S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీరజ కోరిక!

బోనంగి గ్రామంలో రాజేశం, నీరజ అనే దంపతులుండేవారు. రాజేశంది ధనిక కుటుంబం. వారికి కృష్ణ అనే ఏకైక కుమారుడుండేవాడు. రాజేశం చాలా సాత్వికుడు. డబ్బున్న వాడిననే అహంకారం ఉండేది కాదు. అందరితో కలసిమెలసి తిరిగేవాడు. పేద వారిని కష్టాలలో ఆదుకునేవాడు. కానీ నీరజకు పెద్దింటి దానననే అహంకారం ఉండేది. అవకాశం వచ్చినప్పుడల్లా డాబు, దర్పం ప్రదర్శించేది. రాజేశంకు ఈ పద్ధతి నచ్చేది కాదు. తన మాదిరిగానే తన భార్యాపిల్లలు అందరితో కలసిమెలసి ఉండాలనుకునేవాడు.
రాజేశం కొడుకు కృష్ణకు మూడు సంవత్సరాల వయసు వచ్చింది. ఆ ఊరులోని ఇంగ్లీషు కానె్వంట్ స్కూల్‌లో చేర్పించాలంది నీరజ. అందుకోసం ఆటో ఒకటి ఏర్పాటు చేయమంది నీరజ రాజేశంతో. అందుకు రాజేశం ‘మన ఊళ్లో పిల్లలు ఏ బడికి ఎలా వెళ్తున్నారో చూడు. పిల్లలంతా పుస్తకాల బ్యాగులు పట్టుకుని నడుచుకొని వెళ్తున్నారు. అలా నడుచుకుని వెళ్లడం వలన శరీర వ్యాయామం జరుగుతుంది. అందరి పిల్లలు బడికి కలిసి వెళ్లడం, రావడం వల్ల పిల్లల్లో స్నేహభావం పెరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇక టీచర్ల విషయానికొద్దాం. పాఠం చెప్పే అలవాట్లున్న వాళ్లుంటే ఏ బడి అయినా ఒకటే! పైగా పిల్లల్లో తెలివితేటలు గ్రహణ శక్తి ఉండాలి. పిల్లలను మంచి క్రమశిక్షణతో ఉంచగలగాలి’ అని వివరంగా చెప్పాడు రాజేశం.
ఇంతలో నీరజ జోక్యం చేసుకుని ‘పాఠాలు ఎవరైనా చెబుతారు సరే! సర్కారీ బడిలో చదువుతున్న పిల్లలకు కానె్వంట్ స్కూల్ పిల్లల్లా బూటు, సూటు, టై, హేటు ఉంటాయేమిటి? బ్యాగు నిండా పుస్తకాలే! మరి కానె్వంట్ టీచర్లు పిల్లలకు ఎన్ని పాఠాలు చెప్పకపోతే అన్ని పుస్తకాలు పిల్లలచే మోయిస్తారు?’ అంది.
‘ఒసే నీరజా! సూటు బూటు, హేటు, టక్, టై సోకుల్లో ఏముందే? బండెడు పుస్తకాల గాడిద మోత పిల్లలచే మోయిస్తే గానీ చదువులు రావా? అదంతా ‘షో వర్కే.. మన దగ్గరికి అప్పుకొచ్చినోడు సూటూ బూటూ కళ్లద్దాలతో రాలేదటే! కానె్వంట్ చదువులూ అంతే! సోకులు ఫుల్! చదువులు నిల్! ఇంతకీ నువ్వూ, నేను చదివింది ఈ సర్కారీ బడుల్లోనే కదా. ఆ రోజుల్లో డబ్బున్నోళ్లు, పేదవాళ్లు కలిసి ఏ పూరిపాక స్కూల్లోనో, ఏ చెట్టు నీడలోనో చదివేవాళ్లం. ఆడుకొనేవాళ్లం. పాడుకొనేవాళ్లం. నువ్వూ, నేను సూటు, బూటు, హేటు, టై వేస్తేనే చదువులొచ్చాయా?
‘మనకు అమరం. ఆంధ్రంతోపాటు శతక పద్యాలను టీచర్లు నేర్పలేదా? మనం నేర్చుకోలేదా? మరి ఈనాడు ఆ చదువులేవి? ఆ ఆటలేవీ, పాటలేవి? ఆ ఐకమత్యం ఏది? ఈనాటి ధనవంతుల పిల్లల్లో చిన్నప్పటి నుండే పేదవాడంటే చులకన భావం ఉంది. పేదవారితో కలసిమెలసి తిరిగినప్పుడే వారి కష్టాలేమిటో ధనవంతుల బిడ్డలకు తెలుస్తాయి. చదువులు ముగించుకొని పాలనా సంబంధమైన ఉద్యోగాలు చేపడితే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తారు. అదే సర్కారు స్కూళ్ల గొప్పతనం. అందుకే మన బాబును గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను’ అని రాజేశం భార్యతో నిక్కచ్చిగా చెప్పాడు.
నీరజ పట్టు విడవకుండా ‘ఏమయ్యా! నా కొడుకును సూటు బూటు బండెడు పుస్తకాల సంచీతో చూడాలనుకున్నాను. నా ఆశ అడియాసేనా? పోనీలే నీ కోరికే నెరవేర్చుకో’ అని కన్నీరు పెట్టుకుంది.
రాజేశం తను అనుకున్నట్టే సర్కారీ వారి పాఠశాలలో తన కొడుకు కృష్ణను చేర్పించాడు. రాజేశం తన పర్యవేక్షణలో, తన కొడుకును కట్టుదిట్టమైన క్రమశిక్షణతో, ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నత చదువులు చదివించాడు. కృష్ణ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై సబ్ కలెక్టర్ ఉద్యోగాన్ని పొందగలిగాడు. సూటు, బూటు, టక్, టైలో తన కొడుకును చూడాలన్న నీరజ కోరిక తీరింది. సబ్‌కలెక్టర్ ఉద్యోగంలో పేదవారి సేవలకే అంకితమయ్యాడు కృష్ణ.

-శివ్వాం ప్రభాకరం 701 3660 252