ధైర్యంగా చేరుకొంటారు. ‘నెయ్యర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ పరిసరాల్లో 6,129 అడుగుల ఎత్తు ఉన్న కొండపైకి చేరుకొని గిరిజన బాలలకు విద్యాబుద్ధులు చెబుతుంటారు. తాను పనిచేసే ‘అగస్త్య ఎగ అధ్యాపక విద్యాలయ’కు చేరుకొనేందుకు ఉషాకుమారి ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తుంటారు. ఆమె గత పదహారేళ్లలో ఏనాడూ పాఠశాలకు ఆలస్యంగా వెళ్లలేదు. ‘సింగిల్ టీచర్ స్కూల్’ కావడంతో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఆ బడిలో అన్నీ తానే చూసుకొంటారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకూ కేవలం 14 మంది విద్యార్థులే ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా, తనతోపాటు పనిచేసేందుకు మరో టీచర్ లేకున్నా ఉషాకుమారి ఏనాడూ అసంతృప్తికి లోనుకాకుండా బోధనపైనే దృష్టిసారిస్తుంటారు. పాఠాలు చెప్పే పంతులమ్మలా మాత్రమే కాదు.. పిల్లల సంరక్షకురాలిగానూ ఆమె సేవలందిస్తున్నారు. మధ్యాహ్నం వేళ విద్యార్థులకు గుడ్లు, పాలు అందిస్తూ వారిలో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనుదినం రెండు గంటలు ప్రయాణించాల్సి వస్తున్నా, నెలల తరబడి జీతం అందకపోయినా విధి నిర్వహణను ఆమె ఏనాడూ అలక్ష్యం చేయలేదు. పిల్లలకు మంచి భోజనం అందించేందుకు ఒక్కోసారి సొంత డబ్బును సైతం ఖర్చు చేస్తుంటారు. బడికి సొంత భవనం సమకూరక ముందు ఆరుబయట చెట్ల నీడలో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. గిరిజన పిల్లలను తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నందుకు ఉషాకుమారికి ఇప్పటికే ‘సాక్షరతా పురస్కారం’తో పాటు పలు అవార్డులు దక్కాయి. తన వద్ద అక్షరాలు నేర్చుకున్న పిల్లలు డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి ఉన్నత స్థానాల్లో నిలవడమే తన ఆకాంక్ష అని ఉషాకుమారి చెబుతుంటారు. గిరిజన గ్రామాల్లో నిజమైన మార్పు కోసం తన ప్రయాణం ఇలాగే కొనసాగుతూనే ఉంటుందని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటున్నారు.