S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శివరాత్రి - ఏకపాద రుద్ర దర్శనం

నేడే మాఘ కృష్ణ చతుర్దశి. మహాశివరాత్రిగా జగత్ప్రసిద్ధి పొందిన మహాపర్వదినం. హరహర మహాదేవ శంభో! శంకరా! నమః శివాయ అంటూ భక్త జనులందరు భక్తి పారవశ్యంతో ఎలుగెత్తి పలికే శివనామోచ్చారణలు కైలాసం వరకు వ్యాపించి ప్రతిధ్వనించే మహాశివరాత్రి పర్వదినమిదే. ఇసుమంత మారేడు పత్రి మీదకు విసిరినా, ఉద్ధరణి నీళ్లు పైన చిలకరించినా, కొడిగట్టే దీపాన్ని పైకి ఎగద్రోసి దీపం వెలిగించినా, జూదాలాడుతూ కూడ మేల్కొని ఉన్నా, ప్రీతి చెంది కోరిన కొండంత వరాలను గుప్పించే బోళా శంకరుణ్ణి కొలుచుకొనే ఈ మాఘ కృష్ణ చతుర్దశీ పుణ్య దినాన్ని పొరపాటున మరచిపోతామేమోనన్న భయంతో ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాడు ఇది మాస శివరాత్రి అని శ్రద్ధగా పరమేశ్వరుని పూజించుకొంటూ ఏ పర్వదినం కోసం ఎదురుచూడని విధంగా భక్తులందరు ఎదురుచూచే పవిత్ర దినం కాబట్టే ఇది మహా శివరాత్రిగా ప్రఖ్యాతి పొందింది.
కాలం హరిహరాత్మకం
అంతే?! ‘కాలః కలయతా మహమ్’ కాల స్వరూపంగా ఉన్నది నేనే.. అన్న భగవద్వచనానికి నిదర్శనంగా విష్ణు తత్త్వం సాకారమై కృష్ణ స్వరూపంగా భువికవతరించిన శ్రావణ కృష్ణ పక్షానికి సరిగ్గా ఆరు నెలల వ్యవధిలో వచ్చే మాఘ కృష్ణ పక్షంలో శివతత్త్వం సాకారంగా అవతరించిన విశేష పర్వదినం కావడం ద్వారా (ఈ గాథ ముందు చూడండి) హరిహరాత్మకమైన సంపూర్ణ కాల స్వరూపానికి ఈ మాఘ కృష్ణ చతుర్దశి సూచకంగా ప్రాముఖ్యం సంతరించుకొంది. కృష్ణావతారంగా విష్ణు తత్త్వం ఆధిభౌతికంగా మహిమాన్వితమైనట్లుగా మాఘ మాసం నాటి సాకారమైన శివతత్త్వం ఆధిభౌతికంగా అంటే లౌకికంగా కాక కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే మహిమాన్వితంగా ప్రసిద్ధమైంది. చిత్రమేమంటే కృష్ణ తత్త్వం బహు పురాణ - ఇతిహాస ప్రసిద్ధమైనట్లే సాకారమైన శివతత్త్వం లింగోద్భవ మూర్తిగా, ఏకపాద రుద్రమూర్తిగా విశిష్ట నామాలతో శివ - వాయు - లింగ - శివ - బ్రహ్మాండ పురాణ భారతాది గ్రంథాదుల యందు బహుదా వర్ణింపబడటమే గాక విశేషించి వేద ప్రతిపాదితమై ప్రాముఖ్యం వహించి ఉంది. అయితే కృష్ణ లీలలుగా విష్ణు మహిమ జగత్ప్రసిద్ధమైనట్లు వివిధ రీతులుగా శివలీలలు జగత్ప్రసిద్ధమై ప్రకటనం కాకపోయినా శివలీలల సమస్త సమాహారంగా శివమహిమ లింగోద్భవ లీలగా సమావిష్కృతమయింది.
లింగోద్భవ గాథ
సృష్ట్యాదిలో రజోగుణ స్వభావుడైన బ్రహ్మయందు సృష్టికర్తనైన నేనే సర్వోన్నతుడనన్న గర్వం కలిగి - యోగ నిద్రలో నున్న తండ్రిని తట్టిలేపాడు. ‘తండ్రికీ విధంగా నిద్రాభంగం చేయతగునా’ అని శ్రీహరి పలుకగా నిద్రా మత్తుడవైన నీవు నాకు తండ్రివా? అని బ్రహ్మ ధిక్కరించాడు. అప్పుడు నీకు తండ్రినైన నేను సృష్టికర్తనని నారాయణుడు పలుకగా కాదు నేనే సృష్టికర్తనని బ్రహ్మ పలికాడు. అది వివాదంగా మారి వారి మధ్య ఘోర యుద్ధంగానే మారింది. దానితో జగత్తు విలవిలలాడింది. వారి మధ్య యుద్ధాన్ని నివారించేందుకు పరమ శివుడు స్తంభాకృతిలో దివ్యజ్యోతిర్లింగంగా ఉద్భవించి నా ఆద్యంతాలను కనుగొని ముందుగా వచ్చిన వారే సర్వోన్నతులు, సృష్టికర్తలు అని ఆదేశించాడు. విష్ణువు వరాహ రూపంగా క్రింది భాగాన్ని, బ్రహ్మ హంసనెక్కి ఊర్థ్వ భాగాన్ని కనుగొనేందుకు ఉద్యమించారు. వేలవేల యేండ్లు గడిచినా లింగానికి ఆద్యంతాలు కనుగొనలేని హరి బ్రహ్మలకు సాకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు.
ఏకపాద రుద్ర రూపం
అలా లింగంలో ఆవిర్భవించిన సాకారమూర్తినే ‘లింగోద్భవ మూర్తి’గా పురాణాలన్నీ చెబుతున్నాయి.
‘ఆ మూర్తి ఇరువది ఎనిమిది కోట్ల రుద్రులలో సర్వోన్నతుడు. ఏకపాద మూర్తి. త్రినేత్రుడు. శూలాయుధుడు. ఎడమ ఒడిలో శ్రీహరి, కుడి ఒడిలో బ్రహ్మ కలిగి యుండి సర్వాంగ శోభితుడై యున్నాడు.’
అని వాయు - లింగ - శివ - బ్రహ్మాండ పురాణాలు, మహాభారతం విపులంగా వర్ణించాయి. అట్లే ఉత్తర కారణాగమం మరియు అంశుమద్భేదాగమం మొదలైన శైవాగమాలు కూడా ఇట్లే వర్ణించాయి.
శ్లో.క పాదం చతుర్బాహుం త్రినేత్రం శూల సంయుతం
సృష్ట్యాస్థితం హరింవామే దక్షిణే చతురాననం
అష్టావింశతి రుద్రాణాం కోటీః సర్వాంగ సుప్రభమ్
-లింగ పురాణం 76 అధ్యాయం 8-9 శ్లో.
(చూడు. భారతం. అనుశాసనిక పర్వం 351-352. వాయు పురాణం. పూర్వార్థం 55 అధ్యాయం)
ఈ మూర్తి లింగానికి ఆద్యంతాలను కనుగొనేందుకు ఊర్థ్వ - అధో భాగాలకు వెళ్లిన హరి బ్రహ్మలను కుడి ఎడమలలో సమాకర్షించుకొన్న దివ్యమూర్తి అని వేరే చెప్పాలా? చిత్రమేమంటే ఈ మూర్తికి పాదాలు రెండుకాక ఒకటేనట. ఇలాంటి దేవతామూర్తులను మీరెక్కడైనా చూచారా? లేదు కదా! మరి ఈ మూర్తికి ఒక పాదమేమిటి?
ఏకపాదమంటే ఏమిటి?
పాదం నడకకు సాధనం. ఇక్కడ పాద శబ్దం లోకంలోని సాధారణమైన నడకను తెలిపే పదం కాదు. నిత్యగమన శీలమైన క్రియకు సంకేతం. సంకేతితమైన ఈ గమన క్రియ కేవలం విశ్వ సంబంధియే. ఎందుకంటే విశ్వం పుట్టి (జాయతే) నడుస్తూ (గచ్ఛతి) ఉంటుంది కాబట్టి. ఈ గమనం ఒక పాదంతో సాధ్యం కాదు. అందుచేత ‘ఏకపాద’ శబ్దం గమన రహిత స్థితి అంటే సృష్టి రచన జరుగని దశకు చెందిన స్థితిని తెలిపే శబ్ద ప్రతీక అన్నమాట. దీనిని బట్టి ఏక పాదం కల ఈ మూర్తి సృష్టికి పూర్వం సృష్టి స్థితిలయలను తనలో విలీనం చేసుకొని పునః సృష్టికి మూలాధారంగా నిర్గుణమై నిరాకారమై వెలసియున్న ఊహాతీతమైన ఒకానొక అలౌకిక దివ్యమూర్తి అని స్పష్టమవుతూ ఉంది.
వేద ప్రామాణ్యాలు
గర్వించి కలహించుకొంటున్న హరి బ్రహ్మలకు దర్శనమిచ్చిన మూర్తిని, శోధించి కూడా వారు ఆద్యంతాలను కనుగొనలేని ఆ ఆద్యంత రహిత ఏకపాద రుద్ర మూర్తి, కుడి ఎడమలలో హరి బ్రహ్మలను సమాకర్షించుకొని విలీనం చేసుకొనగా అట్టి మూర్తిని ముక్తకంఠంతో వేదాలు బహుదా ఇలా కీర్తించాయి. ఆ కీర్తనలో ఏకపాద శబ్దంతోబాటు 1.అజమూర్తి అని 2.స్తంభాకృత మూర్తి అని మరో రెండు విశేష నామాలను ప్రస్తావించాయి వేదాలు.
అజమూర్తి - ఏకపాద మూర్తి - మం.తత్రశ్రీయే జ ఏక పాదో దృంహత్ ద్యావాపృథివీబలేన
- తైత్తిరీయ బ్రాహ్మణం 3-1-2-8

స్తంభాకృతి - వియస్తంభషళిమా రజాం స్యజస్యరూపే కిమపిస్విదేకమ్.
(ఋగ్వేదం 1 మండలం 664 సూక్తం. 6 మంత్ర)

ఈ విధంగా అజాయమానమై అంటే పుట్టుక లేనిదై (అజ), స్తంభాకృతిగా ఉన్న ఈ మూర్తి సృష్టి రచన కాధారభూతంగా స్థిరంగా ఒకే పాదంతో ప్రకాశిస్తూ ఉందని అధర్వణ వేదం
‘ఏకం పాదం నోక్షిదతి సవిలాద్ధం స ఉచ్చరన్ (అధర్వణ వేదం 11-4-21.) స్పష్టంగా చెప్పింది.
అరుణాచలమే లింగోద్భవమూర్తి
స్తంభాకృతిలోని ఇచటి ఏకపాద రుద్రమూర్తి ఎవరో కాదు సాక్షాత్తు అరుణాచలంలోని అరుణాచలమే. అందుకే అందు వెలసిన పరమశివుడు పంచభూత లింగాలలోని అగ్ని లింగంగా ప్రఖ్యాతి చెందాడు. అరుణాచల రూపంగా చతుర్ముఖ - నారాయణులకు పరబ్రహ్మయే సగుణ - నిర్గుణా కృతులలో (ఏకపాద రుద్ర రూపంగా - అగ్ని లింగంగా) దివ్య దర్శనమిచ్చిన మాఘ కృష్ణ చతుర్దశీ రాత్రి, పరమాత్మ సాక్షాత్ దివ్యదర్శన శుభ రాత్రిగా, శివరాత్రిగా లోక ప్రసిద్ధి గాంచింది. అందుకే అర్ధరాత్రి లింగ దర్శనం పరమాత్మ దివ్య దర్శన మహాఫలదాయినిగా నేటికీ విశ్వసింపబడుతూ ప్రాముఖ్యాన్ని వహించింది. కృష్ణుడుగా విష్ణువు, ఏకపాద రుద్రమూర్తిగా పరమ శివుడు ఉద్భవించి తమ దివ్య తత్త్వ దర్శనాన్ని భక్తుల కనుగ్రహించిన సమయం మాత్రం అర్ధరాత్రే కావడం అనుకోని సంఘటన కాదు.
జాగరణ
ఈ విధంగా రాత్రే భగవద్దివ్య దర్శనం కావడంలోని రహస్యాన్ని విచారిస్తే - రాత్రి చీకటికి పుట్టినిల్లు. ఆధ్యాత్మిక లోకంలో చీకటి అజ్ఞానానికి ప్రతీక. దానివల్ల కలిగేది అహంకారం. ఇదే, జీవుడికి పరమాత్ముడికి మధ్య అడ్డుగోడగా నిలిచేది. లోకమంతా అహంకార బీజమైన అజ్ఞానాంధకార మలముకొన్న రాత్రియందే దైవాన్ని విస్మరించి నిద్రపోతూ ఉంటుంది. జ్ఞానులు, భక్తులు అట్టి రాత్రికి వశపడక జాగరూకులై అంటే మెలకువ కలిగి ఉంటారు. మెలకువ అంటే - భగవద్ధ్యానం - భగవత్క్థాశ్రవణం - భగవద్గోష్ఠి - భగవద్భజన -మొదలైన వాటిలో కాలం గడుపుటయే. లోకులంతా సాధారణంగా అజ్ఞాన రాత్రిలో నిద్రపోతూ ఉంటే అప్పుడే జ్ఞానులు భక్తులు ఆ విధంగా భగవద్ జ్ఞానతత్పరులై జాగరూకులై (మెలకువతో) ఉంటారు.
శ్లో.యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమా
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః (్భ.గీ.2-69)
అని భగవద్గీత వచించింది. ఆ జాగరణ మార్గానే్న నిర్దేశిస్తూ శివరాత్రి ఒక్కరోజయినా ఆచరించండని శివరాత్రి నాడు ‘జాగరణ’ ముఖ్య విధిగా విధించబడింది. కారణం బ్రహ్మకు - శ్రీహరికి శివతత్త్వ జ్ఞానం బోధపడిన రాత్రి గనుక. మృత్యువు దయ లేనిది కాబట్టి మరో శివరాత్రి జీవితంలో వస్తుందో రాదో, ఈ జన్మలోనే భగవద్దర్శనం పొందాలనుకొనే వారు మాస శివరాత్రి అన్న పేరుతో నెలనెలా శివారాధన చేస్తూ లెక్కించుకొంటూ ఎదురుచూచిన ఈ మహాశివరాత్రి మన జన్మకో శివరాత్రి అని దృఢ నిశ్చయంతో జాగరణ నియమాన్ని విధిగా పాటించాలి.
ఉపవాసం
ఇక ఆ రోజు భోజనమంటారా? ఆ ఒక్కరోజు తినకుంటే ప్రాణం పోదు కదా అని ధైర్యంతో దైవ సాన్నిధ్యాన్ని విడిచిపెట్టక ఉపవాస వ్రతాన్ని పాటించాలని ఋషులు నిర్దేశించారు. ఉప - దైవ సన్నిధిలో వాస = ఉండుటయే ఉపవాస శబ్దాని కసలు అర్థం కూడా. అంటే శివ సన్నిధిలో భగవద్ధ్యాన తత్పరులు కావాలని భావం.
అభిషేకార్చనలు
నాలుగు మారేడాకులు మీద పడేసి, ద్రోసెడు నీళ్లు పైన పారబోసి, కొండెక్కే దీపాన్ని ఎగత్రోసినా కూడా ననె్నంతో భక్తితో సేవించాడని పొంగిపోయే భోళాశంకరుని సన్నిధిలో శివరాత్రి నాడు ఉపవాసం - జాగరణలను ఆచరిస్తే శ్రీహరి మరియు చతుర్ముఖ బ్రస్మలకు ఏకాదశ రుద్రులలో ప్రధానుడైన ఏకపాద రుద్రమూర్తి ఇహలోక సౌఖ్యాలతోబాటు పరలోక శివసాయుజ్య ప్రదాత కాగలడు.
ఆలయాలు ఎందుకు లేవు?
ఇట్టి ఏకపాద రుద్రమూర్తిని మేమెన్నడూ ఏ దేవాలయంలో కూడ చూడలేదే అని సందేహించకండి. ఎందుకంటే శివుడికి లింగార్చనే గాని సాకార రూపార్చన లేదు. అంతేగాక సాకార రూపార్చన కంటె లింగరూపార్చనకే మహత్వ మధికం కూడా. అదీగాక ఏకపాద రుద్రమూర్తి ఉద్భవించింది కూడ నిరాకారమైన స్తంభాకృతి గల అగ్నిలింగం నుండే కదా. అందుకే అగ్ని లింగం నుండి ఉద్భవించిన ఏకపాద రుద్రమూర్తిని మనసున స్మరిస్తూ అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ మూర్తి పేరున నిరాకార రూపమైన అగ్ని లింగానే్న పూజిస్తున్నాం.
అయినా భక్తుల దర్శనార్థంగా భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలన్నింటిలో ఈ సాకార ఏకపాద రుద్రమూర్తులు కనపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాళహస్తి, బిక్కవోలు, ముఖలింగం, త్రివేండ్రం, తిరువళ్లం - హీరాపూర్, నంజుండేశ్వరాలయం, జంబుకేశ్వరం, ఉజ్జయిని ఇలా ఎనె్నన్నో చోట్ల ఈ ఏకపాద రుద్రమూర్తులు దర్శనమిస్తున్నాయి. కాకపోతే ఈ మూర్తులకు ప్రత్యేకాలయాలు మాత్రం లేవు.
లేకపోయినా సృష్ట్యాదిలోని ఈ ఏకైక ‘ఏకపాద రుద్రమూర్తి’ యే సాకారులైన హరి - హర - బ్రహ్మ లనే త్రిమూర్తి రూపాలుగా ఉద్భవించి సృష్టి - స్థితి - లయాలను నిర్వహిస్తున్నారని అనేక కావ్యాలలో కూడా ప్రశంసింపబడ్డాడు.
శ్లో.ఏకైవమూర్తి ర్బిభిదే త్రిధాసా, సామాన్య మేషాం ప్రథమావరత్వం
విష్ణోర్హరస్తస్య హరిః కదాచిత్ వేధాస్తయోస్తావతి ధాతురాద్యౌ.
కుమారసంభవం సర్గ 7. శ్లో.44
ఇలా ప్రశంసితుడైన ఈ ఏకపాద రుద్రమూర్తి అంతర్లీనంగా అర్చామూర్తిగా ఉంటూనే నిర్గుణ భగవదారాధనా ప్రాముఖ్యాన్ని చాటుతూ ఉన్న ఈ మహాలింగ మూర్తి సకల పరమయోగి జన ధ్యానైక గమ్యుడు. నానా నామరూప ధారుడైనా నామరూప రహితుడు. ‘ప్రజ్ఞానం బ్రహ్మా’ అన్న మహావాక్య వాచ్యుడైన జ్ఞానైక మూర్తి. ముముక్షువులు సదా ఆకాంక్షించే ‘రసోవైసః’ అన్న ఉపనిషద్వచన ప్రతిపాద్యుడైన ఈ బ్రహ్మానందైక రస స్వరూపి. ఇట్టి మహాదేవమూర్తికి సదాశివమూర్తికి, ఏకపాద రుద్రమూర్తికి ఇదే అక్షరాభిషేకం. సాష్టాంగ వందనం.
శ్లో.ఆనందాయ నిరంతరాయ మహతే జ్ఞానాయ విశ్వాత్మనే
నిత్యాయాక్షత తేజసే సుమహతాంగమ్యాయవై యోగినామ్
నానాకార విధాయినే ప్యవికృతాకారాయ చిత్తాంతరే
ప్రోన్మీలద్రస రూపిణే భగవతే తసమ్మై పరస్మై నమః

-పాలకోడేటి జగన్నాథరావు