S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డార్క్ అవెన్యూ-5

సమీర్ చంద్రలేఖ చెబుతున్నది వింటున్నాడు. భార్గవి ఒక విధమైన షాక్‌లో వున్నది. చెబుతున్నది తన స్నేహితురాలు.. ఒక క్రిమినాలజీ చదివిన వ్యక్తి. కానీ ఎక్కడో లాజిక్ మిస్సవుతోంది.
ఆ లాజిక్‌ను వెతుకుతున్నాడు సమీర్.
‘నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదూ’ చిన్న అనుమానంతో అడిగింది చంద్రలేఖ.
‘నేను నమ్ముతున్నాను’ సుతారంగా అన్నాడు సమీర్. ‘కానీ ఆ నమ్మకం వెనుక వున్న కారణాన్ని అనే్వషిస్తున్నాను.. రేపు ఆత్మలతో మాట్లాడే వ్యక్తులుగా మీ ఇంట్లోకి వస్తాం...’ చెప్పాడు సమీర్.
‘్థంక్యూ’ అంది.. భార్గవి వైపు చూసి.. ‘నా కోసం చాలా రిస్క్ చేసి వచ్చావు.. భార్గవీ’ అంది చంద్రలేఖ.
‘్ఢల్లీలో జరిగిన సంఘటనలు ఏవీ చెప్పలేదు’
‘్భర్గవీ.. చెబితే మరింత ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని...
* * *
విశాలమైన ఆ ఇంట్లో సమీర్, భార్గవి మాత్రమే వున్నారు. హాలులో సోఫాలో కూచొని ఉన్నాడు సమీర్. భార్గవి ఆలోచిస్తూ వుంది.
సమీర్ భార్గవి వైపు చూసి అన్నాడు ‘మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా?’
భార్గవి తల అడ్డంగా ఊపి ‘అదేం లేదు.. పాపం చంద్రలేఖ గురించే ఆలోచిస్తున్నాను...’ అంది.
‘నాకు తెలిసి ఇలాంటిది మొదటి కేసు.. క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న కేసులు చాలా చేశా.. కానీ ఆత్మలు క్షుద్రశక్తులు వున్నా కేసు మొదటిసారి డీల్ చేస్తున్నా...’ అన్నాడు.
నిజమే అన్నట్టు తలూపింది భార్గవి. తరువాత ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్లారు.
భార్గవికి నిద్ర పట్టడం లేదు.
ఢిల్లీలో జరిగిన సంఘటన ఒక కారణం అయితే, ఇక్కడ చంద్రలేఖ పరిస్థితి రెండవ కారణం.
పైగా కొత్త ప్లేస్.
బెడ్‌రూమ్ చాలా విశాలంగా ఉంది. అటాచ్డ్ బాత్‌రూమ్.. ఉదయం నుంచి నిలబడే వుండవలసి రావడం వల్ల అలసటగా అనిపించింది. స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుందనిపించింది.
నైటీ తీసుకుని బాత్‌రూమ్ వైపు నడిచింది.
బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే ఎందుకో తెలియని సిగ్గు, భయం కలిగాయి. ఒక కొత్త ప్రాంతంలో ఒక ఇంట్లో ఇద్దరే వున్న ఇంట్లో అదీ ఒక పురుషుడు వున్నా ఇంట్లో తాను స్నానం చేస్తుంది.. అతని కళ్లు తనని వెంటాడుతున్నాయన్న ఫీలింగ్.. అనుకోకుండా ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
మరో కారణం భయం.. ఈ భయం ఎందుకో అర్థం కావడంలేదు. ఎవరో తనను వెంటాడుతున్నారన్న ఫీలింగ్. బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంది. బోల్టు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంది. తలుపు వేసే ముందు ఓసారి తల బయటకు పెట్టి చూసింది. బాత్‌రూమ్ తలుపు వేసి బోల్టు పెట్టి అద్దం ముందు నిలబడి డ్రెస్ విప్పబోతూ ఆగింది. ఒక్క క్షణం ఉలిక్కిపడింది. తన వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసింది.
ఎవరూ లేరు.. బట్టలు తీసి స్టాండ్ మీద వేసి షవర్ ఆన్ చేసింది. షవర్ ధార తలమీదుగా ఆమె శరీరం నుంచి జారుతోంది. కళ్ల మీద పడ్డ షవర్ ధార తుడుచుకుంటూ తలతిప్పి కెవ్వున కేక వేసింది. బాత్‌రూమ్‌కు వున్నా గ్లాస్ నుంచి నీడ... ఎవరో తనని చూస్తున్నట్టు...
వెంటనే స్టాండ్ మీద వున్న నైటీ తీసుకుని వేసుకుని తలుపు తీసి బయటకు వచ్చి అనుమానంగా హాలులోకి తొంగి చూసింది.
సమీర్ పేపర్ చదువుకుంటున్నాడు. తను వెళ్లేప్పుడు ఎలా వున్నాడో అలాగే కూచొని వున్నాడు.
ఒక్క క్షణం అతనిని అనుమానించినందుకు గిల్టీగా ఫీలయింది.
భార్గవి అడుగుల శబ్దం విని తలెత్తి భార్గవి వైపు చూశాడు. తుడుచుకోకుండానే రావడం వల్ల నైటీ దాదాపు తడిచింది. ఆమె కంగారుగా బయటకు వచ్చిందని అర్థమైంది.
‘ఎనీ ప్రాబ్లమ్?’ అడిగాడు సమీర్.
‘నథింగ్ ఏమీ లేదు’ చెప్పి తన గదిలోకి వెళ్లింది.
తన వంక చూడకుండా.. ముందు తన సమస్యను అడగడం తను కంగారుపడుతున్న విషయం తెలిసి ‘తనకు ధైర్యం చెప్పే ప్రయత్నం’ అద్భుతంగా అనిపించింది. ఇలాంటి వ్యక్తినా.. తను అనుమానించింది? అనుకుంది.
ఓ రచయిత రాసిన వాక్యం గుర్తొచ్చింది..
‘మీతో నగ్నంగా ఒక రాత్రంతా వున్నా.. నాకు ఇష్టం లేకుండా నావైపు కూడా చూడరు. కనీసం మనసుతో కూడా నన్ను తాకే ప్రయత్నం చేయరు’ హీరోయిన్ హీరోతో అన్న మాటలు.
యస్.. సమీర్ అలాంటి వ్యక్తే...
* * *
సిటీ హాస్పిటల్.
మెల్లిగా కళ్లు తెరిచాడు దుర్జన్‌కుమార్.. ఒళ్లంతా నొప్పులు.. చేతులు కదల్చబోయాడు. అప్పుడర్థమైంది తన చేతులకు బ్యాండేజ్ కట్లు ఉన్నాయని. తలంతా బరువుగా ఉంది. తను హాస్పిటల్‌కు వచ్చి ఎన్ని రోజులు అయ్యిందో.. తనకు మెల్లిమెల్లిగా జ్ఞాపకం వస్తుంది. తను చంద్రలేఖను తీసుకువెళ్లడం నుంచి..
తన మీద దాడి చేసింది చంద్రలేఖేనా? అతనిలో కన్ఫ్యూజన్.. ఏదీ సరిగ్గా గుర్తుకు రావడంలేదు. అప్పుడే అడుగుల శబ్దం.. తలెత్తి చూస్తే వహీద్...
‘నువ్వా వహీద్ అసలు నాకు నాకేమైంది?’ అడిగాడు వహీద్‌ను సిఐ దుర్జన్‌కుమార్.
‘మిమ్మల్ని సైతాన్ చంపేయబోయింది’ కళ్లు పెద్దవి చేసి చెప్పాడు వహీద్.
సిఐ దుర్జన్‌కుమార్ ఒక్క క్షణం వహీద్ వంక కోపంగా చూశాడు. ఆ రోజు రాత్రి తాను దెయ్యం అంతు చూస్తానని బయల్దేరాడు.. చంద్రలేఖను రేప్ చేయాలనుకున్నాడు.. అక్కడే అప్పుడే ఏదో జరిగింది.. కానీ ఆ జరిగింది ఏమిటో అతనికి ఎంత గుర్తుకు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడంలేదు.
ఇప్పుడు వహీద్ తనను ఆట పట్టిస్తున్నాడా? వహీద్ వంక చూశాడు.. చాలా క్యాజువల్‌గా వున్నాడు.
‘నిజం సర్. మీరు ఇంతకీ రాకపోయేసరికి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను.. వచ్చేసరికి మీరు స్పృహ తప్పి పడివున్న.. వెంటనే డిసిపి సర్‌కు ఫోన్ చేశాను.. మిమ్మల్ని హాస్పిటల్‌కు తీసుకువచ్చారు..’ చెప్పాడు వహీద్.
ఒక్క క్షణం చిన్నపాటి భయం...
వహీద్ వైపు చూసి ‘డిసిపి సర్ ఏమన్నారు?’ అడిగాడు దుర్జన్‌కుమార్.
‘ఎంక్వయిరీ చేశారు.. చంద్రలేఖను కూడా అడిగారు.. ఆ మేడం చెప్పారు’ చెప్పాడు వహీద్.
‘ఏం చెప్పింది?’ అనుమానంగా అడిగాడు దుర్జన్‌కుమార్.
‘తనను కాపాడబోయిన మిమ్మల్ని దెయ్యం చంపేయబోయిందని తను భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నానని చెప్పింది.’
రెండు చేతులతో తల పట్టుకున్నాడు సిఐ దుర్జన్‌కుమార్.
‘అసలు ఏం జరుగుతోంది? నిజంగా దెయ్యం ఎటాక్ చేసిందా? చంద్రలేఖ నాటకం ఆడుతోందా? ఒక పిచ్చిదానికి అన్ని తెలివితేటలు ఎక్కడుంటాయి..?’
‘సర్ మీరు స్పృహలోకి రాగానే డిసిపి సర్ చెప్పమన్నారు’ అని వహీద్ తన జేబులోని మొబైల్ తీశాడు.
‘వద్దొద్దు. నేనే డిసిపి సర్‌కు చేస్తాను.. నువ్వు స్టేషన్‌కు వెళ్లు’ చెప్పాడు సిఐ దుర్జన్‌కుమార్.
వహీద్ వెళ్లగానే తన జేబులో వున్న మొబైల్ తీశాడు.. ఇరవై మిస్డ్ కాల్స్.. వేరువేరు ఫోన్ల నించి.. ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు అతనికి.. వెంటనే ఓ నంబర్‌కు డయల్ చేశాడు.
అవతలి వైపు నుంచి తిట్లు మొదలయ్యాయి.
‘నీకసలు బుద్ధి ఉందా? ఏ పనీ సరిగ్గా చేసి చావవు...’
‘సారీ సర్ నేను మిమ్మల్ని కలుస్తాను.. కల్సి అసలు ఏం జరిగిందో చెబుతాను’ సిఐ దుర్జన్‌కుమార్ అన్నాడు.
‘ఇప్పుడొద్దు.. నేనే చెబుతాను. ముందు డిజిపికి అనుమానం రాకుండా చూడు.. మరో విషయం.. ఈ కేసు గురించి ఎంక్వయిరీ చేయడానికి, ఈ కేసును పరిశోధించడానికి ఢిల్లీ నుంచి సిబిఐ చీఫ్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్.. జాగ్రత్తగా ఉండు’
అవతలి వైపు ఫోన్ కట్ అయింది.
* * *
రాత్రి పదకొండు దాటింది.
చంద్రకళ కిచెన్‌లోకి వెళ్లింది.. అటుఇటు దిక్కులు చూస్తోంది. ఆమె కళ్లలో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మెల్లిగా వెళ్లి కిచెన్‌రూమ్‌లో స్విచ్ ఆఫ్ చేసింది. కిచెన్ మొత్తం చీకటిగా మారింది. తడుముకుంటూ వెళ్లి అగ్గిపెట్టె చేతిలోకి తీసుకుంది. మెల్లిగా వణుకుతున్న చేతులతో అగ్నిపుల్ల వెలిగించింది. అగ్గిపుల్ల వెలుతురులో ఒక నీడ.. భయంతో అరవబోయింది.. వెంటనే నీడ మాయమయింది. మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి గినె్నలో వున్న అన్నాన్ని కూర కలుపుకోకుండానే పిచ్చిపట్టిన దానిలా తినసాగింది.
అన్నం అలాగే తిని చేతులు కడుక్కుని తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు మూసుకుంది.
* * *
చంద్రలేఖ ల్యాప్ ఓపెన్ చేసింది. ఓరకంట అక్కను చూస్తుంది. చంద్రప్రభ ఒక్కో కిటికీ దగ్గరకు వెళ్లి ఆ కిటికీకి అంటించిన పేపర్స్ సరిగ్గా ఉన్నాయో లేదోనని చూస్తోంది. అలా అక్కను ఆ పరిస్థితిలో చూస్తుంటే భయమేస్తోంది.. అంతకుమించి బాధ కలుగుతోంది.. మాటిమాటికీ భయంభయంగా దిక్కులు చూస్తోంది.
తల్లితోపాటు అక్కతోపాటు తను కూడా వాళ్లలా హెలూసినేషన్ లోకి వెళ్లినట్టు నటిస్తుంటే ఒక్కోసారి భయమేస్తోంది. తను నటిస్తుందా? లేక తను కూడా ఈ భ్రమలకు గురి అవుతుందా? ఇది నిజంగా జరుగుతుందా? అసలు తమ కుటుంబానికి ఏమవుతోంది? లండన్‌లో విలాసవంతంగా గడిపిన తమ కుటుంబం ఏ దేవుడో శాపం పెట్టినట్టు ఎందుకిలా జరుగుతోంది? ఆమె కళ్లు కన్నీళ్లను వర్షించాయి.
సరిగ్గా అప్పుడే బెడ్‌రూమ్ దగ్గర అలికిడి. అది తల్లి బెడ్‌రూమ్ దగ్గర.. చాలా రోజులుగా తల్లి తన బెడ్‌రూమ్‌లో పడుకోవడం లేదు.. ముగ్గురూ హాలులోనే పడుకుంటున్నారు. దిగ్గున లేచి తల్లి బెడ్‌రూమ్ వైపు పరుగెత్తింది. అప్పుడే తల్లి బెడ్‌రూమ్ తలుపులు తెరుచుకున్నాయి.
* * *
తల్లి గది దగ్గరికి వెళ్లడం.. తల్లి తన బెడ్‌రూమ్ తలుపులు తెరవడం ఒకేసారి జరిగాయి. మెల్లిగా తలుపులు తెరుచుకున్నాయి. తల్లి బయటకు వచ్చింది సిగ్గుపడుతూ...
పిచ్చిదానిలా అరవబోయి బలవంతంగా గొంతులోని కేకను గొంతులోనే అదిమిపెట్టింది. ఎదురుగా తల్లి.. నాన్న చనిపోయాక తీసేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని.. ఆ బొట్టు చెదిరి ఉండి.. ఎప్పుడూ లేనిది తలలో మల్లెపూలు.. కొన్ని పూలు బెడ్‌రూమ్‌లో పడి ఉన్నాయి.. మంచం మీద పడి ఉన్నాయి.. తల్లి మొహంలో అలసట.. సిగ్గు..
ఒళ్లు గగుర్పొడిచింది తల్లిని ఆ స్థితిలో చూసి..
‘అమ్మా ఏమిటిది?’ పిచ్చి పట్టినదానిలా తల్లి భుజాలు కుదిపేస్తూ అడిగింది.
మెల్లిగా సిగ్గుపడుతూ చెప్పింది ‘మీ నాన్న వచ్చి వెళ్లారు’
తన నెత్తి మీద పిడుగు పడ్డట్టు బెదిరిపోయింది. ఆ కోపంలో ఆ భయంలో ఆ ఇరిటేషన్‌లో.. తల్లి వైపు కోపంగా చూసి.. ‘నీకసలు బుద్ధి ఉందా.. తెలివి వుండే మాట్లాడుతున్నావా? నాన్న రావడం ఏమిటి?’ అంది.
తల్లి మొహంలో కోపం, బాధ...
‘అంటే నేను.. నేను’ అనడానికి మనస్కరించక ఆగిపోయింది.
‘మీ నానే్న వచ్చాడు.. నా కోసం పువ్వులు తెచ్చాడు.. నీకు ఇష్టమైన పాలకోవా తెచ్చాడు.. అక్కకు లడ్డూ తెచ్చాడు.. రారారా’ అంటూ కూతురిని తన గదిలోకి లాక్కుపోయింది. లోపల తల్లి చెప్పిన స్వీట్ పాకెట్స్ లేవు..
‘పొరపాటున తీసుకువెళ్లినట్టు వున్నాడు’ అంది తల్లి.
ఆ గదిలో పెర్‌ఫ్యూమ్.. ఆ పెర్‌ఫ్యూమ్ స్మెల్ తనకు బాగా గుర్తు. అది తండ్రి వాడే పెర్‌ఫ్యూమ్.. తల్లి జడలో పువ్వులు.. తమ ఇంట్లో పువ్వులు లేవు.. బయటకు వెళ్లి తెచ్చే అవకాశమే లేదు...
‘అంటే నిజంగా నాన్న వచ్చాడా? వస్తే ఎక్కడ?’
‘నాన్న ఎలా వచ్చాడు?’ అడిగింది చంద్రలేఖ.
‘ఎలా ఏమిటి.. పెరట్లో నుంచి వచ్చాడు. పెరట్లో నుంచి కూడా దారి ఉంది..’
వెంటనే చంద్రలేఖ పెరటి వైపు పరుగెట్టింది.. పెరటి తలుపులు తెరిచే వున్నాయి. పెరట్లో అడుగుల గుర్తులు.. అవి చెప్పుల గుర్తులు.
‘నన్ను నమ్మవే.. మీ నానే్న వచ్చాడు.. మనల్ని తనతో పాటు తీసుకు వెళ్తాడట.. ముందు నన్ను.. తర్వాత మీ ఇద్దరినీ’ తల్లి చెబుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది.
* * *

ఆ రాత్రంతా చంద్రలేఖ నిద్రపోలేదు. తల్లి నిద్ర పోనివ్వలేదు.. తండ్రి ఎలా వచ్చాడు.. ఏం చెప్పాడు? అన్నీ వివరంగా చెబుతుంటే భయం వేసింది. తాను కూడా ఆ ట్రాన్స్‌లో పడిపోతోందా? ఎలా నమ్మాలి? ఏం నమ్మాలి? తండ్రి వాడే పెర్‌ఫ్యూమ్ తనకు ఆ స్మెల్ చాలా గుర్తు.. కేవలం కొన్ని చోట్ల మాత్రమే దొరికే పెర్‌ఫ్యూమ్..
ఆ రాత్రి అంతా కలత నిద్రే అయ్యింది చంద్రలేఖకు.
* * *
ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే తలుపు ఎవరో తడుతున్న శబ్దం. రాత్రి ఫ్యూజ్ తీసివేయడం వల్ల కాలింగ్ బెల్ శబ్దం వినిపించలేదు. తలుపుల మీద శబ్దం విని తల్లి తన గదిలో నుంచి పరుగెత్తుకు వచ్చింది. ‘మీ నానే్న వచ్చి ఉంటారు’ అంటూ.
చంద్రప్రభ తలుపు వంక భయంగా చూస్తోంది.
చంద్రలేఖకు వచ్చింది ఎవరో తెలుసు. మెల్లిగా తల్లి దగ్గరికి వెళ్లి గుసగుసగా ‘ష్.. నాన్నతో మాట్లాడ్డానికి ఇద్దరు వచ్చారు. వాళ్లు ఆత్మలతో కూడా మాట్లాడుతారు.. నేనే రమ్మన్నాను. మన ఇంట్లో వున్న దెయ్యాలను పంపించేస్తారు’ చెప్పింది.
‘అవునా.. వాళ్లకు ఎలా తెలుసు.. వాళ్లను నువ్వెప్పుడు కలిశావ్?’ అనుమానంగా కూతురు వంక చూస్తూ అడిగింది తల్లి.
‘రాత్రి నువ్వు నాన్న వచ్చి వెళ్లాడని చెప్పాక.. నేను ఊజా బోర్డు ద్వారా నాకు తెలిసిన ఆత్మల ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆత్మలతో మాట్లాడేవాళ్లను పంపిస్తామని చెప్పారు’ తల్లికి చెప్పింది చంద్రలేఖ వెళ్లి తలుపు తీస్తూ.
సమీర్ భార్గవి లోపలికి వచ్చారు. వాళ్ల వేషధారణ పూర్తిగా మారిపోయింది. అరవై సంవత్సరాల వ్యక్తిలా మారిపోయాడు సమీర్. తెల్లటి జుట్టు.. సూట్.. కళ్లజోడు...
భార్గవి కూడా యాభై ఏళ్ల ఆవిడలా మారిపోయింది. నలుపు రంగు చీర జాకెట్.. మెడలో విచిత్రమైన పెద్దపెద్ద పూసల దండ...
వాళ్లు లోపలికి వస్తూనే చంద్రప్రభ చంద్రకళలను గమనించారు. వాళ్లు తమవైపు అనుమానంగా చూడడం కూడా గమనించారు.
సమీర్ ఇంటి పైకప్పు వైపు చూస్తూ తన చేతిలో వున్న స్టిక్‌ను గాల్లో ఆడించి.. చంద్రలేఖ వైపు చూసి చూపుడు వేలు నోటి మీద వేసుకుని ‘ష్.. మిస్టర్ రాజేంద్రనాథ్ గోడ మీద నిద్ర పోతున్నారు.. డిస్ట్రబ్ చేయకండి.. ఇంతకూ మిస్టర్ రాజేంద్రనాథ్ ఎవరు?’ అని అడిగాడు.
ఎప్పుడైతే తన భర్త గురించి సమీర్ ప్రస్తావించాడో ఆమెకు తమ ఇంటికి వచ్చిన వాళ్ల మీద నమ్మకం కుదిరింది. అందుకే ఉత్సాహంగా ముందుకు వచ్చి ‘మా వారు.. వీళ్ల నాన్నగారు.. నేను చెబితే వీళ్లు నమ్మడం లేదు’ అంది సమీర్‌తో.
‘నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నారు. కానీ తనకు నేను కనిపించడం లేదు.. నేను చెప్పినట్టు చేయండి.. మీ అందరికీ కనిపిస్తాడు’ సమీర్ చెప్పాడు.
చంద్రకళ అలాగే అన్నట్టు తలూపింది.
‘ముందు మా పూజకు కావలసిన ఏర్పాట్లు చూడండి. మీరంతా వెళ్లి ఒక గదిలో కూచోని తలుపులు వేసుకోండి. నేను పిలిచేవరకూ ఎవరూ బయటకు రాకూడదు’ చెప్పాడు సమీర్.
అందరూ ఒక గదిలోకి వెళ్లారు. గడి బయట నుంచి గొళ్లెం పెట్టాడు సమీర్.
* * *
ఆ ముగ్గురినీ లోపల పెట్టి గొళ్లెం పెట్టగానే రంగంలోకి దిగింది భార్గవి. తమ చేతిలో వున్న బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో వున్న అతి శక్తివంతమైన కెమెరాలను ఆ ఇంట్లో అన్ని మూలలకు బిగించడం మొదలుపెట్టింది.
సమీర్ తన చేతిలో వున్న మినీ టేప్‌రికార్డర్ బటన్ ఆన్ చేశాడు. అందులో నుంచి మంత్రాలు గట్టిగా లోపల గదిలో ఉన్న వాళ్లకు భీకరంగా వినిపిస్తున్నాయి.
అవి సమీర్ భార్గవి గొంతులతో రికార్డు చేయబడినవి.
తాము క్షుద్రపూజ చేస్తున్నట్టు వాళ్లను నమ్మించడమే వాళ్ల ఉద్దేశం.
స్పీకర్లు కూడా అమర్చారు. ఆ ఇంట్లో ఏ మూల ఏం జరిగినా స్పష్టంగా చీకట్లో కూడా రికార్డు చేసే శక్తివంతమైన కెమెరాలు అవి.
క్రితం రోజు రాత్రే భార్గవికి తాము చేయబోయే ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పాడు.
సరిగ్గా నలభై అయిదు నిమిషాల తరువాత వాళ్లు వున్న గది తలుపులు తెరిచారు. ఆ ఇంట్లో పసుపు నలుమూలలా చల్లారు. గది మధ్యలో ముగ్గేశారు.
చంద్రకళ సమీర్ వంక చూసి ‘నేను మీ వారితో మాట్లాడొచ్చా.. మా పిల్లలకు వాళ్ల నాన్న కనిపిస్తారా?’ ఆదుర్దాగా అడిగింది.
(ఇంకా ఉంది)

తేజారాణి తిరునగరి