S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాధు సమ్మతం

మనం మాట్లాడే భాష, రాసే భాష మన సభ్యతకి, సంస్కృతికి అద్దం పడుతుంది. మనం తెలివైన వాళ్లం కావచ్చు, మంచివాళ్లం కావచ్చు, కానీ మన భాష సాధుసమ్మతం కాకపోతే అది మన వ్యక్తిత్వానికి, శీలానికి ఒక వెలితిగా మిగిలిపోతుంది.
అసలు సాధు సమ్మతమైన భాష గురించి ఆలోచించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ముందుగా చెప్పనివ్వండి. నేను అవకాశం దొరికినప్పుడల్లా వైజ్ఞానిక వ్యాసాలు రాస్తూ ఉంటానని చదువరులలో చాలామందికి తెలుసు. ఇప్పటివరకు కలన యంత్రాలు, జీవ రసాయనశాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, విశ్వశాస్త్రం, గణితం, వగైరాలు ఎంపిక చేసుకున్నాను తప్ప ఇబ్బందికరమైన విషయాలని ఎత్తుకోలేదు. నా బావమరిది మూత్రపిండాల రోగాల మీద ప్రావీణ్యుడు కావున వాటి గురించి నలుగురికీ అర్థం అయ్యే భాషలో రాయమని అడిగేడు. ప్రవీణుడు పక్కన ఉన్నాడు కదా అని పని ప్రారంభించాను. ఆదిలోనే హంసపాదు!
మొదటగా పిండాలు అన్న పేరు నాకు నచ్చలేదు. పిండాకూడులా పిండాలేమిటి? చచ్చిపోయిన వాళ్లకి పిండాలు కానీ బతికున్న వాళ్లకి పిండాలేమిటి? మూత్రం అన్న మాట నా రాణీగారికి నచ్చలేదు. ఆమె గారికి శరీరం నుండి బహిష్కరించబడే పదార్థాల పేర్లు గానీ, ఆ బహిష్కరించే అవయవాల పేర్లు కాని చెబితే చాలు ‘వామిట్’ (కక్కు అన్న మాట ఆమె చెవిన పడకూడదు) చేసుకుంటుంది. అందుకని మూత్రపిండాలకి మరొక పేరు వెతకటం మొదలుపెట్టేను. నా రాణికి నచ్చితే సాధుసమ్మతం అనుకోవచ్చు.
సాధుసమ్మతం అంటే ఏమిటి? ఏ మాట, ఏ పదబంధం సాధుసమ్మతమో నిర్ణయించటం తేలికేమో కాని నిర్వచించటం కష్టం. అందుకనే సినిమాలని సెన్సారు చేసేవారు ‘ఆ బూతు బొమ్మలని మేము చూసిన తరువాత మీరు చూడకూడదనిపిస్తే కత్తిరించేస్తాం’ అంటారు.
సినిమాలలోను, దేవాలయాల గోడల మీద ఉన్న శిల్పాలలోను కనిపించే బూతు బొమ్మల సంగతి మరొక సందర్భంలో చూద్దాం. ఇప్పుడు, ఇక్కడ, రాసే భాష గురించి, మాట్లాడే భాష గురించి, వాటిలో ఏది ‘శ్లీలమో’ ఏది అశ్లీలమో నిర్ణయించటంలోని కష్టసుఖాల గురించీ మాట్లాడుకుందాం.
మాట్లాడే మాట అశ్లీలం అయినా, శే్లష వల్ల అశ్లీలార్థం స్ఫురించినా, నైచ్యార్థం ధ్వనించినా, నాజూకుగా లేదనిపించినా, అశుభం అనిపించినా ఒక మాటకి బదులు మరొక మాటని వాడటం జరుగుతూ ఉంటుంది. ‘బియ్యం నిండుకున్నాయి’ ‘దీపం ఘనం అయింది’ ‘స్వర్గస్థులయ్యారు’ ‘ఆరున్నొక్కటి’ మొదలైన ప్రయోగాలు తెలుగులో కోకొల్లలు. ఈ రకం ప్రయోగాన్ని ఇంగ్లీషులో ‘యూఫిమిజం’ అంటారు. వీటిని మనం తెలుగులో సభ్యోక్తులు, సరసోక్తులు, చతురోక్తులు వగైరా పేర్లతో సందర్భానుసారంగా పిలవచ్చు.
అశ్లీలం అన్న మాటకి నిర్వచనం ఏమిటి? ఏ భాషలోనైనా సరే రతి క్రియని వర్ణించే కొన్ని మాటలు, ఆ క్రియలో పాల్గొనే శరీర అవయవాల పేర్లు పచ్చి బూతులు. తెలుగు వారికి సంబంధించినంత వరకు, ఈ కోవకి చెందిన ఏ మాటలైనా సరే వాటిని తెలుగులో అన్నంతసేపే అభ్యంతరం; ఇవే మాటలని సంస్కృతంలో కాని, ఇంగ్లీషులో కానీ అంటే ఫరవాలేదు. అప్పుడవి పండు బూతులు. ఉదాహరణకి మన గ్రంథాలలో నాయికని వర్ణించినప్పుడు ముక్కు సంపెంగ పువ్వు, కళ్లు కలువ రేకులు, ముఖం చంద్రబింబం అనేసి ఊరుకోకుండా చన్నులు, పిరుదులు, తొడలు, ఇలా నఖశిఖ పర్యంతం సంస్కృత సమాసాలు గుప్పించి వర్ణించేస్తారు. అప్పుడు అది అశ్లీలం కాదు.
అమెరికాలో, సందర్భోచితం అయినప్పుడు, ‘పీనిస్, వెజైనా, ఇంటర్‌కోర్స్’ అన్న ఇంగ్లీషు మాటలు - ఆడ, మగ కలిసి ఉన్న సమావేశాలలో కూడా - నిరభ్యంతరంగా వాడటం నేను గమనించేను. (చూడండి, ఇక్కడ నేను ధైర్యంగా ఎలా వాడేనో?) అమెరికాలో ‘సెక్స్ ఎడ్యుకేషన్’ అన్న నెపంతో ప్రాథమిక పాఠశాలలో గురువులు ఈ మాటలని పిల్లల ఎదుట నిర్మొహమాటంగా వాడుతున్నారు. వీటికి సమానార్థకాలైన తెలుగు మాటలని వైద్యుడి దగ్గర కూడా వాడటానికి జంకుతాం. ఈ ‘నాలుగక్షరాల’ ఇంగ్లీషు మాటలకి సమానార్థకాలైనవి, సాధుసమ్మతం కానివి, బహిష్కరించబడ్డవి, అయిన ‘రెండు అక్షరాల’ తెలుగు మాటలు లేదా ‘బజారు మాటలు’ ఉన్నాయి. వీటిని ఇంగ్లీషులో ‘టేబూ’ అనిన్నీ, తెలుగులో ‘బూతు’ అనిన్నీ వాడటానికి భయపడతాం. కాని ఇంగ్లీషు సినిమాలలో ఈ నాలుగక్షరాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంగ్లీషు నవలలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ జాతికి చెందిన మాటలు, చేష్టలు లేకపోతే పుస్తకాలు అమ్ముడుపోవు, ప్రజలు సినిమాలు చూడరు అనే ‘పోహ’ (అపోహ కానిది) ఒకటి ఉంది.
మంచో, చెడో తెలుగు వాళ్లు ఇంకా బరితెగించిపోలేదు. నిఘంటువులలో ఇటువంటి మాటలు సర్వసాధారణంగా కనబడవు. అందుకనే కాబోలు నిజంగా అవసరం వచ్చినప్పుడు తెలుగు నిఘంటువుని సంప్రదిస్తే మనకి, ‘గే, లెస్ బియన్, పెడోఫైల్’ వంటి అవసరమైన మాటలు కూడా కనబడవు. మరొక ‘తుంటరులు’ ఎవరో ఈ మాటలు వాడేరని రాతలో చెప్పదలుచుకున్నప్పుడు .... అని రాస్తారు. టీవీ ప్రసారాలలో ఇటువంటి మాటలు వచ్చినప్పుడు వాటిని కత్తిరించి అక్కడ ‘బ్లీప్’ శబ్దం ప్రవేశపెడతారు. పిల్లలు చూసే, వినే కార్యక్రమాలలో అశ్లీలాలు దొర్లకూడదనే సదుద్దేశంతో ప్రసారకులు పాటించే బాధ్యతాయుతమైన పౌరసత్వ ప్రవర్తన ఇది.
నా చిన్నతనంలో రేడియోలు, టీవీలు లేవు. కనుక ‘బ్లీపు’లు కూడా ఉండేవి కావు. పైపెచ్చు నేను పెరిగిన వాతావరణం, తిరిగిన ప్రాంతం ప్రభావం వల్ల కాబోలు ఇల్లు దాటి బయటకి వచ్చినప్పటి నుండి మళ్లా ఇంట్లో అడుగుపెట్టేవరకు ‘బ్లీపులు లేని బజారు భాష’ అలా వినిపిస్తూనే ఉండేది. నేను వినే మాటలలో ఏవి ఇంట్లో అనదగ్గవో, ఏవి కావో ఇప్పుడు చెప్పకుండానే, బ్లీపులు లేకుండానే, నాకు తెలిసిపోయేవి. తెలిసో తెలియకో ‘చెడ్డ’ మాట నోటి వెంట వస్తే ఆ మాట మళ్లా అనకూడదని ఇంట్లో చెప్పేవారు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా