విశిష్టతల సంగమం కుంభమేళా
Published Saturday, 26 January 2019ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ‘కుంభమేళా’. కుంభమేళా అనేది దేవనాగరి లిపి నుండి వచ్చింది. వేదకాలం నుంచీ ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కుంభమేళా ప్రయాగ వద్ద సంగమ తీరంలో ఇపుడు మళ్లీ మొదలైంది. ఇది అర్ధ కుంభమేళానే అయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ‘కుంభ్’ అనాలని ప్రకటించింది. అంతేకాదు ఇప్పుడు ఈ పూర్ణకుంభ్‌ను ‘మహాకుంభ్’ అని కూడా అంటున్నారు. యునెస్కో కూడా కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ మేళాను నిర్వహించే ప్రభుత్వానికి ఇంతకు మించిన ప్రచారం ఏదీ ఉండదేమో!
ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. సమస్త దేవతలూ నివసించే స్థలం జలం. హిందూ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు. దీన్ని బట్టి నది నీటిని.. అందులోనూ ముఖ్యంగా గంగా నదినీ మనం ప్రథమంగా స్మరిస్తాం.. పూజిస్తాం.. మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థ క్షేత్రాల్లో ఒకటి ప్రయాగ. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగ, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించడం వల్ల దీనికి ‘త్రివేణీ సంగమం’ అనే పేరు వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్న సమయంలో అర్ధ కుంభమేళాను నిర్వహిస్తారు. ఇవి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్‌లలో జరుగుతాయి. చివరి అర్ధ కుంభమేళాను మహా కుంభమేళాగా పిలుస్తారు. కుంభస్నానాలు ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి.
అసలు మహాకుంభమేళా అంటే ఏమిటి? ప్రతి పుష్కరానికి (12 సంవత్సరాలకు) ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం ‘కుంభం’ అనేది ఒక రాశి కూడా. ‘మేళా’ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
దక్షిణ భారతంలో పుష్కరాలు, పుష్కర స్నానాలు ఏయే నదులకు ఎప్పుడు వస్తాయో మనకు తెలుసు కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం. అనేకమంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుతారు. ఈ కుంభస్నానాలు ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలోనే జరుగుతాయి. దక్షిణాదిలో నదీ తీరాల వద్ద పుష్కరాలు గురుగ్రహ సంచారంలో ఒక్కొక్క రాశి ప్రవేశంతో ప్రారంభమవుతాయి. ఇవి పనె్నండు రోజుల వరకూ కొనసాగుతాయి. అయితే ఈ కుంభస్నానాలు మాత్రం ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలో ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమవుతాయి. పుష్కర స్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే, కుంభస్నానాలకు గురు గ్రహ సంచారంతోపాటు రవి, చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నాన తేదీలను నిర్ణయిస్తారు. సూర్యుడు-బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్‌లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోను, బృహస్పతి వృషభరాశిలో- సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను, బృహస్పతి-సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి స్థలంలో కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహస్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది.
మేషరాశింగతే జీవే మకరే చంద్రభాస్కరౌ
అమావాస్యా తదాయోగః కుంభాఖ్యస్తీర్థనాయకే॥
- స్కంద పురాణం
అంటే.. గురుడు మేషరాశిలో ఉండి రవి, చంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది అని అర్థం. అలా ఏర్పడిన తరువాత మకర సంక్రమణం నాడు మొదటి షాహీస్నాన్‌తో కుంభస్నానాలు ప్రారంభం అవుతాయి. ఈ గ్రహస్థితి ప్రకారం 2013 జనవరి 14న మకర సంక్రమణం నాడు ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద కుంభమేళా ప్రారంభమైంది. మరి ఇప్పుడు జరిగేదేమిటి... అనుకుంటున్నారా? ఇది అర్ధ కుంభమేళా.. ప్రధాన కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధకుంభ్‌ను నిర్వహించాలని కొన్ని శతాబ్దాల క్రితమే సాధుసంత్‌ల మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్‌లలోనే జరుగుతుంది. ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా ఆరు సంవత్సరాలకు అర్ధకుంభ్‌ను జరుపుతారు. అం దువల్ల 2013లో ప్రధాన కుంభమేళా జరిగాక 2019 మకర సంక్రమణమైన జనవరి 15న అర్ధకుంభ్ ప్రారంభమైంది. అర్ధకుంభ్‌నకు ఖగోళ గ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళా జరిగాక ఆరు సంవత్సరాలు పూర్తి కావాలి.
పురాణాల్లో...
కుంభమేళాల గురించి భాగవతం, మహాభారతం, రామాయణం, విష్ణుపురాణం మొదలైన గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయట. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాల్లో ఒకచోట ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు.
ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అనీ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అనీ అంటారు. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత చేసేదాన్ని మహా కుంభమేళా అంటారు. అంటే 12తి12=144 సంవత్సరాలకు ఒకసారి చేసే కుంభమేళాను మహా కుంభమేళా అని వ్యవహరిస్తారు. ఈ ఏడాది అర్ధ కుంభమేళా తర్వాత 2025లో పూర్ణ కుంభమేళా జరగనుంది. అలాగే ప్రతి సంవత్సరం పుణ్యనదుల్లో ఏదో ఒకదానికి పుష్కరాలు వస్తాయి. గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరము వస్తుంది. ఈసారి గురుడు ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు వస్తాయి.
ఇక అర్ధ కుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో ప్రయాగ్‌రాజ్ వద్ద కుంభస్నానాలు ప్రారంభమయ్యాయి. ఈ అర్ధ కుంభమేళాకి ఎన్నో లక్షలమంది అఘోరాలు, సాధువులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
కుంభమేళా గురించి స్కంద పురాణంలో వర్ణన కూడా ఉంది.
పురాణాల్లో ప్రస్తావన..
మనకు దేవదానవుల క్షీరసాగర మథనం కథ తెలుసు కదా! అప్పుడు ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల నడుమ 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అలాగే కుంభ పర్వాలు కూడా 12 ఉన్నాయి. అయితే అవి మానవులకు నాలుగు, దేవతలకు ఎనిమిది కేటాయించడం జరిగింది. అందువల్ల భూమిపై నాలుగు, దేవలోకంలో ఎనిమిది కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణ వచనం. దేవదానవ సంగ్రామంలో అమృత కుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శని రక్షించారు. చంద్రుడు కలశం నుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే, సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసుల నుండి కాపాడితే, శనీశ్వరుడు ఇంద్రుడి నుండి కలశాన్ని కాపాడాడని స్కంద పురాణం ఇలా తెలిపింది..
చంద్రః ప్రస్రవణాద్రక్షాం సూర్యో విస్ఫోటనాద్ద్ధౌ
దైత్యేభ్యశ్చ గురూ రక్షాం శౌరిదేవేంద్రజాద్భయాత్॥
ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో.. అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు ‘కుంభయోగం’ ఏర్పడుతుంది. అయితే అమృత కుంభం నుంచి కొన్ని అమృత బిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ, అందువల్ల అవి పడిన నాలుగుచోట్ల.. అంటే ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం చెబుతోంది.
విష్ణుద్వారే తీర్థరాజేఁవన్త్యాం గోదావరీతటే
సుధాబిందువినిక్షేపాత్ కుంభపర్వేతి విశ్రుతమ్॥
స్నాన మహాత్మ్యం
మామూలు రోజుల్లోనే ప్రయాగ వద్ద స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇక కుంభయోగంలో స్నానం గురించి చెప్పేదేముంది?
అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ
లక్షం ప్రదక్షిణా భూమేః కుంభస్నానేన తత్ఫలమ్॥
అంటే.. వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద వాజపేయ యాగాలు, లక్షసార్లు భూ ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితమో, ప్రయాగలో కుంభస్నానం చేస్తే అంత ఫలితమని విష్ణుపురాణ వచనం.
సహస్రం కార్తికే స్నానం మాఘే స్నానశతానిచ
వైశాఖే నర్మదాకోటిః కుంభస్నానేన తత్ఫలమ్॥
అంటే.. వెయ్యి కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘ స్నానాలు గంగలో చేసిన ఫలితం, కోటిసార్లు వైశాఖ మాస స్నానాలు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని.. ఒక్కసారి ప్రయాగలో కుంభ స్నానం చేయడం వల్ల మానవుడు పొందుతాడని స్కంద పురాణ వచనం.
గ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో, తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణ వచనం. ప్రయాగలోని అక్షయవట దర్శం చేస్తే బ్రహ్మహత్యాది పాతక నాశనం అవుతుందని పద్మ పురాణం చెబుతోంది. ప్రయాగ తీర్థాన్ని అరవై వేల ధనుర్ధారులు గంగానదిని, సూర్యభగవానుడు యమునా నదిని, ఇంద్రుడు ప్రయాగ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడని మత్స్యపురాణ వచనం. మాఘమాసంలో త్రివేణీ సంగమ స్నానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నారద పురాణ వచనం. అందువల్ల వీలుచూసుకుని పుణ్యాభిలాషులమై, దురిత క్షయాన్ని కాంక్షిస్తూ ప్రయాగలో స్నానం ఆచరించి సాధుదర్శనం చేసుకుంటే జన్మ చరితార్థమైనట్లే..
ముఖ్యమైన రోజులు
జనవరి 15న (మంగళవారం) రాజస్నానం, జనవరి 21న (సోమవారం) పుష్య పౌర్ణమి ఇప్పటికే ముగిశాయి.
ఫిబ్రవరి 4: సోమవారం వౌని అమావాస్య..
ఫిబ్రవరి 9: శనివారం శ్రీపంచమి..
ఫిబ్రవరి 19: మంగళవారం వ్యాసపూర్ణిమ, మాఘపూర్ణిమ..
మార్చి 4 : సోమవారం మహాశివరాత్రి..
శివరాత్రి పర్వదినంతో ఈ ఏడాది అర్ధ కుంభమేళా పరిసమాప్తమవుతుంది.
చరిత్రలో..
629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, గ్జుయాన్జాంగ్ రచనల్లో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.
‘ఇంపీరియల్ గెజట్ ఆఫ్ ఇండియా’ ప్రకారం హరిద్వార్‌లో 1892లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్నవారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వల్ల తరువాతి కాలంలో అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగు పరచడం, హరిద్వార్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. 1903లో దాదాపు నాలుగు లక్షల మంది కుంభమేళాకు హాజరయ్యారు. 1998, ఏప్రిల్ 14న హరిద్వార్‌లో కుంభమేళాకు పది మిలియన్లకు పైగా భక్తజనులు హాజరయ్యారు. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
మేళాకు నిధుల వరద..
కుంభమేళా నిర్వహణకు ఉత్తరప్రదేశ్‌లోని ఆదిత్యనాథ్ యోగి సర్కారు రూ. ఏడువేల కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో 3,200 హెక్టార్ల విస్తీర్ణంలో 1.22 లక్షల తాత్కాలిక టాయిలెట్లు, 20 వేల డస్ట్ బిన్లు, 42 మురుగు కాలువలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రతేకంగా ఫుడ్ హబ్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలను వేడివేడిగా వండి వడ్డిస్తారు. ప్రయాగను అందంగా ముస్తాబు చేయడానికి ఉద్దేశించిన సర్కారీ పథకమే ‘పెయింట్ మై సిటీ’. ఈ పథకం ద్వారా రోడ్లు, కూడళ్లు, ఫ్లైఓవర్లు, భవనాలు, గోడలు రంగులద్దుకుని మెరిసిపోతున్నాయి. దీనికోసం ఐదు ఏజెన్సీల ఆధ్వర్యంలో దాదాపు వెయ్యికి పైగా ఆర్టిస్టులు పగలూ రాత్రీ కష్టపడ్డారు. కుంభమేళా ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రభుత్వం ఓ లేజర్ షోను కూడా ఏర్పాటు చేసింది. సాధువుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో ఐదు వేల శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరిలో దాదాపు 192 దేశాల ప్రతినిధులు కుంభమేళాకు హాజరవుతారని అధికారుల అంచనా.
టెంట్ సిటీ
కుంభమేళా అంటే హిందువులందరికీ పండగే. ముఖ్యంగా మూడు నదుల సంగమంలో మూడు మునకలేసేందుకు, పితృతర్పణాలు వదిలేందుకు, పూజలు చేసేందుకు దేశం నలుమూలల నుంచీ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో త్రివేణీ సంగమం అఖండ భారతావనిలోని సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుగా దర్శనమిస్తుంది. ఆ భిన్నత్వాన్ని తిలకించేందుకు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కుంభమేళాను కళ్లారా చూసేందుకు, సనాతన ధర్మాన్ని అవగాహన చేసుకునేందుకు విదేశీ పర్యటకులు కూడా లక్షల్లో వస్తుంటారు. అటు భక్తులు, ఇటు పర్యటకులతో నదీ సంగమం జనసంద్రమవుతుంది. వారందరికీ మామూలు హోటళ్లలో గదులు దొరకడం అసాధ్యమే. దీనికి పరిష్కారంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ‘టెంట్ సిటీ’ని నిర్మించింది. పేరుకు ఇవి గుడారాలే కానీ స్టార్ హోటళ్లలో ఉండే అన్ని సౌకర్యాలు ఈ టెంట్లలో ఉండటం విశేషం. హాలు, బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్‌లను కలిగి ఉన్న విల్లా టైపు గుడారాలు ఒక రకమైతే, చిన్నగా ఉండి బెడ్‌తో పాటు సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ సదుపాయాలన్నీ ఒకే గదిలో ఉన్నవి మరో రకం. ఇక వీటిలోనే రెస్టారెంట్లు, స్పాలు, యోగ కేంద్రాలు, సాంస్కృతిక వేదికలు.. ఇలా అన్ని రకాల సౌకర్యాలు, భోజన వసతుల్ని బట్టి గుడారాల అద్దె ఉంటుంది. వీటిని ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.
మత సామరస్యం
యూపీలో యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. హిందూ ముస్లిం భారుూ భాయి అని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన అతి ప్రాచీనమైన కుంభమేళాలలో స్నానం చేసే పాపాలన్నీ తొలిగి, ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండీ దేశ విదేశాల నుంచీ భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. హిందూ ధర్మం ప్రధానంగా ప్రతిబింబించే ఈ కుంభమేళా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది డాక్టర్లు కుంభమేళాలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం ముస్లిం డాక్టర్ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వారికి ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తున్నారు. డాక్టర్‌తో పాటు మరి కొంతమంది సభ్యులు కూడా ఈ మెడికల్ క్యాంప్ కోసం పనిచేస్తున్నారు. 24 గంటలపాటు వీరంతా భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. కుంభమేళాలో సెక్టార్ నెంబర్ 15 వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో రోజుకు వందలాదిమందికి చికిత్స అందిస్తున్నారు. వీరు ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో ట్రీట్‌మెంట్ ఎంతో అద్భుతంగా ఉందంటున్నారు భక్తులు. ఓ స్వామీజీ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా బయటకు వెళ్తున్నారన్నారు. ప్రతిరోజు దాదాపు 800 మందికి చికిత్స అందిస్తున్నారన్నారు. మెడికల్ క్యాంపులో ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. కుంభమేళాలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న అలీగఢ్ వర్శిటీ డాక్టర్ల సేవా దృక్పథాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద ఈ కుంభమేళా సాక్షిగా భారతదేశంలో మతసామరస్యం వెల్లువెత్తింది.
అఖాడాలు
ప్రయాగలోని మూడు నదుల సంగమ తీరంలో ఇపుడు కుంభమేళా కోలాహలం ప్రారంభమైంది. మేళాకు ప్రధాన ఆకర్షణగా భావించే నాగ సాధువులతో అన్ని అఖాడాలు ఊరేగింపుగా కుంభమేళాలోని తమ శిబిరాలకు చేరుకున్నాయి. సాధువులు, సన్యాసులు, మతపెద్దలు ఉండే అఖాడాలకు నాగా సాధువులు కేంద్రంగా ఉంటారు. సనాతన మత ధర్మాలను పరిరక్షించేందుకే సాధువుల సంప్రదాయం ప్రారంభమైందని వారు చెబుతారు. ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆఖాడా సంప్రదాయంలో మొదట పది అఖాడాలే ఉండేవి. కానీ క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. ఇప్పుడు 15 అఖాడాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి చెందిన శివ, వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే అఖాడాలతో పాటు, సిక్కులకు కూడా సొంత అఖాడా ఉంది. అది 1855 నుంచే కుంభమేళాలో పాల్గొంటోంది.
కొత్తగా ఏర్పడిన అఖాడాల్లో మహిళా సాధువులు మాత్రమే ఉండేదాన్ని పరీ (దేవకన్యల) అఖాడా అంటున్నారు. ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాల కోసం ప్రత్యేక అఖాడా కూడా ఉంది. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అఖాడాలు చాలా పోరాటాలు చేసిన తర్వాత కుంభమేళాలలో పాల్గొనడానికి స్థానం సంపాదించుకున్నాయి. పరీ అఖాడాకు 2013 ప్రయాగలో జరిగిన కుంభమేళాలో ప్రాధాన్యం లభించింది. ఇక హిజ్రాల అఖాడాకు ఇప్పుడు జరిగే అర్ధకుంభ్‌లోనే ప్రాధాన్యం లభించింది. ఈ అఖాడాలు కుంభమేళాకు వచ్చేవారిని ఆకర్షించాయి. అఖాడాల ఊరేగింపు మొదటి మూడురోజులే ఉంటాయి. *