S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంప్రదాయ సంగీత విదుషీమణి

‘ఏమిటి? అలమేలుకు సంగీతమా? మీకేమైనా మతిపోయిందా? మన పరువు ప్రతిష్టలేం కానూ? సంగీతం లేదూ కాకరకాయా లేదు. నోరు మూసుకుని పడుండండి’ ఇంట్లోంచి తల్లి సతాయింపు మాటలతో కృష్ణస్వామికి నోట మాట లేదు. ఆయనకు సంగీతమే ప్రాణం. కూతురు పాడుతూంటే ఆయన ఆనందానికి అవధులుండవు. పైగా ఊళ్లో నైనాపిళ్లెతో ఆ వేళే మాట్లాడి వచ్చాడు. నైనా పిళ్లె లాంటి మహా విద్వాంసుడు అలమేలుకు సంగీతం నేర్పుతానంటే అంతకంటే కావలసినదేముంది? పైగా కొలంబియా గ్రామఫోన్ కంపెనీ వారు కొత్త గొంతుల కోసం వెదుకుతూ కాంచీపురం వచ్చారు. అలమేలు బాగా పాడుతోందని, తెలిసి కబురు పంపారు. ఆ బాలిక పాట రికార్డు చేసుకుంటామన్నారు.
తండ్రికి ఒక వైపు ఆనందం. మరోవైపు ఇంట్లో కట్టుబాట్లు. ఏం చేయాలో పాలుపోవటం లేదు. సనాతన సంగీత సంప్రదాయంలో పుట్టిన పిల్ల. అందరి ముందూ కూర్చుని పాడి రికార్డ్ చేయటం, ఇంట్లో వాళ్లెవరికీ ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి చేత పాడించారు.
అలమేలుగా పిలవబడే ఆ అమ్మాయే డి.కె.పట్టమ్మాళ్. మొత్తం మీద తెగించి, అందర్నీ కాదని తండ్రి ధైర్యం చేసి పట్టమ్మను నైనా పిళ్లె వద్ద చేర్పించాడు.
అప్పటకే వీణధనమ్మాళ్ మనుమరాళ్లు బృంద, ముక్తలు గురుకుల వాసంలో ఆయన దగ్గర సంగీతాభ్యాసం చేస్తున్నారు.
సంగీతం మీద పిచ్చి కాబట్టి తండ్రి ప్రముఖ విద్వాంసుల శిష్యుల్ని ఇళ్లకు పిలిపించి, కృతులు నేర్పించేవారు. ముత్తుస్వామి దీక్షితర్ మనుమడు అంబి దీక్షితర్ సమర్థులైన వారికే సంగీతం బోధించేవాడు. పట్టమ్మాళ్ గాత్రానికి ముగ్ధుడై నేర్పాలని నిశ్చయించుకుని, దీక్షితర్ కృతులు నేర్పాడు. తోటి కులస్థులు ఆక్షేపణలు, అభ్యంతరాలు చెప్పినా లెఖ్ఖ చెయ్యకుండా పట్టమ్మాళ్ పాడుతోంటే ప్రక్కనే తంబుర వేసేవాడు తండ్రి కృష్ణస్వామి. కూతురి సంగీతాభివృద్ధి కళ్ళారా చూసిన అదృష్టవంతుడు. తండ్రికి అంతకన్నా ఏం కావాలి?
నైనా పిళ్లె ఒక లయ బ్రహ్మ. రాక్షస సాధకుడు. పట్టమ్మాళ్ ఏకసంథాగ్రాహి అవ్వటంతో అటు మనోధర్మం, ఇటు తాళజ్ఞానం రెండూ సమాన స్థాయిలో లభించాయి. సంప్రదాయ సంగీతానికి ఇవే అవసరం. రాగం, తానం, పల్లవి.. విద్వాంసుల పరిణతిని చెప్పే కొలమానాలు. అందులో విశేషాలను పట్టమ్మాళ్ అనతికాలంలో పట్టు సాధించి కర్ణాటక సంగీతంలో తనకో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తొలిరోజుల్లో పట్టమ్మాళ్ కంఠస్వరం ఖంగుమనేది. ఆ రోజుల్లో సనాతన సంప్రదాయ కుటుంబాల్లో దేశభక్తి భావాలు కూడా నిండుగా ఉండేవి. పట్టమ్మాళ్ చిన్నప్పటి నుంచీ దేశభక్తి గీతాలు పాడే అలవాటు చేసుకుంది. మద్రాసు రేడియో కేంద్రం నుంచి మనకు స్వతంత్రం సిద్ధించిన రోజున ‘పాడుకోమే పళ్లుప్పాడుకోమె’ అనే పాట పాడినది పట్టమ్మాళ్లే. శ్రుతి శుద్ధమైన గాత్రం, సంప్రదాయాన్ని ప్రతిబింబించే గమక సంపద, నిర్దుష్టమైన కీర్తన పాఠం, బింకమైన లయ జ్ఞానం పట్టమ్మాళ్‌ని ఉన్నత స్థితికి తీసుకెళ్లి నిలబెట్టాయి.
సంగీతమూర్తి త్రయంలో త్యాగరాజు పేరు చెప్పినంతగా, తక్కిన వారి సంగీతాన్ని కూడా ప్రచారం చేయవలసిన అవసరముంది. పిలిస్తే చాలు. ఆ తల్లి పలికేదట. అటువంటి శ్యామశాస్ర్తీ అఖండ సంగీత జ్ఞాన సంపన్నుడు. కామాక్షీ ఉపాసకుడు. ఆయన కీర్తనలు రాశిలో తక్కువే. కానీ ఒక్కొక్క కీర్తన ఒక్కో ఆణిముత్యం. రాగభావాన్ని సాహిత్యానికి బాగా అన్వయించుకుని, ఒకటికి పదిసార్లు పాడితే గానీ పరిపూర్ణత సిద్ధించదు. సామాన్యుడు పాడలేడు.
అలాగే ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా. మహా ఉపాసకుడు. అసలు తమిళులు పిలిచేది ‘ముత్తుస్వామి’ యని, తెలుగువారు ‘ముద్దు స్వామి’ అని వ్యవహరిస్తారు.
పండిట్, ఉస్తాద్ అని పిలిచినట్లు వారి వంశంలో అందరినీ ‘దీక్షితులు’ అనే పేరుతో పిలవటం అలవాటు. వారి పేర్ల చివరన అలా ‘దీక్షితులు’ వచ్చి చేరింది. మూర్తిత్రయంలో దీక్షితులు వయస్సులో చిన్నవాడు. కానీ అఖండ విద్యా సంపన్నుడు. కారణజన్ముడు. వ్యాకరణ అలంకార, ఛందశ్శాస్త్రాలపై అద్వితీయ పాండిత్యం కలిగినవాడు. దీక్షితుల వారి తమ్ముడు బాలస్వామి దీక్షితులు, కర్ణాటక సంగీత కచేరీలలో వయొలిన్ వాద్యాన్ని ప్రవేశపెట్టిన వయొలిన్ విద్వాంసుడు.
దీక్షితుల వారి కృతులన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. సంస్కృతం దేవ భాష. సాధికారికత కలిగిన భాష. ఇతర భాషలన్నిటికీ తల్లిలాంటిది. ఈ కృతులను పట్టమ్మాళ్ ఎంతో సమర్థవంతంగా నేర్చుకుంది. దీక్షితుల వారి కుటుంబం నుంచి తిన్నగా చేతికి చేరిన కీర్తనలు చెప్పాలా? తన సంగీతాభ్యాసం వల్ల గృహిణిగా నిర్వహించవలసిన బాధ్యతలను విస్మరించకుండా సంపూర్ణ జీవితాన్ని గడిపిన మహా విద్వాంసురాలు. పట్టమ్మాళ్ పేరు చెప్పగానే ఆమె సోదరుడు జయరామన్ పేరు విధిగా చెప్పాలి. అక్క నేర్చుకునే సంగీత పాఠాలన్నీ చిన్నతనం నుండి బాగా వొంటబట్టించుకుని ఆమెతో కూడా పాడి మహా జ్ఞాన సంపన్నుడై సంగీత లోకంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న విద్వాంసుడు. సంగీత రంగంలో, సినీ రంగానికి బాగా తెలిసిన నిత్యశ్రీ ఆమె మనవరాలే. ఆ కుటుంబంలో అందరూ గాయకులే. వాదకులే. అదీ విశేషం. ప్రముఖ మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్ టిఎస్ మణి అయ్యర్ సాక్షాత్తూ పట్టమ్మాళ్ వియ్యంకుడు.
ఆ రోజుల్లో స్ర్తిలు సంగీతం నేర్చుకోవడం అసిధారావ్రతమే. పురుషులతో సమాన స్థాయిలో అన్ని రంగాల్లోనూ స్ర్తిలు రాణించడాన్ని సమాజం సమర్థించేది కాదు. పైగా గాత్ర సంగీతం, నృత్యం లాంటి కళలు రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా నేర్చుకునేలా వుండే దుస్థితి. ఈ రోజుల్లో ‘మా అమ్మాయికి సంగీతమంటే ప్రాణం. ఓ పాట వింటారా?’ అని బ్రతిమాలుతూ చివరకు ఏదో సినిమా పాట వినిపించే స్థాయిలో మనం వున్నాం. సంప్రదాయానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. సంగీతమంటే శాస్త్రం. శాస్త్రంతో అధ్యయనం, అనుభవం, సాధన లాంటి విషయాలపై గురి వున్న సద్గురువులే సంగీత బోధనకు సిద్ధపడేవారు. గమకాలన్నీ గాత్రం పలకగలిగితేనే శిష్యులుగా స్వీకరించేవారు. గమక సౌందర్యం తెలియని వారిని అసలు గడపదాటి లోపలకు రానిచ్చేవారు కాదు.
సుబ్బులక్ష్మి, పట్టమ్మాళ్, వసంతకుమారి లాంటి గాయనీ మణులకు సంగీత విద్వాంసులుగా ఎంతో పేరున్న, సినిమా సంగీతం పాడినా సినిమాల కోసం వారి స్థాయిని తగ్గించుకుని పాడలేదు. ఒక మెట్టు దిగిపోయి దిగజారి పాడే ప్రయత్నం చేసి ఎరుగరు.
కాలం మారిపోతోంది. ఈ మార్పు సవ్యంగా లేదు. ఆశాజనకంగా లేదు. విద్వాంసులవ్వవలసిన అభిరుచి తెలివితేటలు ప్రజ్ఞ కలిగిన వారు కేవలం గాయకులై మిగిలిపోతున్నారు. ఉన్నత స్థితికి వెళ్లే ఆశావహులు లేరు. చౌకబారు పాటల్లో సంగీతాన్ని వెదుకుతూ, ఉన్న తెలివితేటలకు పదును పెట్టుకుని రాణించగలిగే సువర్ణ అవకాశాలను జారవిడుచుకుంటూ ఉభయ భ్రష్టత్వం చెంది ఎటూ కాకుండా పోతున్నారని సంగీత రసికులు భావించటంలో తప్పేముంది? నిజమే మరి.
ఈ వేళ సమాజంలో పురుషులతోపాటు యథేచ్ఛగా రాణించగల అవకాశాలు అన్ని రంగాల్లోనూ ఏర్పడ్డాయి.
విచక్షణా జ్ఞానంతో ఆలోచించి గౌరవమైన స్థానాన్ని ఆశించే ప్రయత్నమే చేయాలి. క్షణికానందాన్నిచ్చే కాలక్షేప గీతాల్లో పస లేదని గ్రహించగలిగే సద్వివేకమే కావాలి. విద్వాంసుల సంఖ్య పెరిగితేనే సంగీతం పెరుగుతుంది. పది మంది విద్వాంసులను తయారుచేయగలవారు తయారవ్వాలి.
ఆ రోజుల్లో మన ప్రాంతంలో దక్షిణాది విద్వాంసులు వచ్చి పాడేది కాకినాడలోనే. ఓసారి సరస్వతీ గానసభలో 1980లో కాకినాడలో పాడేందుకు పట్టమ్మాళ్ వచ్చారు. సంగీత కచేరీ ప్రారంభించే ముందు రెండు మాటలు మాట్లాడారు. ఎదురుగా కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తిని (ఆ సభ వ్యవస్థాపకుడు) చూసి ‘నా చిన్నప్పుడు మీ తాతగారున్నపుడు పాడాను. ఇప్పుడు మీ ఎదురుగా పాడటం నాకెంతో సంతోషంగా వుంద’ని రెండు చేతులూ ఎత్తి నమస్కరించి పాట ప్రారంభించారు. రసికులు మెచ్చేదే సంగీతం మరి.
కర్ణాటక సంగీత విలువలు సంప్రదాయం, కట్టుబాట్లు మొదలైన అంశాలు చర్చకు వస్తే ఒకప్పుడు పెద్ద విద్వాంసులు పట్టమ్మాళ్‌నే సంప్రదించి సందేహ నివృత్తి చేసుకునేవారు.
సుబ్బులక్ష్మి, వసంతకుమారి వంటి వారు స్టార్ సింగర్‌లుగా బాగా పేరు తెచ్చుకున్న రోజుల్లోనే శుద్ధమైన కర్ణాటక సంగీత బాణీ వినాలనుకునే రసికులకు పట్టమ్మాళ్ గానం ఒక షడ్రసోపేతమై వీనులకు లభించే విందు. ఎందరో ఔత్సాహికులైన చాలామంది సంగీత విద్యార్థులకు పట్టమ్మాళ్ సంగీతమే ఆదర్శం.
(సంగీత కళానిధి, గాన సరస్వతి శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్ శత జయంతి సందర్భంగా)

- మల్లాది సూరిబాబు 90527 65490