S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిండి తిప్పలు

నేను డెంటిస్టు దగ్గరకు వెళ్లాను. నిజానికి పంటినొప్పి లేనే లేదు. కానీ అనుభవం మరొక రకంగా ఉంది. నొప్పి తెలిసే సమయానికి ఏదో ఒక పంటిలో కొండగుహంత రంధ్రం తయారవుతుంది. -రాబర్ట్ సన్ డేవిడ్, నవలాకారుడు.
* * *
చదవడం కన్నా చేతనైన పని ఇంకొకటి లేదు. ఆ చదవడంలో కేవలం నవలలే కాక రకరకాల విషయాలు చదవడం చాలాకాలంగా అలవాటు అయ్యింది. అంతర్జాతీయ పత్రికలు చదివేందుకు నా కొడుకు నాకు ఏర్పాటు చేశాడు. అందులో ఎనె్నన్నో పత్రికలను దాచుకోవచ్చు కూడా. అట్లా చదివిన ఒకానొక పత్రికలో ఒక విషయం గురించి అందరితో చెబితే బాగుండును అని అనిపించింది. ఏ పత్రికలో ఎప్పుడు ఏమి చదివింది గుర్తు ఉండదు. అయినా సరే అదృష్టం కొద్దీ ఆ పత్రిక దొరికింది. ఆ విషయం దొరికింది.
మేము ఇంట్లో ఇద్దరమే ఉంటాము. ఉండే రెండవ మనిషికి క్షణం తీరిక ఉండదు. ఆమెకు తిండి గురించి ధ్యాస అంతకన్నా ఉండదు. రుచిగా తినాలన్న కోరిక కూడా లేదు. ఇక మిగిలింది నేను. మాకు కొవ్విన గొర్రె అని ఒక మాట ఉంది. అంటే కొవ్వు పట్టిన గొర్రె అని అర్థము. అది మామూలుగా ఎవరేమి చెప్పినా వినదు. కొరకరాని కొయ్యగా ఉంటుంది. నాకు అచ్చంగా అదే పద్ధతిలో తిండి గురించి ఎనె్నన్నో అభిప్రాయాలు కోరికలు ఉన్నాయి. ఏమి ఉన్నా లేకున్నా తిన్నది చింతకాయ తొక్కు అయినా అది ముందు రుచిగా ఉండాలి. ఆ తరువాత శుచిగా ఉండాలి. ఈ కోరికలు నాకు అలవిమాలినవిగా కనిపించవు. మానవుని కనీస అవసరాలు అనిపిస్తాయి. సరే బాధ నాదైతే అందరూ నాలాగే బాధపడాలని నేను ఎన్నడూ అనుకోను.
ఇంతకు విషయం ఏమిటంటే, ఎక్కువ తినాలన్న కోరిక లేదు గనుక, ఒక్క వంటకం చేసుకుని, అందులోనే ఆరోగ్యం, ఆ తరువాత రుచి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవచ్చునా? అది ప్రశ్న!
మళ్లీ ఒకసారి మొదటికి వస్తే, న్యూ సైంటిస్ట్ అనే వారపత్రిక చదువుతున్నాను. అందులో చివరన ఒక ప్రశ్నల పేజీ ఉంటుంది. పాఠకులు పంపిన ప్రశ్నలకు పాఠకులే సమాధానాలు చెబుతారు. వచ్చిన సమాధానాల నుచి పత్రిక వారు మెచ్చినవి ఎంపిక చేసి అక్కడ పొందుపరుస్తారు. అవి చదవడానికి సరదాగానే కాక ఎంతో సమాచారాన్ని అందించేవిగా కూడా ఉంటాయి. అలాగే పత్రిక చివరిలోనే పాఠకులు రకరకాల విషయాలను గురించి కేవలం మెప్పికోలు కాకుండా సమాచారం అందిస్తూ రాసే ఉత్తరాలు కూడా కొన్ని అచ్చు వేస్తారు. ఈ వారపత్రికలో నాకు ఈ రెండు అభిమాన పేజీలు. చిత్రం మొన్ననొక సంచికలో ప్రశ్నల పేజీలో ఒక ప్రశ్న కనిపించింది. మరి దానితోపాటు జవాబులు కూడా ఉండనే ఉంటాయి.
అడిగిన మనిషి ఎవరో కానీ ప్రశ్నలు చాలా చక్కగా మొదలుపెట్టారు. వైవిధ్యమన్నది జీవితానికి మంచి ప్రాతిపదిక అన్న మాట నిజమే కానీ, అంటూ ప్రశ్న మొదలవుతుంది. శరీరానికి కావలసిన పోషక విలువలను అన్నింటిని అందించగల ఒకే ఒక వంటకం ఉండాలి. అది ఆరోగ్యకరంగా ఉండాలి. అందునా శాకాహారం అయితే మరింత మేలు.. అన్నారు అక్కడ. అటువంటిది ఏమున్నది అని ప్రశ్న. జవాబుల్లో భారతదేశం గురించి కనిపిస్తుందో లేదో చూడాలని తొందరపడ్డాను. ఎక్కువగా లేదు గానీ భారతదేశం ప్రసక్తి తప్పకుండా ఉంది.
ఒకే ఒక వంటకంతో అన్ని పోషక అవసరాలు తీరాలంటే అవి సూపులు, లేదా కూరగాయలు ఉడికించిన స్ట్యూలు, కాసరోల్స్ అయి ఉండాలి అన్నది మొదటి జవాబు. వీటిని వండడంలో ఒక పద్ధతి ఉంది. తినదలిచిన కూరగాయలను అన్నింటిని నీటిలో మునిగేలా పొయ్యి మీద పెట్టి మరిగించాలి. కొంతసేపు తరువాత మంట తగ్గించి ఉడికించాలి. అలా చాలాసేపు వాటిని పొయ్యి మీద ఉంచాలి. ఎప్పుడూ ఒకే కూరగాయలు కాకుండా ఏ రోజుకారోజు కొత్త కలయికలను వాడుకోవాలి. మాంసకృత్తులు కలిసే పద్ధతిలో గింజలు, చీజ్ లాంటి ఇతర అంశాలను కూడా ఇందులో చేర్చుకోవచ్చు. మనకు ఇటువంటి వంటకాలు తినడం అలవాటేనా? తెలుగు వారికి ముఖ్యంగా భోజనం అనగానే ఆవకాయ, బండ పచ్చడి, ముక్కల కూర, ముక్కల పులుసు, పొడులు, పెరుగు మరెన్నో గుర్తుకు వస్తాయి. ఒకే ఒక్క వంటకం అంటే ఇందులో నుంచి దేన్ని తీసుకుంటారు? కొంతసేపు ఈ సంగతి పక్కనపెట్టి గతంలో తిండి గురించి ఒక్కసారి చూస్తే, మధ్యయుగ కాలంలో, అందరూ కూరగాయలను ఉడికించుకుని తినడం అలవాటుగా ఉండేదట. ఇప్పుడు కూడా చాలాచోట్ల గత ఆరేడు దశాబ్దాలుగా ఇటువంటి కలగూర పులుసు వండుకుని తింటున్నారట. అయితే ఇందులో ఒక చిన్న తిరకాసు ఉంది అంటారు. వండిన పులుసు వేడిగా ఉండగా తినేయాలి. ఎటువంటి సందర్భంలోనూ దాన్ని మళ్లీ వేడి చేయకూడదు. ఇక్కడ మళ్లీ ఒకసారి నాకు మన వాళ్ల అలవాట్ల మీదకు దృష్టి పోతుంది. మిగిలిన పులుసును వేడి చేసి చల్లార్చి దాచుకుంటే ఎక్కువసేపు ఉంటుంది అని మన వాళ్లకు ఒక నమ్మకముంది. ఎందుకోగాని నాకు ఆ పద్ధతి నచ్చదు. ఎక్కువ వంటకం మిగిలితే హాయిగా మరోపూట తినవచ్చు కానీ దానిని వేడి చేయడం నాకు ఎందుకో నచ్చదు గాక నచ్చదు. వండిన పులుసు ఎంతసేపయినా వేడిగా ఉండేటట్లు పొయ్యి మీద పెట్టి ఉంచమంటారు తెలిసిన వాళ్లు. పాతకాలంలో పిడకల పొయ్యిలు, కుంపట్లు ఉండేటప్పుడు ఈ పద్ధతి కుదిరేదేమో? ఇప్పుడు ఎవరైనా మిగిలిన తిండిని మేము ముద్దుగా సద్దిపెట్టె అని పిలుచుకునే రెఫ్రిజిరేటర్‌లో దాచుకుంటారు. ఆ తరువాత దాన్ని మళ్లీ తినాలంటే వేడి చేయక తప్పదు.
ప్రశ్న అడిగిన వాళ్లు ఆ ఒక్క వంటకం కూరగాయలతో మాత్రమే అయితే బాగుంటుంది అన్నారు. జవాబు చెబుతున్న వారిలో ఒకరు ఒక చిన్న సమస్యను ఈ సందర్భంగా పైకెత్తారు. మనుషులకు విటమిన్ బి 12 కావాలి. అది లేకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ విటమిన్ (నిజానికి వైటమిన్ అనాలి) జంతు పదార్థాల నుంచి మాత్రమే సులభంగా అందుతుంది. మాంసం, చేపలు, గుడ్లు కాకుంటే కనీసం పాడి పదార్థాలైనా తప్పకుండా తినాలి. కనుక వండుకున్న కూరల పులుసులో చీజ్ వంటి పదార్థాలను కలుపుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది అంటున్నారు. వీగన్ అని ఒక పద్ధతి ఉన్నది. ఈ రకం భోజనం చేసే వాళ్లు జంతు సంబంధమైన పదార్థాలు ఏవీ తినరు. అటువంటి వారికి ఇక్కడ చిక్కు ఎదురవుతుంది.
నేను ఆ మధ్యన చాలా కొద్దికాలం అమెరికాలో గడిపాను. మా వాడు మమ్మల్ని రకరకాల భోజనశాలలకు తిప్పాడు. నాకు వాటిల్లో చాలా మటుకు నచ్చాయి. ఎక్కడికి పోయినా ఎక్కువగా పచ్చి కూరగాయలు పెడుతున్నారు. వండినా సరే వాటిని ఇంచుమించు పచ్చిగా వదిలేస్తున్నారు. స్వీట్ టొమాటోస్ అనే ఒక రెస్టొరాంట్‌లో నిజానికి ఎక్కువగా సలాడ్ రకాలు మాత్రమే పెట్టారు. మొదట్లోనే అవి ఉన్నాయి కనుక వాటిని బాగా తిన్నాం. ఆ తరువాత ఐస్ క్రీములు, తీపి పదార్థాలు ఉన్నా సరే తినాలనిపించలేదు. మెక్సికన్ పద్ధతి తిండిలో వాళ్లు కూరగాయలు పెట్టిన తీరు ఎంతో బాగుంది. అటువంటి తిండి మన దగ్గర వెతికినా దొరకదు. థాయ్ తిండి కూడా బాగుంది. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. మన దగ్గర హోటల్లో భోజనం చేద్దామని వెళితే అన్నంతోపాటు కేవలం దుంపకూరలు, మరేవో మాత్రమే వడ్డించారు. కూరగాయల కొరకు అడిగాను. చాలా సంతోషంగా ఆ మనిషి లోపలికి వెళ్లి శనగల కూర తీసుకువచ్చాడు. బెండకాయ, చిక్కుడుకాయ వంటివి ఏమీ వండే పద్ధతి లేదా అని అడిగాను. ఆ మనిషి ఆశ్చర్యంగా చూచాడు.
ప్రపంచమంతటా శాకాహారం (శాఖాహారం కాదని మనవి.) తినే వాళ్లు తమ తిండిలో చిక్కుడు లాంటి లెగ్యూమ్స్ జాతి కూరగాయలు ఉండేటట్లు చూస్తారు. ఇక ఏదో ఒక ధాన్యం తినడం కూడా పర్వాలేదు. మనం కేవలం పాలిష్ చేసిన బియ్యం తింటాం అంతేగాని, మిగతా ధాన్యాల వేపు దృష్టి మరలదు. ఏకంగా జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనలలో కూడా బియ్యం, గోధుమల దిగుబడి పెంచే ప్రయత్నాలు చేశారు కానీ పప్పులు, మొదలయిన వాటిని పట్టించుకోనే లేదు. ఈ మధ్యన ఫ్యాషనబుల్ ప్రపంచంలో చిరుధాన్యాలు ప్రచారానికి వచ్చాయి. ఎవరన్నారో తెలియదు గానీ వాటిని సిరిధాన్యాలు అని వర్ణిస్తున్నారు. ఇంతకాలానికి నిజంగానే ఆ ధాన్యాలు పండించే వారికి సిరులను అందిస్తున్నాయి. చిన్నతనంలో కొర్రలు, సామలు, ఆర్కలు మొదలైన ధాన్యం సరదాగా తిన్నాము. అవి నిజానికి కలిగిన వారు తినే గింజలు కావు అనుకున్నాము. కొర్ర పాయసం ఐస్‌క్రీమ్ కన్నా మెత్తగా తయారయ్యి గొంతులో గుటుక్కున జారిపోయేది. ఇప్పుడు కొర్రలు కిలో 350కి అమ్ముతున్నారట. మనకి ఏది వచ్చినా ప్రళయంగానే ఉంటుంది మరి.
పెనం మీద రొట్టె తప్పించి పులిసిన పిండితో రొట్టె మనకు తెలియదు. అటువంటి రొట్టెతో ఉడికించిన చిక్కుడు గింజలు, కాల్చిన టొమాటో కలిపి తింటే అదే అన్ని రకాల సంపూర్ణ ఆహారం అవుతుంది. ఇటువంటి ఆలోచన కూడా మనకు రాదు. ప్రపంచమంతటా వేరుశెనగలతో తయారుచేసిన పీనట్ బటర్ బాగా తింటారు. ఇది నేను స్వయంగా గమనించాను. ఇక్కడ వచ్చి ఆ బటర్ కొరకు వెతికితే దొరుకుతున్నది. కానీ చాలా ధరగా ఉన్నది. నేను చాలాకాలంగా పీనట్ బటర్ తింటున్నాను. అయితే దాన్ని ఏ రకంగా ఉపయోగించాలి అన్నది కొంచెం సమస్యగా ఉంటుంది. మన దగ్గర జ్వరం వచ్చిన వాళ్లు తప్ప పులిసి పొంగిన రొట్టె తినరు కదా! ఇటలీలో బఠాణీలతో, పచ్చి కూరగాయలను కలిపి ఒక వంటకం చేసుకుంటారట. నేటివ్ అమెరికన్లు అంటే దక్షిణ అమెరికాలో ఉండే వారు బీన్స్‌తో మొక్కజొన్నలు, గుమ్మడికాయ వంటి స్క్వాష్ కలిపి వండుకుంటారు. ఇవన్నీ ఒకే వంటకంతో సంపూర్ణ ఆహారంగా ఉంటాయని నాకు సైన్స్ పత్రిక వల్ల తెలిసింది.
ఇంత చెప్పిన తరువాత భారతదేశం ప్రసక్తి కూడా వచ్చింది. యూకేలోని నార్త్ అంబర్ లాండ్ నుంచి జవాబు చెప్పిన ఒక పెద్ద మనిషి ఆ ప్రసక్తి చేసాడు. భారతదేశంలో పప్పు్ధన్యాలు బాగా తింటారు. వాటితో చేసిన వంటకాలను అన్నంతో కలిపి తింటారు. ముఖ్యంగా మెంతి ఆకులను కలిపి వండిన పప్పు చాలా మంచిది. ఈ రకమైన ఆకుకూరలు పప్పు తినడం భారతీయులకు శతాబ్దాలుగా అలవాటు అంటూ నాలుగు మాటలు రాశారు. నాకు నిజంగా సంతోషం అయింది. మామూలుగా వండుకు తినే కూరలు, సాంబారు చాలా మంచి తిండి అన్న మాట. కనుక ఒక వంటకం చేసుకోదలచుకుంటే సాంబారు వండుకోవాలి. అది కూడా కాదనుకుంటే దాన్ని ఏకంగా అన్నంలో కలిపి కన్నడ వారి పద్ధతిలో వేడి పప్పు పులుసు అన్నం, అనే బిసి అన్నం వండుకోవాలి. కాదంటే కిచిడి చేసుకోవాలి.
నాకు తిండి విషయంలో సులభ సూత్రాలు కొన్ని అలవాటు అయిపోయినయి. అన్నం తినాలన్న యావ మొదటి నుంచీ లేదు. ఉన్నది ఏదయినా అన్నం అంటే తిండి కింద లెక్క అవుతుంది. అది వరి వండిన అన్నమే కానవసరం లేదు. పప్పు, కూర, చారు, అండ్ పీకేసీ అని మా ఇంట్లో ఒక ఫార్ములా ఉంది. దానితో నాకు సంబంధం లేకుండా బతుకుతున్నాను. ఒక్క వంటకం కూడా లేకుండా ఉండాలన్నది ఇక తరువాతి మెట్టు. నేను అట్లా ఉండగలను కానీ మిగతా వారి ప్రమేయం ఉంటుంది గదా.
ఓకే వంటకంలో సంపూర్ణ ఆహారం గురించి ఇంకా కొంచెం సమాచారం ఉంది గానీ అది మనకు అంతగా ఆసక్తికరంగా లేదు. కనుక ఇక్కడికి ఆపేద్దాం. ఇంట్లో ఏమి వంటకాలు ఉన్నాయన్నది చూడలేదు. సాంబారు ఉందో లేదో తెలియదు. మరి ఇప్పుడు నేను ఏం తినాలో?

-కె.బి.గోపాలం