S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రావణుడిని అడ్డుకున్న జటాయువు

రామలక్ష్మణులను తలచుకుంటూ ఏడుస్తున్న సీతాదేవికి, ఒక పెద్ద చెట్టు మీద వున్న గద్దరేడు జటాయువు కనిపించింది. రామవియోగ దుఃఖంతో, రామచంద్రమూర్తికి ఏమైందో అన్న భయంతో, బాధపడ్తూ వున్న సీత పెద్ద గొంతుతో గట్టిగా జటాయువును పిలిచింది. పిలుస్తూ.. ‘తండ్రీ! జటాయూ! ఇదిగో చూడు. ఈ పాపాత్ముడు రావణుడు క్రూరకార్యం తలపెట్టి, నేను ఏడుస్తున్నా వదలక, దయాహీనుడై దిక్కులేనిదానిలాగా నన్ను తీసుకుపోతున్నాడు. వీడు చాలా బలవంతుడు. విజయాలతో ప్రసిద్ధి గాంచినవాడు. దయా దాక్షిణ్యం లేనివాడు. నువ్వు వాడిని జయించడం సాధ్యం కాదు. ఎందుకంటే, వీడు సాయుధుడు. నీవు నిరాయుధడవు. పాపపు మనస్సు గలవాడు కాబట్టి నిరాయుధుడిని కొట్టకూడదన్న ధర్మజ్ఞానం లేనివాడు. అన్నా! తండ్రీ! జటాయువా! పాపాత్ముడైన ఈ రాక్షసుడు నన్నీ విధంగా బలవంతంగా పట్టుకుని పోతున్నాడు. యుద్ధం చేయవద్దంటివి కదా? మరేం చేయమంటావా? సందేహం వద్దు. ఇప్పుడే శీఘ్రంగా పోయి, నా పరిస్థితి రామలక్ష్మణులకు చెప్పు. మహాత్మా! ఇంత మాత్రం సహాయం చేసి ఈ దీనురాలిని రక్షించు’ అంటుంది సీతాదేవి.
(జటాయువు దాస్య విధానం తెలుసుకోవాలి. స్వామికార్యం ప్రతిఫలాపేక్ష కోరక నిబద్ధతతో చేసేవాడు దాసుడు. దాసుడికి స్వామి కార్యంలో నీచమనేది తెలియదు. ప్రాణభయం ఉండదు. సిగ్గు పడడు. ఈ పని చేయగలనా? చేయలేనా? నా శక్తి ఏంటి? శక్తికి మించిందా? అని ఆలోచించడు. యథాశక్తి పని చేయడం తన వంతు అనుకుంటాడు. జయాపజయాలు భగవంతుడి మీద భారం వేసి ఉంటాడు. ఇలాంటి వాడు కాబట్టే, ముసలివాడైనా, నిరాయుధుడైనా, అసహాయుడైనా, జటాయువు తన ప్రాణం ఇచ్చి రామసేవ చేశాడు కాబట్టే మోక్షఫలం లభించింది. అంటే, మోక్షమనేది కేవలం మనుష్యులకే కాకుండా భూతకోటి కందరికీ లభిస్తుంది.
అలాగే, ఎంత కష్టాలలో వున్నా ధర్మాత్ములు ధర్మబుద్ధి వదలరు. అధర్మ మార్గాన నడవరు. యుద్ధం చేసి తనను విడిపించమని సీత జటాయువును కోరలేదు. అది అపాయమని ఆమెకు తెలుసు. రామలక్ష్మణులకు తన సంగతి చెప్పమని మాత్రమే అడిగింది. ఆమె కోరిక నెరవేర్చాడు కానీ తక్షణమే వెళ్లలేదు. ఎందుకంటే, తానూ వాళ్ల దగ్గరకు పోయి తీసుకొచ్చేలోపల రావణుడు లంకకు చేరతాడు. ఏం ప్రయోజనం? అనుకున్నాడు. కొంతసేపైనా వాడిని ఆపుచేస్తే మంచిదని, ఇంతలో రామలక్ష్మణులు రావచ్చని భావించి యుద్ధానికి దిగుతాడు.)
కొంచెం కొంచెం తూగుతున్న జటాయువు, సీత చేస్తున్న అరుపులు వింటాడు. మహాకాయుడైన రావణుడిని, వాడి అంకంలో వున్నా సన్నని సీతను చూసి, వాడికి అడ్డంగా పోయి, ‘రావణా! నేనెవరని అనుకుంటున్నావో? శాశ్వతమైన, శ్రేష్టమైన భగవద్దాస్యం అనే ధర్మకార్యం అంటే ప్రీతి కలవాడిని. సత్యస్వరూపుడైన భగవంతుడంటే ధ్యానరూపకమైన బుద్ధి కలవాడిని. కాబట్టి అలాంటి భగవంతుడి భార్యను నువ్వు అపహరించుకుని పోతుంటే, నా దాస్యధర్మం నిర్వహించడానికి వచ్చాను. గద్దలకు రాజును. పక్షీ.. నువ్వేమి చేయగలవు? అంటావేమో? మహాబలుడైన నా పేరు జటాయువు. నేను జీవించి ఉండగా, నువ్వు ఆమెను అపహరించలేవు.’
‘ఓరీ! నా సంగతి చెప్పాను. ఇక శ్రీరామచంద్రమూర్తి స్వరూప స్వభావాలను చెప్తా విను. రాముడంటే ఏమనుకుంటున్నావో? సమస్త ప్రపంచంలోని భూతాలకు మేలు కోరేవాడాయన. కాబట్టి నీ మేలూ కోరేవాడే! అలాంటి నీ మేలు కోరేవాడికి కీడు చేయవచ్చా? చేస్తే నువ్వు కృతఘు్నడివి కావా? ప్రపంచ క్షేమం కోరేవాడు భగవంతుడు కదా! అంటావేమో? ఆ భగవంతుడే దశరథ కుమారుడనే పేరుతో కనపడుతున్నాడు. మేలు చేయాలని వుంటే చాలా అంటావేమో? ఆ ఆలోచన కార్యరూపంలో పెట్టగల బుద్ధిబలం కలవాడు. ఆయనలోనే సుత్రామ, వరుణ శబ్దాలు అన్వయిస్తాయి. ఇంద్రుడు తూర్పునకు, వరుణుడు పడమరకు రాజులు కాగా, ఈయన సమస్త ప్రపంచానికి రాజై వున్నాడు. ఆయన దేవతలకే రాజు కాదు.. నీకు కూడా ఆయనే ప్రభువు.’
‘అంత ప్రసిద్ధికెక్కి, అంతటి మహిమ కల జగన్నాథుడి భార్యను, మహాసాధ్విని, జగన్మాతను, అపహరించడం నీకు సమంజసమేనా? ఆమె అంటే నీకు అలాంటి గొప్ప అభిప్రాయం లేదంటావా? నువ్వు రాజువు కదా? రాజు ధర్మ పద్ధతిలో నడవాలి కదా? అలాంటప్పుడు రాజు పరస్ర్తిని, ఎలాంటిదైనా అపహరించవచ్చా? రాజు భార్య తల్లి కదా? తల్లిని కాపాడినట్లే, రాజభార్యలను కాపాడాలి కదా? ఇతర స్ర్తిలను అపహరిస్తే ఏమైతుంది అంటావేమో? పరుల సొత్తు కొంచెమైనా అపహరించడం నీచకార్యం అయినప్పుడు, పరుల భార్యలను అపహరించడం ఎంత నీచమో ఆలోచించావా? ఇలాంటి నీచకార్యం నీకు విశేష హాని కలిగిస్తుందని ఆలోచించావా? పరుల భార్యలను కోరడం వల్ల నీకు ఆయుక్షయం అని తెలియదా? నువ్వు ఆమెను తీసుకుని పోవడం నీకు మంచిది కాదు. వదిలిపెట్టు. ఓరీ! క్రూరుడా! నీ భార్యను ఎలా ఇతరులు తాకకూడదో, ఇతరుల భార్యను కూడా తాకరాదని తెల్సుకో.’

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12