S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అర్థంకానిది బ్రహ్మ పదార్థమే!

దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూంటారు. దిక్కున్న వారికైనా ఆ దేవుడే దిక్కు. ఎందుకంటారా?
గంపెడంత సంసారం. బోల్డంత ఆస్తి, నౌకర్లు చాకర్లూ.. ఉండవలసిన భోగాలన్నీ ఉన్నా సుఖంగా దర్జాగా గడిపే కుటుంబాలెన్ని? కాలగమనంలో మనం ఊహించని మార్పులొస్తూంటాయి. కడుపున పుట్టిన పిల్లలతో ఉండే సంబంధ బాంధవ్యాలకో పరిమితి ఏర్పడుతుంది. పిల్లల బాల్యంలో అదే మహా భాగ్యమనుకున్న తల్లిదండ్రులకు, వారు పెరిగి ప్రౌఢ వయస్సు రాగానే కోడళ్ళ రాకతోనే నెమ్మదిగా మార్పు మొదలవుతుంది.
ఇంట్లో అప్పటివరకూ అంటుకు తిరిగిన కన్నకూతుళ్లకు సంసారాలేర్పడి, ఎక్కడకో వెళ్లిపోతారు. తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుని కాళ్లు కడిగి కన్యాదానం చేసిన వియ్యంకులు వియ్యపురాళ్లు అప్పుడప్పుడు మాత్రమే కనిపించి వెళ్తూంటారు. వీరి అవసరం వారికీ, వారి అవసరం వీరికీ ఉండదు. కడుపున పుట్టిన కన్నకూతుళ్లతో బావురుమంటూ బాధలు చెప్పుకుందామనే ఆశతో తల్లిదండ్రులుంటారు. ఏదో వెలితి. వాళ్లు ఎప్పుడింటికి వస్తారా అనే ఎదురుచూపులు. అరమరికలు లేక అన్యోన్యంగా బ్రతకవలసిన వారికి గమ్మత్తుగా ఒక్కసారి అనుకోని కష్టాలు కలుగుతాయి. కన్నకొడుకులతో కలివిడిగా మాట్లాడలేని దుస్థితి కూడా ఏర్పడుతుంది. సంతానం లేకపోయినా సమస్యే. ఉన్నా సమస్యలే. ఆర్థికంగా కుటుంబం బలంగా ఉన్నా బంధమే, బాధలే. లేకపోయినా ఇబ్బందే! ఉంటే వాటాల కోసం ఏడుపు, లేకపోతే లేదనే ఏడుపు. ఈ రెంటి మధ్య నలిగిపోయే సంసారాలెన్ని లేవు? మెట్టింట్లో అత్తగారిని కన్నతల్లిలా భావించే కోడళ్లు, కోడళ్లను కన్నకూతురిలా చూడగలిగే సంస్కారులైన అత్తగార్లు లేనంత కాలం ఆ కుటుంబాల్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఎండమావులే. ఇలా ఎందుకు జరుగుతుంది? కారణాలు వెదకగలమా? ఒకవేళ పట్టుకుని వెతికితే పరిష్కరించగలమా? రెండూ కష్టసాధ్యమే. అనుభవిస్తూ అంతా ప్రారబ్దం అనుకోవటమే హాయి. రోజువారి జీవితంలో మనం ఒక మాట చెప్పి, దాన్ని ఇంకో వ్యక్తిని చెప్పమంటే అవి ఒకలా ఒక్కనాటికుండవు. భావం ఒక్కటే కావచ్చు. వాక్యమొక్కటే కావచ్చు. మనుషులను బట్టి మారిపోతూంటుంది.
భర్త ఒకటంటాడు. భార్య మరోటంటుంది. ఆ ప్రభావం కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది. అదే మాట పిల్లలంటే దాని ప్రభావం మరోలా ఉంటుంది. మాట ఒక్కటే. కాని మనుషులను బట్టి వారి స్వభావాన్ని బట్టి మారిపోతుంది.
నిత్య జీవితంలో ఇంట్లో కుటుంబ సభ్యులు కొందరు చక్కగా మితంగా ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. మరి కొందరు దీనికి భిన్నం.
లక్ష్మీర్వసతి జిహ్వాగ్రే, జిహ్వాగ్రే మిత్రబాంధవాః
జిహ్వాగ్రే మరణం తవమ్
మీ సంపద, మీరు ధనాన్ని ఆకర్షించుకునే శక్తి, మీరెలా మాట్లాడతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సంపాదించుకున్నది నిష్క్రమించినా మాటే ఆధారం. మాట్లాడే మాటలు మనం అనుభవించే అంతర్గతనూ ప్రశాంతతనూ చెబుతాయి. మానసిక వౌనం ఎక్కువైన కొద్దీ మాటలకుండే శక్తి ద్విగుణీకృతవౌతుంది. నోరుంది కదాని లొడలొడా మాట్లాడేస్తూ ఇంట్లో చేసే అల్లరికి, బెంబేలెత్తి పోతారు జనం. ఎప్పుడు అవతలకు పోతాడురా? అనిపించి విసుగు పుట్టేస్తుంది. 24 గంటలూ భార్యాభర్తలెప్పుడూ మాట్లాడుతూ కూర్చోరు, ఒకే గదిలో ఉన్నా మాటలవసరం వారిద్దరి మధ్య లేకపోవచ్చు. పెద్దరికానికి గుర్తింపు వౌనం వల్లే లభిస్తుంది.
ఒకరినొకరు అర్థం చేసుకున్న కొద్దీ సంభాషణ అవసరం తగ్గిపోతుంది.
కుటుంబంలో ఈ స్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా సమస్యలుండవు.
మనుషుల మధ్య చక్కని అవగాహన ఏర్పడుతుంది. అందుకే వౌనానికి మించిన మందు లేదు. ఏ డాక్టర్‌తోనూ పని లేదు.
అనునిత్యం రామనామ ధ్యానమే లోకంగా బ్రతికిన త్యాగయ్య మనలా సంసారే. భార్య ఉంది. చుట్టూ శిష్యులున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఆయన సంగీతాన్ని కోరి ఆశ్రయిచుకున్న వారికీ సమస్యలుండేవి. అన్నిటికీ అనుపానం ఆయనకు సంగీతమే ఆయనకూ, ఆయన శిష్యుల సమస్యలకూ సందేహాలకూ కూడా శ్రీరామరక్ష. యోగిలా బ్రతికాడు. కాబట్టే, అంతరంగంలో కొలువై యున్న ఆ పరమాత్ముడే ఆయన సందేహాలకు సమాధానాలిస్తూ ఆయన జీవిత సారధిగా నిలిచి నడిపాడు. సందేహమా చెప్పండి.
సంసారంలోనే ఉన్నా తామరాకు మీద నీటిబొట్టులా జీవించాడు. మనకు ఆయన భార్య, సంతానం గురించిన ప్రస్తావన చరిత్రలో ఎక్కడా కనిపించదు. సోదరుడై తన పక్కనే ఉంటూ, వైరం ఎంచుకున్నది జపేశ్యుడే.
ఇంట్లో పుట్టే అంతర్గత కలహాలు ఒకలా ఉంటే ఓ తల్లి రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు మళ్లీ మరోలా ఉంటాయి. నివురుకప్పిన నిప్పులా కొన్ని కనిపిస్తాయి. మరి కొన్ని కనిపించవు. ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా బుద్ధి వక్రీకరిస్తే దాపురించే దౌర్భాగ్యాలే యివన్నీ. విచిత్రమేమంటే ‘అయ్యో! పొరపాటు జరిగింది. అలా చేయకుండా ఉండవలసినది సుమా!
ఆ రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది సుమా! అని ఏ ఒక్కడూ జీవితంలో పశ్చాత్తాపబడటం కూడా ఉండదు. అప్పటికే వయసు మీద పడుతుంది.
మోహన రాగంలో పాడే ఈ అరుదైన కీర్తన చిత్తగించండి.
1.గట్టిగ రాళ్లను గట్టిన గృహముల
మట్టు మితము లేనట్టి పరిజనుల
చుట్టుకున్న నిజ చుట్టాల కొరుల
పట్టులకతిథులకు పెట్టలేక, తమ
పొట్ట సాగుకొన్నట్టి దేహముల
రెట్టు సంచుల కట్టిన ధనముల
పెట్టెలతోడను పెట్టి పొయ్యే
మట్టు కనుంగొని॥
ఎందుకో బాగా తెలియదు. అందగాడ! శ్రీరామ ఈ తనువు స్థిరమని ఈ కవి మానవులకు అంటారు త్యాగయ్య. ఈ కాస్త మర్మం తెలిసిన మనిషి ఎంత పునీతుడై పోతాడో కదా! అని భావించే త్యాగయ్య పరమార్థ దృష్టిని కాస్త అర్థం చేసుకుందాం.
లంకంత ఇల్లు, ఆ ఇళ్లల్లో పరిమితి లేకుండా ఓ వైపు గుమ్మాలు తుడిచే వాళ్లు, కిటికీలు శుభ్రపరిచేవారు, నేల శుభ్రం చేసేవారు ఇలా లెఖ్ఖలేని నౌకర్లతో అలవికానంత ఆస్తి ఉండి ఎలా ఖర్చు పెట్టాలో తెలిసి చావక పాముల పుట్టలో పెరిగిన (పేరుకున్న) డబ్బును ముతక సంచుల్లో మూటలుగా కట్టి, దాని చుట్టూ నిద్రించే వారికి, ఎందుకో అంతా కట్టుకుపోలేము కదా. ఈ కాస్త ఇంగిత జ్ఞానమూ ఎందుకు తెలియదో? మరొకరికివ్వలేడు. తాను అనుభవించలేడు.
2.కల్లలాడి కడుపు పల్లము నింపుట కల్లవారి ధనమెల్ల చేర్చుకు
వల్లవాధరుల నెల్లగని శునకపు పిల్లల వలె తిరిగి
ఒళ్ళ రోగములు కొల్లగా తగుల దొల్లి పైకములు మెల్లజార జను
లెల్లదూర, పరమెల్ల పార, భువి మళ్ల పుట్టు ఫలమెల్ల కనుగొని॥
ఎందుకో బాగ తెలియదు.
‘ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? ఓ పద్ధతంటూ లేకుండా రోజుకో అబద్ధం చెప్తూ, ఆకలేస్తే చాలు. కనిపించిన చోటల్లా ఆగి కడుపు నింపేస్తూ ఊళ్లో వాళ్ల సొమ్మును కూడా వెనకేసి సుందరాంగులు కనపడగానే కుక్కపిల్లల్లా తోకాడిస్తూ ఒంటికి రోగాలు తగులుకుని, సంపాదించినదంతా అడుక్కు తినిపోయి, పరమార్థం మాయమై మళ్లీ పుట్టాల్సిన దరిద్రం సంభవిస్తున్నా బుద్ధి రావటం లేదే మనుషులకు?

3.వంచకుల ననుసరించిన అలమట
ఇంచుకైన సైరించలేక తమ
సంచిత కర్మంబులంచు తెలిసి
వేరెంచు వారలజూచి
మంచువలె ప్రతిఫలించే సంపద లంచుకోరకను
మంచి త్యాగరా
జంచితముగ పూజించి నుతించు ప్ర
పంచనాథుని భజించుదామనుచు॥

ఎందుకో బాగ తెలియదు.
మాయగా బ్రతకటం, మాయలు చెప్పి మభ్యపెట్టటం మొదలైనవన్నీ పాపం పోగేసుకోవటమే అని తెలిసి కూడా ఈ ఆస్తి, సంపదలు మంచులా కరిగిపోవలసినదే అనే సత్యం తెలియకుండా బొత్తిగా పారమార్థిక చింతన లేని వాళ్లను చూసి జాలిపడతాడు త్యాగయ్య. ఆధ్యాత్మిక సంపదను పోగు చేయటంలో మనందరి కంటే ఆయనే కోటీశ్వరుడు. ఆయన సంపాదించి దాచిపెట్టుకున్నదంతా ఆయనతోనే వెళ్లింది. ధ్రువ నక్షత్రంలా, అక్కడెక్కడో ఆయనకో సుస్థిరమైన స్థానం ఏర్పడే ఉంటుంది. ఆ స్థానం మరెవ్వరికీ దక్కదు.
లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెం
జీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్‌॥
అని గజేంద్రుడిలా ఆ పరమదైవాన్ని నమ్ముకున్నాడు. పునరావృత్తి లేని శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. లౌకిక జీవనం చేస్తూ చేయవలసిన త్యాగాలన్నీ చేసి, నిష్కామయోగియై త్యాగరాజయ్యాడు. *

**
8.12.2019 నాటి అమృతవర్షిణి ‘చిటికలో బ్రహ్మాండం’ వ్యాసానికి సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అభినందనతో ప్రతిస్పందన.
‘మీ అమృతవర్షిణి వ్యాసాలు బాగుంటున్నాయి. సంగీతంలో మీ మనోధర్మాన్నీ, అనుభవాన్నీ అక్షరబద్ధం చేస్తూ చక్కని విశే్లషణలు అందిస్తున్నారు.
‘చిటికలో బ్రహ్మాండం’ చాలా అద్భుతమైన వ్యాసం. నిజానికి సుబ్బయ్య నాయుడుగారు తెలుగువారు. ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడే అవకాశం లభించింది.
అదీ ఎంజిఆర్ గారికి. ఎం.ఎస్.విశ్వనాథన్‌కు సాక్షాత్తూ మొదటి గురువు.
ఆయన్ని గురించి పెద్ద కథలున్నాయి. వీలైనప్పుడు చెప్తాను. కార్తవరాయని కథ చిత్రానికి రామనాథన్ అన్ని పాటలూ చేయలేదు. కొన్ని పాటలు ‘అశ్వత్థామ’ చేశారు. సంగీత దర్శకుడు అపురూపమైన జి.రామనాథన్ పాడిన పాట పంపుతూ ‘మిత్రమా! జి.రామనాథన్ గారు స్వరపరచి పాడిన పాట వినండి. నేనే నటుడికీ పాడనని చెప్పేవారు. యజమాని చనిపోతే, ఆ యజమాని భార్య పిల్లలూ అనాధలైపోతే, ఒకవైపు ఆ ఇంట్లో ఊయలలో రోదించే చంటి పిల్లవాడు, మరోవైపు యింటి చుట్టూ ఆవేదనతో తిరిగే యజమాని పెంపుడు గుర్రంపై అద్భుతంగా చిత్రీకరించగా నేపథ్యంలో రామనాథన్ ఆర్తిగా పాడిన పాట.. మనకు కళ్లనీరు తెప్పిస్తుంది మిత్రమా!’ అని రామనాథన్ పాడిన, అపురూపమైన ఓ తమిళ చిత్రంలోని పాట పంపారు.
వెనకటి సినీ సంగీత దర్శకుల ప్రజ్ఞా ప్రాభవాలను మనస్ఫూర్తిగా మెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యం ప్రతిస్పందనకు నా కృతజ్ఞతలు.
***

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656