S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మకుటం లేని మహారాజులు

‘రాజుల్ మత్తులు వారి సేవ నఱకప్రాయంబు వారిచ్చునం
బోజాక్ష చతురంగ యాన తురగీ భూషాదులాత్మ వ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలు పరితృప్తిన్ బొందితిన్ జ్ఞాన ల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళ హస్తీశ్వరా!’
మహాప్రభువుల సమక్షంలో ఠీవిగా గజారోహణ, అశ్వారోహణాది సత్కారాలు, గండపెండేరాది నూషణాలు తొడిగించుకుని మహా పండితులై ఆస్థాన కవి శేఖరుల, అంగరంగ వైభవాల్లో మునిగి తేలిన కవులకు రాజుల పట్ల, రాజసేవ పట్ల ఎందుకంత కసి ఏర్పడింది? దానికేం బలమైన కారణమో మనం ఊహించవచ్చు. పొగుడుతూ కవిత్వం చెప్పాలి. ఆహా! ఓహో! అనాలి. ఆస్థాన దిగ్గజమని భావింపబడే ధూర్జటి రచించిన ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లో, విసిగి వేసారి రాజులను నిరసిస్తూ కొన్నీ, తనను తాను నిందించుకుంటూ అల్లిన మరి కొన్ని ముత్యాల్లాంటి పద్యాలు సకల మానవాళికీ శిరోధార్యాలు. దైవాన్ని పొగిడే నోటితో, నరస్తుతి చేయ బుద్ధవుతుందా? అంతేకాదు. సంసారంలో అసలు నిజాయితీగా ఎలా బ్రతకాలో మాయతో ఎలా బ్రతకకూడదో స్పష్టంగా సరళంగా చెప్పిన కవులు అరుదు.
ఏ కారణమూ లేదు. ఎవ్వరూ అడగలేదు. ఓ మంచి ముహూర్తం చూసుకుని అందులో ఓ వంద శతక పద్యాలు ఎంపిక చేసుకుని పాడి రికార్డ్ చేసేశాను. ఎంతో తృప్తి పడ్డాను. ఓ వేసవిలో పద్యాలన్నీ పాడేసి ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆ పద్యాలను నెమరు వేసుకుంటున్నాను. మనసులో ఒక కీర్తన మెదిలింది.
త్యాగయ్యకు ఎంత లోకానుభవం? ఎంతటి ఆత్మపరిశీలన?
చూడండి ఈ కీర్తన!
గౌళీపంతు రాగంలో
‘కాసిచ్చేదే గొప్పాయెనురా - కలిలో రాజులకు॥
(హరి)దాసులు సేవింపరనుచు ప్రభువులు
దయమానిరి పరమెంచక పోయిరి ॥
రాజాంగము కొఱకు నాల్గుజాతుల రక్షణ పరసుఖమో
రాజసులై సన్మార్గమెరుగక పరాకు సేయ ఘనమో
తా జన్మము కొలిచే విప్రవరుల కానందము కలదో! త్యాగ
రాజ వినుత! నీ మాయగాని నీరజనయన!
సుజనాఘ విమోచన
రాజసేవ పట్ల విముఖత్వానికి కారణం ఒకటే. వాళ్ల భజన చేయాలి. ఉన్నవీ లేనివీ కలిపి ॥
వారి మీద పాటలో పద్యాలో అల్లాలి. ఇంద్రుడనీ చంద్రుడనీ పొగడాలి. అది ఈ మహాకవుల వల్ల అయ్యేపనా? అందుకే ఉన్నదున్నట్లు మాట్లాడారు.
బాగా సాధన చేసిచేసి ప్రయత్నిస్తే త్యాగయ్యలా పాడగలమేమో కానీ విద్వాంసులెవ్వరూ ఆయనలా జీవితాలు వెళ్లదీయలేరు. ఇది సత్యం.
చాలా గుప్తంగా సిగ్గుపడుతూ రెండో కంటి వారికి తెలియకుండా దానం చేయాలని చెప్పారు పెద్దలు. ఈ వేళ అలా వుందా పరిస్థితి?
ముక్కు మూసుకుని కూర్చుని కృష్ణా! రామా! అనుకునే భక్తులు మన దగ్గరకు రారేమి? మన భజన సేయరేమి? అనుకునే రాజులకు పరలోక భయమంటూ ఉండదు. కొంతమంది లోపల తిట్టుకుంటూ ఏ పావలాయో పరకో విదిల్చి అదేదో ఘనకార్యమని భావిస్తూంటారు. పుణ్యమొస్తుందని దిక్కుమాలిన ఆశ. అలాంటి దానం వల్ల ఫలితముండదు.
అశ్రద్ధతో చేసిన హోమంగానీ, దానం కానీ, తపస్సు కానీ, ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఏ సుఖాన్నీ ఇవ్వవు.
ఈ సత్యాన్ని జీర్ణించుకున్న మహనీయులు పోతరాజు త్యాగరాజు. రాజాశ్రయం కలలో కూడా కోరని ఈ భక్తులు నిజంగా ధన్యులు. మనం పుట్టక మునుపే పుట్టిన ఈ మహానుభావులు లోకాన్ని ఎప్పుడో కాచి వడగట్టేశారు. ఈ వేళ పరిస్థితి భిన్నంగా వుందా? వేసవి కాలంలో చలివేంద్రాలను ప్రారంభిస్తూ వందలాది కార్యకర్తలను వెంటబెట్టుకుని పెద్ద పెద్ద కుండల మధ్య ఠీవిగా నిలబడి, దాహం తీరుస్తున్నట్లుగా పత్రికల్లో ప్రకటనలు, చేసిన అప్పు తీర్చకుండా (రుణ మాఫీ) కోట్లాది రుణాలు మాఫీ చేస్తున్నట్లుగా బాహాటంగా ప్రకటించేలా ఫొటోలు, ఇంట్లో ఉద్యోగం సద్యోగం లేని దీనులకు ఉచితంగా ధన సహాయం చేసినట్లుగా పుచ్చుకున్న వారితో కలర్ ఫొటోలు, దేశాన్ని అమ్మేయగల ఆర్థిక నేరాలు దిట్టంగా చేసి, దర్జాగా ఒకప్పుడు బతికినందుకు, గుర్తుగా చిరునవ్వులు చిందిస్తూ, కోర్టులకు వెళ్తూ చేసే అభివాదాలు.. ఇవన్నీ కలియుగ లక్షణాలే. ఇవన్నీ కళ్లప్పజెప్పి చూసే సమాజంలో విజ్ఞులైన వారు సిగ్గుతో తలవంచుకోరా? ఎవరిని అడగగలరు? ప్రశ్నించగలరు? అందుకే ప్రభుత్వం, ప్రభుత్వ మర్యాదలు, ప్రభుత్వ కొలువుల పట్ల అసహ్యం, హేయభావం పుట్టి ‘రాజుల్ సేవ నరక ప్రాయమని’ ఉన్నదున్నట్లు సెలవిచ్చాడు ధూర్జటి.
‘పనికిరాని వాళ్లను పరమ పురుషులని
ఛస్తే పొడగను ఎందుకా ఖర్మ రామా!
ధర్మాత్మక! ధనధాన్య దైవమునీవై యుండగ॥
దుర్మార్గ చరాధములను దొరనీవన జాలరా:
అంటూ..
పలుకు బోటిని సభలోన
పతిత మానవుల కొసగే
ఖలుల నెచట పొగడను శ్రీకర త్యాగరాజ వినుత॥
అంటారు త్యాగయ్య. పైవాణ్ణి నమ్ముకుంటే మనకో దారీతెన్నూ దొరుకుతుంది. పక్కవాణ్ణి లేదా పాలించే వాణ్ణి నమ్ముకుంటే అధోగతే.
నమ్ముము తల్లి నాదు వచనమ్ము ధనమ్మునకై బజారులో
అమ్మను జేశ్వరాధముల కమ్మను నిన్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుం జెవి కాటుక కంటి వేడి బా
ష్పమ్ముల చేతితో తుడిచివైచెడి భాగ్యము నీకె అబ్బెరా’ అని కరుణశ్రీ ఎంత ముద్దుగా పొగిడాడో పోతనను.
పుణ్యమూర్తులను పొగడాలంటే సమర్థత కావాలి. సంస్కారముండాలి.
చదువుల తల్లి సరస్వతిని నిండు సభలో భ్రష్టులకు సమర్పించే దౌర్భాగ్యపు పనికి పూనుకోను అని పోతన చెప్పినట్లే త్యాగయ్య కూడా చెప్పాడు.
భక్తులు భావాలు పంచుకుంటారనేందుకు ఇదో ఉదాహరణ.
మమత బంధన యుతమైన దిక్కుమాలిన నరస్తుతిలో ఏముంది సుఖం? ఎప్పుడు పొగడటం ఆపేస్తే, అప్పుడే విరోధం. ఎందుకా భజన?
సత్యము తప్పక సకల లోకులకు
భృత్యుడై దైవ భేదము లేక
నిత్యమైన సుస్వర గానంతో
నిరంతరము త్యాగరాజ నుత
రామ నామ సుఖి ఎవరో, సుముఖి ఎవరో అఖిల సారమైన తారకనామ సుఖియే సుఖి అంటారు. త్యాగయ్య నిజమైన సుఖానికి అర్థం పరమార్థం ఇదే. అందుకే భాగవతాగ్రేసరులైన పోతరాజు, త్యాగరాజు ఇద్దరూ రామభక్తి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులు. అందుకే మనకు చిరస్మరణీయులు.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656