S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పదారవిందం

కేవలం కొన్ని వాస్తవాలను ఎంత బాగా అమర్చి పెట్టినప్పటికీ, వాటిలోనుంచి ముఖ్యమయిన అంశాలు బయటకు రానే రావు. -జార్జ్ హోవార్డ్ డార్విన్ - గణిత, ఖగోళ నిపుణుడు
* * *
కరారవిందేన పదారవిందం, ముఖారవిందే వినివేశయంతం, వటస్య పత్రస్య పుట్టే శయానం, బాలం ముకుందం అంటూ వటపత్రశాయిని గురించి శ్లోకం ఉంది. వటపత్రం మీద పడుకున్న దేవుడు చిన్ని శిశువు. ఆయన చేతులతో కుడికాలిని పైకెత్తి, దాని బొటనవేలిని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కనీసం భక్తులు ఆయనను ఆ రకంగా ఊహించారు. ఆయన చెయ్యి, కాలు, ముఖము అన్ని అరవిందంలాగే ఉన్నాయిట. అవును మరి, భక్తునికి భగవంతుడు అన్ని రకాల అందంగా, ఆనందకరంగా కనిపించాలి కదా! నాకు పదారవిందం అన్న మాట ఎందుకు మనసులోకి వచ్చిందో నాకే తెలియదు. అది వచ్చిన తరువాత అరవిందములో రేకులు ఉండును, పదములో అక్షరములు ఉండును. పువ్వుల రేకులు కలిసి అందము కనిపించినట్లే, మాటలో అక్షరములు కలిసి ఒక అర్థమును కలిగించును, అన్న భావం మిగిలింది. అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. నాకు పరిచయం ఉన్న, లేని మాటలను గురించి పరిశీలించి, ప్రశ్నించుకుని ఆనందించడం ఒక అలవాటు. కొంచెం తమిళం, మరి కొంచెం కన్నడం, అంతకన్నా ఎక్కువ ఉర్దూ, ఇంతో అంతో హిందీ, ఇలా కొన్ని భాషలతో పరిచయం ఉంది కనుక మాటల వెనుక ఉన్న తత్వాన్ని వెదికి చూడడం నాకు హాబీగా మిగిలింది.
హాబీలో అక్కడో ఇక్కడో కొంత ఆనందం కూడా మిగులుతుంది. ఆనందం ఎక్కడ ఉన్నా సరే దాన్ని అందరితో పంచుకోవాలి అన్నది నా పద్ధతి. కనుక ఈ మాటాటలోని సదానందమును కొంత పంచుకుందాము అనిపించింది.
ఆ మధ్యన ఒకసారి కవి సమ్మేళనంలో పాల్గొనవలసిన అగత్యం వచ్చింది. ఎవరూ లేని హాలులో, బాగా రాత్రి సమయాన నా కవిత కూడా వినిపించాను. ఎదురుగా ఉన్న పదిమందిలోని ఒక గొప్ప కవి మాత్రం, నన్ను మెచ్చుకున్నాడు. అది వేరే సంగతి కానీ, ఆనాడు కవిత చదివిన వారిలో కనీసం పది మంది, ఏగిలి పారంగ అన్న మాటను ఏదో ఒక సందర్భంలో వాడుకున్నారు. చాలామంది అలాగే సబ్బండ వర్ణాలు అన్న మాట కూడా వాడుకున్నారు. ఏగిలి అన్న మాటకు అర్థం ఊహించడం కొంచెం సులభంగానే వీలైంది. వేకువ జామున అని పత్రికలలో, పుస్తకాలలో ప్రస్తావించే సమయాన్ని వేగుచుక్క పొడిచే సమయం అని అర్థం చేసుకోవాలి. అంటే తెల్లవారడానికి కొంచెం ముందు అన్నమాట. దాన్ని కొన్ని ప్రాంతాలలో చుక్కపొద్దు అని కూడా అంటారు. సుక్కపొద్దున లేచి బొక్కనెత్తా బోతే, బొక్కబోర్లా పడితి రన్నా అంటూ ఒక జానపద గీత సాగుతుంది. నాదేటి బతుకాయేరన్నా, నేను నాడే సావకపోతిరన్నా అంటూ ఆ పాటకాడు కడు దీనంగా పాడతాడు. ఆ సుక్కపొద్దు కొంతమందికి వేకువ పొద్దు. సమయాన్ని వెలుగులు పారే పొద్దు. దాన్ని ఏగిలివారే పొద్దు అని కూడా అంటారు. తెలుగులో పల్లెపల్లెకు ఒక యాస ఉంది. పది కిలోమీటర్లకు భాష మారుతుంది. మాట మారుతుంది. అర్థాలు మారతాయి. నేను తెలంగాణ వాణ్ణి. ఏగిలి వారంగ అన్నది కూడా అసలు సిసలైన తెలంగాణ మాట. కానీ అది నాకు పరిచయం ఉన్న మాట కాదు. అంటే మా ప్రాంతం మాట కాదు అని అర్థం. పాలమూరు పల్లెల్లో తెల్లవారుజామున ఏదైనా జరిగింది అని చెప్పడానికి, మస్కుల అన్న మాట వాడతారు. ఆ మాట బహుశా మిగతా ప్రాంతాల వారికి ఎవరికీ తెలిసి ఉండదు. పాత్రికేయ మిత్రుడు ఒకతను వచ్చి, మా దగ్గర మస్కుల అంటరు అన్నడు. మాటలు ఎంత తేడా కలిగి ఉన్నాయో చూడండి! అందుకే పదారవిందంలోని అందం అందరము పొందాలి. అన్ని మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు పదారవిందం, ముదారవిందం అవుతుంది. ముదా అంటే సంతోషం అని అర్థం. సంతోషం రేకులుగా వెల్లివిరుస్తుంది అని అర్థం.
నిన్న రాత్రి ఇంట్లో ఒక చిన్న చర్చ జరిగింది. అందుకు బహుశా నేను, నా పదారవిందం కారణం. ఒక ప్రశ్న అడిగాను. పాలమూరులోని మా వంటి బ్రాహ్మణ కుటుంబాల వారు, పూరీలను రొట్టెలను చేసే కర్రను లట్టణిగె అంటరు. ఇది బహుశ కన్నడ ప్రభావంతో వచ్చిన మాట అయ్యుండాలె. తెలుగు వాళ్లకు ఎంత మందికి ఈ మాట తెలుసు అన్నది నా అనుమానం. ఈ వస్తువు విశేషాన్ని కొన్ని ప్రాంతాల వారు బల్లానిగె అనడం కూడా నాకు చాలా కాలంగా తెలుసును. పదం కొనకు ఎ వచ్చిందంటే అది కన్నడమే. అనుమానం లేదు. రాయలసీమలో, ఒంగోలు జిల్లాలో దాన్ని ఏమంటారు అని మా ఇంట్లో ఉన్న అతిథి అల్లుడు గారిని అడిగాను. ఆయన తెల్లమొహం వేశాడు. మా ఆవిడ భాష విషయంలోనూ, సంస్కృతి విషయంలోనూ చాలా విస్తృత మనస్తత్వం గల మనిషి. దాన్ని అప్పడాల కర్ర అంటారు అని జవాబు చెప్పింది. ఆ సంగతి తెలియకనా? అయితే అందులోనూ నాకు ఒక అనుమానం! అది అప్పడాల కర్ర అయితే, పూరీలు, రొట్టెలు చేయడానికి ఎట్లా పనికి వస్తుంది? దాన్ని రొట్టెల కర్ర, పూరీకర్ర అని ఎవరైనా అంటారా? ఈ అప్పడాల కర్ర లేదా మా లట్టణిగె అనే వస్తు విశేషానికి ఎంతో చరిత్ర ఉంది. ఒకే కాలంలో లావుపాటి పిన్నిగారు, ఆవిడ భర్తగారైన బక్కపలచని బలరామయ్యగారు గురించి కార్టూన్లు వేస్తే, ఆవిడగారి చేతిలో అప్పడాల కర్ర, ఆయనగారి తల మీద బొప్పి చాలా మామూలుగా కనిపించేవి. ఈ మధ్యన స్ర్తి పురుష సంబంధాలను గురించి అవగాహనలు బాగా మారిపోయాయి. కనుక అప్పడాల కర్రలు జోకులు రావడం లేదు. అప్పడాల కర్ర ఆకారం గురించి, నిర్మాణ విశేషాన్ని గురించి మరెన్నో వివరాలు ఉన్నాయి. రూళ్లకర్ర లాగ ఆ చివర నుంచి ఈ చివర వరకు ఒకే రకంగా ఉండేవి కొన్ని అయితే, మధ్యలో కొంతమేర మందంగా ఉండి, అటు ఇటు పక్కన అంత లావులేని కర్ర, అందరికీ తెలిసిన నమూనా. దీన్ని హిందీలో బేలన్ అంటారు. రొట్టెలను అప్పడాలను వత్తి పెద్దవి చేయడం బేల్ నా అన్న కార్యక్రమం. చాలా కష్టపడవలసి వచ్చింది అని చెప్పడానికి బహుత్ పాపడ్ బేర్నా పడా అనడం హిందీలో విన్నాను. ఇంగ్లీష్ భాషలో దాని పేరు రోలింగ్ పిన్. అక్కడ మరి దాన్ని భర్తల మీద ఆయుధంగా వాడే సంప్రదాయం ఉండేదా తెలియదు.
మీరెప్పుడైనా సర్కటాల కుండ అన్న మాట విన్నారా? మా ప్రాంతంలో ఇల్లు, అందులోని ఒక మూల, లేదా ఒక గది మరీ గజిబిజిగా ఉంటే దాన్ని సర్కటాల కుండ అనడం కొంతమందికి అలవాటు. మా ప్రాంతంలో కూడా అందరికీ ఈ మాట తెలియదు అని నా అనుమానం. అచ్చం ఇదే పద్ధతిలో సర్పరాయి సామాను అని మాకు కొంత ఉండేది. అర్థం లేని అవి ఇవి అన్ని కలిపి ఒకచోట పోగు వేస్తే అది సర్పరాయి సామాను. నిజం చెబుతున్నాను. బ్లాగ్ పేరిట, సరదా పేరిట రాసిన కవితలు, అనువాదాలు, కథలు లాంటి రచనలు కొన్ని పోగుపడి ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేసుకోవాలి అన్న ఆలోచన ఉన్నది. ఆ పుస్తకంగాని వేస్తే గీస్తే, అంటే ముఖపత్రం గీస్తే, దానికి సర్పరాయి అని పేరు పెట్టాలి అని నాకు ఒక కోరిక లోపల ఉన్నది.
చటుక్కున చిన్నప్పుడు పల్లెలో మా ఇంటి పక్కనే ఉండే చేదబావి మీద విన్న ఒక మాట మనసులో వెలిగింది. సిలు కట్టు అవనీతు ఉన్నది. అని ఒక ఆవిడ నీళ్లు తోడడానికి తన తాడు చేదలను మరొకరికి ఇవ్వడానికి నిరాకరిస్తూ చెబుతుంది. ఈ మాట చదివిన వారికి అది ఏమిటో అర్థం అయిందని నేను మాత్రం అనుకోను. అసలు ముందు నాకే ఈ మాట అర్థం కాలేదు. అది తెలుగేనా అనిపించింది. అయితే మాటలను పలికిన తల్లికి తెలుగు తప్ప మరొక భాష రాదని, అందులో కూడా మా ఊరి భాష తప్ప మరొకటి రాదని నాకు గట్టిగా తెలుసు. కనుక నేను ఆ మాటల అర్థాన్ని గురించి పరిశోధించాను. చేద, లేదా బొక్కెన, లేదా బకెట్‌లకు తాడు కట్టి, చక్రం మీదుగా, లేదా గిలక మీదుగా బావిలోకి వదిలి, ఆ పాత్రలోకి నీళ్లను నింపి చక్రం మీద తాడును లాగుతూ నీళ్లను పైకి తెచ్చుకుంటారు. పాత్రకు తాటిని కట్టాలంటే అక్కడ ఒక ముడి వేయాలి. కొన్ని పాత్రలకు అందుకు అనువుగా నిర్మాణంలో ఒక ఏర్పాటు ఉంటుంది. అందులో నుంచి తాటిని దూర్చి ముడి వేయాలి. ఆ ముడి పేరు చిలుకకట్టు. ఆ ముడి బహుశా చిలుక ఆకారంలో వస్తుందేమో. చిలుకకట్టు చిలుక్కట్టు అయ్యింది. శిలుకట్టు అయ్యింది. ఆ కట్టు అంత బలంగా లేదు. ఎప్పుడు ఊడుతుందో అన్నట్టు ఉంది. అమాంతంగా ఉంది. ఈ అమాంతం అన్న మాట ఎంతమంది డిక్షనరీలలో ఉన్నదో నాకు తెలియదు. మా ఇళ్లలో మాత్రం మేము వాడతాము. వాడు ఉన్నదంతా అమాంతం మింగేశాడు అనడం మాకు అలవాటే. కానీ ఇక్కడ అమాంతంగా ఉన్నది అంటే అది అంత గట్టిగా లేదు అని అర్థం. చేద ఇవ్వడానికి నిరాకరించే ఆ మనిషి వేసిన ముడి బలహీనంగా ఉంది, ఎప్పుడు ఊడుతుందో తెలియదు. కనుక నేను ఇవ్వను అని చెబుతున్నది అన్న మాట. ఈ మాట నేను ఎవరికి చెప్పాలి? ఇప్పుడు బహుశా మా ఊర్లో ఎవరూ బావిలో నుంచి నీళ్లు చేదడం లేదు. మా ఇంటి ముందు ఉండి, ఊరి వారందరికీ అన్ని అవసరాలకు నీళ్లు అందించిన బావి ఇప్పుడు లేదు. మొన్న మొన్నటి వరకు మొండి గోడలు మాత్రం మిగిలి ఉండేవి. ఇప్పుడు దాన్ని కూడా పూడ్చి వేశారు అని ఈ మధ్యనే వార్త వచ్చింది. నా చిన్ననాటి జ్ఞాపకాలలో స్థానం సంపాదించుకుని ఉన్న ఆ బావి, అక్కడ విన్న మాటలు, ఇప్పుడు ఉన్నాయా? ఎందుకు నాకీ పదారవిందం?
ఒరధిరకటము, అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఇల్లు ఇరకటము, ఆలు మర్కటము అన్న మాట కనీసం ఎవరైనా విని ఉంటారు. అంటే అందరికీ కోపం వస్తుంది కానీ ఇంట్లో ఆడమనిషి కోతిలాగా ఉంటే విశాలమైన ఇల్లు కూడా మాకు ఇర్కటము. అందరికి ఇరకాటమే అవుతుంది. జానకిరాణి గారు ఈ మాటలు కొంచెం మార్చి ఇల్లు ఇరుకవాటం, ఆలు మరుకవాటం అని వ్యాఖ్యానం చెప్పారు. రెండు తలుపులు ఉన్న ఇల్లు బాగానే ఉంది. మన్మథుడిని గుర్తుకు తెచ్చే పెళ్లాం అంతకన్నా బాగుంది. కానీ ఇరకాటం అనే పరిస్థితిని ఒరధిరకటము అని పెంచి పలకడం మా వాళ్లకు మాత్రమే చేతనైంది.
ఎక్కడికక్కడ అర్థాలు మారే మాటలు కొన్నైతే, అసలు అర్థం లేని మాటలు కూడా కొన్ని ఉంటాయి. నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు. అది నాకు ఇప్పటివరకు జ్ఞాపకం ఉన్నది. ఉదబంతికజియమ, అనే మాట విన్న తరువాత నా వయసు వారు నాకన్నా పెద్ద వయసు వారికి ఎవరికైనా ఏదైనా గుర్తుకు వస్తే నాకు తప్పకుండా తెలియజేయమని మనవి. నాన్నకు ఈ మాట బడికి వచ్చిన ఉత్తరాలలో ఎక్కడో కనిపించిందట. అర్థం లేని మాట గురించి చెప్పవలసిన సందర్భాలలో ఆయన ఈ మాట గుర్తుకు తెస్తూ ఉండేవారు. ఇవాళటి వరకు ఆ మాటల్లోని అంతరార్థం మాత్రం నాకు తెలియలేదు.
ఈ మధ్యన పోనీ కొంతకాలం క్రితం వచ్చిన గాంధీ ఆసుపత్రి దగ్గర ఒక గుడ్డ మీద రాసి పెట్టిన అక్షరాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. స్వాస్థ్య జాగ్రుక్తమ అని వారు ఒక పెద్ద బ్యానర్ తయారుచేసి పెట్టారు. మా ఇంటి యజమానురాలు ఆ రంగానికి సంబంధించిన మనిషి కనుక సందర్భం గురించి అడిగాను. ప్రజలకు ఆరోగ్యం గురించి జాగరూకత కలుగజేయాలని ఒక 15 రోజులపాటు పట్టుబట్టి కార్యక్రమాలు చేసినట్టున్నారు. మరి ఆ కార్యక్రమానికి ఒక పేరు ఉండాలి. తెలుగులో ఎవరూ ఆరోగ్యాన్ని స్వాస్థ్యము అనరు. అస్వస్థత అన్న మాట మాత్రం ఉంది. మొత్తానికి అక్కడి నుండి ఆరోగ్యానికి సంబంధించిన ఆ మాటను వెతికి తెచ్చారు. తరువాత జాగరూకత అన్నది మరి ఏదోగా మారిపోయింది. ఇది అక్కడ చిక్కు. నిజానికి నా పదారవిందంలో ఈ రకమైన ఆనందానికి తావులేదు.
చివరకు ఒక చిన్న రహస్యం చెప్తాను. కొంతకాలం నేను వ్యాసాలు కాగితం మీద కలంతో రాసేవాడిని. ఆ తరువాత ఒక మిత్రుడు నేను చెపుతుంటే టైప్ చేసేవాడు. ఇప్పుడు నేను నా టాబ్లెట్‌కు వ్యాసాలను డిక్టేట్ చేస్తున్నాను. అది తెలుగులోనే టైప్ చేస్తుంది. అక్కడ వారికి ఒక తెలుగు డిక్షనరీ ఉన్నది. అది కంటికి కనబడదు. కానీ నేను చెప్పిన మాటలను తనకు ఇష్టం వచ్చినట్లుగా చూపిస్తుంది. నా తెలంగాణ భాషలో ఒక్క ముక్క కూడా ఈ కంప్యూటర్‌కు తెలియదు.

-కె.బి.గోపాలం