S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అజోవిభోకందాళం సంస్థ రజతోత్సవం

తారీఖులు, దస్తావేజులు కచ్చితంగా పాటిస్తే కిందటి సంవత్సరమే రజతోత్సవం జరిగిందనో, జరుపుకున్నామనో సంస్థ వారు భావించవచ్చు. కానీ తెలుగునాట 2020లో వారు నిర్వహించే తెలుగు పండుగ ఇరవై ఆరోదని అనాలి. అనుకోవాలి. ఏమంటే ఓం ప్రథమం ఈ ఉత్సవం అమెరికాలో జరిగింది. అప్పుడింత ఆనందాతిశయ సంరంభ సభావేదిక ఉండి ఉండదు. నాలుగు రోజుల పాటూ జరిగి ఉండదు.
మూడోసారి ఉత్సవాలు మన మధురాంతకం రాజారాంగారి సృజనాత్మక ప్రతిభా వైభవ కథారచన, సమకాలీన సామాజిక అధ్యయన విశే్లషణ పరంగా విజయవాడలో జరిగాయి. తెలుగునాట చోటు చేసుకున్న ఈ తెలుగు తిరునాళ్లు అనేక విధాల స్మరణీయాలు. అప్పటిలో తెలుగు కథారచనా శేముషీవిరాజమానులు తెలుగునాడు నాలుగు దిక్కుల నుంచీ ఏభై మంది దాకా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. తెలుగు ఆధునిక కథ పట్టపు టేనుగుపై ఊరేగింది. ఆధునిక కథా సాహిత్యానికి ఆ నాలుగు రోజులు శరదిందు వికాస మందహాసరోచులు ప్రసరింపజేశాయి. ఇటువంటి సాహిత్య, సాంస్కృతిక, రంగస్థల విలసిత వేదిక సంస్థ వారు నిర్వహించటం అదే మొదటిసారి. ఈ పాతిక లేదా ఇరవై ఆరు సంవత్సరాలలో త్రైవిక్రమంగా ఈ సంస్థ కార్యకలాపాలు, పుస్తక ప్రచురణలు, ఉత్సవ విశేష సంచిక ప్రకటనలు కనుల పండుగను సంతరింప చేసుకున్నాయి. చేసుకుంటున్నాయి ప్రతి సంవత్సరమున్నూ.
ఇటువంటి గొప్ప సాహిత్య, సాంస్కృతిక, రంగస్థల హొరంగులు భారతదేశంలో ఎక్కడా జరిగిన, జరిపిన దాఖలాలు కన్పట్టవు. అందువల్ల అజో.విభో.కందాళం సంస్థ తెలుగు వారికి సాంస్కృతిక చైతన్య కల్పతరువు అనాలి. పందొమ్మిదో శతాబ్ది ముగింపు దశకం ఆధునికాంగ్ల సాహిత్యానికి సువర్ణ్ధ్యాయమని గూటాల కృష్ణమూర్తి మహాశయుడు ఒక పత్రిక నడిపి, విస్మృతులైన ప్రతిభావంతులైన కవుల కవితా సంకలనాలు ప్రచురించీ రుజువు చేశారు. అట్లానే 20వ శతాబ్దపు ముగింపు దశకం తెలుగు వారి ప్రక్రియా వైవిధ్యవిలసిత ఆధునిక సాహిత్యానికి స్వర్ణయుగ ప్రారంభంగా పరిగణించాలి. ఆ దశాబ్దంలో పుట్టినంత మంది తెలుగు సాహిత్యాకాశోజ్జ్వల నక్షత్ర కాంతిమంతులు అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఏక దశాబ్దంలో ప్రభావించలేదు. రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, దేవులపల్లి, అడవి బాపిరాజు, పింగళి - కాటూరి వంటి వారు ఈ దశాబ్దంలోనే పుట్టారు.
భారతదేశ స్వాతంత్య్రావిర్భావ కాలం దాకా వారి తరం. అట్లానే 20వ శతాబ్ది చివరి దశాబ్ది అజోవిభో సంస్థ ప్రభావంతో, ప్రాభవంతో తెలుగువారి సాహిత్య సామాజిక సాంస్కృతిక చైతన్య సమాహార సమగ్ర కళాకాంతులు వెల్లివిరిసాయి. ఒక కొత్త అధ్యాయాన్ని వారు సృష్టించారు. ఈ సంస్థ వారు ప్రచురించిన గ్రంథాలు ప్రాచీనాధునిక తెలుగు సాహిత్య ఉత్తమోత్తమ ప్రమాణాలను స్థిరీకరించాయి. సంగీతం, సాహిత్యం, విమర్శ, రంగస్థల ప్రతిభ, ప్రదర్శన సాంకేతిక ఆధునిక విజ్ఞాన పురోగతి, జానపద కళలు, గ్రంథాలయ సేవా ఔరంధర్యం, నేటికీ వారు విస్మరించలేదు. రంగస్థలంపై ఒక ప్రదర్శన రక్తి కట్టడానికి అవసరమైన ప్రసాధన కార్య నిపుణులను (మేకప్ ఆర్టిస్టులు) రంగస్థలాలంకార కుశలురను, కూడా వారు సత్కరించారు. సమ్మానించారు. నగదు పారితోషికాలతో పరితోషింపచేశారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో కథ, నవల, వ్యాసం, విమర్శ, నాటక, నాటికా రచన, అభినయం, పాత్రోచిత వేషధురీణత వంటి అన్ని ప్రక్రియలను వారు సమాదరించారు. జీవితకాల సాఫల్య పురస్కారంతోపాటు, విశిష్ట సాహితీమూర్తుల పురస్కారాలు కూడా ప్రారంభించారు. ఈ రెండు వర్గాలకు సంబంధించి దరిదాపుగా 50 మంది విశిష్ట ప్రతిభులు ఇప్పటికి సమ్మానితులైనారు.
ప్రతి సంవత్సరం సంస్థ వారు నాలుగు రోజులు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మూడు రోజులపాటు సామాజిక సమస్యల ప్రతిఫలించే నాటికలు ప్రదర్శింపజేస్తారు. నాలుగవ రోజు జీవన సాఫల్య పురస్కార సభ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం జీవన సాఫల్య పురస్కార గ్రహీత విశిష్ట ప్రతిభ ఏమిటో ప్రసంగ పత్ర సదస్సు ద్వారా సాహితీ లోకానికి విశదం చేస్తారు.
1993 ప్రాంతంలో ఈ సంస్థకు బీజావాపం జరిగినప్పుడు శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ, శ్రీ విష్ణ్భుట్ల రామన్న, లక్ష్మన్నలు స్థాపక సభ్యవదాన్యులుగా ఈ సంస్థ ప్రారంభమైంది. సుమారు పది సంవత్సరాల తర్వాత శ్రీ కందాళం ఆచార్యుల వారు కూడా సరస్వతీ దేవి పల్లకికి నాలుగో బోరుూగా తమ భుజస్కంధాన్ని చేర్చారు. మొదటి రెండు మూడు ఉత్సవ సందర్భాలలో విశిష్ట సారస్వత సంచిక ప్రచురణ జరుగలేదు. తరువాతి కాలంలో క్రమంగా విష్ణ్భుట్ల సోదరులు ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం లేకపోయింది. కె.వి.ఆర్. చారిగారు ఆ లోటు భర్తీ చేస్తున్నారు. అప్పాజోస్యుల సత్యనారాయణ గారు మహాకవి జాషువా చిలకమర్తి వారిని గూర్చి వర్ణించినట్లు ఆత్మనయనుడు, అంతర్నేత్రుడు. సమస్త కార్యభారాన్ని ఆయన అవలీలగా, లేదా సలీలగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్థిర ప్రాతిపదికపై ఈ గొప్ప సంస్థ నాలుగు కాలాలపాటు వర్థిల్లాలి. తెలుగు వారికి సర్వతో సమగ్రమైన సమస్త సన్మంగళాలు చేకూరాలి. తూర్ణారవాలు మారుమ్రోగాలి. ఓం సహనావవతు, సహనౌ భునక్తు.. అనే వైదికాశీస్సుకు ఈ సంస్థ పాత్రం కావాలి.

-అక్కిరాజు రమాపతిరావు