S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డార్క్ అవెన్యూ-8

కారు వెళ్తోంది. భార్గవి సమీర్ వంక చూసి అడిగింది.
‘శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో కచ్చితంగా తెలిసినట్టే కదా?’
శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో చెప్పాడు సమీర్.
‘అక్కడా? పెద్ద కోటీశ్వరుడు.. అలాంటి హోటల్‌లో?’
‘స్టార్ హోటల్‌లో ఉండే తాహత్తు లేక కాదు. స్టార్ హోటల్ అయితే తన ఐడెంటిటీ బయటపడుతుందన్న భయం. అందరి దృష్టి పడుతుంది. ఇలాంటి చిన్న హోటల్స్ అయితే ఎవరూ పట్టించుకోరు. తన పని తాను చేసుకుపోవచ్చు’ చెప్పాడు సమీర్.
‘క్రిమినల్ మైండ్ కదూ...’ అంది భార్గవి.
‘అతను క్రిమినల్ కాబట్టి కదా.. మనం అతడిని వెతుక్కుంటూ వెళ్తున్నాం’ నవ్వి అన్నాడు సమీర్.
‘నిజమే.. కానీ మరీ ఇంత క్రిమినల్ మైండా? డబ్బు కోసం స్వంత చెల్లెలిని.. చెల్లెలి కుటుంబాన్ని’
‘కన్నవాళ్లనే నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. డబ్బుకన్నా అతి శక్తివంతమైనది మరోటి లేదని కొందరి నమ్మకం. అందుకే ఎంత డబ్బు వున్నా ఇంకా డబ్బు కోసం వెంపర్లాడుతూనే ఉంటారు. విషాదకరమైన విషయం ఏమిటంటే పది తరాలకు సరిపడే డబ్బు వున్నా ఇంకా డబ్బు కోసం పరిగెడుతూనే ఉంటారు. కదిలే కాలాన్ని.. కరిగిపోయే విలువైన జీవితాన్ని పట్టించుకోకుండా’ చెప్పాడు సమీర్.
అలాగే సమీర్ వంకే చూస్తోంది భార్గవి. ఎంత చక్కగా విశే్లషించాడు.
ఎప్పుడూ సీరియస్‌గా ఉండే సమీర్ ఇంత లోతుగా ఆలోచిస్తాడని అనుకోలేదు..
అన్నింటికన్నా ఆమెకు సమీర్‌లో నచ్చింది -పక్కన అందమైన అమ్మాయి అందుబాటులో వున్నా.. చాలా డీసెంట్‌గా ఉండడం. అతనితో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లొచ్చు’ అనేంత భరోసా ఇస్తాడు.
ముఖ్యంగా అతను పక్కనుంటే ప్రశాంతంగా సెక్యూర్డ్‌గా ఉంటుంది.
‘నాకు తెలిసి మనం వెళ్లేసరికి అతను ఉండకపోవచ్చు’ అన్నాడు సమీర్.
‘అదేమిటి?’
‘అదంతే.. ఎందుకంటే మనకన్నా అతను ఇంకా అడ్వాన్సులో ఉన్నాడు.. ఎప్పుడైతే దుర్జన్‌కుమార్ చనిపోయాడో.. అప్పుడే అతను ఎలర్ట్ అయ్యాడు’
భార్గవి కళ్లు మూసుకుంది. ఒక్కసారిగా ఏదో మగతగా అనిపించింది. కళ్లు బలవంతంగా తెరచి చూసి భయంతో బిగుసుకు పోయింది.
ఎదురుగా తమ కారుకు ఎదురుగా ఒక వృద్ధుడు వస్తున్నాడు. పొడవాటి తెల్లటి గడ్డం.. తీక్షణమైన చూపులు.. రోడ్డుకు అడ్డంగా...
‘కారాపండి’ గట్టిగా అరిచింది భార్గవి.
ఆమె మాటలతో సడెన్‌గా కారు ఆపారు. కీచుమని శబ్దం చేస్తూ కారాగింది. కారు ఎక్కువ స్పీడ్‌లో వెళ్లడం లేదు.. లేకపోతే పల్టీలు కొట్టేది.
‘ఏమైంది?’ కంగారుగా అడిగాడు సమీర్ భార్గవి భుజాలు పట్టి కుదుపుతూ. భార్గవి ఒక విధమైన షాక్‌లో వుంది. ఢిల్లీలో ఎలాంటి సంఘటన ఎదురైందో.. అలాంటి సంఘటనే...
‘కారుకు ఎదురుగా...’
సమీర్ రోడ్డు మీదికి చూశాడు.. ఏమీ లేదు.
‘నువ్వు ఏదో చూసి ఊహించుకుని భయపడ్డావు’ అన్నాడు సమీర్ డ్రైవర్ వైపు చూసి కారు పోనివ్వమని చెబుతూ..
‘తాను చూసింది నిజమే..’ అని సమీర్‌ని ఎలా నమ్మించాలో అర్థం కాలేదు.
* * *
అది చాలా పురాతనమైన హోటల్.. డొక్కు మంచం.. పెద్ద శబ్దంతో తిరిగే ఫ్యాన్.. ఇనుప కుర్చీలు.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్.. ఒక కుర్చీలో రాజేంద్రనాథ్ కూచున్నాడు.
పంచె కట్టుకుని వున్నాడు. పంచె పైభాగంలో మినహా ఎలాంటి ఆచ్ఛాదనా లేదు. నుదురు మధ్యలో పెద్ద కుంకుమబొట్టు.. ఇనుప మంచం మధ్యలో నల్లటి వస్త్రం.. దాని మధ్యలో నిమ్మకాయలు.. కుంకుమ.. పద్మాసనంలో కూచున్నాడు. కళ్లు మూసుకున్నాడు. ధ్యానంలోకి వెళ్లాడు.
అతనే శివప్రసాద్ వర్మ.. చంద్రకళ అన్నయ్య.
అతను కళ్లు మూసుకోగానే చీకటి తెరలు కనిపించాయి.
ఆ చీకటి తెరల నుంచి వెలుతురు.. చితి తాలూకు వెలుతురు...
జంగానియా తీశ్మార్.. చితి ముందు కూచొని క్షుద్రోపాసన చేస్తోన్న తీశ్మార్...
‘శివప్రసాద్ వర్మ.. నువ్వు వెంటనే బయల్దేరి వచ్చేయ్. క్షుద్రోపాసనలో ఆఖరి ఘట్టం మొదలైంది. అర్ధరాత్రి రెండు గంటలకు దుర్ముహూర్తం.. క్షుద్రశక్తులు బలిని స్వీకరించే సమయం...
చంద్రకళ ఆత్మార్పణతో క్షుద్రశక్తులు నిధిని నీకు స్వంతం చేస్తాయి. నువ్వు బయల్దేరి రా..’ అతని గొంతులో ఆజ్ఞ వినిపిస్తోంది.
ధ్యానంలో నుంచి బయటకు వచ్చి కళ్లు తెరిచాడు శివప్రసాద్ వర్మ. అతని కళ్లు ఎర్రగా వున్నాయి. తన ఎదురుగా వున్న రాజేంద్రనాథ్ వైపు చూశాడు.
‘ఎలా వున్నారు బావా?’ ఆ అడగటంలో ధ్వనించిన కంఠంలో ఒళ్లు గగుర్పొడిచే హెచ్చరిక కనిపిస్తోంది.
‘శివప్రసాద్ వర్మ.. నాకు ఎనే్నళ్లు ఈ శిక్ష.. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నా.. అసలు నీకేం కావాలి.. నా ఆస్తి మొత్తం తీసుకో.. మీ నాన్న మీ చెల్లెలికి ఇచ్చిన ఆస్తి తీసుకో.. మమ్మల్ని వదిలేయ్. నన్నో ఆత్మలా నటించమన్నావ్.. నా భార్యాబిడ్డలను పిచ్చి వాళ్లుగా ముద్ర వేయించావు. అయినా వాళ్లు ప్రాణాలతో ఉంటే చాలనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పటికైనా నన్ను నా కుటుంబాన్ని వదిలేయ్.. నీకు కనిపించనంత దూరం వెళ్లిపోతాం’ అన్నాడు రాజేంద్రనాథ్.
‘ఎక్కడికెళ్తావ్ పిచ్చి అమాయకపు బావా! నీ ఆస్తి నా తండ్రి నా చెల్లెలికి ఇచ్చిన ఆస్తి మొత్తం కలిపితే నిధిలో వున్న ఒక్క వజ్రం విలువ చేయవు.. నిధిలో వున్నది సంపద కాదే.. కొన్ని శక్తులు నిక్షిప్తపరచిన తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి.... సరే బావా! నీకు నీ కుటుంబానికి విముక్తి కలిగిస్తాను.. నాతోపాటు నీ కుటుంబాన్ని చూడడానికి వచ్చేయ్’ అంటూ టేబుల్ మీద వున్న మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు.
‘ఓకే ఓకే రెండు హెలికాప్టర్లు..’ చెప్పి మొబైల్ ఆఫ్ చేసి
‘మనం ఈ హోటల్ గది ఖాళీ చేసి శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం...’ చెప్పాడు డ్రెస్ వేసుకుంటూ..
పదే పది నిమిషాల్లో అక్కడి నుంచి బయల్దేరారు.
‘ఒక్క విషయం. రిసెప్షన్‌లో మనం రూమ్ ఖాళీ చేస్తున్నట్టు చెప్పడం లేదు. నువ్వు నోరు జారకు బావా.. నీ కుటుంబం ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి’ చెప్పాడు శివప్రసాద్ వర్మ.
‘ఎందుకు?’ అడిగాడు రాజేంద్రనాథ్.
‘ఎందుకంటే మనం గది ఖాళీ చేశామంటే మన గురించి వేట మొదలవుతుంది. మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే మన కోసం ఇక్కడే కాపు కాస్తారు. ఈలోగా మనం హెలికాప్టర్‌లో జంగానియా వెళ్తాము. నీ భార్యాబిడ్డలు కూడా అక్కడికే వస్తారు’ చెప్పి ఒక చిన్న బ్యాగ్‌ను ఆ గది నుంచి బయటకు విసిరేశాడు. ఆ గది వెనుక భాగంలో చెత్తకుప్ప వుంది. ‘మనం వెళ్లి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుందాం?’ అన్నాడు. ఒక రోజు ముందే సామాను షిఫ్ట్ చేశాడు.
ఆ గదిలో నుంచి బయటకు వచ్చారు. రూమ్‌కు తాళం వేశారు.
రూమ్‌లో నుంచి బయటకు వచ్చే ముందు రాజేంద్రనాథ్ కావాలనే తన మొబైల్ ఫోన్ ఆ గదిలో మంచం మీద వదిలేసి వచ్చాడు.
మొబైల్‌లో శివప్రసాద్ వర్మ మాట్లాడిన మాటలు రికార్డ్ చేశాడు.
* * *
‘మేము మరో రెండు గంటల్లో వస్తాం.. మా కోసం ఎవరైనా వస్తే చెప్పండి’ చెప్పి రిసెప్షన్‌లో ‘కీ’ ఇచ్చి బయటకు నడిచాడు శివప్రసాద్ వర్మ రాజేంద్రనాథ్‌తో కలిసి.
వీళ్లు వెళ్లిన ఇరవై నిమిషాల తర్వాత ఆ హోటల్ ముందు కారులో నుంచి దిగారు సమీర్, భార్గవి.
రిసెప్షన్‌లోకి వచ్చి శివప్రసాద్ ఫొటో చూపించి అడిగాడు సమీర్.
‘కాసేపటి క్రితం వెళ్లారు సార్.. రావడానికి టైం పడుతుందట. వెయిట్ చేయమన్నారు’ చెప్పింది రిసెప్షనిస్ట్.
వెనక్కి తిరిగి వెళ్లబోయిన సమీర్ ఆగాడు. రిసెప్షనిస్ట్ వైపు చూసి ‘ఏం చెప్పారు?’ అని అడిగాడు.
‘ఎవరైనా వాళ్ల కోసం వస్తే వెయిట్ చేయమన్నారు సర్’ చెప్పింది రిసెప్షనిస్ట్ సమీర్ తన ఐడెంటిటీ చూపించాక.
**
‘మాకు ఆ గది చూపించండి. వెరీ అర్జెంట్’ చెప్పాడు సమీర్.
‘వాళ్లు మళ్లీ వస్తామని చెప్పారుగా’ అడిగింది భార్గవి.
‘ఊహూ... నా అంచనా నిజమైతే వాళ్లు గది ఖాళీ చేసి వెళ్లాలి’ చెప్పాడు వాళ్లు వున్న రూమ్ వైపు వెళ్తూ.
‘అదేమిటి?’ అడిగింది భార్గవి.
‘మనల్ని తప్పుదారి పట్టించడానికి.. మనం వాళ్ల కోసం ఇక్కడే వెయిట్ చేస్తామని అతడి ఉద్దేశం’ అంటూ ముందుకు కదిలాడు.
శివప్రసాద్ వర్మ వున్న రూమ్‌ను ఓపెన్ చేశాడు హోటల్ మేనేజర్.
అక్కడి వాతావరణం చూడగానే భార్గవిలో మళ్లీ భయం మొదలైంది.. మంచం మధ్యలో క్షుద్రపూజ జరిగిన ఆనవాళ్లు.
అంటే తనకు ఇందాక రోడ్డు మీద కనిపించిన దృశ్యానికి.. ఈ క్షుద్రపూజకు సంబంధం ఉందా?’
‘సర్ వాళ్లు చెప్పాపెట్టకుండా రూమ్ ఖాళీ చేశారు’ అన్నాడు మేనేజర్ వాళ్ళు రూమ్ ఖాళీ చేశారని కన్ఫర్మ చేసుకుని.
‘మీ దగ్గర అడ్వాన్స్ ఉంటుందిగా?’ అడిగాడు సమీర్.
‘ఉంటుంది సర్. రెండు రోజుల రెంట్ అడ్వాన్స్ ఉంటుంది. ఇక్కడ పనివాళ్లకు టిప్స్ కూడా బాగా ఇచ్చేవాడు’ చెప్పాడు మేనేజర్.
సమీర్‌కు సిట్యుయేషన్ అర్థమైంది. ఇప్పుడేం చేయాలి.. బయటకు నడుస్తూ ఆలోచిస్తూ వెళ్లి కారులో కూచొని చంద్రలేఖకు ఫోన్ చేద్దామని మొబైల్ తీశాడు. స్విచాఫ్‌లో వుంది. చార్జ్ అయిపోయిన విషయం ఈ హడావిడిలో గుర్తించలేదు.
వెంటనే ఛార్జర్ బ్యాంక్ తీసి కనెక్ట్ చేసి ఫోన్ ఆన్ చేశాడు. ఫోన్ ఆన్ చేయగానే వాట్సాప్‌లో చంద్రలేఖ పంపిన మెసేజ్.. జిపిఎస్ కనిపించింది.
వెంటనే జిపిఎస్ చూస్తుంటే సడెన్‌గా కట్ అయింది.. జిపిఎస్ చూపించడం లేదు.. ఫోన్ పోయి ఉండాలి. లేదా వాళ్లు లాక్కొని ఉండాలి.. లేదా ఆఫ్ చేయబడింది.
షిట్! ఇప్పుడెలా అనుకుంటూ ఉండగానే... చటుక్కున ఒక విషయం గుర్తొచ్చింది.
వెంటనే కారులో నుంచి దూకినంత పని చేసి హోటల్‌లోకి పరుగు పెట్టాడు. భార్గవి విషయం అర్థంకాక తాను కూడా సమీర్ కూడా పరుగెత్తింది.
అప్పుడే మేనేజర్ రూమ్‌ను క్లీన్ చేయించబోతున్నాడు.
‘స్టాపిట్’ అని అరిచి మంచం దగ్గరికి వెళ్లాడు. బ్లాక్‌కలర్ క్లాత్ మీద కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి. దానితోపాటు అదే బ్లాక్ కలర్ క్లాత్‌లో కలిసిపోయి ఉంది మొబైల్ ఫోన్.. రాజేంద్రనాథ్ కావాలని అక్కడ జారవిడిచిన ఫోన్. వెంటనే దాన్ని తీసుకున్నాడు.
* * *
భార్గవికి అంతా అయోమయంగా ఉంది.
సమీర్ కారు ఎక్కాక అడిగింద ‘ఏమైంది?’ అంటూ.
రాజేంద్రనాథ్ చాలా స్మార్ట్‌గా బిహేవ్ చేశాడు. శివప్రసాద్ వర్మ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడు. మనల్ని తప్పుదోవ పట్టించాలని శివప్రసాద్ వర్మ ప్రయత్నిస్తే-
మనకు కరెక్ట్ వే చూపించాడు రాజేంద్రనాథ్.
చంద్రలేఖ ఫ్యామిలీని జంగానియా తరలిస్తున్నారు.
శివప్రసాద్ వర్మ కూడా అక్కడికే వెళ్తున్నాడు.
అక్కడ అసలు కథ మొదలవుతుంది.
ఈ కథకు ముగింపు కూడా అక్కడే...
మనకు టైం లేదు.. అంటూనే ఉన్నతాధికారులతో మాట్లాడాడు. అత్యవసరంగా హెలీకాప్టర్ కావాలని చెప్పాడు.
ఇక్కడి నుంచి జంగానియాకు ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది. ఎందుకంటే క్షుద్రపూజలు అర్ధరాత్రి జరుగుతాయి. అందులోనూ ఆదివారం అమావాస్య. మూఢనమ్మకాలకు కలిసొచ్చిన రోజు...
భార్గవి మనసులో ఏదో భయం.. కానీ సమీర్ వున్నాడని నిశ్చింత. మనసైన వ్యక్తి మనసుకు నచ్చిన వ్యక్తి మన పక్కన ఉంటే ఇంత నిశ్చింత ఉంటుందా? అనిపించింది.
* * *
చంద్రలేఖ ఆలోచిస్తోంది. ఆమెకు అర్థమవుతుంది. తమ కుటుంబం ట్రాప్‌లో పడింది. ఇప్పుడు చేయవలసింది జరుగబోయే దానిని ఎదుర్కోవడమే.
ఫోన్‌ను దారిలోనే తీసేసుకున్నారు. సమీర్‌కు తమ ఆచూకీ చెప్పే అవకాశం లేదు. అయినా ఆమె మనసులో ఏదో మూల సమీర్ భార్గవి తమని కాపాడుతారనే నమ్ముతోంది.
వహీద్ ఇచ్చిన తాయెత్తును తల్లి మెడలో కట్టింది. తల్లి ప్రమాదంలో ఉందని అర్థమవుతోంది. తనకు ఎలాంటి ఆపద వచ్చినా తాను ఎదుర్కొంటుంది.. లేదా రాణించడానికి సిద్ధపడుతుంది. అమ్మ బావుండాలి. నాన్నను కలుసుకోవాలి.
ఒక్కో చిక్కుముడి అర్థం అవుతుంది.
డబ్బు కోసమే తన మామయ్య ఆడిన నాటకం.. కానీ ఇంత నీచానికి పాల్పడుతాడు అనుకోలేదు.
డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని ఆమె చదివిన క్రిమినాలజీ చెబుతుంది.
కారులో నుంచి హెలీకాప్టర్‌లోకి ఎక్కించారు.
ఒక విలయానికి కాలం సాక్షి కాబోతోంది.
* * *
జంగానియా
ప్రకృతి కనె్నర్ర చేస్తే నల్లబడ్డ క్షేత్రం.. ప్రేతాత్మలు మేఘాలను ఆవహించినట్టు..
ఈదురుగాలి గబ్బిలాలతో కలిసి గాలిలోకి ఎగిరినట్టు
చితిమంటలు మృత్యువును ఆహ్వానిస్తున్నట్టు...
ఎటు చూసినా సమాధులు...
అమావాస్య
అర్ధరాత్రి..
పిశాచాలు బలం పెంచుకునే నిశిరాత్రి...
తరతరాలుగా క్షుద్రోపాసనలతో ప్రేతాత్మలను ఆవాహన చేసుకున్న జంగానియా.. ప్రాంతం భీతిగొలిపేలా ఉంది.
సమాధుల మధ్య పెద్ద చితి మంట.
ఆ చితి మంట ముందు తొంభై తొమ్మిదేళ్ల తీశ్మార్...
చూపుల్లో క్రూరత్వం.. గొంతులో తగ్గని గాంభీర్యం
నలుగురంగు వస్త్రాన్ని ధరించి కాటుకను పెట్టుకుని కాళరాత్రి భయానకంగా కనిపిస్తున్నాడు.
ఒక హెలీకాప్టర్‌లో రాజేంద్రనాథ్ శివప్రసాద్ వర్మ దిగారు.
మరో హెలీకాప్టర్‌లో చంద్రకళ కుటుంబం దిగింది.
చంద్రకళను మినహాయించి చంద్రప్రభను చంద్రలేఖను చెట్టుకు కట్టేశారు. చంద్రకళ ట్రాన్స్‌లో ఉన్నట్టు ఉంది.
తీశ్మార్ ముందు నిలబడి ఉంది చంద్రకళ...

- ఇంకా ఉంది -

తేజారాణి తిరునగరి