S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాయిదాలు.. నిండని బంగారు పాత్ర

చిన్నప్పటి కథలు కొన్ని మనకు ఇప్పటికీ గుర్తుంటాయి. మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తికి బంగారు నాణాల పాత్ర ఒకటి దొరుకుతుంది. ఆ పాత్ర కొద్దిగా ఖాళీగా ఉంటుంది. తన జీవితంలో ఊహించనంత బంగారం ఒకేసారి చూసే సరికి ఆ వ్యక్తికి మతిపోయినంత పనవుతుంది. ఆ బంగారు పాత్రను చూసి రకరకాలుగా ఆలోచిస్తాడు. ఆ బంగారాన్ని ఏం చేయాలి, జీవితాన్ని ఎలా అనుభవించాలి అని తొలుత ఆలోచించిన వ్యక్తి చివరకు తన నిర్ణయాలన్నింటిని పక్కన పెట్టి, ఆ బంగారు నాణాల పాత్రలో కొంత ఖాళీ ఉండడంపై దృష్టిసారిస్తారు. ముందు ఆ కొద్దిపాటి ఖాళీని భర్తీ చేసిన తరువాత వాటిని ఏం చేయాలో నిర్ణయించుకుందామనుకుంటాడు. అప్పటి కన్నా ఎక్కువ కష్టపడి ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటాడు. కానీ చిత్రంగా అతనెంత కష్టపడి సంపాదించిన డబ్బుతో నింపినా ఆ పాత్రలో ఖాళీ అలానే ఉంటుంది. ఈ లోగా అతని జీవితం ముగిసిపోతుంది. అఖరి క్షణాలు సమీపించిన తరువాత ఆ వ్యక్తి బంగారు నాణాల పాత్రలోని ఖాళీని నింపలేకపోయాను అనే అసంతృప్తితో కన్ను మూస్తాడు. బంగారు నాణాల పాత్ర అతని జీవితంలో అసంతృప్తినే మిగిల్చింది కానీ సంతోషాన్ని నింపలేకపోయింది. ఈ కథ అనేక భాషల్లో అనేక విధాలుగా ప్రచారంలో ఉంది. కథ చదివి పాపం మూర్ఖుడు తనకు లభించిన బంగారంతో సంతృప్తి చెందకుండా ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుని అసంతృప్తితోనే జీవితం ముగించాడు అమాయకుడు అని జాలి పడతాం.
అంతే కదా?
ఇలాంటి అమాయకులు ఈ కాలంలో ఉంటారా?
ఉంటారని చెప్పినా మనకు నమ్మబుద్ధి కాదు. కానీ ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు. నమ్మనే నమ్మం అంటున్నారా? నిజమే నమ్మాలంటే కొంచెం కష్టం కావచ్చు. కానీ ఈ కథ ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయితే ఈ కాలానికి తగ్గట్టు బంగారు నాణాల పాత్ర, అమాయకుడు ఇద్దరూ ఈ కాలానికి తగిన రూపాల్లో కనిపిస్తున్నారు. బంగారు నాణాల పాత్ర ఇఎంఐల రూపంలో కనిపిస్తుంటే, మనమంతా ఆ అమాయకుడి లాంటివాళ్లమే.
అతను ఏనాటికైనా బంగారు నాణాల పాత్రను పూర్తిగా నింపాలని ప్రయత్నిస్తే, మనం ఏనాటికైనా ఇఎంఐల చెల్లింపులు పూర్తి చేసి బయటపడాలని చూస్తాం. అతను ఆ పాత్రను నింపకుండానే తన జీవితాన్ని ముగించాడు. మనలో చాలా మంది ఇలా ఏనాటికీ క్రెడిట్ కార్డులు, ఇఎంఐలు చెల్లించడం పూర్తి చేయకుండానే జీవితాన్ని ముగించేస్తాం.
బంగారు నాణాల పాత్రను పూర్తిగా నింపాలని ప్రయత్నించడం మనకు అమాయకత్వంగా, మూర్ఖంగా అనిపించవచ్చు. కానీ మన జీవితం కూడా అచ్చంగా అలానే మార్చేసుకుంటున్నాం. వాయిదాల (ఇఎంఐలు) మాయలో మనం ఒకసారి పడ్డామంటే జీవితంలో బయటపడలేం. చాలా మంది ఆర్థికంగా ఎదగకపోవడానికి, జీవితం ఎదుగు బొదుగు లేకుండా సాగడానికి కారణం ఈ అప్పులే. ఒక ఖరీదైన వస్తువును కొనే స్థోమత మనకు లేనప్పుడు ఇఎంఐలను ఆశ్రయిస్తున్నాం. అంటే సంపాదించ బోయే డబ్బును సైతం ముందుగానే ఖర్చు చేస్తున్నాం. ఈ ఊబిలో పడ్డవారు బయటకు రావడం అంత ఈజీ కాదు. ఆ స్థోమత వచ్చిన తరువాతనే ఆ వస్తువును కొంటే తప్పేంటి? అప్పుల్లో మునగడం ఎందుకు?
చాలా మంది ఆర్థికంగా ఎదగక పోవడానికి, ఎదుగుబొదుగు లేని జీవితం గడపడానికి కారణం ఈ అప్పులే అని తేలింది.
సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండడమే మేలు. ఇంటి రుణం, విద్యా రుణం వంటి వాటిని మినహాయిస్తే మిగిలిన అప్పులు ఆర్థికంగా దెబ్బతీసేసే. ఇంటి కోసం రుణం తీసుకున్నా ఇంటి విలువ పెరుగుతుంది కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్య, విదేశాల్లో విద్య వంటి వాటికి విద్యా రుణాలు తీసుకున్నా , మంచి ఉద్యోగం సాధించడం ద్వారా ఆ రుణాలు తిరిగి చెల్లించడమే కాకుండా ఆర్థికంగా ఎదిగిని మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంతే తప్ప ఇఎంఐలతో భారీ టీవిలు, ఫర్నీచర్, ఐ ఫోన్లు, గృహోపకరణాలతో అప్పుల్లో మునుగుతారు. ఒక వస్తువు ఇఎంఐ అయిపోగానే మరో వస్తువు అంట కట్టడానికి ప్రయత్నిస్తారు.
అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీ చదువులు ముగించి, క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఐటి రంగంలో ఉద్యోగాలు పొందిన చాలా మంది ఆర్థిక వ్యవహారాలు అర్థం కాక, జీవితానుభవం లేక ఇఎంఐల ఉచ్చులో కూరుకుపోవడం కనిపిస్తుంది. ఉద్యోగంలో చేరగానే ఓ ఇళ్ళు తీసుకుని జీతంలో సగం ఇఎంఐలకు చెల్లించినా ఇబ్బంది లేదు. నాలుగైదేళ్లు గడిస్తే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో తేడా వచ్చినా ఇంటి విలువ ఎక్కడికీ పొదు. కానీ అదే ఖరీదైన వస్తువులు కొంటే కాలం గడిచినా కొద్ది వాటి విలువ తగ్గిపోతుంది. ఎంత ఖరీదైన కారు ఐనా, గృహోపకరణాలు ఐనా వాటి విలువ రోజు రోజుకు తగ్గుతుంది కానీ పెరగదు. జీతంలో ఎక్కువ మొత్తం ఇలా ఇఎంఐలకు చెల్లించే వారు మన చుట్టూ చాలా మంది కనిపిస్తారు. వీరా ఊబి నుంచి బయటకు రారు. ఏ ముందిలే జీతంలో నుంచి వాయిదాల్లో చెల్లించడమే కదా? అనుకుంటారు. కానీ భవిష్యత్తులో అదెంత నష్టదాయకమో తెలియదు. జీతంలో ఎక్కువ మొత్తం, కారు ఇతర వస్తువుల ఇఎంఐలకు చెల్లించే వారికి హఠాత్తుగా ఏదో కారణంతో ఉద్యోగం పోయింది అనుకోండి అప్పుడేం చేస్తారు. ఈ రోజుల్లో కంపెనీలో ఎప్పుడేమవుతుందో తెలియదు. అద్భుతంగా నడిచిన జెట్ ఏయిర్‌వేస్ ఉద్యోగులు వేల మంది రోడ్లపై ర్యాలీలు తీస్తూ తమ జీతాలు చెల్లించాలని, తమ కుటుంబాన్ని కాపాడాలని కోరుతున్నారు. జెట్ ఏయిర్‌వేస్ ఉద్యోగుల పరిస్థితి అలా అవుతుందని కలలో నైనా ఊహించామా? ఏ కంపెనీ ఎప్పుడు దెబ్బతింటుందో, ఏ కంపెనీలోని ఉద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడు ప్రమాదంలో పడతాయో ఊహించలేం. ఏదో దేశం తీసుకునే ఒక నిర్ణయం మరో దేశంలో ఉండే మనపై పడవచ్చు. తుంటిమీద కొడితే మూతి పళ్లు రాలాయి అన్నట్టు గ్లోబ్‌లో ఎక్కడుందో తెలియని ఏదో దేశంలో జరిగే పరిణామాలు మనింట్లో హాయిగా సేదతీరే కుటుంబరావు జీవితంపై పడొచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీ జీతం ఎంత ఎక్కువ అయినా కావచ్చు, ఇఎంఐల మాయాజాలంలో చిక్కుకోకుండా, భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక స్వేచ్ఛ కోసం ఆస్తి విలువ పెంచే హోమ్‌లోన్ వంటి ఇఎంఐలైతే మంచిది కానీ, విలువను కరిగించే ఇఎంఐలకు దూరంగా ఉండండి. కాకూడదు.

-బి.మురళి