అంతర్జాల యుగపు అజ్ఞానం
Published Saturday, 2 November 2019కొదవలేని తప్పిదాలు
పూడ్చలేని నష్టాలు
జ్ఞానం లేక కాదు
వినియోగించుకునే నేర్పు లేక
రెక్కల్లేని ఫంకా
యంత్రాన్ని తిప్పగలదని తెలుసు
మూర్ఖత్వాన్ని పరాకాష్ఠకు చేర్చుకుని
అటువంటి యంత్రం గల పడవలో
తలకు మించిన భారం నింపి
తోస్తాడు దాన్ని నది మధ్యలోకి
పాపం, ఏ పాపం తెలియని
పసివాళ్ల ప్రాణాలు
వరద నీటిలో కరిగిపోతాయి
హతవిధీ, ఎంత కసాయివాడీ మనిషి!
లీటర్ ఇంధనం అదనమవుతుందని
ప్రమాదం జరిగే చోట
పడవ దాటించాడు
ఇరవయ్యొకటో శతాబ్దపు
విజ్ఞానం ఇదేనా?
పైసాకన్నా ప్రాణం అధమమా?
మళ్లీ మళ్లీ జల ప్రమాదాలు
సృష్టిస్తూనే ఉన్నాడు
బుద్ధి తెచ్చుకోని మనిషి
పాపికొండల అందాల మోజులో
మరో నలభై ఆరు అసువులు
కలక నీటిలో కలిసిపోయాయి
అనుమతిలేని జల వాహనం మీద
మితిలేని భారంతో ప్రయాణం
అంతులేని అంతర్జాల
యుగపు అజ్ఞానానికి
నిలువుటెత్తు ఉదాహరణ
బాధ్యతలేని ప్రభుత్వ యంత్రాంగపు
పనితనానికి
తిరుగులేని నిదర్శనం
ఈ అజ్ఞానం, బాధ్యతలేమి
ఏ ఒక్క రంగంలోనే కాదు
సర్వత్రా వ్యాపించి ఉన్నాయి సుమీ!
యుగమేదైతేనేం?
జ్ఞానం పరిపూర్ణం కానప్పుడు!
జ్ఞానం ఏమిటో
తెలుసుకోవలసిన సమయమిది.