S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్రివేణి సంగమం.. ‘స్వర్ణోత్సవ’ సంబరం

భవిష్యత్తు తరాలకు మార్గదర్శి..
విశ్వవిఖ్యాత నరుడు..
వేదాంతయోగ శాస్త్ర సంపన్నుడు..
పవిత్ర హిందూతత్త్వబోధామృత పారంగతుడు..
భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని విదేశాల్లో ప్రచారం చేసిన ప్రాభవవంతుడు..
తన అద్భుత ప్రసంగాలతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగొన్న భారతీయ తత్త్వవేత్త.. గొప్ప మేధావి వివేకానందుడు. ఆయన సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు.. లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండి.. మేల్కోండి.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని, ఇతరులనూ మేల్కొల్పండి.. మీరు మరణించేలోపు జీవిత పరమావధిని సాధించండి.. లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకు ఎక్కడా నిలవకండి.. ఎప్పుడూ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం.. బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలంటూ యువతరాన్ని కోరుకున్నాడు. అలాంటి వివేకానందుడి జీవితాన్ని మలుపుతిప్పిన సాగర తీరం, బాపూజీ జ్ఞాపకాలను నిలుపుకున్న స్మారక కేంద్రం, మూడు సముద్రాలు కలిసే త్రివేణీ సంగమం.. వివేకానందుని రాక్ మెమోరియల్ ఉన్న అద్భుత సుందర ప్రదేశం.. కన్యాకుమారి. కన్యాకుమారికి మరింత పేరు తెచ్చిన వివేకానందుని రాక్ మెమోరియల్ స్వర్ణ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం...
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.. సర్వధర్మ స్వరూపమే వేదాంతం అని.. అన్ని మతాల ఆరాధనలూ భగవంతుని తత్త్వాన్ని తెలిపే మార్గాలే అని చెప్పిన ప్రఖ్యాత ఆధ్యాత్మికత నాయకుడు.. సమస్త శక్తి నీలోనే ఉంది.. దానే్న విశ్వసించు.. నీవు బలహీనుడువని ఎప్పుడూ తలపోయకు.. ధీరుడువై నిలిచి, నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు.. అంటూ సమస్త మానవాళిని భయం వదిలి సమాజ సేవకు నడుం కట్టాలని చెప్పిన హిందూ తత్త్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి.. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద.. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడిగా ఎలా మారాడు? అసలు నరేంద్రనాథుడు వివేకానందుడిగా ఎలా మారాడు..? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
కలకత్తాకు చెందిన ప్రసిద్ధ న్యాయవాది విశ్వనాథ దత్తా, ఆయన సతీమణి భువనేశ్వరీదేవి దంపతులకు 1863 జనవరి 12వ తేదీ, మకర సంక్రాంతి పర్వదినాన నరేంద్రనాథ్ జన్మించారు. ఆ శిశువే అనంతరం స్వామి వివేకానందుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. చిన్నతనంలోనే తల్లి చెప్పే భారత, రామాయణ ఇతిహాసాలను చాలా శ్రద్ధగా వినేవాడు. మూఢనమ్మకాలను నమ్మేవాడు కాదు. అయితే అతడి జ్ఞాపకశక్తిని, అసాధారణ మేధాశక్తిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపడేవారు. నరేంద్రుడు చిన్నప్పుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. ఆయన సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. అయితే చరిత్ర, సైన్స్‌తో పాటు పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని కూడా ఔపోసిన పట్టిన ఆయనకి రోజురోజుకీ మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. అతడి సందేహాలన్నింటినీ ఎందరో పండితుల దగ్గర ప్రస్తావించినప్పటికీ వారి జవాబులు ఏవీ కూడా ఆయన్ని సంతృప్తి పరచలేదు. ఇటువంటి పరిస్థితిలో కలకత్తాకు కొద్ది దూరంలో దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని, తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ విధంగా 1881లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామకృష్ణునికి, అతని సందేశ ప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. అప్పుడు నరేంద్రుడు ఆయనను ‘అయ్యా! మీరు దేవుణ్ణి చూశారా?’ అని ప్రశ్నించాడు. అందుకు రామకృష్ణులు ‘ఔను! నేను భగవంతుణ్ణి చూశాను! నిన్నిప్పుడు చూస్తున్న దానికన్నా స్పష్టంగా చూశాను’ అని సమాధానమిచ్చారు. అలా తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక స్వామీజీ నరేంద్రునికి లభించాడు. అప్పటి నుంచి నరేంద్రుని అనుమానాలు తొలగిపోయి రామకృష్ణులవారికి శిష్యునిగా శిక్షణ ప్రారంభించాడు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్ర్తిలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి అనే వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారు. రామకృష్ణులవారు చివరి రోజుల్లో నరేంద్రుడిని పిలిచి ఆయన్ని చాలా మృదువుగా తాకి, ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి, అతనికి ఇలా చెప్పారు. ‘నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడువు.. వీళ్ళంతా నా బిడ్డల వంటివారు. వీరికి చూసుకోవాల్సిన బాధ్యత నీదే’ అన్నారు. అలా రామకృష్ణులవారు పరమపదించాక గంగా నది ఒడ్డుకి దగ్గరలో ఉన్న రామకృష్ణులవారి సమాధి దగ్గర రామకృష్ణమఠం స్థాపించారు నరేంద్రుడు. అక్కడ ఉండే యువ సన్యాసులకి రెండే లక్ష్యాలు ఉండేవి. ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండు ముక్తిని సాధించడం. ఇలా మారిన నరేంద్రుడు రామకృష్ణ మఠానికి నాయకుడయ్యాడు.
కాషాయం ధరించి, సన్యాసాన్ని స్వీకరించిన నరేంద్రుడు వివేకానందుడిగా మారాడు. ఆ తరువాత దైవ సాక్షాత్కారం కోసం నిరంతరం ధ్యానం చేశారు. పరివ్రాజకునిగా దేశసంచారం చేశారు. ఎన్నో క్షేత్రాలు తిరిగి భారతదేశంపై పూర్తి అవగాహనకు వచ్చారు. 1892లో స్వామి వివేకానంద కన్యాకుమారికి వెళ్లి అక్కడ ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రాన్ని నిర్మించారు.
కన్యాకుమారిలోని పర్యాటక ప్రదేశాలు
తమిళనాడులోని కన్యాకుమారి పట్టణం జిల్లా కేంద్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది భారతదేశ ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశం, ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమల్లో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం. మూడు సముద్రాల అరుదైన మేలు కలయిక కన్యాకుమారికి ప్రధాన ఆకర్షణ. భారతదేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయానే్న తన నునులేత కిరణాలతో వెలుగును ప్రసరింపజేసే సూర్యభగవానుడు. అప్పుడు సముద్ర గర్భం నుండి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా..? అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట.. ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికుడు ఉండడు.
త్రివేణీ సంగమ క్షేత్రం
కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహా సముద్రం, దిగువన హిందూ మహా సముద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. సముద్రతీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్రతీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు. వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా, కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ చూడాల్సిన ప్రముఖ పర్యాటక కేంద్రాలు ఇవే..
వివేకానంద రాక్
ఇక్కడి పర్యటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తులో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవత్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకానందుడి రాక్‌కు కొంతదూరంలో పార్వతీదేవి, పరమశివుడిని పెళ్లాడేందుకు తప్పస్సు చేసిన ప్రాంతం, అక్కడ శిలారూపంలోని ఆమె పాద ముద్రికలు కూడా మనకు దర్శనమిస్తాయి.
తరువళ్లువర్ విగ్రహం
వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని 2000లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు. తిరువళ్లువర్ విగ్రహం బరువు ఏడు వేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవల్లో వెళ్లాల్సిందే.. ఇది ఆసియాలోని ఎతె్తైన విగ్రహాల్లో ఒకటిగా పేరు గాంచింది.
మహాత్ముని స్మారక చిహ్నం
కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మాగాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్ 2, మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మాణం చేపట్టడం విశేషం.
కుమారి ఆలయం
బాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమారి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలుంటాయి. ఆలయంలోని ముగ్ధమనోహర మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒక్కప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవాని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవత్సరంలో నాలుగైదు సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు. పురాణాల కథనాల ప్రకారం కుమారి ఆలయంలో దేవతగా కొలవబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తాయని చెబుతుంటారు.
ఇందిరా పాయింట్
కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరా పాయింట్ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. *

చికాగోలో ప్రసంగం

1893, సెప్టెంబర్ 11న చికాగోలో ప్రారంభమైన సర్వమత మహాసభలో దేశ విదేశాలకు చెందిన వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 7 వేల మంది శ్రోతలు ఉన్న సభలో స్వామి ప్రవేశించారు. అయితే అక్కడికి వచ్చిన వారందరూ కూడా స్వామి వివేకానంద వేషధారణ చూసి ఇతడు ఇక్కడికి ఎలా వచ్చాడు? అసలు ఇక్కడికి వచ్చే అర్హత ఇతడికి ఉండా? అన్నట్లుగా ఆయన్ని చూశారు. అక్కడ ఉన్నవారందరిలో కంటే ఆయనే చిన్నవాడు. దేశ విదేశాల నుండి వచ్చిన వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు అంతా కూడా ఏం మాట్లాడాలి? అనే దాన్ని ముందుగా సిద్ధం చేసుకున్నారు. కానీ స్వామి వివేకానంద దగ్గర మాత్రం ఎటువంటి ఉపన్యాసం సిద్ధంగా లేదు. స్వామి వివేకానంద ప్రసంగించాలంటూ అధ్యక్షుడు పిలిచినప్పుడు కనీసం ఎవరు కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించలేదు. స్టేజ్ మీదకు వెళ్లిన ఆయన ఉపన్యాసానికి ముందు తన గురువు రామకృష్ణులవారిని, సరస్వతీ దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. సాధారణంగా ఎవరైనా సభలో మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రసంగాన్ని మొదలుపెడతారు. కానీ స్వామి వివేకానంద మాత్రం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ ఆత్మీయ సంబోధనతో ప్రపంచ దేశాలకు మన భారతీయ సోదరభావాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఆయన ఆత్మీయ సంబోధన విని వేలాదిమంది లేచి రెండు నిముషాల పాటు చప్పట్లతో ఆనందానుభూతిని వ్యక్తం చేశారు. చప్పట్ల శబ్దం ఆగిన వెంటనే ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘అమెరికా సోదరులు, సోదరీమణులారా.. నన్ను ఆహ్వానించడంలో మీరు ప్రదర్శించిన ఆత్మీయతతో నా హృదయం నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతిని నెలవు, అన్ని ధర్మాలకూ జనని అయిన భారతదేశం తరఫున నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయుల తరఫున మీకు కృతజ్ఞతలు. మతసహనం అన్న భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఈ సదస్సులో వెల్లడించిన కొందరు వక్తలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మతసహనం, అన్ని మతాల పట్ల సమాన ఆదరణలాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మేం కేవలం మతసహనాన్ని నమ్మడమే కాకుండా, అన్ని ధర్మాలను నిజరూపంలో స్వీకరిస్తాం. నేను అన్ని మతాలకు, అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందుకు గర్వపడుతున్నాను. రోమన్ నిరంకుశ పాలకులు ఇజ్రాయిలీయుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసినప్పుడు, ఇజ్రాయిలీ వాసులు దక్షిణ భారతదేశంలో తలదాచుకున్నప్పుడు వారిని మా హృదయాలకు హత్తుకున్నాం. పార్సీ మతం వారికి ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. మేం ఇప్పటికీ వారికి సహాయం చేస్తున్నాము. ఈ సందర్భంగా నేను చిన్ననాటి నుంచి వింటున్న, అనేక లక్షలమంది ప్రజలు ఇప్పటికీ చెప్పే మాటలను చెప్పాలనుకుంటున్నాను. నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాల్లో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయో.. అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూడటానికి ఈ దారులన్నీ వేరైనా.. అవన్నీ కూడా చివరకు దేవుణ్నే చేరుకుంటాయి. ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. గీతలో చెప్పినట్లు.. నా దగ్గరకు వచ్చిన దేన్నైనా, అది ఎలాంటిదైనా, నేను దాన్ని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు. కష్టాలను ఎదుర్కొంటారు. కానీ చివరకు నన్ను చేరుకుంటారు.. అన్న వాక్యాలు దానికి నిదర్శనం. మతతత్త్వం, మూఢభక్తి, దాని పర్యవసనాలు.. ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి. ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ భయానక మతతత్త్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సర్వమత సమ్మేళనం.. కరవాలం ద్వారా కావచ్చు.. కలం ద్వారా కావచ్చు.. అన్ని రకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను.. అంటూ అనర్గళంగా సాగిన వివేకానంద విశ్వజనీన ప్రసంగానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. అంతవరకూ ఎవరికీ తెలియని స్వామి అసాధారణ ధార్మిక ప్రబోధకుడిగా కీర్తిగాంచారు. చికాగో వీధుల్లో వెలసిన ఆయన చిత్రపటాలకు వందనం చేయనివారు లేరంటే అతిశయోక్తి కాదు. డిసెంబర్ 18న ఆయన మాతృభూమికి ప్రయాణమవుతుండగా ఆయనను వీడలేక అఖండ జనం భారంగా వీడ్కోలు పలికారు. చికాగో నుంచి వచ్చాక మాతృదేశంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి