ఆకుకూరలతో అజీర్తి అంతం
Published Saturday, 4 May 2019గలిజేరు ఆకుతో కూర, ఛారు, పప్పు: గలిజేరుని పునర్నవ అంటారు. అత్యంత శక్తివంతమైన లివర్ టానిక్ ఇది. కామెర్లలో దివ్యౌషధం. పుఅర్న వారిషట, పునర్న వాది మండూరం లాంటి అనేక ఆయుర్వేద ఔషధాలు రక్తహీనతను తగ్గించి, కాలేయాన్ని బలసంపన్నం చేసేవి ప్రసిద్ధం. అజీర్తిని పోగొట్టే ఔషధం. వారానికి కనీసం రెండుసార్లయినా గలిజేరు ఆకుతో కూర గాని పప్పు గానీ పచ్చడి గానీ చేసుకుని తింటూ ఉండటం అందరికీ మంచిది. కీళ్లవాత వ్యాధుల్లో వాపుల్ని తగ్గిస్తుంది. మొలల వలన కలిగే ఇబ్బందుల్ని తగ్గిస్తుంది. చర్మవ్యాధుల్లో కూడా ఇది బాగా పని చేస్తుంది. దీని ఆకు రసంలో చారు (రసం) పొడి వేసి చారు కాచుకొని తాగితే జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తుంది. సంప్రదాయ వైద్యులుల గలిజేరు రసాన్ని, నేల ఉసిరిక రసాన్ని కామెర్ల రోగంలో పసురుగా తాగిస్తారు. గలిజేరు తీగని మెడలో నగలాగా ధరిస్తారు. కామెర్లను తగ్గించటానికి ఇది స్పర్శామాత్రంగానే పని చేస్తుదంని!
ఆగాకర ఆకుతో పులుసు కూర/ పచ్చడి: ఆగాకర తీగెలు తోటల్లో కంపల మీద పాకుతూ పెరుగుతాయి. ఇప్పుడు బాగానే మార్కెట్‌కు వస్తున్నాయి. దొరికినప్పుడు విడవకుండా కొనుక్కుని తినటం మంచిది. వాతాన్నీ, వేడినీ కఫాన్నీ మూడు దోషాలనూ తగ్గించే దివ్యౌషధం ఆగాకర. దీని ఆకులక్కూడా కాయలతో సమానమైన గుణం ఉంది. ఆగాకర ఆకులతో పచ్చడి లేదా పులుసు కూరలు వండుకుంటారు. అజీర్తిని పోగొడుతుంది. మొలల వ్యాధిలో ఔషధంగా పని చేస్తుంది. షుగరు వ్యాధి ఉన్నవారికి ఇది అవసరమైన ఆహార ద్రవ్యం. కంటి జబ్బుల్లో కూడా పని చేస్తుంది. టీబీ లాంటి క్షీణింపచేసే రోగులకు వీటిని తరచూ వండిపెట్టండి. కఫాన్నీ, అజీర్తిని తగ్గించి, రోగికి శక్తిని కలిగిస్తుంది. ఆపరేషన్లు అయిన వారికి, గాయాలు అయిన వారికి తప్పనిసరిగా పెట్టండి.
ఉత్తరేణి ఆకు కూర: ఉత్తరేణి మొక్క కూడా రోడ్డు పక్కన పెరిగే మొక్కే! కానీ చాలా శక్తివంతమైన ఔషధం. దీన్ని అపామార్గ అని పిలుస్తారు. దీనిలోని క్షారాలు గాఢమైనవి కూడా! తక్కువ మోతాదులోనే ఎక్కువ ఫలితాలనిస్తాయి. అజీర్తి, జీర్ణకోశ వ్యాధులు, లివరు, మూత్రపిండాల వ్యాధులు, కఫ వ్యాధులు, క్షీణింపచేసే వ్యాధుల్లో దీని ఆకులతో కూర, పప్పు లేదా పచ్చడి చేసుకుని తింటూ ఉంటే వ్యాధులు త్వరగా ఉపశమిస్తాయి. ఆయా వ్యాధులకు వాడుతున్న ఔషధాలు శక్తిమంతంగా పని చేస్తాయి.
ఉత్తరేణి గింజల పాయసం: ఉత్తరేణి గింజలు ముళ్లు కలిగి పక్కనుంచి నడిచి వెళ్లే వారి బట్టలకు అంటుకుంటూ ఉంటాయి. కంకుల నుండి ఈ గింజలను వేరుచేసి పాలలో వేసి ఉడికించి కాచిన పాయసం తాగుతుంటే పేగుపూత (కడుపులో అల్సర్లు) తగ్గుతాయి. పురుషత్వం పెరుగుతుంది.
వాము ఆకు కూర/ బజ్జీలు: వాము ఆకులు వేడి చేస్తాయి. తక్కువగా తినాలి. వంకాయ లాంటి కూరల్లో దీన్ని చిన్ని ముక్కలుగా కత్తిరించి కలిపి వండుతారు. వాము వేసి వండినట్టే రుచికరంగా ఉంటాయి. అల్లం వెల్లుల్లి మసాలాలకు ప్రాధాన్యత తగ్గించి ఇలాంటి సుగంధ ద్రవ్యాలను కూడా తింటూ ఉంటే జీర్ణాశయం బలసంపన్నం అవుతుంది. వాము (ఓమము, వామము, వామ్ము)తో సమాన గుణాలు దీనికున్నాయి. దీప్యక అనే మరో పేరు కూడా దీనికుంది. అంటే జఠరాగ్నిని ప్రజ్వరిల్లచేస్తుందని భావం. ఎంతటి కఠిన ఆహార పదార్థాన్నయినా కంఠపర్యంతం భుజించినా తేలికగా అరిగించేస్తుంది. కడుపులో నులి పురుగుల్ని చంపుతుంది. కామెర్ల వ్యాధిలో మేలు చేస్తుంది. మూత్రం అయ్యేలా చేస్తుంది. ఉబ్బరాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. వామాకులతో కూర వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. గోధుమ పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవచ్చు.
కాకరాకు కూర/ పచ్చడి: కాకర కాయలతోనే కాదు మన పూర్వులు లేత కాకరాకుల్ని కూడా ఆహార పదార్థంగా తయారుచేసుకునేవారు. కాకరాకు జీర్ణశక్తిని పెంచుతుంది. టీబీ వ్యాధిలోనూ, క్షీణింపచేసే వ్యాధుల్లోనూ లివరు వ్యాధుల్లోనూ ఇది ఔషధంగా పని చేస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగిన వాటిని తింటున్నప్పుడు ఆయా వ్యాధులకు వాడే మందులు త్వరగా పని చేస్తాయి. అలా పని చేయించే గుణాన్ని ‘యోగవాహి’ అంటారు. ఈ ద్రవ్యాలకు యోగవాహి గుణం ఉంది.
గుంటకలగర ఆకు పులుసు కూర: దీన్ని భృంగరాజ అంటారు. కేశ సంపదను పెంపు చేసే గుణం ఉండటాన దీనితో కాచిన తైలాన్ని తలకు రాసుకుంటారు. భృంగరాజ తైలం, నీలి భృంగామలక తైలం, భృంగామలక తైలం, ఇవన్నీ గుంటకలగరాకుతో తయారయ్యేవే! గుంటకలగర లేత ఆకుల్ని గోంగూర లేదా చుక్కకూరతో కలిపి వండుకుంటే పుష్టికరమైన ఔషధంగా పని చేస్తుంది. శరీరంలోని విష దోషాలను హరించే గుణం దీనికుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. దీనిలో ఇనుము ఎక్కువగా ఉండటాన తరచూ వండుకుంటూ ఉంటే రక్తహీనతకు దివ్యౌషధం. చర్మ వ్యాధుల్లో బాగా పని చేస్తుంది. కామెర్లు, ఇతర లివరు వ్యాధుల్లో ఇది మంచిది.
గుమ్మడి ఆకు కూర: ఎర్రగా, తియ్యగా ఉండే గుమ్మడి కాయలకున్న గుణాలన్నీ దీని లేత ఆకులక్కూడా ఉన్నాయి. లేత ఆకుల్ని కూర, పప్పు, పులుసు కూర, పచ్చడి వగైరా చేసుకోవచ్చు. అజీర్తి తగ్గుతుంది. వాతం తగ్గుతుంది. పండు తినకూడని వారికి లేత ఆకులు కూరగా వండుకుని తింటే గుమ్మడి వలన కలిగే లాభాలన్నీ కలుగుతాయి. పుష్టినిస్తాయి.
గోంగూర ఆకులు, పువ్వుల పప్పు/ పచ్చడి: చాలామందికి గోంగూర అంటే భయం. కీళ్లు పట్టుకుపోతాయని. దీన్ని నీళ్లలో ఉడికించి వార్చి పప్పుగానో, పచ్చడిగానో చేసుకుంటే అపకారం చెయ్యదు. దీనితో కలిపి గుంటకలగర లేదా పారిజాతం ఆకులను కూడా ఉడికించి కలిపి వండుకుంటే కీళ్లవాతంలో ఔషధంలా పని చేస్తాయి. రుచి చెడదు. రేచీకటి వ్యాధి ఉన్నవారికి గోంగూర + గుంటకలగర కలిపి వండిన వంటకం తరచూ పెడుతుంటే రేచీకటి తగ్గుతుంది.
తిప్పతీగ ఆకు కూర: తిప్పతీగ కూడా తోటల కంపల మీద పాకే మొక్క. రోడ్డు పక్కన వాటికవే పుట్టి పెరిగే మొక్క ఇది. గుడూచీ అంటారు దీన్ని. లేత గుడూచీ ఆకుల్ని తరచూ కూరగానో పప్పుగానీ వండుకుని తింటూ ఉంటే, అజీర్తి బాధలు, ఎసిడిటీ బాధలు తగ్గి శరీరంలో విష దోషాలు పోతాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. వాత వ్యాధులున్న వారు తప్పనిసరిగా దీన్ని తినటం మంచిది.
ఇప్పటి తరం వారికి ఇవన్నీ పిచ్చి కాయలు, పిచ్చి ఆకులు అనిపించవచ్చు. కానీ, ఒకప్పుడు వీటిని తినే ఆస్పత్రి ముఖం చూడకుండా నూరేళ్లు శక్తిమంతంగా బతకగలిగారు మన పూర్వులు. వీటిని కూరగాయలు అమ్మేవారిని అడిగి తెప్పించుకోవటం ఒక్కటే మార్గం. రైతుబజార్లలో రైతాంగం కూడా కొంచెం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మార్కెట్‌కు తెచ్చి అమ్మటం మొదలుపెడితే ప్రజలు వాటిని తెలుసుకుని కొనటం ప్రారంభిస్తారు. దేశానికి వెనె్నముక రైతు అని మన జాతి రైతుల్ని గౌరవిస్తోంది. కానీ, విష పూరితమైన రసాయనాలతో నిండిన ధాన్యాలు, కూరగాయలే ప్రజలకు అందుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అపురూప ద్రవ్యాల్లో వాటికవే పడి మొలిచేవే ఎక్కువ. వీటి మీద పురుగు మందుల ప్రభావం అంతగా ఉండదు. కాబట్టి, కొత్త ఆహార ద్రవ్యాల కోసం అనే్వషణ ప్రారంభిద్దాం.