S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇల్లు కట్టి చూడు..

ఈ మధ్యన మా వీధిలో మా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక ఇంటిని స్వంతదారులు అమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరే కనిపించేవారు. బహుశా పిల్లలు విదేశాలలో ఉండే ఉంటారు. నా పిల్లలలాగే. నాకు ఇంకా ఆ పరిస్థితి రాలేదు కానీ ఈ దంపతులు ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయినట్టు ఉన్నారు. మా వీధిలో ఉన్న ఇళ్లు చాలా మటుకు ఒకటి కన్నా ఎక్కువ అంతస్తులు గలవి. ఈ ఇల్లు మాత్రం ఒకే అంతస్తు ఉండేది. వెనుక ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ముందు మరే లో చాలా పెద్ద చెట్టు ఉండేది. చూస్తుండగా ఆ చెట్లను నరికి పడేయడం కనిపించింది. కొత్తగా ఇల్లు కొన్నవారు, ఉన్న నిర్మాణాన్ని పడగొట్టి మళ్లీ కట్టుకుంటారు అని అర్థం అయింది. అందుకని చెట్లు నరకవలసిన అవసరం ఉందా అనే అనుమానం వచ్చింది కానీ, అసలు తతంగం చూసిన తరువాత విషయం అర్థమైంది. కొంతకాలం ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. చెట్లు పడగొట్టిన అప్పుడు గోడ, కొంత పాడయింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అంటే దాన్ని పడగొడతారు అని అర్థం. ఒకనాడు ఇద్దరు ముగ్గురు పనివాళ్లు చేరి సుత్తెలు తీసుకుని మెట్ల గదిని పడగొట్టడం మొదలుపెట్టారు. ఒక రెండు మూడు గంటలైనా వాళ్లు కొంత మాత్రమే పడగొట్టగలిగినరు. మొత్తం ఇల్లు పడగొట్టేసరికి సుత్తిదెబ్బలు నా నెత్తి మీద పడ్డట్టు ఉంటుంది అని అనుమాన పడుతున్నాను. వాళ్లు పని మానుకుని మధ్యాహ్నమే వెళ్లిపోయారు. మరునాడు ఉదయం ఒక రణగొణ ధ్వని వినిపించింది. ఇది రణము యొక్క గుణము గల ధ్వని, కనుక రణగుణ ధ్వని అయి ఉంటుంది అని నా అనుమానం. అటువైపు వెళ్లను, కొమ్మ దూకను. బయటకు వెళ్లి చూస్తే, అంటే నా ఐదవ అంతస్తు బాల్కనీలో నుంచి చూస్తే, ఒక భారీ యంత్రం కనిపించింది. దానికి ఒక ఎద్దుల లాంటి పెద్ద తల ఉంది. ఆ తలలో నాలుగు గడ్డపారలు కలిపినంత లావు గడ్డపార ముక్కు ఉంది. అది ఆవేశంగా అటు ఇటు కదులుతున్నది. ప్రాణమున్నట్టు కనిపించింది. దానికి పేరు ఏమైనా ఉందేమో తెలియదు. బుల్ డోజర్ అనే మాట విన్నాను కానీ, ఇది దాని తాతలాగా ఉన్నది. ఉదయం తొమ్మిది ప్రాంతంలో వచ్చిన ఆ యంత్రం ఆరు గంటలకల్లా మొత్తం ఇంటిని నేలమట్టం చేసింది. కోటలు మింగే వానికి తలుపులు అప్పడాలు అన్నట్టు, కాంక్రీట్ స్తంభాలను ముక్కుతో పొడిచి పడగొట్టగల ఆ యంత్రానికి మామూలు గోడలు, ఏమనాలో తెలియడం లేదు, అసలు అడ్డమే రాలేదు. అటువంటిదే మరొక యంత్రం వచ్చి ఆ మట్టిని లారీలకు ఎత్తింది. మరునాటి సాయంత్రం లోపల అసలు అక్కడ ఇల్లు ఉండేదా అని అనుమానం వచ్చే రకంగా శుభ్రమైన ప్లాట్ మిగిలింది.
ఇక తరువాతనయినా విషయం మామూలుగా జరగకపోతుందా అని నేను ప్రతి నిత్యం, బాల్కనీలోకి పని లేకుండా వెళ్లి గంట గంటకు ఆ ఇంటి వైపు చూడడం అలవాటు అయింది. వ్యాసం రాయడానికి ముందు కూడా అక్కడికి వెళ్లి చూసి వచ్చాను. ఎండల పేరున ఇన్ని రోజులు పని మానేసిన వారు, ఇవాళ కాంక్రీట్ స్తంభాలు వేయడానికి చువ్వలను ఏర్పాటు చేస్తున్నారు. ఈలోగా జరిగిన తతంగం గురించి చెప్పకపోతే, మీకు అంత ఇల్లు కట్టడం గురించి ఏం తెలుస్తుంది? నేను ఇక్కడ ఎంతో నేర్చుకుంటున్నాను అన్న సంగతి ఏం అర్థం అవుతుంది?
వెనకట ఇల్లు కట్టాలంటే గదులు గోడలు ఉండే ప్రకారం పునాదులు తోడేవారు. వీటిని హిందీ, ఉర్దూ భాషలలో బునియాద్‌లు అంటారు. పునాదులు బదులు మా దగ్గర తెలుగు వాళ్లు కూడా బునాదులు అంటారు. వీలయితే నా మీద ఒక యావత్తు కూడా కలుపుతారు. బహుశా ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయి ఉంటుంది. అసలు ఎవరూ పునాదులు వేయడం లేదు అని నాకు ఈ ఎదురింటి వలన అర్థం అయింది. మట్టిని తోడి లారీలకు ఎక్కించిన మధ్యరకం యంత్రం మళ్లీ వచ్చింది. అది నేలలో అటు ఆరు ఇటు ఆరు అడుగుల గుంటలు తోడింది. చెబితే నమ్మరు, ఒకరోజులో ఎనిమిది గుంటలు తోడింది. మామూలుగా గడ్డపారలు పుచ్చుకుని తవ్వుతూ ఉంటే మిగతా వాళ్లు ఆ మట్టిని తరలిస్తారు. ఆ పద్ధతిలో అయితే ఈ గుంటల వ్యవహారం ఎన్ని రోజులు సాగేదో ఆలోచించాను. కాలం మారిపోయింది. ఇల్లు కట్టే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కట్టినప్పుడు కూడా లే పద్ధతులు అమలులోకి వచ్చాయి. గుంటలలో ఒక కాంక్రీట్ పొర వేసి నేలకన్నా కొంచెం పై ఎత్తు వరకు స్తంభాలు వేశారు. గుంతలు పూడ్చేశారు. అసలు ఆశ్చర్యం మొదలైంది. పునాదులు లేవు. పునాదుల స్థానంలో కేవలం అడుగు లోతు మాత్రం తవ్వారు. అందులో కంకర పరిచారు. ఆ మీద నుంచి సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమం పోశారు. దిమ్మిస వేశారు. ఒకరోజు వదిలేశారు. ఇంత కొంచెం పునాదులు భవనాన్ని నిలబెడతాయా అనిపించింది. అప్పుడు అసలు నాటకం మొదలైంది. సాధారణంగా మిద్దె ఎత్తులో వేసే కాంక్రీటు దూలాల వంటివి నేల ఎత్తులో వేశారు. ఇది నాకు తెలిసిన సంగతి కాదు. ఈ మధ్యన అన్ని నిర్మాణాలు ఇట్లాగే జరుగుతున్నాయట. ఒకటి కన్నా ఎక్కువ అంతస్తులు ఉండే భవనం గట్టిగా నిలబడాలంటే మరి ఇటువంటి ఆధారం ఉండడం చాలా బాగుంటుంది. ఈ రకమైన కొత్త పద్ధతి పునాదులు, దూలాల రూపంలో ముగిసిన తరువాత వాటి ఎత్తు వరకు నింపారు. అందులో చేతనయినంత నీళ్లు కట్టారు. గడ్డపారలతో రంధ్రాలు వేసి నీళ్లు కట్టారు. అంటే మట్టి చేతనైనంతగా కాంపాక్ట్ అయ్యింది అని అర్థం. ఆ మీద మళ్లీ కంకర పరిచి సిమెంటు ఇసుక మిశ్రమం కూడా పరిచి, ఒక చక్కని ఫ్లోర్ తయారుచేశారు. ఇప్పుడు గాని స్తంభాల పని మొదలుపెట్టలేదు. ఇంత తతంగం జరగడానికి పాతకాలపు పద్ధతులు అయితే చాలాకాలం పట్టింది. ఇక్కడ చూస్తుండగానే పనులు జరిగిపోతున్నాయి. అన్నిటిలోను యంత్రాల ప్రమేయం ఉంటున్నది.
అన్నిటికన్నా ఆశ్చర్యం ఆ ఇంట్లో వేసిన బోరు సంగతి. నిజానికి ఈశాన్యం మూలలో ఒక నీటి సంపు ఉన్నట్టు కనిపించింది. కానీ ఒకరోజు పొద్దునే్న బోరు యంత్రం వచ్చింది. ఇక ఇవాళ ప్రశాంతత ఉండదు, చదువు రాత సాగవు. రాత్రి కూడా బహుశా నిద్ర ఉండదు అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఆనాటి సాయంత్రం ఎక్కడికో వెళ్లవలసి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా రాత్రి అయింది. సాయంత్రం వెళ్లేటప్పుడు బోరు యంత్రం ఇంకా పని చేస్తూనే ఉన్నది. అందులో నుంచి పెద్ద ఎత్తున నీళ్లు చిమ్మిన జాడ కనిపించలేదు. బహుశా వీళ్ల బోర్ ఫెయిల్ అయింది అనుకున్నాను నేను. రాత్రి వచ్చేసరికి బోర్ యంత్రం లేదు. పాపం నీళ్లు పడలేదు అనుకున్నాను. మనసులో నాకు కొంత బాధ కలిగింది. ఎవరికి అపజయం కలిగినా నాకు నచ్చదు. అందరూ బాగుండాలి. అంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్లకు నీళ్లు లేకుండా ఎట్లా సాగుతుంది? నా మంచితనం నాది.
నిజానికి ఇల్లు కట్టడం మొదలైన తరువాత నాకు ఒక రహస్యం తెలిసింది. ఒకనాడు ఒక పెద్ద మనిషి వచ్చి ఒక పొడుగాటి తాటికి బరువు కట్టి, ఆ బోరులోకి వదులుతున్నాడు. అంటే దాని లోతును, అందులో నీళ్లు ఉన్న లోతును పరీక్షిస్తున్నాడు అని అర్థం. అతని పరీక్ష ముగిసింది. ఆ సాయంత్రానికి మరో నలుగురైదుగురు వచ్చారు. సరంజామా ఏదో తెచ్చారు. బావిలో సబ్మెర్సిబుల్ రకం పంపు బిగించారు. గొట్టంలోంచి ఆశ్చర్యంగా అంత దూరం నీళ్లు చిమ్ముతున్నాయి. మామూలుగా అయితే బోరు బావిలో నీళ్లు పడితే వీధి వీధంతా బురద అయ్యేది. మరి ఇక్కడ అట్లా బురద కాకుండానే, బావిలో నీళ్లు ఎట్లాగ పడినయి అన్నది నాకు ఇవాళటి వరకూ అర్థం కాలేదు. ఇన్ని రోజులుగా ఆ బోర్‌ల నుంచే పనివాళ్లు నీటిని పుష్కలంగా వాడుకుంటున్నారు. నాకు ఏదో సంతృప్తిగా ఉంది. ఆ ఇంటి వాళ్లు నీళ్లు లేక బాధ పడరు అన్న భరోసా కలిగింది. పాలమూరులో నీళ్ల కరువుతో చాలా కష్టపడ్డాము. పద్మారావు నగర్‌లో కూడా నీళ్లు కొంతవరకు కరువే అనవచ్చు. ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చిన తరువాత నీళ్ల సమస్య మాత్రం లేదు.
మాకు నిజానికి ఒకటి రెండు ప్లాట్లు ఎక్కడో ఉన్నట్లున్నాయి. వాటిలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక మాత్రం అంత బలంగా లేదు. నాకు అసలే లేదు. ప్లాట్ లేకుండా, నేల మీద ఇల్లు కట్టుకుని, కావలసినన్ని మొక్కలు పెంచుకుని, వీలైతే ఒక బర్రెను కూడా పెట్టుకుని పల్లెటూరి పద్ధతిలో బతకాలని నాకు ఉంటుంది. అయితే నా కోరికలు తీరడానికి, అసలు అవి తీరాలని నేను అనుకునేందుకు వీలు లేదు. మోక్షం గురించి చెప్పుతూ, స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్త జ్ఞానం ఉండాలి అంటుంది శాస్త్రం. నాకు అది జీవితంలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది అనిపిస్తుంది. నా గురించి నాకు తెలుసు. నాకు గల ప్రాపకం గురించి తెలుసు. వాటికి తగినంత కన్నా ఎక్కువే నాకు దొరికింది అని కూడా తెలుసు. ఇక నేను ఒక సొంత ఇల్లు కావాలి, అని కోరిక పెట్టుకోగల స్థితిలో లేను అన్న సంగతి కూడా తెలుసు. కానీ రకరకాల ఇళ్లు కట్టగా చూచి, ఇల్లు కట్టడంలో చేయకూడని పనులు నాకు చాలా తెలుసు అనిపిస్తుంది. ఇప్పుడు గానీ నా చేత ఎవరైనా ఇల్లు కట్టే ధైర్యం చేయిస్తే, లేదా వారి ఇల్లు కట్టే బాధ్యత నాకు అప్పగిస్తే, మంచి ఇల్లు కట్టగలను అని నా మీద నాకు నమ్మకం ఉంది. చిన్న ఉదాహరణ చెబుతాను. చిన్న బెడ్‌రూమ్ తలుపు బాల్కనీలోకి తెరుచుకొంటుంది. వర్షం వస్తే బాల్కనీలోకి బలంగా నీళ్లు వస్తాయి. బెడ్‌రూమ్ తలుపు లోపలికి తెరచుకునే విధంగా బిగించారు కనుక, వాన నీళ్లు నేరుగా గదిలోకి వెళ్లిపోతాయి. అదే తలుపు బాల్కనీలోకి తెరుచుకునేటట్లు బిగిచి ఉంటే, వాన నీరు లోపలికి వచ్చే వీలు ఉండేది కాదు. ఈ సంగతి కాంట్రాక్టర్‌కు తోచలేదు. అప్పట్లో నాకు కూడా తోచలేదు. ఇప్పుడు ఆ సంగతి అర్థం అయింది. బాత్రూం విషయంలో కూడా మేము కొన్ని పొరపాట్లు చేశాము. ఇంజనీరింగ్ వాళ్లు దానికి ఏదో ఒక కిటుకు చెప్తారు కానీ, బాత్రూం మిగతా గదిలో నేల కన్నా ఎత్తుగా ఉండటం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. పాతకాలం పద్ధతి కమోడ్‌లు బిగించడానికి గది కన్నా స్నానాల గదిలో నేల ఎత్తుగా ఉండటం అవసరం. కానీ ఈ కాలంలో అటువంటి అవసరం లేని కొత్త కొత్త నమూనాలలో కమోడ్‌లు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకుంటే ఇల్లంతా ఒకే ఎత్తులో నేల ఉండవచ్చు. పాలరాతి నేలను నీళ్లు పెట్టి కడిగే పద్ధతి ఉండదు. కనుక బాత్‌రూమ్ ఎత్తు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. అమ్మ 86 సంవత్సరాల వయసులో పోయే ముందు ఒక సంవత్సరంపాటు నా దగ్గర ఉన్నది. ఆ సమయంలో ఆమె స్నానాల గదిలోకి వెళ్లాలంటే, ఆ కొంచెం ఎత్తు కూడా ఎక్కలేక పడిన కష్టాలు నాకు కళ్లల్లో కనిపిస్తాయి. ఇటువంటి సంగతులు ఇల్లు కట్టేటప్పుడు సాధారణంగా ఎవరూ ఆలోచించరు. కట్టిన తరువాత దాన్ని మార్చడం అసలు వీలు కాని పరిస్థితులు ఉంటాయి.

-కె.బి.గోపాలం