S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వినా దైనే్యన జీవితం’

అదో కుగ్రామం. అందులో వృద్ధ దంపతులు. వారికొక్కడే కొడుకు. నిద్రాహారాలు మాని, వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలనే యావ కొద్దీ, కడుపు కట్టుకుని, బాగా ఉన్నత చదువులు చదివించారు. యుక్త వయస్సు వచ్చింది. ఉద్యోగమొచ్చింది. కానీ తల్లిదండ్రుల శరీరాలు చిక్కి శల్యమయ్యాయి. బొమికలు కాస్తా గూడుగా మారాయి. ప్రయోజకుడైన కొడుకు ఈ ఇద్దరినీ వదిలేసి ఎక్కడో పరాయి దేశం వెళ్లిపోయాడు. ఇంట్లో వృద్ధ దంపతుల్ని పలుకరించే వాళ్లు లేరు. ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
మొదటి నుండీ ఆ ఇద్దరికీ ఓ కోరికుండేది. కష్టపడి పెంచి పెద్ద చేశాం. చక్కగా మనం చెప్పినట్లే విని బుద్ధిగా చదువుకున్నాడు కదా! మన వృద్ధాప్యంలో వాడు అండగా వుండి, బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకోలేక పోతాడా? అని వారిద్దరి విశ్వాసం. అంతేనా? అబ్బాయి అలా అటూ ఇటూ కొత్త కొత్త కార్లలో తిరుగుతూంటే ఎంత ముచ్చటగా ఉంటుందో? అని ఎన్నో కలలు కన్నారు. నెల నెలా కొడుకు దగ్గర నుంచి మనియార్డర్ అందుతోంది కానీ, వీరి మర్యాద మాత్రం తీరటంలేదు. ‘ఒరేయ్ నాన్నా! ఈ డబ్బు మాకెందుకురా? నీ కంటే ఎక్కువా డబ్బు? నువ్వు కావాలి. నీతో కలిసి ఆనందంగా గడపాలి. వచ్చి మమ్మల్ని ఎప్పుడు ఆ దేశం తీసుకెళ్తావు? ఇలా ఒంటరిగా ఎన్నాళ్లుంటాం? కాస్త తిరిగే ఓపికున్నప్పుడే, మీ నాన్నగారినీ, నన్నూ తీసుకెళ్లరాదా?’ అంటూ సుదీర్ఘమైన ఉత్తరం రాశారా వృద్ధులైన తల్లిదండ్రులు.
సంసార బాధ్యత నిర్వహించటం, పిల్లల్ని కని పెంచటం ఒకదాని వెంట మరొకటి వరుసగా జరిగే ప్రక్రియల పరంపర. అదేదో ఊళ్లో వారికి ఉపకారం చేసినట్లు కాదు. నెత్తిమీద కూర్చుండే ఓ కుదురైన బాధ్యత. అంతే - ప్రశ్నిస్తే జవాబులేమీ రావు. పిల్లల్ని కనగలం. కానీ వారి రాతల్ని కాదు.
ఈ వృద్ధ దంపతులు రాసిన దానికి తిరుగు టపాలో సమాధానం మాత్రం వచ్చింది.
‘ఇక్కడ నేనుండేది మహానగరం. అక్కడ మీరుండేది కుగ్రామం. పెద్ద ఉద్యోగం కదా! బాధ్యత ఎక్కువ. నేను అక్కడికి రావటం కుదరదు. పైగా తీరిక లేదు. మీరు ఇక్కడకు రావటానికి ప్రయత్నించకండి. ఇక్కడ భాష వేరు. మనుషులు వేరు. మీరిక్కడ ఇమడలేరు. మీరు మీ అలవాట్లు మార్చుకోలేరు. మీ వేష భాషలు చూడగానే ఇక్కడ నా మిత్రులు విసుక్కుంటారు. మీరు నాతో వుంటే వచ్చిన ప్రతివారికీ మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా పరిచయం చేయాలి. అది నాకు చాలా చికాకు. మీ అవసరాలకు అప్పుడప్పుడు డబ్బు పంపుతూంటాను.’
-ఇదీ ఆ సుపుత్రుని ఉత్తరంలోని సారాంశం. ఇప్పుడు చెప్పండి. అడిగి సుఖమెవరైనా సుఖం అనుభవించారా ఈ లోకంలో? వృద్ధ దంపతుల దుఃఖానికి అంతు లేదు. సృష్టి కథలో మనమంతా ఒక భాగం. మనం నిర్వర్తించవలసిన బాధ్యతను ‘పని’ అనుకుంటున్నాం. లోకోపకార మనుకుంటున్నాం. చేయటం వరకే మన పని. ఫలితం మాత్రం కోరుకోకూడదని మనకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు జన్మించిన ‘త్యాగయ్య’ అన్నాడు. ‘అడిగి సుఖమెవరనుభవించారని.’
త్యాగయ్య పాడుకొన్న వేలాది కీర్తనలలో ఇదోటి. సంగీత కచేరీలలో గాయక విద్వాంసులు వారికున్న జ్ఞాన పరిధిలో పాడేస్తూంటారు. అర్థం తెలిసి పాడినా తెలియకపోయినా వినేవారికే ఇబ్బందీ లేదు. మనం గమనించలేం. అర్థం తెలిసి పాడే పాటకూ తెలియకపోయినా పాడే పాటకూ వ్యత్యాసమంటూ లేకపోయినా సంగీతపరంగా మాటలు అర్థం తెలిసి పాడితే, ఎంతో రక్తిగా వినిపిస్తాయి. రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్‌లో కొనే్నళ్లు మా తండ్రిగారు మల్లాది శ్రీరామమూర్తి గారు (1950-55) పని చేశారు. అదే సమయంలో ‘హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వర్రావు కూడా పని చేశారు. సంగీతజ్ఞుల సహవాసంతో, కామేశ్వర్రావుగారికి సంగీతాసక్తి ఏర్పడింది. త్యాగరాజు ఆత్మ విచారం’ అనే గ్రంథమొకటి రాశారు. పి.వి.రాజమన్నారు ఆ గ్రంథానికి పీఠిక రాశారు. త్యాగరాజ కీర్తనలలోని భావార్థాన్ని క్లుప్తంగా చక్కగా వ్రాసి వ్యాఖ్యానించారు కామేశ్వర్రావుగారు. ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధమైంది కూడా. రామాయణార్థంలో ముడిపడ్డ కొన్ని త్యాగరాజ కీర్తనలకు కామేశ్వర్రావుగారి వివరణ.. చెప్పాలంటే ‘రోడ్డు మీద ఆత్మీయంగా పలకరించుకునే మిత్రులిద్దరు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది.’ మంచి స్నేహితులవటం వల్ల, వారిద్దరూ తరచుగా ఈ కీర్తనలను విశే్లషించుకుంటూండేవారు. త్యాగరాజ కీర్తనల్లో కొన్ని టీకా తాత్పర్యంతో వుంటే గానీ అర్థంకాని కీర్తనలు లేకపోలేదు. మంగళప్రదమైన ‘మధ్యమావతి’ రాగంలో ప్రసిద్ధమైన కీర్తన ఇది.
ఈ వేళ ఫలితాన్ని ఆశించకుండా పని చేసేవారెవరు? పైగా ఈ కలియుగంలోనా? అసంభవం. అసాధ్యం కూడా. కానీ ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్లమంటాడు గీతాకారుడు. అందుకే ఫలితమాశిస్తే మిగిలేది పరాభవాలే.. అంటూ త్యాగయ్య పాడుకున్న ఈ కీర్తన విద్వాంసుల గళాల్లో అరుదుగా వినిపించేదే.
పల్లవి: అడిగి సుఖములెవ్వ - రనుభవించిరిరా
ఆదిమూలమా రామా!
అనుపల్లవి: సడలని పాపతి మిరకోటి సూర్య
సార్వభౌమా! సారసాక్ష! సద్గుణ ని ॥
చరణం: 1.ఆశ్రయించి వరమడిగిన సీత - అడవికి పోనాయె
ఆశహరణ! రక్కసి ఇష్టపడగ. అపుడె ముక్కుపోయె, ని
2.వాసిగ నారదవౌని వరమడుగ - వనిత రూపుడాయె
ఆశించి దుర్వాసులు అన్నమడుగ - అపుడె మందమాయె ఓ రామ! ని॥
3.సుతుని వేడుక చూడ దేవకి అడుగయ - శోద చూడనాయె
సతులెల్ల రతి భిక్షమడుగ వారివారి - పతుల వీడనాయె, ఓ రామ ని ॥
4.నీకే దయబుట్టి బ్రోతువో బ్రోవవో, నీ గుట్టు బయలాయె
సాకేతధామ! శ్రీత్యాగరాజ నుత! స్వామి! ఏటి మాయ ఓ రామ ని ॥
సాధారణంగా పల్లవి, అనుపల్లవి, ముద్రాచరణం పాడి త్యాగరాజ కీర్తన ముగించటం వల్లనో, సమయాభావం వల్లనో మధ్యలో వున్న చరణాలు వినబడవు.
లోకంలో అన్నింటికీ మూలాధారుడవు నీవే. సర్వ పాపాలనూ పోగొట్టే కోటిసూర్యుల కాంతినిచ్చే వాడవే అయినా, నిన్నడిగి ఎవరు సుఖపడ్డారు? చెప్పమంటావా?
1.కుశలవులు గర్భంతో వున్నప్పుడు తల్లి సీతమ్మకు మళ్లీ అడవుల్లోకి వెళ్లి, అక్కడి అందచందాలు చూస్తూ, ముని పత్నులతో గడపాలనే కోరిక పుట్టింది. ఆవిడ కోరికైతే తీరింది కానీ, మళ్లీ ఆవిడ నీ దగ్గరకు రాగలిగిందా? ప్రారబ్దం కాకపోతే రాక్షస స్ర్తి శూర్పణఖకు నిన్ను చూసి మోహించాలనే బుద్ధెలా పుట్టింది? ఏమైంది? ముక్కూ చెవులూ కాస్తా పోగొట్టుకుంది - అడిగి అవమానం పొందలా?
2.నీ మాయా విలాసం చూడాలనే కోరికతో వరాన్ని పొందిన నారదుడికి స్ర్తిరూపం కలిగింది. మహా కోపిష్టి దూర్వాసుడు పాండవులను ఏడిపించాలనే నెపంతో ధర్మరాజింట్లో భోజనానికి దిగాడు. ఏమైంది? వచ్చిన పరివారానికి ఆకలి లేకుండా చేశావు కదా?
3.నిన్ను కొడుకుగా పొందాలనుకున్న దేవకీ దేవికి ఆ వేడుకకు నోచుకోలేక పోయింది. ఆ అదృష్టాన్ని యశోద పొందింది.
గోపికా స్ర్తిలు నీతో పొందును కోరి నానా బాధలూ పడ్డారు. తమ భర్తలకూ పిల్లలకూ దూరమై గడపవలసి వచ్చింది. ఎందుకొచ్చిన తంటా? మా అందరి కోరికలు తీర్చే వాడవని అలా మనసులో అనుకుంటూ మురిసిపోవాలే గానీ, పైకి అడిగామా? కొంప మునిగినట్లే. పైగా స్వామీ! మాకేం కావాలో నీకు తెలియదా? నీకే దయ రాదా? ఎప్పటికైనా రక్షించాలనే బుద్ధి నీకు పుట్టదా? అంతవరకూ నేను ఓపిక పట్తే చాలు. ధన్యుణ్ణే’ అంటాడు త్యాగయ్య.
(శివుడు భోళాశంకరుడు. అడగ్గానే అభయమిచ్చేస్తాడు. విష్ణు భక్తులకు బాధలెక్కువంటారు. రామభక్తులే మనకు సాక్ష్యం.) పుటం వేస్తేనే బంగారానికి విలువ. పరీక్షలకు తట్టుకుంటేనే భక్తికి విలువ. మహనీయులు, గురుమూర్తులు తోటమాలి లాంటి వారు. సాధకులు, భక్తులు ఆ తోటలోని మొక్కల్లాంటి వారు. తోటమాలి తోటలోని మొక్కలకూ చెట్లకూ అవసరమైన నీరందిస్తూంటాడు. అతడి బాధ్యతది. ఎదిగి, పూలు పూసి, కాయలై, పండ్ల నివ్వవలసిన బాధ్యత మాత్రం ఆ మొక్కలూ చెట్లదే. కొన్ని మొక్కలు తొందరగా ఎదుగుతాయి. మరి కొన్ని మందకొడితనాన్ని ప్రదర్శిస్తే, వదలగొట్టడానికి తోటమాలి ప్రయత్నం చేస్తాడు. మానవ సృష్టి చేసిన దైవం కూడా అంతే. మనిషి తనకు తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినంత కాలం ఏ ఇబ్బందీ ఉండదు. ఆ ప్రయత్నంలో అతని మనస్సు, ఇంద్రియాలు, అతనికి మిత్రులు. ఏమరుపాటుగా వుంటే అవే, అతనికి బద్ధ శత్రువులు.
పురిటి నెప్పులు తప్పవని తెలిసినా ఏ మాతృమూర్తికైనా పిల్లల్ని కనాలనే ఉంటుంది. అంతవరకే వారి బాధ్యత. వాళ్ల వల్ల ఉద్ధరింపబడతామనే అత్యాశ వద్దంటారు, విజ్ఞులు.
ఎవరిని వారు ఉద్ధరించుకునే ప్రయత్నమే శరణ్యం. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదు. పైగా ఇది కలియుగం. ‘కలి’ అంటేనే విభేదం. పక్కవాణ్ణే పలకరించి మాట్లాడుకోరు. మనుషుల మధ్య భేదభావాలు పొడసూపుతూంటాయి. ఎప్పుడు విడిపోదామా అనే ప్రతి మనిషి ఆలోచిస్తూంటాడు. మొండిగోడలే కానీ మనుష్యుల మధ్య వారధులుండవు. తల్లిదండ్రులు బిడ్డలతోనూ, పాలకులు ప్రజలతోనూ చేయవలసినది మైత్రి మాత్రమే. అదే రక్ష.

- మల్లాది సూరిబాబు 90527 65490