S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆహార ఔషధాలు -6

తుమ్మి ఆకుల టీ:
సంస్కృతంలో దీన్ని ద్రోణపుష్పీ అంటారు. వగరుగా, చేదుగా ఉంటుంది. టీ కాచుకుని త్రాగటానికి అనువైనది. పులుసు కూరగా వండుకుంటారు. షుగరు వ్యాధి ఉన్నవారికి తుమ్మి ఆకు ఔషధంగా పనిచేస్తుంది. పాలు కలపకుండా తుమ్మి ఆకుల గ్రీన్ టీ తాగుతుంటే అమీబియాసిస్ త్వరగా తగ్గుతుంది. విరేచనం ఫ్రీగా అవుతుంది. మొలల వ్యాధిలో కూడా ఔషధంగా పనిచేస్తుంది. అన్ని వాత వ్యాధుల్లోనూ రోజూ తీసుకోదగిన ఆహారం. అవకాశం ఉన్నవారు ఈ ఆకుని సేకరించి ఎండించి శుభ్రం చేసుకుని, పైపైన దంచి, ఒక సీసాలో భద్రపరచి, వాడుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపులో నులిపురుగుల్ని, కంటికి కనిపించని సూక్ష్మజీవులైన చెడు అమీబాల్నీ చంపే గుణం వీటికి ఉంది. పాము విషంతో సహా సమస్త విష దోషాలనూ హరించే గుణం వీటికుంది. వీటి ఆకులు చాలా శక్తిమంతమైనవి కాబట్టి ఒక చెంచా మోతాదులో ఈ పొడిని తీసుకుంటే సరిపోతుంది.
పొట్ల ఆకు కూర:
పొట్లకాయని ఇష్టపడేవారికి పొట్ల ఆకుకూర కూడా రుచికరంగా ఉంటుంది. తోటకూర లాగా పప్పు, పులుసుకూర, పచ్చడి, పెరుగుపచ్చడి, ఆకురసం తీసి చారు పొడి వేసి కాచిన చారు వీటిని చేసుకునేవాళ్లు మన పూర్వులు. త్రిదోషాలను అదుపులో పెట్టగల ఏకైక శాకము అని ఆయుర్వేద గ్రంథాలు దీని గురించి పేర్కొన్నాయి. ముఖ్యంగా వేడిని తగ్గిస్తుంది. కఫ దోషాలను పోగొడుతుంది. జ్వరాలలో పథ్యంగా పెట్టదగినది. వేడి చేసినందువలన కలిగే పొడి దగ్గు తగ్గుతుంది. ఎలర్జీవలన కలిగే జలుబు దగ్గులలో ఇది మేలుచేస్తుంది. నోటికి రుచిని కలిగిస్తుంది. కడుపులో నులిపురుగులని వెళ్లగొడుతుంది. విష దోషాలను పోగొడుతుంది. కీళ్లవాత వ్యాధుల్లోనూ, ఇతర వాత వ్యాధుల్లోనూ, సయాటికా నడుమునొప్పి వగైరా నొప్పుల్లోనూ తరచూ పొట్ల ఆకులతో ఏదైనా వంటకం చేసుకుని తింటూ ఉంటే మంచిది.
కొయ్య తోటకూర:
కోయు తోటకూర అనేది దీని అసలు పేరు. కోసినా తిరిగి పెరుగుతుంది. కానీ, బాగా వేడి చేసే స్వభావం ఉంది. అందుకని వేడి శరీరతత్త్వం ఉన్నవాళ్లు జాగ్రత్తగా చూసుకుని తినాలి. దీన్ని మరింత వేడి చేసే విధంగా చింతపండుతోనూ, అల్లం వెల్లుల్లి మసాలాలతోనూ కాకుండా చలవచేసే విధంగా ధనియాల పొడి వగైరా కలిపి వండుకోవటం మంచిది. తక్కువ మోతాదులో తినటం అవసరం. తోటకూరకూ, కొయ్య తోటకూరకూ తేడా ఇదే! వేడి చేస్తుంది గానీ, వాతవ్యాధుల్లో గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కీళ్ల వాత వ్యాధులున్న వాళ్లు వేడి చేయటాన్నిబట్టి జాగ్రత్తగా దీన్ని తరచూ తింటూ ఉంటే త్వరగా నొప్పులు తగ్గుతాయి.
దురదగొండి ఆకులతో టీ:
భయపడకండి, ఆకు మీద నూగు తగిలితే దురద పుట్టే దూలగొండి లేదా దురదగొండి ఆకులతో ఆహార పదార్థాలేమిటా అని ఆశ్చర్యపడకండి. కడుపులోకి హాయిగా తీసుకోదగినవే ఇవి. రేగడి భూముల్లో పెరిగే మొక్క కాబట్టి, దీన్ని రేగడి దూల గోవెల మొక్క అని కూడా పిలుస్తారు. తీట కసివింద మొక్క అనే పేరు కూడా ఉంది. కందని తరుగుతుంటేనే దురద పుడ్తుంది. కానీ, దాన్ని వండి ఇష్టంగా కూర చేసుకుంటున్నాం కదా! ఔషధం తియ్యగా ఉండాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు. లేత దూలగొండి ఆకులకు దురద పుట్టే నూగు అంతగా ఉండదు. చిన్న దూలగొండి మొక్క లేత ఆకుల్ని తెచ్చి, నీళ్లలో వేసి బాగా కడిగి, ఎండించి తేలికగా దంచిన పొడిని నీళ్లలో వేసి టీ కాచుకుని తాగవచ్చు. మూత్ర వ్యాధులకు ఇది ఉత్తమ ఔషధం. డయాలిసిస్ లాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూరగానూ, పప్పుగా కూడా వండుకుంటారు. గనేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులున్నవారికి దీన్ని తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, వాపు, చీము తగ్గి పుండు త్వరగా మానే అవకాశం ఉంది. స్ర్తిలకు ఋతురక్తం ఎక్కువ అయ్యేలా చేస్తుంది. షుగరు రోగులకు మేలుచేస్తుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధుల్లో నీరు పట్టినవాళ్లకు దీన్ని ఇస్తుంటే నీరు, ఉబ్బు, వాపులు కూడా తగ్గుతాయి. గవదబిళ్ళలు, వృషణాలు వాచిన వ్యాధుల్లోకూడా ఇది మేలుచేస్తుంది. వీర్యకణాలు తక్కువగా ఉన్నవారికి ఇది కణాలను పుట్టిస్తుంది. కీళ్లవాతం వ్యాధుల్లో ఇది ఔషధమే!
దొండ ఆకుల పప్పు:
నిజానికి దొండ కాయలకన్నా కొన్ని సుగుణాలు దొండ ఆకులకే ఎక్కువ. రుచిగా వండుకోదగిన ఆకులివి. వాతాన్నీ, వేడినీ, పైత్యాన్నీ తగ్గించి శరీరానికి సమస్థితిని కలిగిస్తాయి. కంటి వ్యాధుల్లో దొండాకు మేలుచేస్తుంది. దీర్ఘకాలంగా బాధిస్తోన్న వివిధ చర్మవ్యాధుల్ని తగ్గించే శక్తి వీటికుంది. రక్తహీనతను పోగొడుతుంది. వంటికి నీరు పట్టినప్పుడు ఇది ఆ నీటిని లాగేసి ఉబ్బుని తగ్గిస్తుంది. మందులు ఎక్కువగా మింగుతున్న వారిమీద కలిగే చెడు ప్రభావాలను తగ్గిస్తుంది. మెదడు పనితీరుని నియంత్రిస్తుంది. తోటకూర లాగానే దీన్ని వండుకుంటారు. లేదా ఎండించి టీ కాచుకుని రోజూ తాగవచ్చు.
దోసాకుల పప్పు:
దోసకాయలతో పప్పు, కూర, పులుసు, పచ్చడి, బజ్జీ పచ్చడి ఇలా రకరకాల వంటకాలు మనకు బాగానే అలవాటు. కానీ బెంగాలీయులకి దోసాకులతో పప్పుచేసుకోవటం ఎక్కువ ఇష్టం. మలమూత్రాలు రెండింటినీ ఫ్రీగా అయ్యేలా చెయ్యటంలో దోసకాయలకన్నా వీటికి ఎక్కువ శక్తి ఉంది. రసం తీసి చారుపొడి వేసి చారు కాచుకోవచ్చు. ఇవేమీ కాదనుకుంటే ఎండించి టీ కాచుకుని రోజూ తాగవచ్చు. వయోవృద్ధులు కాల విరేచనం అయ్యేందుకు దీన్ని వాడుకోవటం మంచిది.
గంగపావిలాకు పులుసుకూర:
కోస్తా ప్రాంతంలో గంగబాయిలమ్మ ఆకు అనీ, కొన్ని ప్రాంతాల్లో గోళీ కూర అనీ, సన్నపావిలాకు అనీ, పావిలాకు అనీ పిలుస్తారు దీన్ని. పర్షియన్ భాషలో కుర్ఫా అంటారు. అమీబియాసిస్ వ్యాధిని జయించే రుచికరమైన ఔషధం ఇది. తోటకూర మాదిరే పప్పు, పులుసు కూర, పచ్చడి వగైరా వండుకుంటారు. మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించే ద్రవ్యాలలో కొండపిండి ఆకు, పావిలాకు ముఖ్యమైనవి. రక్తదోషాలను పోగొడుతుంది. షుగరు వ్యాధి, స్థూలకాయం తగ్గించటానికి ఇది బాగా ఉపయోగపడ్తుంది. పొడి కూరగా కూడా వండుకుంటారు. చాలా రుచికరంగా ఉంటుంది. మూడు దోషాలనూ పోగొట్టి, శరీరానికి సమస్థితిని తెస్తుంది. మామూలుగా మనం తినే ఆకు కూరలైన తోటకూర, పాలకూరలకన్నా ఇది శక్తివంతమైనది. తక్కువ మోతాదులోనే ఎక్కువ శక్తిని ప్రదర్శిస్తుంది. ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన ప్రకృతి వరాలనీ, ప్రకృతి వనరుల్నీ మనం ఎంచుకోవటంలోనూ, వండుకోవటంలోనూ నేర్పరితనం కావాలి. మేలుచేసే ఓషధులు కళ్లముందే ఉన్నా వదిలేసి, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆస్తులు కరిగించుకోవటంలో విజ్ఞత ఉండదు.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com