S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆనంద జీవనమే ఆరోగ్యం

‘‘ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్..
తిండి కలిగితే కండగలదోయ్..
కండగలవాడేను మనిషోయ్’’.. అన్న మహాకవి గురజాడ మాటలు అక్షర సత్యాలు. మనిషి బతకడానికి తిండి కావలసిందే కానీ.. అయితే- ఎలాంటి ఆహారం తినాలి? ఎంత తినాలి? అదెంత శుభ్రంగా ఉండాలి? ఎలా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం.. ఇలా మదిలో ఎనె్నన్నో ప్రశ్నలు. చాలామంది జబ్బుల బారిన పడకుండా ఉంటేనే ఆరోగ్యం అనుకుంటారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యానికిచ్చిన నిర్వచనం సమగ్రమైనది, సరైనది కూడా.. అదేమంటే.. మనిషి కేవలం శారీరకంగానే కాక, మానసికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం అంది. ఆరోగ్యానికి ఇన్ని పార్శ్వాలు ఉన్నాయన్న మాట. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక కష్టాలు పడాల్సి వస్తోంది.
నేటి ఆధునిక కాలంలో చదువు, ఉద్యోగం, ఒత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక కారణాల వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనివల్ల ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యంగా లేకుంటే అది నిష్ప్రయోజనమే. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, వాతావరణంలో వచ్చే మార్పులనను అధిగమించాలని హెచ్చరిస్తూ ప్రపంచస్థాయిలో వివిధ దేశాల ఆరోగ్య పరిస్థితులను, పరిణామాలను తెలిపేది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 1948, ఏప్రిల్ ఏడోతేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థను స్థాపించారు. ఐక్యరాజ్యసమితి సహకారంతో నడుస్తున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో 26 దేశాల ఆమోదంతో ‘మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ 1948, ఏప్రిల్ ఏడున పాటించారు.
అంతర్జాతీయ సమన్వయంతో పాటు ప్రపంచ ఆరోగ్యసంస్థ సార్స్, మలేరియా, ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమైన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తోంది. 1979లో మశూచి (స్మాల్ పాక్స్) వ్యాధిని సమూలంగా నివారించినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఈవిధంగా మానవ ప్రయత్నాల ద్వారా నివారించిన మొదటి వ్యాధిగా మశూచి చరిత్రలో నిలిచిపోయింది. మలేరియా, సిస్టోసోమియాసిస్కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతోంది. పోలియోను సమూలంగా నిర్మూలించే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తోంది.
1948లో ప్రపంచ ఆరోగ్యసంస్థ మొట్టమొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సమావేశం జరిపింది. ఈ సమావేశంతో 1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతోంది. 1950లో ‘వైద్య సదుపాయాలను గురించి తెలుసుకో..’ అనే థీమ్‌తో మొదటి ఆరోగ్య దినోత్సవం ప్రారంభ మైంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భయాందోళనలు చెందుతున్న ప్రాధాన్య రంగాన్ని ఎత్తి చూపడానికి, నిర్దిష్ట ఆరోగ్య అంశంపై చైతన్యాన్ని కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుతున్నారు. ప్రతి ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రత్యేక థీమ్‌ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారితీసే ప్రధాన అంశాలపై అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో ఏప్రిల్ 7న వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్: ఎవ్రీ వన్, ఎవ్రీ వేర్..’ అనే థీమ్‌తో జరుపుకోబోతున్నాం.
ప్రజల ఆరోగ్యంతోపాటు వాటిపై దుష్ప్రభావం చూపే వాటిని నిరోధించే అంశంపై కూడా డబ్ల్యూటీవో వివిధ దేశాలకు సూచసలు చేస్తోంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలనీ, ఏ హానికర అనారోగ్య పదార్థాలతో కల్తీ కానిదై ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కనీసం పంట నుంచి పళ్లెం వరకూ వెళ్లేంతవరకు ‘సురక్షిత ఆహారం’ అనే నినాదాన్నిచ్చి ప్రజలకు తమ ఆరోగ్యం పట్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కలుషిత వాతావరణం పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపట్టమని సూచించింది. నిత్యజీవితంలో ప్రతిరోజూ మనకు తెలియకుండానే పోషక విలువలు లేని అనారోగ్యకర ఆహారాన్ని తింటున్నామో!? మనచుట్టూ ఆధునిక సమాజం పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకీ తగ్గుతోంది. ఇలాంటి క్రమంలో అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు సామాన్యులు. కొందరు ఆహారపు అలవాట్లలో చిట్కాలను పాటిస్తే.. మరికొందరు యోగ, వ్యాయామం వంటి వాటివైపు చూస్తున్నారు. రోజురోజుకీ విస్తరిస్తున్న రోగాలతోపాటు అనేక చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు.. మధుమేహం, స్థూలకాయం, గుండెపోటు, కేన్సర్‌లు. రోజుకో కొత్త వైరస్ పుట్టుకొచ్చి దాని ప్రాబల్యాన్ని పెంచుకొని మానవాళిని ముప్పతిప్పలు పెడుతున్నాయి. వీటికి కారణం మానవ తప్పిదాలే. చిన్న చిన్న కారణాలే మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. నేటి నాగరిక సమాజంలో ప్రజలు, విద్యార్థులు, మహిళలు.. ముఖ్యంగా ఉద్యోగులు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు. విద్య, వృత్తి, ఉద్యోగాలతో మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. కాబట్టి యోగ, మెడిటేషన్ వంటి పద్ధతులను అవలంబించడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఉప్పు, కారం వంటి వాటితో పాటు ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలి? ఏయే సమయాల్లో తీసుకోవాలి? అనే అంశాలను తప్పకుండా పాటించాలి. క్రిములు ఎక్కువగా మన శరీరంలోకి ముక్కు, నోరు, ప్రత్యక్ష తాకిడి ద్వారా ప్రవేశిస్తాయి. కాబట్టి మనం నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం నడివయసువారు ఎక్కువగా మధుమేహం, స్థూలకాయం, గుండెపోటు బారిన పడుతున్నట్టుగా వెల్లడించింది. భావి సమాజాన్ని ఇలాంటి సమస్యలు వేధించడం తీవ్ర పరిణామం. శారీరక బరువును నియంత్రించేందుకు ఆరోగ్యం పెంపొందడానికి ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఒత్తిడి లేకుండా ఉండాలి.. కాబట్టి సరైన నిద్ర, వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు పాటిస్తే అనారోగ్యం దరికి చేరకుండా ఉంటుంది.
ఇలా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సంగతులూ తెలిస్తే ఒక్కోసారి బతకాలంటేనే భయమేస్తుంది. కానీ తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే అనారోగ్య ప్రమాదాల నుండి బయటపడే ఉపాయం దొరుకుతుంది. మన కాళ్ళకింద నేల, మనం తాగే నీరు, పీల్చే గాలి, పాలు, పళ్లు.. ఒకటేమిటి.. కల్తీ కానిది ఏదీ లేదు. ‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ చెప్పాడు.. కానీ నేటి కాలంలో ‘కాదేదీ కల్తీలకనర్హం’ అని లాభాల కోసం నడిచే ఈ దగుల్బాజీ సమాజం రుజువు చేస్తోంది. మనం తినే పిడికెడు మెతుకులు నోటికి చేరే వరకు ఎన్ని కల్తీలో.. ఆ కల్తీ కూడా తినే మనకు ఎన్ని రోగాలో..? మనం తినే ఆహారం కల్తీ కావడం వల్ల పరిశుభ్రత లేని నీళ్లు తాగడం వల్ల మనకు దాదాపు 200 రకాల రోగాలు వస్తున్నాయి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం వల్ల వచ్చే విరేచనాలతో ఏటా ప్రపంచంలో 22 లక్షల మంది చనిపోతున్నారట! వాళ్లలో పసిపిల్లలు ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అందుకే ‘పరిశుభ్రమైన ఆహారం’ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలి.
పరిశుభ్రత పెరగాలి
* చేతులు, వంటపాత్రలు, వాటిని తుడిచే గుడ్డలు, కూరగాయలను కోసే కత్తిపీటలపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉంటే అవి ఆహారంపై చేరి వ్యాధుల్ని కలిగిస్తాయి. వీటిని తరచూ శుభ్రంగా కడగటం వల్ల ప్రమాదాన్ని నివారించవచ్చు.
* ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు, శౌచాలయానికి వెళ్లొచ్చిన అనంతరం తప్పనిసరిగా చేతుల్ని శుభ్రంగా కడగాలి. ఫలితంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.
* వంటకు, తాగడానికి పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించాలి.
* పచ్చిపండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. వీటిని శుభ్రంగా కడగడం, చెక్కుతీయడం వల్ల సూక్ష్మక్రిములను తొలగించవచ్చు.
* ఆహార పదార్థాలను పూర్తిగా ఆవిరిపై ఉడికించిన తరువాతే తినాలి. తినే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోతే.. మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినాలి.
* పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే భుజించాలి. కాలపరిమితి దాటిన ఆహార పదార్థాలను తినకూడదు.
* వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడదు.
* వండిన ఆహారాన్ని రెండు గంటల తరువాత తినాలనుకునేవారు ఫ్రిజ్‌లో ఐదు డిగ్రీల వద్ద ఉంచి, తినేముందు వేడిచేయాలి.
* ఆహారాన్ని ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచి తినకూడదు.
* పచ్చి ఆహార పదార్థాలను ఉడికించిన వాటికి దూరంగా ఉంచాలి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు విడివిడి పాత్రల్లో వేరు వేరు అరల్లో ఉంచాలి.
ఇలా పరిశుభ్రత విషయంలో చిట్కాలను పాటించడం వల్ల యాభై శాతం వరకు వ్యాధులను కలిగించే సూక్ష్మక్రిములను నివారించవచ్చు.
ఔషధ నిరోధకత
నేడు మనిషి ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించగలగడానికి ఒకానొక కారణం వ్యాధులను నియంత్రించగలిగే శక్తిమంతమైన ఔషధాల లభ్యత. 1940లో యాంటీ మైక్రోబియల్స్ మందులను కనిపెట్టి, అవి లభ్యమయ్యేదాకా ప్రజలు ఇనె్ఫక్షన్లతో పెద్ద ఎత్తున మరణిస్తుండేవారు. నేడు యాంటీ మైక్రోబియల్స్‌కు ఔషధ నిరోధకత కలిగి ఉన్న జీవుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా మరణాల సంఖ్య, అనారోగ్య తీవ్రత, ఆరోగ్య సంరక్షణ వ్యయం అధికమవుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అనేక ఇనె్ఫక్షన్స్, వ్యాధులు నియంత్రించలేనివిగా మారి ఇప్పటిదాకా ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలన్నీ తారుమారయ్యే దుస్థితి దాపురిస్తుంది. పైగా శరవేగంతో విస్తరిస్తోన్న దేశాంతర వ్యాపారాలు, ప్రయాణాల వల్ల ఈ ఔషధ నిరోధకత కలిగిన జీవులు గంటల వ్యవధిలోనే విస్తరించడానికి సులువవుతుంది. ఔషధ నిరోధకత పూర్తిగా కొత్త సమస్య కానప్పటికీ, కొన్ని దేశాలు దీని నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ, ఔషధ నిరోధకత ఫలితంగా ‘యాంటీ బయాటిక్స్ కనుగొనక ముందు రోజుల దుస్థితి’లోకి మానవాళిని నెట్టకుండా ఉండాలంటే అన్ని ప్రపంచదేశాల సమన్వయంతో కూడిన సమష్టి కృషి తక్షణం ప్రారంభం కావాల్సివుంది. మునుపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఔషధ నిరోధకతకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నింటినీ కార్యాచరణకు సమాయత్తం చేసేందుకు ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆరు అంశాల్లో బలహీనలతను అధిగమించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
1. పరిశోధన లేమి
2. చిత్తశుద్ధి కొరత
3. పర్యవేక్షణ లోపం
4. ఔషధ నాణ్యత లోపం
5. ఔషధ వినియోగంలో హేతుబద్దత లోపించడం
6. ఇనె్ఫక్షన్ నియంత్రణ లోపాలు
ఈ అంశాలపై కేంద్రీకరించి ఔషధ నిరోధకతపై పోరాడేందుకు సన్నద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
ప్రపంచ ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెనుసవాలుగా మారనున్న ఈ ఔషధ నిరోధకతను అడ్డుకోవడం తక్షణ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఔషధ నిరోధకత గురించి ప్రజల్లో విసృతంగా ప్రచారం కల్పించి మానవాళికి రానున్న పెనుముప్పుపై పోరాటం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పట్టణీకరణ-కాలుష్యం
ప్రపంచ చరిత్రలో క్రీ.శ. 2007లో మొట్టమొదటిసారి పట్టణాల్లో జీవించే ప్రజల సంఖ్య 50 శాతం దాటింది. కొన్ని అంచనాల ప్రకారం క్రీ.శ. 2050 నాటికి ప్రతి పదిమందిలో ఏడుగురు పట్టణాల్లో జీవిస్తారని అంచనా. ఇప్పుడు మనం జీవించే ప్రపంచంలో పట్టణీకరణ అనేది ఏమాత్రం సరిదిద్దలేని వాస్తవం. పట్టణీకరణ వల్ల వ్యక్తులపైనా, కుటుంబాలపైనా, సమాజంపైనా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పట్టణాల్లో, నగరాల్లో ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా. ఇందువల్ల కనీస అవసరాలైన నీరు, ఆహారం, గృహవసతి సరిగ్గా ఉండవు. మురికివాడలు ఎక్కువ అవుతాయి. పరిశ్రమలు పెరిగిపోతాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి సమస్య ఏర్పడుతుంది. నీరు కలుషితం అవుతుంది. పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయన పదార్థాలు నీటివనరులు పాడుచేస్తాయి. మురుగునీటిని పట్టించుకోకపోవడం వల్ల మురుగునీరు, మంచినీరు కలిసిపోతాయి. ఇందువల్ల విరేచనాలు, అమీబియాసిస్, కలరా, టైఫాయిడ్, కొన్ని రకాల కామెర్లు, నులిపురుగుల వ్యాధులు, పోలియో వ్యాధులు ప్రజలకు వచ్చే ప్రమాదముంది. పట్టణీకరణ వల్ల వాయుకాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతారు. అంతేకాదు పెరుగుతున్న రద్దీ, వాహనాల వాడకం, పారిశ్రామికీకరణ వల్ల పట్టణాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగి అంగవైకల్యం, మరణాలు ఎక్కువ అవుతున్నాయి. మద్యం వాడకం, మత్తుమందుల వాడకం, పేకాట, వ్యభిచారం.. ఇలా ఎన్నో.. అందుకే పట్టణాల్లో జీవన పరిస్థితులు పెంపొందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆరోగ్యకరమైన నగరాల ప్రణాళిక’ ప్రకటించింది. పట్టణాలు, ఆరోగ్య నిలయాలుగా ఉండాలంటే పౌర సమాజం బాధ్యత ఎంతో ఉంది. సమష్టిగా కృషిచేసి చెట్లు పెంపకం, పార్కులు, ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపరిచేలా చూడాలి. అలాగే శాస్తవ్రేత్తలు కాలుష్యం తగ్గించే పరిశోధనలు చేసి పాలకులకు, ప్రజలకు శాస్ర్తియ సమాచారం అందించాలి. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలు వదులుకుని చట్టాల పరిధిలో పరిశ్రమలు నడపాలి.
ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తొమ్మిది ఆసక్తికర విషయాలు..
* 1990 తర్వాత పుట్టినవారు అంతకు ముందు పుట్టినవారి కన్నా సగటున ఆరేళ్ల ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. ఇక 2012లో పుట్టిన వారైతే సగటున 70 ఏళ్ల వరకు బతుకుతారు. అధికాదాయం ఉన్న దేశాల్లో అయితే వీరి ఆయుఃప్రమాణం 79 ఏళ్లు.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా 66 లక్షల మంది చిన్నారులు అయిదేళ్లలోపు చనిపోతున్నారు. సకాలంలో తల్లిపాలు, తక్కువ ధరకు లభించే టీకాలు ఇస్తే వీరందరినీ కాపాడవచ్చు.
* ఏటా 1.5 కోట్లమంది చిన్నారులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి పది జననాల్లో ఒకటి నెలలు నిండకముందే జరుగుతోంది. దీనివల్ల ఏటా పది లక్షలమంది చిన్నారులు చనిపోతున్నారు. తక్షణ వైద్య సదుపాయంతో 7.5 లక్షల మందికి పైగా చిన్నారులను కాపాడవచ్చు.
* ప్రతి పది మరణాల్లో మూడు హృద్రోగాల వల్లే జరుగుతున్నాయి. గుండెపోటు, స్ట్రోక్ వల్లే ఎక్కువమంది చనిపోతున్నారు. పొగ మానేయడం, తగిన ఆరోగ్యకర ఆహారం, శారీరక శ్రమ ఉంటే 80 శాతం ముందస్తు మరణాలను ఆపొచ్చు.
* 2012లో 70 శాతం మేర హెచ్‌ఐవీ మరణాలు ఆఫ్రికాలోనే నమోదయ్యాయి. అంతకుముందు ఏడేళ్లతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య బాగా తగ్గింది. 2005లో ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ వల్ల 23 లక్షల మంది చనిపోతే, 2012లో ఇది 16 లక్షలకు తగ్గింది.
* కాన్పుకు ముందు, తరువాత తగిన సంరక్షణ, వైద్య సదుపాయాలు లేక ప్రపంచంలో రోజుకు 800 మంది మహిళలు చనిపోతున్నారు. ఈ రేటు పేద దేశాల్లో మరింత అధికంగా ఉంది.
* ప్రపంచంలో ఎక్కువమంది మరణానికి రోడ్డుప్రమాదాలే కారణమట. రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు 3,500 మంది చనిపోతుండగా మరికొన్ని వేల మంది గాయపడుతున్నారు. వాహనాల సంఖ్య పెరిగేకొద్దీ ఈ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.
* నేరుగా పొగాకు నమలడం, పొగతాగడం వల్ల విశ్వవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది చనిపోతున్నారు. పరోక్ష ధూమపానం కారణంగా మరెంతో మంది రోగాలపాలవుతున్నారు. ఈ విషయం తగిన చర్యలు తీసుకోకుంటే 2030కి ఏటా పొగాకు వల్ల చనిపోయేవారి సంఖ్య 30 లక్షలకు చేరుతుంది.
* ప్రపంచంలో పది శాతం మంది మధుమేహం బాధితులున్నారు. మధుమేహం వల్ల హృద్రోగాలు, స్ట్రోక్ వచ్చి చనిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2012లో మధుమేహం వల్ల 15 లక్షల మంది చనిపోయారు.
ఇలా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఒత్తిడి లేకుండా ఉండాలి కాబట్టి సరైన నిద్ర, వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు పాటిస్తే అనారోగ్యం మన దరికి కూడా చేరదు. కాబట్టి అందరం ఆరోగ్యపు అలవాట్లను పాటిస్తూ ఆరోగ్యకరమైన భావితరానికి బాటలు వేద్దాం.
*

సిరిధాన్యాలు
సిరిధాన్యాలు అంటే వింత పదార్థాలు కావు. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత ఆహార ధాన్యాలు. బియ్యాన్ని ఎలా అయితే వండుకుంటామో.. వీటిని కూడా అలాగే వండుకోవాలి. వీటిని తిన్నాక.. జీర్ణం అవడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. కాబట్టి మధ్యమధ్యలో చిరుతిళ్ళు, కాఫీ, టీ వంటివి తీసుకోవడానికి కుదరదు. ఫలితంగా చెడు కొవ్వు తగ్గుతుంది. అరికెలు, సామలు, ఓధలు, సజ్జలు, రాగులు, వరిగెలు, జొన్నలను సిరిధాన్యాలుగా పిలుస్తారు. అయితే ముఖ్యంగా అరికెలు, సామలు, వరిగెలు, కొర్రలు, రాగులను కలిపి ఐదు రకాలను సిరిధాన్యాలు అంటారు. ఇవి వేరే దేశంలో ఎక్కడా కనిపించవు. ఒక్క భారతదేశంలోనే కనిపిస్తాయి. అయితే ఇవి వందల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చాయని అంటుంటారు. ఇప్పుడిప్పుడే జనాల్లో వస్తున్న అవగాహన వల్ల సిరిధాన్యాలకు ఆదరణ లభిస్తోంది. వీటిలో పీచుపదార్థం చాలా అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. వీటివల్ల గ్లూకోస్ చాలా తక్కువ మోతాదులో రక్తంలోకి నెమ్మదిగా చేరుతుంది. పీచు పదార్థం ఎక్కువ కాబట్టి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఈ ధాన్యాల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, కావాల్సిన కొలెస్ట్రాల్, విటమిన్ బి, పొటాషియం, జింక్, మెగ్నీషియం.. మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. అందుకే సిరిధాన్యాలను అద్భుత ధాన్యాలు, అమృతతుల్యాలు అంటారు. మన పూర్వీకులు సిరిధాన్యాలనే ఎక్కువగా తినేవారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. దాదాపు 130 సంవత్సరాల నుంచే మనకు బియ్యం తినే అలవాటు ఎక్కువైంది. గోధుమ పంట కూడా చాలా అరుదైన పంటగా చలామణిలో ఉండేది. ఎప్పుడైతే వరి, గోధుమల పట్ల మోజు ఏర్పడిందో అప్పటి నుంచీ సిరిధాన్యాలు చిన్నచూపుకు గురయ్యాయి. ఇవి పేదల ఆహారం అని, డబ్బున్న వాళ్లందరూ బియ్యం, గోధుమలు తింటారనే భ్రమ పెరిగింది. ఎప్పుడైతే సిరిధాన్యాలను పక్కకు పెట్టారో.. అప్పటినుంచే అనారోగ్యాలు మొదలయ్యాయన్న విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఇప్పటివాళ్లలా వారికి రోగాలు, నొప్పులు ఉండేవి కాదు. వాళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు. ఎప్పుడో ఒకసారి జ్వరం.. తప్ప వారికి అంత పెద్ద పెద్ద రోగాలు వచ్చిన దాఖలాలు కూడా తక్కువే.. కారణం వారు సంపూర్ణంగా సిరిధాన్యాలను భుజించేవారు. మనం మాత్రం కల్చర్ నెపంతో బియ్యం, గోధుమపిండి వెంట పరుగులు తీస్తున్నాం. ఫలితంగా రెట్టింపు వేగంతో ఆసుపత్రుల చుట్టూ కూడా తిరుగుతున్నాం.
రోజూ నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులతో కూడుకున్న నేటి నవనాగరిక జీవనంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేటి ప్రజలకు కొరవడింది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసం ఇరవై సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.. ఆరోగ్య నిపుణులు చెప్పిన ఇరవై సూత్రాలు..
* ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు, మూడు గ్లాసుల నీటిని సేవించాలి.
* రోజూ కనీసం పదిహేను నిముషాలపాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి.
* ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించాలి.
* వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. ఉపవాసం ఉన్న రోజుల్లో నీటిని లేదా పండ్లను మాత్రమే తినాలి.
* టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను మానేయాలి.
* తెల్లవారుజామునే నిద్ర లేవాలి.
* భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, పంచదార, వేపుడు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.
* భోజనం చేసేటప్పుడు వౌనంగా ఉండాలి. మాట్లాడకూడదు.
* భోజనంలో సలాడ్, ఆయా రుతువుల్లో లభించే పండ్లు తప్పనిసరిగా ఉండాలి.
* రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి.
* మొలకెత్తిన గింజలు తరచూ తీసుకుంటూ ఉండాలి.
* ప్రతిరోజూ రెండు పూటలా క్రమం తప్పకుండా స్నానం చేయాలి. దీంతో శరీరం శుభ్రమవ్వడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు.
* ఉదయం తీసుకునే అల్పాహారం తేలికపాటిదై ఉండాలి. త్వరగా జీర్ణమయ్యేదిగా ఉంటే మరింత మంచిది.
* నిద్రకు కృత్రిమమైన సాధనాలను ఉపయోగించకూడదు.
* మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని తీసుకోకూడదు. దీంతో ఆకలి తీరడం మాట అలా ఉంచితే అనారోగ్యం పాలవుతారు.
* పండ్లు తీసుకునేటప్పుడు కూడా అవి తాజాగా ఉన్నాయా? లేదా? అని సరిచూసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పండ్లను తీసుకోకూడదు.
* ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా దంతావధానం చేయాలి.
* సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేయాలి. భోజనానికి, నిద్రకు కనీసం రెండు గంటల సమయం ఉండాలి.
* రాత్రి త్వరగా నిద్రపోవాలి.
* మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లే.. కాబట్టి ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేయడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి