S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మసంయోగంతో ఆనంద తీరాలకు.. (రాస క్రీడాతత్త్వము-11)

వాళ్ళు మొదటినుంచీ మధురభక్తి మార్గంలో ఉపాసన చేస్తున్నవాళ్ళు కనుక, స్వామితో మాట్లాడేటప్పుడు శృంగారపరంగా మాట్లాడుతూ వుంటారు. కానీ, వారు కోరేది ఆత్మసంయోగ రూపమైన శృంగారమే కానీ, శారీరక శృంగారం కాదు. అందుకే, వారు తమ స్తనాల మీదా, శిరస్సు మీదా, చేయి వుంచమని చెప్పగానే, వారు యోగప్రక్రియలో శక్తిపాతాన్ని కోరుతున్నారని పరమాత్మ అర్థం చేసుకున్నాడు. లౌకిక శృంగారమైతే నెత్తిమీద చెయ్యి పెట్టమని కోరరు కదా?
ఆ విధంగా వారి యొక్క సాధన పరిపాకానికి సంతృప్తి పడ్డ బాలకృష్ణుడు, ముగ్ధ మనోహరమైన మందహాసాలను వెదజల్లుతూ, అద్భుతమైన వేణుగానం చేశాడు. స్వామి పెదవులు మురళిమీద అల్లనల్లన ఆడుతుంటే, ఆ గోపికలు ఆనందభరితలయ్యారు. ఈ సందర్భాన్ని శ్రీకృష్ణకర్ణామృతం లో లీలాశుకుడు ఇలా వర్ణించాడు.
శ్లో॥ అయి మురళి ముకుంద స్మేరవక్త్రారవింద
శ్వసన మధురసజ్ఞే త్వాం ప్రణమ్యాద్య యాచే
అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం
కదయ రహసి కర్ణే మద్దశాం నందసూనోః ॥
(్భవం: చిరునవ్వులు చిందే మా కన్నయ్య ముఖ పద్మపు గాలుల మద్యపు రుచికి మరిగిన ఓ మురళీ! నీకు దణ్ణంపెట్టి, ఓ మాటడుగుతాను, వినవే. నువ్వు మా నందకుమారుడి పెదవుల దగ్గరకు చేరినప్పుడు, ఆయన చెవులో రహస్యంగా నా సంగతి చెప్పవే) - అని.
మరో గోపిక ఇలా అంది-
శ్లో॥ జనుషి పరస్మి న్నాత్తపుణ్యో భవేయం
తటభువి యమునాయా స్తాదృశో వంశనాళః
అనుభవతి య ఏష శ్రీ్శమదాభీరసూనో
రధరమణి సమీపన్యాసధన్యా మవస్థామ్ ॥
(శ్రీకృష్ణ కర్ణామృతం)
(్భవం : నాకేమాత్రమైనా పుణ్యం మిగిలి వుంటే, అది కలిసి వస్తే, వచ్చే జన్మలో నేను ఈ యమునాతీరాన, ఇదిగో ఇప్పుడు మా గోపాలబాలుడి రత్నాల పెదవుల ముద్దులందుకుంటోందే.. అలాంటి వెదురు గొట్టమై పుడతాను) - అని.
గోపికలిలా భావపారవశ్యంలో తేలిపోతూ, వాళ్ళకు తెలియకుండానే కన్నయ్య పాటకనుగుణంగా నాట్యం చేస్తున్నారు. కన్నయ్య కూడా వారితో అడుగు కలుపుతూ, మధ్యమధ్యలో తన గొంతుతో పాడుతూ, మురళి ఊదుతూ, అలా అలా తిరుగుతూ, ఒక అడవినుంచి మరో అడవికి ఆవుల మందలను త్రిప్పినట్లు ఆ గోపికల మందలను తన వెంట తిప్పాడు. వివిధ శృంగార చేష్టలతో వాళ్ళను ఉప్పొంగింప చేశాడు. కొంతసేపు అయ్యేసరికి, ఆ గోపికలు, మా అంత అదృష్టవంతులు లేరని మనస్సులోనే విర్రవీగిపోయారు.
అది గమనించిన పరమాత్మ, ఈ గర్వం వీరికి తగదని భావించి, అందరి మధ్యలో తిరుగుతున్నవాడు తిరుగు తున్నట్టే మాయమైపోయాడు.
దాంతో గోపికలకు వెర్రెత్తి, మతి చెడి, పిచ్చివాళ్ళ లాగా ప్రవర్తించారు. చెట్టు చెట్టునీ, పుట్ట పుట్టనీ, ‘‘కృష్ణుడెక్కడ..?’’ అని అడిగారు.
ఇక్కడ తెలుగు భాగవతంలో పోతన్న గారి పద్యం చిరస్మరణీయం -
నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసంబు పై
జల్లెడివాడు, వౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే?
(దశమ స్కంధము-పూర్వభాగము-పద్యం 1011)
అలా గోపికలు చాలా సేపు అడవులన్నీ తిరిగి తిరిగి, ఆయన గురించే మాట్లాడుకుంటూ, తమకు తెలియ కుండానే తన్మయ భావంలో పడిపోయారు. కొంతసేపు, అప్పటివరకూ జరిగిన శ్రీకృష్ణలీలలను మననం చేశారు. ఆ తరువాత, తామే వేషాలు లేని పాత్రధారులై, ఆ కథలనే నాటకాలుగా ఆడారు.
ఇంకా కొంత సేపయినాక, కృష్ణుడు తమలో ఎవతెనో వెంట వేసుకుని ఎటో పోయాడని కొంత సేపు కృష్ణుణ్ణీ, కొంత సేపు ఆతడి ప్రియురాల్నీ, నిందించారు. కొన్ని చోట్ల ఇసుకలో ఏవేవో అడుగు జాడలు కనిపించే సరికి, ఇవి కృష్ణుడి అడుగు జాడలేనని, ఆ ధూళిని నెత్తిన జల్లుకున్నారు.
మాయమై వుండి గోపికల భావాలన్నీ గమనిస్తున్న శ్రీకృష్ణుడు, వీరిలో ఒక ప్రక్క పరమాత్మ పట్ల అంకితభావం ఉన్నా, మరో ప్రక్క స్ర్తి సహజమైన ఈర్ష్యాభావం తొలగలేదని గ్రహించాడు. అది తొలగేందుకు ఏమి చెయ్యాలా? -అని ఆలోచించి, ఆయన వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమైనవాడు ఇందాకటి లాగా అందరితోనూ కలసి విహరించకుండా, వారిలో కొంచెం అతి సౌందర్యరాశిగా వున్న ఒక గోపికను వెంటబెట్టుకుని పొద చాటుకు పోయాడు.
అది చూసి, ఇతర గోపికలు కలవరపడ్డారు. కృష్ణుడి వెంట ఉన్న గోపిక మాత్రం, తానే అందరికన్నా గొప్ప అందగత్తెననీ, తన భక్తే గొప్పదనీ, అందుకే శ్రీకృష్ణుడు అందరినీ వదిలిపెట్టి తన వెంట వస్తున్నాడనీ, లోలోపలే మిడిసిపడ సాగింది. దానికి తగ్గట్టే శ్రీకృష్ణుడు ఆమె చెప్పిన పాటలే పాడుతూ, ఆమె చెప్పిన చిందులే వేస్తూ, చాలా దూరదూరాలకు తీసుకుపోయాడు.
కొంతసేపటికి ఆ పిల్లకు కొత్త ఆలోచన వచ్చి ‘‘ప్రియా! ఇంక నడవడం నావల్ల కాదు. కావాలంటే నన్ను ఎత్తుకుపో!’’ అని అంది.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060