ఆహార పదార్థాలు -4
Published Saturday, 25 May 2019చేమాకుతో పప్పుకూర, పులుసు కూర
చేమ దుంపల్నే కాదు చేమ ఆకులతో కూడా పప్పు కూర, పులుసు కూరలు చేసుకునే అలవాటు నేటికీ గ్రామీణులకుంది. రుచికి తోటకూర మాదిరే ఉంటుంది. అన్ని రకాల ఆహార పదార్థాలూ వీటితో వండుకోవచ్చు. రుచికరంగా ఉంటాయి. ఆకలిని పెంచుతాయి. చేప దుంపలు ఎలర్జీని కలిగించటం, నొప్పుల్ని పెంచటం చేస్తాయి. చేమాకులు వీటిని తగ్గించేవిగా ఉంటాయి. ఈ వైరుధ్యాన్ని గమనించాలి. మొలలు, మూల వ్యాధులు తగ్గటానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చేస్తాయి. అన్ని వ్యాధుల్లోనూ ఈ ఆకులు మేలు చేసేవిగానే ఉంటాయి.
చింత చిగురు పప్పు, పచ్చడి
శాకాహారులూ, మాం సాహారులు కూడా అ త్యంత ఇష్టంగా తినే చింతచిగురుని వైద్యానికి ఎలా ఉపయోగించుకోవాలనేది ముఖ్య చర్చనీయాంశం. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పుతో కలిపి పప్పుకూరగా వండుతుంటారు. చింతపండు కన్నా తక్కువ పుల్లగా ఉంటుంది. కానీ రుచిగా ఉంటుంది. మూత్రపిండాలకు చెడు చేయకుండా ఉంటుంది. పులుపు కావాలనుకున్నప్పుడు కుదిరితే, చింతపండుకన్నా చింతచిగురుకు ప్రాధాన్యత నివ్వటం మంచిది. పైల్స్ వ్యాధిలో కూడా ఉపయోగపడ్తుంది. ఆపరేషన్లు అయిన వారికి, గాయాలైన వారికీ చింతచిగురు పప్పు లేదా పచ్చడి పెడుతుంటే పుళ్లు త్వరగా మానుపడతాయి. లైంగిక సమర్థతను పెంచుతుంది. నీరసాన్ని తగ్గించి శక్తినిస్తుంది. నోటికి రుచిని పుట్టిస్తుంది. నరాలకు ఉత్తేజాన్నిస్తుంది. మేథాసంపత్తిని పెంచుతుంది. చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా వండిపెట్టాల్సిన ద్రవ్యం ఇది! అల్లాన్ని, మిరియాలపొడిని కలిపి వండితే చింతచిగురు వలన దోషాలు కలుగకుండా ఉంటాయి.
చింతపూల పప్పు
మార్కెట్‌లో దొరక్కపోవచ్చు కానీ, రోడ్డుపక్కన మొక్కలే కాబట్టి ఊరవతలకు వెడితే దొరికేవే! చింతపూలు వేపపూల మాదిరే వేసవి రావటానికి ముందు మార్చి ఏప్రిల్ నెలల్లో పూస్తాయి. కొంచెం పుల్లని రుచినే కలిగి ఉంటాయి. కుప్పలు కుప్పలుగా రాలిపడుతుంటాయి. చింతచెట్టు కింద దుప్పట్లు పరిచి చింతపూలను సేకరించుకోవచ్చు. చింతపూల పప్పు వండుకుంటారు. పచ్చడి కూడా చేసుకుంటారు. అన్ని దోషాలనూ పోగొట్టే శక్తి వీటికుంది. నీళ్లలో వేసి మరిగించి టీలాగా త్రాగితే కామెర్లు తగ్గుతాయి. అన్ని లివర్ వ్యాధుల్లోనూ మేలు చేస్తాయి. రక్తదోషాలను పోగొట్టి, ఆహార ద్రవ్యాల్లో ఉండే ఇనుము శరీరానికి వొంటబట్టేలా చేసే గుణం వీటికుంది. ఒక చిన్న మట్టి ముంతలో చింతచిగురు గానీ, చింతపూలు గానీ వేసి, తుప్పెక్కని తెల్లని ఇనుప మేకును వేసి 8 రెట్లు నీళ్లు పోసి 4రెట్లు మిగిలేంత మరిగించి, వడగట్టి, ఆ నీటిని రోజూ ఓ గ్లాసు మోతాదులో త్రాగుతుంటే రక్త క్షీణత తగ్గుతుంది. లివర్ వ్యాధులు తగ్గుతాయి. చింతపూలను కొద్దిగా నెయ్యి వేసి వేయించి, మెత్తగా దంచి పాకం పట్టి హల్వాలాగానో లడ్డూలాగానో చేసి పిల్లలకు వృద్ధులకూ పెట్టవచ్చు. బడి నుంచి అలసిపోయి వచ్చిన పిల్లలకు పెట్టదగిన ఆహారం ఇది! వాత వ్యాధులున్న వారికి వాతాన్ని తగ్గించటానికి ఇది బాగా తోడ్పడుతుంది! లివర్ వ్యాధుల్లో ఔషధంగా పని చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. నరాల బలాన్ని పెంచుతుంది. ఎండిన చింతపూలు, వేపపూలు సమానంగా కలిపి మిరియాల పొడి లేదా అల్లంతో కారప్పొడి తయారుచేసుకుని రోజూ అన్నంలో మొదటి ముద్దగా తినటాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే రోగాలకు చెల్లుచీటీ రాసివ్వచ్చు!
చిర్రికూర పప్పు
పొలం గట్ల మీద ఉచితంగా పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. మొక్కల పరిజ్ఞానం ఉన్న రైతుల్ని అడిగితే గుర్తిస్తారు. ఇంచుమించు తోటకూర లాగే ఉంటుంది. నల్లని సన్నని కాడ కలిగి ఉంటుంది. దీన్ని సంస్కృతంలో పథ్యశాకం అంటే ‘అన్ని రోగాల్లోనూ తినదగిన కూర’ అని పిలుస్తారు. తోటకూరతో వండే వంటకాలన్నీ చిర్రి ఆకు కూరతోనూ వండుకోవచ్చు. ముఖ్యంగా వాతవ్యాధులున్న వారికి ఇది మేలు చేస్తుంది. తోటకూరకన్నా రుచిగా ఉంటుందంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా అంటే విష దోషాలను హరించేదిగా ఉంటుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. కంటి వ్యాధుల్లో మేలు చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. అతిగా తినకూడదు. వేడి చేస్తుంది. తోటకూరకన్నా శక్తివంతమైనది. కాబట్టి తక్కువ మోతాదులో తినాలి.