S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భక్తుల కొంగు బంగారం అల్లాదుర్గం

అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే అల్లాదుర్గం గ్రామ శివారులో వెలసిన శ్రీ బేతాళ స్వామి నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఇక్కడ ప్రతియేటా నిర్వహించే ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ లక్షలాది మందిని తన్మయత్వానికి గురిచేస్తాయి. బేతాళుడు అంటే భూత, ప్రేత, పిశాచాలకు అధిపతి. అలాంటిది ఆయనను దైవ స్వరూపంగా ఎందుకు పూజిస్తారనే ప్రశ్నలు తలెత్తడం సహజం. బేతాళుడి చరిత్రను తంత్ర శాస్త్రం అపూర్వంగా తెలియజేస్తోంది. బేతాళుడు అంటే రాత్రిళ్లు కాపలా కాసేవాడు అని అర్థం. బేతాళుడు వాస్తవంగా భూతం కాదని, శివుడి వద్ద ఉండే రుద్రగణాలలో నాగ, గరుడ, గంధర్వ అనే ఉప జాతులలో ఒక వర్గానికి అధిపతిగా, రాజుగా ఉన్నాడని తంత్ర శాస్త్రం ద్వారా అవగతమవుతోంది. బేతాళుడిలో కేవలం మగవారు మాత్రమే ఉండగా, స్ర్తి జాతి లేకపోవడం మరో విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో గ్రామ దేవతల సోదరుడు పోతురాజుగా ఆరాధించేది కూడా బేతాళ స్వామినే. తమిళనాడు, కేరళ, కర్నాటక, శ్రీలంక తదితర ప్రాంతాల్లో బేతాళ స్వామిని కర్పస్వామిగా పూజిస్తారు. మహారాష్టల్రో బేతాళ్‌గా విఠోభగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బేతాళుడు అసూయ, కోపం ఇతర దుర్గుణాలను తొలగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ స్వామిని మనసా, వాచా, కర్మణా పూజిస్తే భూత, ప్రేత, పిశాచ, అనారోగ్య బాధలను నుండి విముక్తి కల్పిస్తాడని నమ్మకం. పచ్చని పొలాలకు, కొత్తగా నిర్మించే గృహాలకు దిష్టి తగులకుండా బేతాళుడి స్వరూపంలో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి మనకు తెలియకుండానే మొక్కులు చెల్లించుకుంటున్నాం. బేతాళ స్వామిని వశపర్చుకోవడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో అఘోరీలు కర్ణకఠోరమైన పూజలు నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. మహారాష్ట్ర కొంకణ్ తీరంలో సింధూదుర్గ్ జిల్లా వెంబుర్ల తాలుకాలోని హరావళిలో 17వ శతాబ్దంలో బేతాళుడి దివ్య మందిరాన్ని నిర్మించారు. ‘హరా’ అంటే శివుడు...‘వళి’ అంటే గ్రామం. శివుడు కొలువైన ఆ గ్రామంలో కాపలాదారుగా బేతాళుడు ఉంటాడని పురాణాల ద్వారా స్పష్టమవుతోంది. హరావళి ఆలయ విశేషం, చరిత్ర ఎంతటి అపూర్వమో అదే స్థాయిలో మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గంలో గ్రామానికి దక్షిణ భాగాన బేతాళ స్వామి వెలిసి లక్షలాది మంది భక్తులకు శుభాలు కలిగిస్తున్నాడు. ఇక్కడ స్వామి వారు చేతిలో కొరడా పట్టుకుని భక్తులకు నిజదర్శమిస్తాడు. అల్లాదుర్గంలోని బేతాళ స్వామి మందిరాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించి ఉండవచ్చని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే బేతాళ స్వామి జాతర మహోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. గ్రామ పొలిమేర్లలో ఉన్న ఇల్లింత చెట్టు వద్ద బేతాళ స్వామి విగ్రహం ఉందని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తే సర్వరోగాలకు ప్రాప్తి లభిస్తుందని ఓ స్వామి చెప్పినట్లు గ్రామస్థులు చర్చించుకుంటారు. బేతాళ స్వామి మందిరానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. పునాదులు తీసి గోడలు కట్టకుండా కేవలం 16 రాతి స్తంభాలపైన పైకప్పును నిర్మించారు. మందిరంపై కూడా ఎలాంటి గోపురం లేకపోవడం మరో విశేషం. స్వామివారి విగ్రహానికి వెనుకభాగం పడమటి దిక్కులో మాత్రం గోడను నిర్మించగా, తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులు ఖాళీగా ఉన్నాయి. వైద్యం అంతంత మాత్రంగా ఉన్న నాటి కాలంలో ప్రజలు కలరా, మశూచి లాంటి వ్యాధుల బారిన పడటం, పశువులకు సోకే గాలికుంటు వ్యాధిని నివారించడానికి దైవాన్ని నమ్ముకునే వారు. ఇందులో భాగంగానే ప్రజలు సుభిక్షంగా ఉండాలనే తలంపుతో అల్లాదుర్గం సంస్థానాదీశుడైన ఈర్ల రాఘవరెడ్డి మొట్టమొదటి సారిగా బేతాళ స్వామి ఉత్సవాలను ప్రారంభించినట్లు ఆయన మనవడు ఈర్ల అనిల్‌కుమార్‌రెడ్డి వివరించారు. అనంతరం ఈర్ల లక్ష్మారెడ్డి, ప్రస్తుతం అనీల్‌కుమార్‌రెడ్డిలు జాతరను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. బండ్ల ఊరేగింపు రోజున స్వామి వారికి కావల్సిన పూజా సామాగ్రి, పట్టు వస్త్రాలను సంస్థానాదీశుల ఇంటి నుంచి తీసుకువెళ్లడం నేటికి ఆనవాయితీగా వస్తోంది. ఈర్ల అనిల్‌కుమార్‌రెడ్డి కమిటీ అధ్యక్షునిగా ఉంటూ ప్రతియేటా ఉత్సవాలను ఘనంగా చేపడుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్టల్ర నుండి లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అరటి పండ్లను (రంభాఫలాలు) నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు. ఈ యేడాది ఏప్రిల్ మూడవ వారంలో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగడం గమనార్హం. మొదటి రోజు పోలేరమ్మ, రెండవ రోజు పోచమ్మ, మూడవ రోజు దుర్గమ్మ, నాలుగవ రోజు బేతాళ స్వామికి బోనాల ఊరేగింపులతో పూజలు నిర్వహించారు. ఐదవ రోజు బేతాళ స్వామికి బండ్లతో చేపట్టిన ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకప్పుడు సంస్థానాదీశుల ఎడ్ల బండి ముందుంటే దాని వెంబడి చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన దాదాపు 150 వరకు బండ్లను ఊరేగించే వారు. కాలక్రమేణా ఊరేగింపులో బండ్ల సంఖ్య తగ్గినా ఇప్పటికీ 50కి పైగానే పాల్గొంటుండటం గమనార్హం. తెలంగాణకే తలమానికమైన ఏడుపాయల జాతర ఎడ్ల బండ్లకంటే అల్లాదుర్గం బేతాళ స్వామికి నిర్వహించే ఎడ్ల బండ్ల అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరవ రోజు భాగోతము, ఏడవ రోజు భజనలు, ఎనిమిదవ రోజు లంకా దహనం, తొమ్మిదవ రోజు పాచిబండ్ల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. శివ సత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బేతాళస్వామి ఆవహించిన శివ సత్తులు భక్తులకు భవిష్యవాణిని తెలియజేడం, వాతావరణం, పాడిపంటల ఏవిధంగా ఉంటాయో వివరించడం విశేషం. ప్రతి సంవత్సరం వేసవి కాలం ఆరంభంలో వచ్చే ఈ ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాగడానికి, స్నానాలకు అవసరమైన మంచినీటి వసతి కల్పించనున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు, ఖాళీ స్థలంలో భక్తులు నిర్మించుకునే తాత్కాలిక గుడారాలు దర్శనమిస్తాయి. బంధు, మిత్రులు, సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాక విందులు, వినోదాలతో ఆనందోత్సవాల మధ్య కాలక్షేపం చేస్తారు. జాతర ప్రారంభమైందంటే అల్లాదుర్గం గ్రామంలోని దాదాపుగా అన్ని కుటుంబాలు బంధువులతో సందడిగా కనిపిస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బంధువులను ఆహ్వానించుకుని ఉల్లాసంగా కాలం వెళ్లదీస్తారు. ఈ జాతర ఉత్సవాల నాటికి వ్యవసాయ పనులు కూడా ముగియనుండటంతో బంధువులు రావడం పరిపాటి. గ్రామీణ ప్రాంత ప్రజల పాలిట నమ్మిన ఇలవేల్పుగా విలసిల్లుతున్న బేతాళస్వామి జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం చిరు వ్యాపార సంస్థలు, తినుబండారాల దుకాణాలు, టీ కొట్లు వెలుస్తాయి. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ భారీ ఎత్తున పోలీసులను మోహరించి బందోబస్తును పర్యవేక్షిస్తోంది. *

-తమ్మలి మురళీధర్ 9989507333