S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘యోగి’ అమృతోత్సవం

భగవాన్ విశ్వయోగి విశ్వంజీ 75 వ జన్మదినోత్సవం
మహారుషులు, యోగులు, గురువులు, ఆచార్యులు నెలవైన స్థలం భారతదేశం. వేల సంవత్సరాల నుండి ఆచార్య పరంపర, గురువుల పరంపర భారత్‌లో కొనసాగుతూ వస్తోంది. భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న శక్తి ఆచార్యపరంపరనే. మహారుషులు, యోగుల చల్లని చూపుల వల్లనే ఈ దేశం ప్రశాంతంగా నడుస్తోంది. ఇది కాదనలేని సత్యం. భగవంతుడు ఈ భువిపైకి ఏ రూపంలో వస్తాడో ఎవరికీ తెలియదు. మనుషుల రూపంలో అవతారం ఎత్తిన భగవంతుడు తానే భగవంతుడిని అంటూ ఏ యుగంలోనూ చెప్పుకోలేదు. రాయి రూపంలో ఉన్న ‘వజ్రాన్ని’ గుర్తించే శక్తి వజ్రం గురించి నైపుణ్యం, అవగాహన ఉన్నవారికే ఉంటుంది. అలాగే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో, ఏ రూపంలో జన్మించాడో గుర్తించగలవారు కొందరే. అలాంటి వారి ద్వారా మొత్తం సమాజం భగవంతుడి గురించి తెలుసుకుంటోంది. శ్రీకృష్ణుడు భగవత్ రూపమే అని కౌరవులు మరీ ముఖ్యంగా దుర్యోధనుడు మొదటనే గుర్తించి ఉంటే మహాభారత యుద్ధమే జరిగేది కాదు. దుర్యోదనుడి అహంకారం కారణంగానే మహాభారత యుద్ధం జరిగింది. సమాజాన్ని చక్కటి మార్గంలో నడిపేందుకు, అధర్మానికి హాని జరిగిన ప్రతి సారి భువిపై జన్మిస్తుంటానని భగవంతుడే స్వయంగా వెల్లడించారు. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లోనే కాదు కలియుగంలో కూడా భగవంతుడు వివిధ రూపాల్లో జన్మిస్తున్నాడు.
దత్తుడి అవతారంగా భక్తులు భావించే ‘విశ్వయోగి విశ్వంజీ’ అమృతోత్సవం ఇప్పుడు జరుగుతోంది. 2019 మార్చి 5 న ‘విశ్వ యోగి’ 75 వ జన్మదినోత్సవం. తన జన్మదినోత్సవాన్ని ‘విశ్వసమైక్యతా శాంతి దినోత్సవం’గా స్వామి స్వయంగా ప్రకటించారు.
గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్లే జాతీయ రహదారి 16 (పాత జాతీయ రహదారి 5) లో ఉన్న చినకొండ్రుపాడు వద్ద ఉన్న ‘విశ్వనగర్’ విశ్వంజీ ఆశ్రమం. విశ్వనగర్ లోనే స్వామి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ‘నా జీవితమే నా సందేశం’ అంటారు విశ్వంజీ. మహానుభావుల అడుగుజాడల్లో నడవడం, వారి బోధనలను అమలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయనడంలో అతిశయోక్తిలేదు. ప్రకృతిని ప్రేమించాలని, ఆరాధించాలని, ప్రకృతిని కలుషితం చేయవద్దని స్వామి చెబుతుంటారు. భగవంతుడితో నేరుగా సంబంధం కలిగి ఉండాలని విశ్వంజీ బోధిస్తుంటారు.
‘‘బ్రహ్మభూతః ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌॥
(్భగవద్గీత 18 వ అధ్యాయం 54 వ శ్లోకం ఇది)..‘దివ్యస్థితియందు జీవించే వారు పరబ్రహ్మానుభవనాన్ని పొంది, దేని కొరకు శోకింపక, దేనినీ వాంఛింపక, సర్వజీవుల యందు సమత్వభావనను కలిగి ఉంటారు, భగవంతుడి పాదాలపై మనస్సు నిలపకపోతే ఎవ్వరు కూడా బ్రహ్మభావనలో నిలిచి ఉండలేరు..అంటూ శ్రీకృష్ణపరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెబుతారు. విశ్వంజీ కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు.
ప్రకృతి పంచభూతాలతో కూడుకుని ఉంది. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలు మన జీవనానికి మూలమైనవి. మనిషి కూడా పంచభూతాలతో కూడుకుని ఉన్నాడు. మనదేహం పంచభూతాలతో కూడుకుని ఉన్నందు వల్లనే ‘దేహమే దేవాలయం-హృదయమే దైవపీఠం’ అంటున్నారువారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ది అనేవి మనిషి దేహంలో పంచభూతాలకు కేంద్రాలని చెబుతున్నారు. పంచభూతాలతో కూడిన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, దేవాలయంలా పవిత్రంగా మార్చుకోవాలని విశ్వంజీ చెబుతుంటారు. నీతి, న్యాయం, ధర్మం, సత్యం అనే మార్గాల్లో నడిస్తే మనిషి ఉన్నత శిఖరాలవైపు పయనించేందుకు వీలవుతుందని విశ్వ యోగి చెబుతుంటారు. అదేవిధంగా భగవంతుడి సృష్టి అయిన పంచభూతాలు స్వచ్ఛంగా, కల్తీలేని విధంగా ఉండాలి. పంభూతాలను ఎట్టిపరిస్థితిలో కలుషితం చేయ కూడదని, అలా చేయడం వల్ల వాటి మధ్య సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని గత మూడు దశాబ్దాల నుండి విశ్వంజీ చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు నేడు పకృతి వైపరీత్యాలను చవిచూస్తున్నాయి. భూకంపాలు, తుపాన్లు, టోర్నిడోల వల్ల అనేక దేశాలు ఇక్కట్లకు గురవుతున్నాయి. హిమాలయాలతో పాటు అనేక మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. వేలాది సంవత్సరాల నుండి హిమపర్వతాలు కరగడం అన్నది లేదు. అంతరిక్షంలో ఓజోన్ పొర బలహీనం అవుతోంది. దాంతో ఎండలు విపరీతమై మండుతున్నాయి. వైపరీత్యాల వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో పాటు ఆస్తులకు కూడా నష్టం జరుగుతోంది.
అందుకే పంచభూతాలు శాంతిగా ఉండాలంటూ భగవంతుడి పూజ తర్వాత శాంతి మంత్రం చదవడం భారతీయ సాంప్రదాయం.
‘పృథ్వి శాంతిః
ఆపస్ శాంతిః
అగ్నిశాంతిః
వాయు శాంతిః
ఆకాశ శాంతిః
అంటూ శాంతి మంత్రం చదువుతారు. పంచభూతాలను కలుషితం చేయవద్దంటూ విశ్వంజీ మహారాజ్ చేస్తున్న బోధనలు ప్రపంచంలోని అన్నిదేశాలకు ఆచరణ యోగ్యమైనవి. భారత్, అమెరికా, రష్యా, చైనా, కొరియా, జపాన్ తదితర దేశాల అధినేతలకు అనేక పర్యాయాలు ఈ అంశంపై యోగి లేఖలు రాశారు. పంచభూతాలను సంరక్షించడం కేవలం ఒక భారతదేశంపైనో, అమెరికాపైనో మాత్రమే లేదని ప్రపంచంలోని అన్ని దేశాలు ఇందుకు నడుం కట్టాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని విశ్వంజీ చెబుతున్నారు.
ప్రపంచ దేశాలన్నీ మేల్కొనాలని, చైతన్యం కావలసిన అవసరం ఉందంటున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఐక్యంగా పనిచేయాలని (అవేక్, అరైజ్ అండ్ యూనైట్) ఈ విశ్వానికి విశ్వంజీ సూచించారు. గత ఇరవై ఏళ్లుగా విశ్వంజీ అమెరికా వెళుతున్నారు. అమెరికాలోని పాలకులు, విశ్వవిద్యాలయాలు, మేధావులతో జరుపుతున్న చర్చల్లో పంచభూతాల పరిరక్షణ, విశ్వశాంతి అనే విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
మూడు అంశాలు
పంచభూతాలను కలుషితం కాకుండా కాపాడుకోవడంతో పాటు, ప్రపంచాన్ని భయభ్రాంతులను చేస్తున్న భయంకర వ్యాధులను నివారించడం, యువత తప్పుడు మార్గాల్లో పయనించకుండా చూడటంపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి కేంద్రీకరించాలని విశ్వంజీ సూచిస్తున్నారు.

విశ్వనగర్
విశ్వయోగి విశ్వంజీ ప్రధాన ఆశ్రమంగా ఉపయోగిస్తున్న కేంద్రమే ‘విశ్వనగర్’. విశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న విశ్వనగర్ ప్రకృతి రమణీయతకు మారుపేరుగా విరాజిల్లుతోంది. ఏపీలోని గుంటూరు పట్టణం నుండి చిలకలూరిపేట వెళ్లే జాతీయ రహదారిలో 16వ కిలోమీటర్ వద్ద విశ్వనగర్‌ను ఏర్పాటు చేశారు. భగవంతుడి ప్రతిరూపమే ప్రకృతి అన్నట్టు విశ్వనగర్ ప్రకృతి మధ్య ఓలలాడుతోంది. విశ్వనగర్‌లోని ‘గురుపీఠం’లో స్వామి ఉంటారు. గురుపీఠం సమీపంలో ‘విశ్వ మానవ సమైక్యతా స్థూపం’ (విశ్వ మందిరం) నిర్మించారు. ప్రపంచంలోని అన్ని మతాలు సమానమే అని చాటిచెప్పేందుకే విశ్వ మానవ సమైక్యతా స్థూపాన్ని నిర్మించినట్టు స్వామి చెబుతున్నారు. హిందూ, ముస్లిం, క్రిష్టియన్, జోరాష్ట్ర, శిక్కు, బౌద్ద, జైన్ మతాలతో పాటు మతం అంటే నమ్మకం లేని నాస్తికుల పేర్లతో ద్వారాలను ఏర్పాటు చేశారు. ఏ ద్వారం నుండి వెళ్లినా చివరకు చేరేది ఒకే చోటికి అని చాటి చెప్పడమే విశ్వ మానవ సమైక్యతా స్థూపం నిర్మాణం ఉద్దేశం. విశ్వనగర్ ఆవరణలో విశాలమైన ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మాతా, శిశు చికిత్సా కేంద్రంగా ప్రత్యేకంగా దీనికి పేరుపెట్టారు.
గణేశుడి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం ఉన్నాయి. హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాల నిర్వహణకు ఆడిటోరియం నిర్మించారు. హోమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా హోమమందిరాన్ని నిర్మించారు. స్వామి వద్దకు వచ్చే భక్తులు నివాసం ఉండేందుకు గెస్ట్‌హౌజ్‌లు ఉన్నాయి. గోశాల ప్రత్యేకంగా ఉంది. దత్తాత్రేయుడి అవతారాలను తెలియచేసే నిర్మాణాలు ఉన్నాయి.
విశ్వశాంతికి కేంద్రంగా విశ్వనగర్‌ను విశ్వయోగి మారుస్తున్నారు.

- పి.వి.రమణారావు 98499 98093