S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డార్క్ అవెన్యూ-9

తీశ్మార్ గొంతులో నుంచి క్షుద్ర మంత్రాలు ఆ స్మశాన ప్రాంతంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
తీశ్మార్ లేచాడు.. అతని చేతిలో మంత్రదండం లాంటిది ఉంది.. దాని పిడిభాగం పుర్రె గుర్తు ఉంది.
దానిని చంద్రకళ తల మీద పెట్టి
‘నీ భర్త దగ్గరికి నిన్ను పంపిస్తాను.. నువ్వు అభ్యంగన స్నానం చేసి ఈ చితి ముందు నిలబడి నేను ప్రాణత్యాగం చేస్తున్నాను.. అని పదమూడుసార్లు ఉచ్చరించాలి. అప్పుడు నీ భర్త నీ దగ్గరికి వస్తాడు.. సరేనా’ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
‘సరే’ అన్నట్టు తలూపింది.. దూరంగా ఇది చూస్తున్న రాజేంద్రనాథ్ తల్లడిల్లిపోయారు. ‘వద్దు నేను బ్రతికే వున్నాను’ అని చెప్పాలనుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది.. అతని నోటికి ప్లాస్టర్ వేశారు.
భార్య తనకు తానుగా చితి మంటల్లో పడి చనిపోతే నిధికి కాపలా వున్న శక్తులు ప్రసన్నం అయి ఆ నిధి కాపలా నుంచి విముక్తం అవుతాయి. అప్పుడు ఆ నిధిని సులువుగా స్వాధీనం చేసుకోవచ్చని శివప్రసాద్ వర్మ కుటిల ఆలోచన.
ఈ ఆపద నుంచి గట్టెక్కించే దేవుడే లేడా? అతని మనసు దేవుణ్ణి వేడుకుంటోంది.
సరిగ్గా అప్పుడే జంగానియా ప్రాంతానికి కూతవేటు దూరంలో ప్రత్యేక హెలీకాప్టర్‌లో దిగారు సమీర్ భార్గవి.
కేవలం మొండి ధైర్యమే వాళ్ల దగ్గర వున్న బలం బలగం ఆయుధం...
* * *
‘ఇప్పుడు మనం ఆ తీశ్మార్‌ను ఎలా ఎదుర్కొంటాం.. పోలీసు బలగాన్ని పిలిపిస్తే బావుండేది’ అంది భార్గవి.
‘అప్పుడు ఈ విషయం అందరికీ తెలుస్తుంది. మూఢ నమ్మకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లినట్టు అవుతుంది. అంతేకాకుండా.. జంగానియా తెగ వాళ్లు ఎదురు తిరిగితే అది శాంతిభద్రతల సమస్య అవుతుంది’ చెప్పాడు సమీర్.
చెట్లను దాటుకుంటూ వెళ్తోన్న వీళ్లకు ఒక దృశ్యం కనిపించింది.
ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పొడవాటి పాము సాధువు దగ్గరికి వచ్చి కాటు వేయడానికి పడగ ఎత్తింది. క్షణం ఆలస్యమైనా ఆ పాము సాధువును కాటు వేస్తుంది. సమీర్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే తెగించాడు. ఆ పాము మెడ భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పాము తప్పించుకోవడానికి పడగను సమీర్ మీద విసరడానికి ప్రయత్నం చేసింది.. సమీర్ ఆ అవకాశం పాముకు ఇవ్వలేదు. తనకీ తెలుసు.. తాను ఏ మాత్రం ఆలస్యం చేసినా పాము తనను కాటేస్తుంది.
అతడి పిడికిలి మరింత బిగుసుకుంది. బలంగా గిరగిరా తిప్పి గాల్లోకి విసిరాడు.
ఆ పాము గాల్లోనే అదృశ్యమైంది.
సమీర్ సాధువును తప్పించానన్న తృప్తితో ముందుకు వెళ్లబోతుంటే ఆ సాధువు కళ్లు తెరిచి ‘నాయనా ఒక్క నిమిషం’ అంటూ పిలిచాడు.
సమీర్ షాకయ్యాడు.. వెనక్కి తిరిగాడు.
‘ఒక మనిషి అపాయంలో వున్నాడని తెలిసీ అడగకపోయినా పాముతో పోరాడావు.. నిన్ను ఆ హనుమంతుడు.. ఆ వాయుపుత్రుడు కాపాడుతాడు’ అంటూ తన చేతిలో వున్న హనుమంతుడి తాయెత్తును సమీర్ చేతికి ఇచ్చాడు. తాయెత్తు వద్దని వారించబోయాడు సమీర్. కానీ భార్గవి తీసుకోమన్నట్టు చూసింది. సమీర్ ఆ తాయెత్తును తీసుకుని షర్ట్ జేబులో పెట్టుకున్నాడు.
భార్గవి ఆ సాధువుకు నమస్కరించింది.
సాధువు ఆశీర్వదిస్తున్నట్టు చేతిని ఎత్తి విజయోస్తు అని దీవించి వెనక్కి తిరిగి వెళ్లాడు.
ఆ సాధువు నిధిని కాపాడే ఒక మహాశక్తి అని వాళ్లకు తెలిసే అవకాశం లేదు.
* * *
సమీర్ భార్గవి కొద్ది నిమిషాల్లోనే బలి ఇచ్చే ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడికి రాగానే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది భార్గవికి.
చితిమంటకు అభిముఖంగా చంద్రకళ తడిబట్టలతో నిలబడి వుంది. ఆమెకు ఎదురుగా తీశ్మార్.
మొదటిసారి ప్రత్యక్షంగా చూసింది.
తనను కలల్లో ఊహల్లో భ్రమల్లో భయపెట్టిన క్షుద్ర మాంత్రికుడు...
తీశ్మార్ మంత్రోచ్ఛారణ ప్రారంభించాడు. అక్కడ ఆ మంత్రాలకు ఆ ప్రాంతం కంపిస్తూ ప్రతిధ్వనిస్తోంది.
చంద్రలేఖ ఒకవైపు...
రాజేంద్రనాథ్ మరోవైపు నిస్సహాయంగా చూస్తున్నారు.
తీశ్మార్ చంద్రకళ వైపు తీక్షణంగా చూస్తూ
‘ఈ చితి మంటల వైపు చూస్తూ చెప్పు.. నీకు నువ్వే ఆత్మార్పణ చేసుకుంటున్నానని’ హెచ్చరించాడు.
ఆమె ట్రాన్స్‌లో ఉన్నట్టు గొంతు విప్పింది.
అప్పుడు తగిలింది గొంతుకు.. కూతురు చంద్రలేఖ కట్టిన తాయెత్తు.
* * *
ఉలిక్కిపడి నిద్రలేచాడు వహీద్.
అర్ధరాత్రి రెండు కావడానికి కొద్దిక్షణాల వ్యవధి మాత్రమే ఉంది.
తనకు ఎందుకు సడన్‌గా మెలకువ వచ్చింది..? అతనికి చంద్రలేఖ కుటుంబం గుర్తుకు వచ్చింది.
ఎదురుగా వున్న అల్లా ఫొటో వైపు చూశాడు.
కిటికీలో నుంచి చూస్తుంటే మసీదు కనిపిస్తోంది.
‘ఏ అల్లా... ఆ కుటుంబాన్ని నువ్వే కాపాడు. సైతాన్ బారి నుంచి నువ్వే కాపాడాలి’ మోకాళ్ల మీద కూచొని అల్లాని ప్రార్థించాడు.
* * *
తాయెత్తు ఎప్పుడైతే కంఠానికి తాకిందో చంద్రకళ స్వరంలో మార్పు వచ్చింది.
‘నేను చావను. నేను ఆత్పార్మణ చేసుకోను’ అంది.
తీశ్మార్ విస్మయంగా కోపంగా చూశాడు.
చంద్రకళ గొంతులో నుంచి వచ్చే మాటలు వేరు.. బయటకు వినిపించే మాటలు వేరు.. అదంతా ఆ తాయెత్తు ప్రభావం అని అర్థమైంది.
కోపంగా చంద్రకళ దగ్గరికి వచ్చాడు. ఆమె గొంతు పట్టుకోబోయాడు.. సమీర్ పులిలా లంఘించాడు. తీశ్మార్ గొంతు పట్టుకున్నాడు.
ఊహించని ఈ పరిణామాన్ని తీశ్మార్ కోపంతో రెచ్చిపోయాడు. సమీర్ గుండెల మీద చెయ్యేశాడు.
సమీర్ జేబులో ఉన్న ఆంజనేయుడి తాయెత్తు తీశ్మార్ చేయికి తగిలింది. పెద్ద సుడిగాలి.
ఒక్కసారిగా సుడిగాలి తీశ్మార్‌ని గాల్లోకి లేపి దూరంగా విసిరేసింది. అప్పటికి కానీ సమీర్‌కు ఆ తాయెత్తు గొప్పదనం అర్థం కాలేదు.
తీశ్మార్ మరింత కోపోద్రిక్తుడయ్యాడు.
తన మంత్రదండాన్ని చేతిలోకి తీసుకోబోయాడు.
సరిగ్గా అప్పుడే ఓ పాము గాల్లోనుంచి ఎగిరి వచ్చి ఆ మంత్రదండాన్ని నోట కరుచుకుని చితిలోకి విసిరివేసింది.
ఆ పామును గుర్తు పట్టాడు సమీర్. అలానే చూస్తూండిపోయాడు. అప్పుడు గాలిలోకి అదృశ్యమైన సర్పం...
ఎప్పుడైతే తీశ్మార్ చేతిలో క్షుద్రశక్తులతో కూడిన మంత్రదండం చితిలో పడి కాలిపోయిందో.. తీశ్మార్ గొంతులో నుంచి రక్తం భళ్లున బయటకు వచ్చింది.
ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. విచిత్రమైన కేకలు భయంతో వెలువడే ఆర్తనాదాలు.. గబ్బిలాల గుంపు ఆకాశంలోకి ఎగిరి మాయమైంది.
ఎన్నో క్షుద్ర ప్రయోగాలు చేసి.. క్షుద్రోపాసకుడిగా తొంభై తొమ్మిదేళ్లు బతికిన తీశ్మార్ ఒక్క క్షణంలో దిక్కులేని చావు చచ్చాడు..
పెద్దగాలి వీచింది. చితిలో ఓ కాలుతున్న కట్టె పైకి ఎగిరింది.. సరాసరి శివప్రసాద్ వర్మ నెత్తిన పడింది.
కన్నుమూసి తెరిచేలోగా శివప్రసాద వర్మ మంటల్లో తగులబడిపోయాడు.
అత్యాశతో నిధిని స్వంతం చేసుకోవాలని.. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలిని బలి ఇవ్వబోయి తను చచ్చిపోయాడు.
నిధికి నిధి మీద వున్న ఆశకు
స్వార్థానికి.. నీచత్వానికి.. క్రూరత్వానికి
తగిన ప్రతిఫలం అనుభవించాడు.
* * *
ఉపసంహారం
చంద్రప్రభను చంద్రకళను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.
భర్త బ్రతికి వున్నాడన్న నిజం తెలియడంతో చంద్రకళ త్వరలోనే కోలుకుంది.
చంద్రప్రభ కొద్దికొద్దిగా రికవరీ అవుతోంది.
డార్క్ అవెన్యూని వృద్ధాశ్రమంగా మార్చి వృద్ధులకు వెలుగు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రాజేంద్రనాథ్..
డార్క్ అవెన్యూని కూలగొట్టారు. ఆ స్థానాల్లో వృద్ధాశ్రమం రూపుదిద్దుకుంటోంది.
భార్గవి సమీర్‌ను పెళ్లి చేసుకుంది.
చంద్రలేఖ తన కుటుంబంతో యుఎస్ వెళ్లిపోయింది.
పావని వృద్ధాశ్రమం బాధ్యతలు స్వీకరించింది.
* * *
ఇది జరిగిన కొన్ని నెలల తరువాత..
జంగానియాకు వచ్చాడు ఒక వ్యక్తి
తీశ్మార్ మునిమనవడు కుశ్మార్‌ను కలవడానికి...
నిధిని స్వంతం చేసుకోవడానికి...
కుశ్మార్‌ను కలవడానికి వచ్చిన వ్యక్తి పేరు విశ్వప్రసాద్ వర్మ.. సన్నాఫ్ శివప్రసాద్ వర్మ. *
- సమాప్తం -

తేజారాణి తిరునగరి