S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేరా సైనిక్ మహాన్

ప్రపంచం మొత్తమీద సాయుధ పాటవంలో, ఆయుధ సంపత్తిలో భారత సైన్యం ముందుకు దూసుకుపోతోంది. విశ్వవ్యాప్తంగా చూస్తే అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్మీని కలిగిన అతి కొద్ది దేశాల్లో మన దేశం ఒకటి. భారతీయ త్రివిధ దళాలు శత్రు దుర్బేధ్యమైనవి. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన పలు యుద్ధాలలో మాతృభూమి రక్షణకు పదాతి, వాయు, నౌకాదళ విభాగాలు ప్రదర్శించిన తెగువ నిరుపమానం. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేకంగా అమలవుతున్న 370వ అధికరణను రద్దు చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచానికి తన సత్తాను చాటింది. దాయాది దేశమైన పాకిస్తాన్ ఏ విధంగానైనా జమ్మూ కశ్మీర్‌ను కబళించాలని దశాబ్దాల తరబడి చేస్తున్న కుటిల ప్రయత్నాలకు చెక్ పెడుతూ 370వ అధికరణను రద్దు చేయడం గొప్ప సాహసమే. జమ్మూ కశ్మీర్, లడక్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్’ (ఏపీఎఫ్‌ఎస్‌ఓడీ)ను ఏర్పాటు చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో ఆర్మీ శక్తి అపారమైనది. పదాతి, వాయు, నౌకాదళాల్లో చేరేందుకు యువతీ యువకులు ఎంతగానో ఉత్సాహపడుతుంటారు. మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలు ఎనలేనివి. ప్రతి పౌరుడు తన నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి గురించి అన్ని వివరాలను తెలుసుకుంటాడు. అంతే ఆసక్తితో దేశభద్రతకు సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల సేవలను తెలుసుకోవాలి.
స్పెషల్ ఫోర్సెస్ డివిజన్ మొదటి అధిపతిగా ఆర్మీ మేజర్ జనరల్ ఏకే ధింగ్రాను కేంద్రం నియమించింది. ఈ డివిజన్ విశేషమేమిటంటే- ఇందులో త్రివిధ దళాలకు చెందిన సుశిక్షుతులైన సైనికులు ఉంటారు. ఈ డివిజన్‌ను కేంద్రం 2018 సెప్టెంబర్ 28న ఏర్పాటు చేసింది. పాక్ నుంచి కశ్మీర్‌లోకి చొరబడిన మతోన్మాదులు, ఉగ్రవాదుల భరతం పట్టేందుకు ఈ డివిజన్ నిరంతరం అప్రమత్తంగా విధులను నిర్వహిస్తుంది. ఈ డివిజన్‌ను ‘మూడు సేవల కమాండ్’ అంటారు.
కార్గిల్ యుద్ధం ముగిశాక అప్పటి జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసేందుకు ఓ టాస్క్ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్స్ డివిజన్‌ను ఏర్పటు చేశారు. ఈ డివిజన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 2019 సెప్టెంబర్ 28న ‘స్మెల్లింగ్ ఫీల్డ్’ పేరుతో విన్యాసాలు నిర్వహించారు. గుజరాత్‌లోని కచ్‌లో ఈ విన్యాసాలు జరిగాయి. అదే సమయంలో అండమాన్, నికోబార్ దీవుల్లో ‘డీఏఎన్‌ఎక్స్-2019’ పేరుతో విన్యాసాలు నిర్వహించారు. ఈ డివిజన్‌ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్ట్ఫా అని కూడా పిలుస్తారు. భారత్ లోపల, వెలుపల ప్రత్యేక ఆపరేషన్స్‌ను ఈ డివిజన్ అమలు చేస్తుంది. శత్రుదేశంలో వౌలిక సదుపాయాల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు ఈ విభాగంలోని వారికి శిక్షణ ఇస్తారు. ఈ డివిజన్‌లో మూడువేల మందితో యువ సైన్యం ఉంటుంది. ఇందులో పారా పేరుతో స్పెషల్ ఫోర్సెస్, నౌకాదళానికి చెందిన మార్కోస్ పేరుతో విభాగం, వాయుసేనకు చెందన గరుడ్ కమాండో ఫోర్స్ ఆపరేషన్లను నిర్వహిస్తాయి. ఆదేశాలు వచ్చిన మరుక్షణం లిప్తకాలంలో యుద్ధరంగంలో ఈ సైనికులు ఉంటారు. 1948 నుంచి పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్ భూభాగాలను విముక్తి చేసే లక్ష్యంతో ఈ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.

సాహసవీరులకు వేదిక..
భారత ఆర్మీ సాహస వీరులకు, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పాటుపడే మెరికల్లాంటి యువకులకు వేదిక. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతాయి. చైర్మన్ ఆఫ్ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్‌గా కరీం బీర్ సింగ్, ఎయిర్‌ఫోర్స్ అధిపతిగా ఎయిర్ మార్షల్‌గా రాకేష్ కుమార్ సింగ్ బదూరియా ఉన్నారు. కోస్ట్ గార్డ్, పారామిలిటరీ సంస్థలు అంటే అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, అనేక వ్యూహాత్మక బలగాల కమాండ్‌ల మద్దతుతో ఆర్మీ పని చేస్తుంది. భారత రాష్టప్రతి త్రివిధ దళాల అధిపతిగా వ్యవహరిస్తారు. మన సైన్యంలో అన్ని విభాగాల్లో సుమారు 14 లక్షల మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరికి రిజర్వులో 2.1 మిలియన్ల మంది సైనికులు ఉన్నారు. ఇంకా 1.3 మిలియన్ల మందితో పారా మిలిటరీ భద్రతా బలగాలు ఉన్నాయి. 15.67 లక్షల మంది మాజీ సైనికులు ఉన్నారు. సైన్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యువత ఎక్కువ మంది చేరుతుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు కూడా ఇపుడు ఉత్సాహవంతంగా చేరుతున్నారు. ఆర్మీలో 3 శాతం, నేవీలో 2.8 శాతం, ఎయిర్‌ఫోర్స్‌లో 8.5 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్మీని భారత్ కలిగి ఉంది. ఐదవ శక్తివంతమైన ఆర్మీగా పేరుతెచ్చుకుంది. రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో నాల్గవ స్థానంలో భారత్ ఉంది. భారత్ ఆర్మీ 1947, 1965, 1971లో పాకిస్తాన్‌తో, 1962 చైనాతో జరిగిన యుద్ధాలలో, ఆ తర్వాత కార్గిల్ యుద్ధం, సియాచిన్ సంఘర్షణలో పోరాట పటిమను ప్రపంచానికి చాటింది. ఏటా డిసెంబర్ 7న ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డే’ను జరుపుకుంటున్నాం. కేంద్రం ఇతోధికంగా బడ్జెట్‌ను పెంచడంతో ఆర్మీ ఆధునీకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఆర్మీకి అవసరమైన ఆయుధ సామాగ్రిని సరఫరా చేసేందుకు ప్రభుత్వ రంగంలోని హాల్, బీఈఎల్, బీఈఎంఎల్, బీడీఎల్, ఎండీఎల్, జీఎస్‌ఎల్, జీఆర్‌ఎస్‌ఈ, మిథానీ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు.
భారత ఆర్మీకి ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంలో మొదటి ప్రపంచ యుద్ధంలో పది లక్షలమంది అవిభక్త భారత సైనికులు పాల్గొనగా, 62 వేల మంది మరణించారు, 67 వేల మంది గాయపడ్డారు. తూర్పు ఆఫ్రికాలో విస్తరించిన జర్మన్ సామ్రాజ్యంపై మన సైనికులు యుద్ధం చేశారు. ఈజిప్టు, మెసపటోమియా ప్రాంతాలకు భారత్ సైన్యాన్ని బ్రిటీష్ ప్రభుత్వం పంపింది. 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలోనూ లక్షల సంఖ్యలో అవిభక్త భారత సైన్యం బ్రిటీష్ సామ్రాజ్యం తరఫున పోరాటం చేసింది. అప్పుడు మన సైనికులు 36వేల మంది మరణించగా, 34వేల మంది మంది గాయపడ్డారు. 67వేల మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. 38 మంది భారత సైనికులకు విక్టోరియా క్రాస్ పతకం లభించడం విశేషం.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆర్మీ చీఫ్‌గా కేఏం కరియప్ప ఉన్నారు. 1947లో పాక్ దురాక్రమణను వీరోచితంగా నిలువరించారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విముక్తికి అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ ఆదేశాలపై ఆర్మీ ఆపరేషన్ పోలో నిర్వహించి రజాకార్లను మన సైన్యం మట్టుబెట్టింది. 1949లో జనరల్ కేఎం కరియప్పను తొలి భారత కమాండ్ ఇన్ చీఫ్‌గా ఆనాటి ప్రభుత్వం నియమించింది. ఆర్మీ పోరాటంలో గగుర్పాటుకు గురిచేసే అనేక ఘటనలు ఉన్నాయి. 1984లో మంచుతో కప్పబడి ఉండే సియాచిన్ ప్రాంతంలో ‘ఆపరేషన్ మేఘదూత్’ నిర్వహించి మన భూగాన్ని భారత సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం 70 కి.మీ ప్రాంతం. దీని వల్ల వెయ్యి చదరపు మైళ్ల విస్తీర్ణ ప్రాంతం భారత్ అధీనంలోకి వచ్చింది. శ్రీలంకకు, భారత్‌కు ముప్పుగా పరిణమించిన తమిళ టైగర్ల ఆగడాలను అరికట్టేందుకు 1987-1990 మధ్య శాంతి పరిరక్షణ దళంగా భారత్ ఆర్మీ పనిచేసింది. ఈ యుద్ధంలో సుమారు 1,200 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
భారతీయ ఆర్మీనీ ఏడు వ్యూహాత్మక కమాండ్‌లుగా విభజించారు. ప్రతి కమాండ్ ఒక లెఫ్టినెంట్ జనరల్ ఆధీనంలో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్‌ను ఐదు ఆపరేషనల్, రెండు ఫంకనల్ కమాండ్‌లుగా విభజించారు. ప్రతి కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఉంటారు. వీరి ర్యాంకు ఎయిర్ మార్షల్. భారత్ నేవీని మూడు కమాండ్లుగా విభజించారు. ప్రతి కమాండ్‌కు వైస్ అడ్మిరల్ స్థాయి అధిపతిగా ఉంటారు. రెండు జాయింట్ కమాండ్లకు మూడు దళాలకు చెందిన వారుంటారు. వీటిని వ్యూహాత్మక ఫోర్సెస్ కమాండ్, అండమాన్ నికోబార్ కమాండ్ అంటారు. భారత్ ఆర్మీ సేవలు జమ్మూ కశ్మీర్,లడక్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల చొరబాటు, అక్రమ వలసలను ఆర్మీ నిరోధిస్తుంది. విధి నిర్వహణలో సాహసోపేతమైన పటిమను ప్రదర్శించిన వీరులకు పరమ వీరచక్ర, మహా వీరచక్ర, వీర చక్ర అవార్డులను రాష్టప్రతి ప్రదానం చేస్తారు. అశోక్ చక్ర అవార్డు, పరమ విశిష్టసేవ పతకం లాంటి సర్వోన్నతమైన అవార్డులను జవాన్లకు, ఆర్మీ అధికారులకు ఇస్తారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు అనుబంధంగా కోస్ట్ గార్డ్, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్త్ర సీమాబల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ ఆర్మ్‌డ్ ఫోర్సస్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డు విభాగాలు పనిచేస్తున్నాయి. ఆర్మీలో ఫీల్డ్ మార్షల్, జనరల్, లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, బ్రిగేడర్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్, కెప్టెన్, లెప్టినెంట్, సుబేదార్ మేజర్, సుబేదార్, నరుూబ్ సుబేదార్, హవాల్దార్, నాయక్ వంటి ర్యాంకులుంటాయి. నేవీలో అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్, అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్, కమాండోర్, కెప్టెన్, కమాండర్, లెఫ్టినెంట్ కమాండర్, లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, మాస్టర్ చీఫ్, మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్, చీఫ్ పెట్టీ ఆఫీసర్, పెట్టీ ఆఫీసర్, లీడింగ్ సీమెన్ ర్యాంకులు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్‌లో మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్సెస్, ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ కమాండోర్, గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్, ఫ్లైట్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్, మాస్టర్ వారెంట్ ఆఫీసర్, జూనియర్ వారెంట్ ఆఫీసర్, సార్జంట్, కార్పొరల్ ర్యాంకులు ఉన్నాయి.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో బాలలు చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సైనిక పాఠశాలలను నెలకొల్పింది. మిలిటరీ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలు ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీని (ఎన్‌డీఏ)ని పూణె వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్ లేదా ప్లస్ టూ చదివిన వారు ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైతే ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ జరుపుతారు. వీటిలో ఎంపికైన వారికి త్రివిధ దళాల్లో అవకాశాలు ఉన్నాయి. దక్షిణాది కంటే ఉత్తరాదిన ఎన్‌డీఏలో చేరేందుకు విద్యార్థులు విశేషంగా పోటీపడుతుంటారు. ఇంకా డిఫెన్స్ సర్వీసస్ స్ట్ఫా కాలేజీ, నేషనల్ డిఫెన్స్ కాలేజీ, కాలేజీ ఆఫ్ డిఫెన్స్ మేనేజిమెంట్ కాలేజీలను ఏర్పాటు చేశారు. పూణెలో ఆర్మ్‌డ్ ఫోర్సస్ మెడికల్ కాలేజీని నెలకొల్పారు. డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఎగ్జిమాలాలో నేవల్ అకాడమీ, హైదరాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, చెన్నై, గయలలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మహోలో ఆర్మీ వార్ కాలేజీ, జమ్మూ కశ్మీర్‌లో హై ఆల్టిట్యూట్ వార్‌ఫేర్ స్కూలును, కౌంటర్ ఇన్‌సర్జన్సీ, జంగిల్ వార్‌ఫేర్ స్కూలును, మిజోరం, పూణెలలో కాలేజీ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్‌ను ఏర్పాటు చేశారు.
ఆర్మీలోమహిళలు
ఆర్మీలో 1992లో మహిళా అధికారులను వైద్యేతర రంగాల్లో రిక్రూట్ చేయడం ప్రారంభించారు. 2007 జనవరి 19న ఐక్యరాజ్యసమితి తొలిసారిగా 105 మంది భారతీయ మహిళా సైనికులతో లిబేరియాలో శాంతి పరిరక్షక దళాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 1993లో ప్రియా జింగాన్ అనే మహిళా ఆర్మీలో చేరిన తొలి అధికారి. ఆ సమయంలో 25 మంది మహిళలు అధికారులుగా చేరారు. 1993లో రిపబ్లిక్ డే కవాతులో ఆర్మీకి చెందిన తొలి మహిళా అధికారి ఆల్కా కురానా పాల్గొన్నారు. ఆర్మీలో 2011లో తొలి మహిళా సైనికురాలిగా సప్పర్ శాంతి టిగ్గా చేరారు. ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు ఇచ్చే గ్యాలంటరీ అవార్డును లెఫ్టినెంట్ కల్నల్ మిటాల మధుమిత స్వీకరించారు. కాబూల్‌లో ఇండియన్ ఎంబసీపై జరిగిన దాడిని ఆమె సాహసోపేతంగా తిప్పికొట్టారు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఎంపికైన తొలి మహిళ అంజనా బదూరియా. దివ్య అజిత్ కుమారికి 2010 గణతంత్ర దినోత్సవ కవాతులో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. 2015 గణతంత్ర పరేడ్‌లో 154 మంది మహిళలకు దివ్య నాయకత్వం వహించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో గణ్వీ లాల్జీ పేరుతెచ్చుకున్నారు. నాథూలా పాస్ మార్గంలో సిగ్నల్స్ ఇన్‌చార్జిగా చేరిన తొలి మహిళ స్వాతి సింగ్.
1994లో ఎయిర్‌ఫోర్స్‌లో మహిళల రిక్రూట్‌మెంట్ ఆరంభమైంది. గుంజన్ సక్సేనా ఫ్లైట్ ఆఫీసర్‌గా చేరి, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. దీపక్ మిశ్రా అనే మహిళ సరాంగ్ విన్యాసాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన నివేదిత చౌదరి ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. 2015లో హెలికాప్టర్ పైలెట్లుగా మహిళలు చేరేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లో 1500 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 94 మంది పైలెట్లు, 14 మంది నేవిగేటర్లు ఉన్నారు. వింగ్ కమాండర్ శైలజా ధామి పర్మినెంట్ కమిషన్ హోదా పొందిన తొలి మహిళ. యుధ్ సేవాపతకాన్ని పొందిన తొలి మహిళ స్క్వాడ్రన్ లీటర్ మింటీ అగర్వాల్.
నేవీలో 1968లో చేరిన డాక్టర్ పునీత ఆరోరా లెఫ్టినెంట్ జనరల్ హోదాకు చేరుకున్నారు. ఆమె వైస్ అడ్మిరల్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. పద్వాతి బందోపధ్యాయ అనే మహిళ భారత ఎయిర్ ఫోర్స్‌లో తొలి ఎయిర్ మార్షల్‌గా పద్నోనతి పొందారు. ఘటక్ పోర్స్, గరుడ్ కమాండో, మార్కోస్, పారా కమాండో దళాల్లో ఇంకా మహిళల రిక్రూట్ ప్రారంభం కాలేదు. డాక్టర్ సీమారావు అనే మొదటి మహిళా కమాండో ట్రైనర్ దాదాపు 15వేల ప్రత్యేక బలగాల సిబ్బందికి శిక్షణ ఇచ్చి గుర్తింపు పొందారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫ్రాంటియర్ సర్వీసుల్లో మహిళల నియామకాలు జరుగుతున్నాయి.

పరిశోధన సంస్థలు
రక్షణరంగంలో త్రివిధ దళాలు విశిష్టసేవలు అందిస్తున్నాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)ను 1958లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని డీఆర్‌డీవో భవన్ పరిధిలోని అనేక సంస్థల్లో ఐదు వేల మంది శాస్తవ్రేత్తలు పనిచేస్తున్నారు. వీటి పరిధిలో 52 ల్యాబొరెటరీలు ఉన్నాయి. మిలిటరీ ఇంజనీరింగ్, ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, క్షిపణులు, యుద్ధ తంత్రాలు, వ్యూహాలు, వివిధ నేవల్ సిస్టమ్స్‌ను శాస్తవ్రేత్తలు రూపొందిస్తారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ప్రపంచ వ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన అత్యున్నతమైన రక్షణ పరిశోధన సంస్థ. అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ రీసెర్చి అనాలిసిస్ గ్రూప్ హైదరాబాద్‌లో, ఏరియల్ డెలివరీ రీసెర్చి డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆగ్రాలో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ బెంగళూరులో, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ల్యాబొరేటరీ డెహ్రాడూన్‌లో, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చి ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. పలు సంస్థలను దిల్లీ, తేజ్‌పూర్, గ్వాలియర్, కాన్పూర్, లేహ్, మైసూర్, పూణెలలో ఏర్పాటు చేశారు.
సర్జికల్ స్ట్రైక్స్
సైన్యం, యుద్ధమంటే మనకు చటుక్కున గుర్తుకువచ్చే పదం సర్జికల్ స్ట్రైక్స్. పాక్ భరతం పట్టేందుకు భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ వాయుసేన మెరుపుదాడులకు మంచి ఫలితాలు వచ్చాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాదుల శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. భారత ఆర్మీ 2016 అక్టోబర్ 28,29వ తేదీల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. యూరి దాడుల్లో 18 మంది సైనికులను కోల్పోయిన భారత్ ప్రతీకార చర్యగా చేసిన ఈ దాడితో పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా వద్ద ఉగ్రవాదుల దాడిలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ సంఘటనకు ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్ వద్ద ఉగ్రవాదుల శిబిరంపై దాడి చేసి పెద్ద సంఖ్యలో ముష్కరులను భారత వైమానికదళం మట్టుపెట్టింది.
అభినందన్ వర్ధమాన్
సర్జికల్ స్ట్రైక్స్‌లో భాగంగా పాక్‌కు బందీగా దొరికిన అభినందన్ వర్ధమాన్ చరిత్ర సృష్టించారు. ఈ యువ వైమానికదళాధికారి భారత యువతకు స్ఫూర్తి. 60 గంటల పాటు పాక్ చెరలో ఉండి బయటకు వచ్చారు. చెన్నై సైనిక స్కూలులో చదివిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అభినందన్.. భటిండా, హల్వారాలలో శిక్షణ పొందారు. అంతర్జాతీయంగా వచ్చిన వత్తిడితో మార్చి 1వ తేదీన వాఘా సరిహద్దుల్లో అభినందన్‌ను భారత్‌కు అప్పగించారు. ఆయనకు అత్యున్నత వీర్ చక్ర అవార్డును అందజేశారు.
భారత దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ సేనలను నిలువరించి, వారి వ్యూహాలను తుత్తినియలు చేస్తూ యుద్ధరంగంలో మరణించిన వీరులెందరో... వీరిలో కెప్టెన్ అనుజ్ నయ్యర్, కల్నల్ నీలకంఠన్ జయచందన్ నాయర్, బ్రిగేడర్ కుదీప్ సింగ్ చందపురి, గుర్బజన్ సింగ్ సలారియా,రైఫిల్ మ్యాన్ జ్వంత్ సింగ్ రావత్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, అరుణ్ కుమార్ వైద్య, నంద్ సింగ్ లాంటి వీర సైనికులు ఉన్నారు. వీరు యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడి భారత సరిహద్దులు దురాక్రమణకు గురికాకుండా రక్షించారు. వీరి జీవితాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
దురదృష్టవశాత్తు మన పాఠ్యపుస్తకాల్లో వీర జవాన్లకు సంబంధించిన పాఠ్యాంశాలుగా పొందపరిచే విధానం లేదు. ఐదో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు తప్పనిసరిగా సైనికుల పోరాట పటిమ, అమరులైన జవాన్ల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి. సైన్యంలో విద్యార్థులు చేరే విధంగా దేశభక్తిని పెంచే పాఠాలను ఉపాధ్యాయులు చెప్పాలి. దీని కోసం సిలబస్‌లో తప్పనిసరిగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విశిష్టతను చాటే పాఠ్యాంశాలను చేర్చాలి.
దేశం కోసం సర్వం త్యాగం చేసే గొప్ప పౌరులు జవానులు. వారికి ప్రతి రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలి. వారి అనుభవాలను విద్యార్థులు, యువకులకు వివరించే విధంగా చర్చా వేదికలను ఏర్పాటు చేయాలి. సువిశాలమైన మన త్రివిధ దళాల్లో ఉద్యోగావశాలు ఎక్కువ. ప్రతి వృత్తికి సంబంధించిన ఉద్యోగాలు లభిస్తాయి. చిన్న వయస్సు నుంచే విద్యార్థులు సైన్యంలో చేరే విధంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో పెద్దలు ప్రోత్సహించాలి. దేశానికి సేవ చేయడం కంటే మించిన గొప్ప కార్యం మరొకటి లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భారత్ రక్షణ వ్యవస్థలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలి. *

-కె.విజయ శైలేంద్ర 98499 98097