S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘బఫే డిన్నర్’ లాంటిది ‘వీక్లీ’

నాటి పాఠకుడు మృష్టాన్న ప్రియుడు!
1962 సెప్టెంబర్ ఏడు వీక్లీ సంచిక ‘హమేషా తమాషా’ శీర్షికలోని ఒక జోకు: ఇది నాకు ఇష్టం... ఇక వీక్లీని ప్రేమించడం మొదలుపెట్టాను...
ప్రశ్న: లట్టూ! ఒరేయ్! ఇది చెప్పరా?! మీ అమ్మ మాట మీ నాన్న వింటాడా? లేక మీ నాన్న మాట మీ అమ్మ వింటుందా?
జవాబు: ఇద్దరి మాటా వీధిలో వాళ్లు వింటారు!...
రామచంద్రాపురం నుంచి ఐ.పి.పి.లీల అనే పఠిత పంపిన జోకు (వాస్తవం) ఇది.
ఆ రోజు నా దగ్గరికి వచ్చిన కార్టూనిస్ట్‌కి చెప్పాను. ఈ జోక్ మీద ఓ ‘సిరీస్ ఆఫ్ కార్టూన్లు’ వేయొచ్చునోయ్’ అన్నాను.
కొంటె కోణంలోంచి చూస్తే ఈ జీవితం ఒక హమేషా - తమాషా.. యస్.ఆర్.గారు అంటే మా ఆఫీసులో బాస్ రాధాకృష్ణగారు. ఆయనకీ ఈ శీర్షిక ఇష్టం. మేం ఇద్దరం కూర్చొని మా ప్రయివేటు ‘చిక్కులు’ (ప్రాబ్లమ్స్) మరిచిపోయేటందుకు కొన్ని తమాషాలు రాసేవాళ్లం. వాటిలో ఈ క్రిందిది ఒకటి.
కథా పరిభాషాకోశం: నగ్న సత్యం అందరికీ కనపడేది; విషాద గాథ: విసుగు పుట్టించే కథ; రోదించింది: ఏడిచింది; ఆరాధన: పిచ్చి; హృదయంలో స్థానం: వైద్య శాస్తవ్రేత్తలు ఇంకా కనిపెట్టని రహస్యం; కళాపిపాసి: సినిమా పోస్టర్లు చూచేవాడు; విచలిత: చలి బాగా వీస్తున్నప్పుడు కప్పుకోలేని స్థితిలో వున్న వనిత. (ఇది మా నిఘంటు పరిశోధన) అంటూ సరదాగా ఇలా రాసేవాళ్లం. డైలీలో వున్న పెద్దలు హారిత శివశర్మ (సాంబశివరావు) కౌండిన్య (పి.ఎస్.ప్రకాశరావు), విశాల నేత్రాలు (గణపతిశాస్ర్తీ) పేజీలు నింపడం అన్న సమస్యని చాలా పరిష్కరించారు. 1.హరివంశం 2.హైదరాబాద్ లేఖ 3.విశాల నేత్రాలు (కాశ్మీర్ జానపదాలు) ఈ కార్టూనిస్టులంతా గణపతి బప్పా అంటే బొజ్జయ్య మీద జోకు బొమ్మలు మొదలెట్టారు. అన్యాపదేశంగా విఘ్నపతిని అడ్డం పెట్టుకుని లోకం పోకడని వేళాకోళం చేయాలి అన్న మా అదర్శం కొంచెం దెబ్బతింది. అయితే దీన్ని సవరించాం అనుకోండి ఆనక. ఎంతైనా హిందువులు విశాల హృదయం గలవాళ్లు కదా!
ఆంధ్రపత్రిక వీక్లీకి ప్రకటనల తాకిడి చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని యాడ్స్ తిరస్కరించే స్థితికి చేరుకున్నాం. ఎందుకంటే మొత్తం ఇరవై నాలుగు పుటలలో ముప్పావు సంచిక కన్నా పత్రికలు ఎక్కువ ‘కారాదు’ అన్న ఆంక్ష ఉండేది. 28 పేజీల దాకా ఎలాగో ఎక్కించేసే వాళ్లం. పేజీలలో ప్రకటనల మీద ‘గ్యాప్’ వస్తే అక్కడ గొప్పగా ‘తెలుగు పత్రికలన్నింటిలో ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక సర్క్యులేషన్ అధికమైనది’ అని ఒక ‘స్ట్రిప్’ పెట్టేవాణ్ణి. అది నాకు గొప్ప! కాని అప్పుడే నా కర్మకాలి న్యూస్‌ప్రింట్‌కి కొరత మొదలయింది.
మా యస్.ఆర్.గారు డైరెక్టర్ హోదాలో ‘న్యూస్‌ప్రింట్ కొరత’ మీద గమనికలు, విజ్ఞప్తులు రాసేస్తూ ఉండేవాడు.
‘మీరు చందాలు కట్టండి. లూజ్ సేల్స్‌కి చాలానన్ని ప్రతులు వెయ్యలేమేమో?’ అంటూ ఆర్తనాదాలు చేసేవాడు. కానీ, పాఠకులు వీక్లీ కోసం నిరీక్షించి కిళ్లీ కొట్లోనే కొనుక్కొనడానికి మొగ్గు చూపేవారు. కారణం పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారికే తెలుసు...
అన్నట్టు వినాయకచవితి హాస్య సంచికయే కాదు. దసరా సంచికను స్ర్తిల ప్రత్యేక సంచికగా వేసేవాళ్లం. ఆనాడే, ‘అరవైలలోనే’ రాజకీయాలలో స్ర్తిల పాత్ర మీద వ్యాస పోటీ ‘నగదు బహుమతులతో’ పెట్టాము. ఆడది అంటే వంటింటి కుందేలు.. చాకలి పద్దులు రాసుకోగలిగితే చాలు.. అంతకన్నా చదువులెందుకు? అన్న యుగం నుండి బయటపడుతున్న దశలో ‘మన వీక్లీ’ స్ర్తి వికాసానికి దోహదించింది. ఈ మాట చరిత్ర అంగీకరిస్తుంది - ‘మీ వీక్లీ మొత్తం ఆడాళ్లకేగా! మళ్లీ ప్రత్యేక సంచికలు వేయడం ఏమిటి? అని అనే వాళ్లు కొందరు.
కానీ పత్రిక స్థాపనకి సంబంధించి ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన చెయ్యాలనిపిస్తోంది. 1903లో అమృతాంజనం మందుల కంపెనీని స్థాపించారు. బోలెడు పైకం సంపాదించారు లేదా సేకరించారు. ఆంధ్రులకు మాత్రమే గాదు సకల జనుల తలనొప్పి నివారణ చేయడంతోపాటు, పంతులుగారు తెనుగు వాడి బుర్రలో ఆధునిక భావజాలాన్ని పెంచి పరిపోషించారు. ఆంధ్రపత్రిక స్థాపన ఒక చారిత్రక ఘట్టం.
డెబ్బై దశకంలో నేను డైలీ రిపోర్టర్‌గా ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ రామకృష్ణ నన్ను ఉడికించడానికి ‘అమృతాంజనమ్ముతో తలనొప్పి ఇచ్చి అంటూ మేలమాడేవాడు. దానికి సమాధానంగా మన తలనొప్పి తగ్గించటమే కాదు ‘నాటి’ జనాలకి బుర్ర, బుర్రలోని వికాసము కూడా ‘పత్రిక’యే ఇచ్చింది అనేవాణ్ణి. ఆది నుంచి అదో వీక్‌నెస్ పత్రికని ఎవరేనా అంటే ఉడుక్కునేవాణ్ని. అది మద్రాసులో వున్నప్పుడు.. అమృతాంజనముతో సంపాదించిన పెట్టుబడితో కాశీనాథుని వారు 1908 వినాయక చవితి నాడు ఆంధ్రపత్రిక (వారపత్రిక)ని బొంబాయి (అప్పటి పేరు)లో ప్రారంభించారు. ఇట్లా వినాయక చవితి సెంటిమెంట్‌కి ప్రేరణ తిలక్ మహాశయుడే. మొదటి సంచిక ‘ప్రస్తావన’లో నాగేశ్వరరావు పంతులుగారు ఇలా రాశారు.
‘ఆంధ్రోద్యమానికి అవసరమైన అనేకానేక ఉద్యమాల్ని, అన్ని రకాల వస్తువుల్ని (ఈ మాట గమనించండి) స్వతంత్రమయిన, విమర్శనాత్మకం అయిన రీతిలో చర్చించుటకై ఈ పత్రికని స్థాపిస్తున్నాను.’
‘న్యూయార్క్ టైమ్స్’ మకుటం మీద ‘ఎవ్విరిథింగ్ దట్స్’ ఫిట్ టూ ప్రింట్’ అన్న ‘మాటో’ వున్నట్లుగా ఆంధ్రపత్రిక కూడా అన్ని రకాల ఇజాలకి, నిజాలకి, గాలులకీ, దుమారాలకీ ‘ట్రెండ్స్’కీ, నెలవు అయింది.
అది జీర్ణావస్థకి చేరుకున్నప్పుడు కూడా పత్రిక అన్ని ఉద్యమాలకి అద్దం పట్టాలనుకుంటూనే ‘కాలభైరవునికి’ నీరాజనం అయిపోయింది!
పత్రిక ప్రచురణ యొక్క ఆ చివరి దశలో ఉండటమే నాకు ఈ ‘స్మృతిలయలు’ రాయడానికి అవకాశం ఇచ్చింది. అంతేనా? చాలినంత ‘దుఃఖభారాన్ని’ కూడా ఇచ్చింది. మిగతా ‘డైలీ స్థాపన’, భారతి, ఉగాది ఆంధ్ర పత్రికలు వగైరాల ప్రస్తావనలు సందర్భోచితంగా చేస్తాను.
మళ్లీ 1961 నాటి వీక్లీకి వద్దాం. నాకు (మాకు) ముందు ఇదే వీక్లీలో నండూరి రామమోహనరావు, ముళ్లపూడి వెంకటరమణ ‘బాపూ’ల ‘హవా’ జేగీయమానంగా సాగిందంటారు. వాళ్లు కథలకి ‘బాపు’ బొమ్మలు వేయించారు. ఆ బొమ్మలను పేజీలో ఎలా వెయ్యాలి? అన్న సూచనలతో సహా బాపూ అండ లభించడంతో - కథలు రాసే రచయితలు ఆంధ్రపత్రిక వైపు బాగా ఆకర్షితులైనారు. అది వరకు రచయిత పేరు కంపోజ్ చేసి టెక్నికల్‌గా చెప్పాలంటే రెండు బార్డర్ రూల్స్ మధ్య పెట్టేవారు. కాని యస్.ఆర్.గారి ప్రమేయం వచ్చినాక, బాపు, రామమోహనరావు గారి ‘ఉపజ్ఞ’ వల్ల రచయిత పేరు ‘హైలెట్’ అవుతూ వచ్చింది.
ఈ హేమాహేమీలు ఎక్కడ కూర్చునేవారో? అలాగే పోలవరపు శ్రీరాములుగారు, వి.డి.ప్రసాద్ గారు పెద్దలు వగైరా ఎక్కడ ఉపనిష్టులై కార్యకలాపాల్ని సాగించారో? నేను ఎరుగను. కానీ ఇట్లా మాలాగ ప్లాట్‌ఫామ్ మీద వెయిటింగ్ హాలు ‘ముంగిట’ కూర్చోవడం చేసే వాళ్లా? అన్నది ప్రశ్న-
‘బాపు’కి కథలు తీసుకుని వెళ్లడం, తేవడం రమణగారి వంతు. కానీ వాళ్లు నిష్క్రమించాక బాపు దగ్గర నుంచి బొమ్మలు కథలు రావడానికి గొప్ప సమయం పట్టేసేది.. జాప్యం కూడా జరిగేది.
నేను కొత్త ఆర్టిస్టులకి ‘బ్రేక్’ ఇవ్వాల్సిందే ననుకున్నాను. ‘బాపు’గారు ‘బోర్న్ జీనియస్’ అన్న మాట నిజమే. నాకు తెల్సు. నా కథ (నేను క్యాంపస్‌లో ఉన్నాను. అప్పుడు) ‘ప్లాట్‌ఫామ్’కి బాపు బొమ్మ వేస్తూ, ఓ డబుల్ ‘స్ప్రెడ్’ వేశాడు. ఆ రోజుల్లో ‘కలర్స్’ లేవు. కేవలం నాలుగు నుంచి ఎనిమిది పుటలలోనే ‘కట్‌కలర్’లు వేయగలం! అదంతా ఆనక చెబుతా. నా కథకి బాపుగారు ఓ సూచన చేశాడు (రు). రెండు పేజీలను కలుపుతూ ఓ ‘స్ట్రిప్’ని ‘టెంట్’గా వేసేయమని సూచించాడుట! కథ ‘టైటిల్’ ఎలివేట్ అయిపోతుంది అట్లా...
కానీ నా వేళకి మొదట కథలు - యస్.ఆర్. గారి ఆమోదం పొందాక, బొమ్మలకి పోయి రావడం ఒక ‘యజ్ఞం’ అయిపోయేది. దీంతో నేను కథకు ‘లీడ్స్’ పెట్టడంతో టైటిల్ హైలైట్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఏవో తంటాలు మరి.
ఇంగ్లీషు భాషలో నుంచి ‘మార్లిన్ మన్రో జీవిత కథ’- కింగ్ ఆఫ్ కింగ్స్ సినిమా నవల, టెంపుల్‌టన్ వండర్ సిటీస్, ప్రపంచ ప్రముఖులు.. ఇవన్నీ మేమే ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి.
ఊమెన్ మహాశయుడు కార్టూన్లు వేసి, పెన్సిల్‌తో వాటికి ‘కాప్షన్స్’ ఇలా గొలికి పడేసి ఇచ్చేవాడు. అవి తెలుగులోకి రాసి దాన్ని డి.ఆర్. గారి చేత సిరాలో రాయించుకోవాలి. దీనికి తోడు ‘్ఢల్లీ లేఖ’ శ్రీకృష్ణ లెటర్ వచ్చేది. వారి ఇంగ్లీషు నారికేళ పాకంగా ఉండేది. అది ఆఖరి క్షణంలో అందేది. రాసుకోవాలి. వీలైతే ఓ బొమ్మ బ్లాకు చేయించి వెయ్యాలి - అది చాలా పాప్యులర్ శీర్షిక.
నాకు ముందున్న ఎస్.వెంకటేశ్వరరావు గారు తన బాధ్యతల్ని నాకు అప్పగిస్తూ ఇవన్నీ (ఈ కష్టాలు) ముందే విపులంగా చెప్పి మళ్లీ వెళ్లాడు, గనుక నేను సంసిద్ధుడైనాను.. కె.సుబ్బారావు నాకు ముందున్న మరో సబ్ ఎడిటర్.
పాపం! ‘కింగ్ ఆఫ్ కింగ్స్’తో ఎలాగో తంటాలు పడేవాడు. నాతో సుబ్బారావు నేను నీకన్నా ఇక్కడ ముందున్నా. ఐనా మీరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరేమి? అనేవాడు. ‘్ఢల్లీ లేఖ చెయ్యి’ అనంగా ‘్ఫనిష్’. ‘బాబ్బాబూ వీరాజీ! నాకన్నా చిన్నవాడివి. హుషారుగా వున్నావు - చకచకా రాసేసుకుందూ. అదేదో అంటూ ‘లీడ్’ నాకిచ్చేవాడు.
అంటే - ఇంత ‘వంట ఇల్లు పని’ ఉంటుంది సుమా! అని చెప్పడం నా ఉద్దేశం. ‘పాప్యులారిటీ’ రెక్కలున్న కీర్తి గరుత్మంతుడి వీపు మీద ఎగరడం ‘వీక్లీ’ అనుకునేవాళ్లు - మా వి.వి.ఎన్. లాంటి వాళ్లు పేరు వస్తుందిగా నీకే వీరాజీ అనేవాడు బొమ్మకంటి (స్పోర్ట్స్) సుబ్బారావుగారు. ఏడ్వలేక నవ్వేసేవాణ్ని.... సహనమేరా! జీవితం...
నిజం చెప్పాలంటే ఎస్.ఆర్. గారు అనువాదాలు చేయడం అలవోకగా చేసేవాడు. ఆఫీస్‌లో ఉండేది రోజుకి రెండు మూడు గంటలే అయినా చాలా ‘వర్క్‌లోడ్’ సరదాగా భరించేవాడు. కానీ యజమాని కదా! ఒకవేళ ఆయన పప్పులో కాలువేసినా మనం కిమ్మనలేంగా. పైగా మధ్యలో వదిలేసేవారు. ఆదివారంనాడు కూడా సారు వచ్చేవాడు. అంటే నేను వెళ్లాలిగా. ఇద్దరంపైన ‘ప్రెస్’లోకి పోయి ప్రూఫ్ రీడర్స్ బల్ల మీద కూర్చొనేవాళ్లం. (వాళ్లకి ఆఫ్ కదా) ఫైనల్ ప్రూఫ్‌లు తీసుకుని చదివేవాడు సారు. (నాకు ప్రూప్‌రీడింగ్ చిరాకు)
సరే, వర్కర్స్ కరెక్ట్ చేసి మళ్లీ ‘గ్యాలీ’ ప్రూఫ్ ఇవ్వంగానే తాను దిద్దిన కాపీ దగ్గర పెట్టుకుని - దిద్దుతుండాలి. ‘క్యారీ - అవుట్’ అయినాయా? లేదా? అని చెక్ చేసేవాడు. మిగతా మిగిలిన తప్పులు? అట్లా. ఆదివారం కూడా నాన్నగారితో నాకు లంచ్ చేసే ఛాన్సు లేదన్నమాట!
దీనే్న తల అమ్ముకున్న బ్రతుకు అంటారు కాబోలు...
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com