S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టయిల్ మారిన సైన్మా

తెలుగు చిత్రసీమ
వేగంగా మారుతోంది.
అంతకంటే వేగంగా విస్తరిస్తోంది.
వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ -తనదైన సత్తా చాటుతోంది. ప్రమాణాలు దాటెళ్తూ -సరికొత్త అడుగులేస్తోంది. వినోదాత్మక కథలను తెరకెక్కిస్తూ, వ్యాపారాత్మక ప్రాజెక్టులు రూపొందిస్తూ.. సినిమా కేరాఫ్ టాలీవుడ్ -అనిపించుకునే దిశగా పరుగులు పెడుతోంది.
ఈ వేగాన్ని చూసి -సౌత్ సినిమాలు టాలీవుడ్‌వైపు చిత్రంగా చూస్తున్నాయి. ఆ గట్స్‌ని చూసి -బాలీవుడ్ సైతం ప్రాంతీయ కథలవైపు పరుగులెడుతోంది. విస్తరిస్తోన్న తెలుగు పరిశ్రమతో కలిసి నడిచేందుకు ప్రపంచ సినీ నిర్మాణ సంస్థలే స్నేహహస్తం చాస్తున్నాయంటే -గొప్పలు చెప్పుకోదగిన ఎదుగుదలే ఇది. ఇదంతా ఒక్క ఏడాదిలో సాధ్యమైందైతే కాదు. దశాబ్దకాలంలో ‘టాలీవుడ్’లో చోటుచేసుకున్న పరిణామాల ఫలితం. ఆ కోణంలో చూస్తే -గడుస్తున్న ఏడాదిలోనూ తెలుగు చిత్రసీమ బలమైన అడుగులే వేసింది. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తి.
**
ఇదంతా శెభాష్ అనుకునేంత సంతృప్తికరమైన ఫలితమేనా? అన్న ప్రశ్నకు ఔనని గట్టిగా సమాధానం చెప్పలేని -అసంతృప్తి. పరిమాణంగా విస్తరిస్తోన్న చిత్ర పరిశ్రమ ప్రామాణిక బలాన్ని పుంజుకోలేకపోతోందన్న అపవాదు మోయక తప్పడం లేదన్న -అసంతృప్తి. ప్రపంచస్థాయి సినిమాతో పోటీపడగల సత్తావున్నా సినిమా సరాసరి విజయాన్ని స్థిరం చేయలేకపోతున్నామన్న -అసంతృప్తి. నిజానికి ఈ ఏడాది నిర్మాతల అభిరుచిలో మార్పొచ్చింది. దర్శకుల్లో ప్రయోగాత్మక పనితీరు కనిపించింది. రొటీన్‌కి భిన్నంగా సాహసోపేత, వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో స్టార్లనుంచి కుర్రతరం వరకూ తెగువ చూపించటం కనిపిస్తోంది. ఓ సినిమాను పరిపుష్టం చేయడానికి సాంకేతిక విభాగాలూ అనితరసాధ్యమైన శ్రమకే సిద్ధపడటం చూస్తున్నాం.
మార్పును ఆస్వాదించడానికి సిద్ధపడిన ప్రేక్షకులూ -కథాంశాల్లో కొత్తదనానికి పట్టంగట్టారు. అందుకే -2019లో కాలమాన పరిస్థితులకు అనుగుణమైన, అతీతమైన ప్రయోగాత్మక సినిమాలొచ్చాయి. ఫార్మాట్‌ను దాటెళ్లిన సినిమాలు ఆదరణకు నోచుకున్నాయి. బయోపిక్‌ల రూపకల్పనకు బలమైన బీజం పడింది. ‘హీరోయిజం’ అనే పడిగట్టును పక్కనపెట్టి పాత్రోచిత అభినయానికి ప్రాధాన్యతనిచ్చిన నటీనటులూ విజయా

లందుకున్నారు. వినూత్న ఇతివృత్తాలతో కొత్తతరం కొత్తపుంతలు తొక్కుతుంటే -ప్రామాణిక కంచెను దాటి సృజనాత్మక తోవను సృశించేందుకు తెలుగు సినిమా దేనికైనా ‘సై’ అంటోంది.
అయినా -ఎక్కడో చిన్న అసంతృప్తి!
**
2019లో -తెలుగు స్ట్రెయిట్ చిత్రాలుగా 140 వరకూ బాక్సాఫీస్ ముంగిటకొచ్చాయి. హిట్టయినవి పదో పరకోవుంటే, ఓకే అనిపించుకున్నవి రెండు పదులు దాటలేదు. అంచనాలు రేకెత్తించి అంచులకు చేరని చిత్రాల సంఖ్యే ఎక్కువ. ఇలాంటి సినిమాల సంఖ్య ఏటేటా పెరుగుతుండటమే -కనిపించని అసంతృప్తికి కారణం.
జనవరి నెలలో ఏడు చిత్రాలు విడుదలైతే -మూడు పెద్ద చిత్రాలు (ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయరామ, మిస్టర్ మజ్ను) డిజాస్టర్లు కావడం ఆందోళన రేకెత్తించింది. ఫిబవరిలో 10 చిత్రాల వరకూ థియేటర్లకొస్తే.. ఒక హిట్టు ఒక ఫట్టు (యాత్ర, ఎన్టీఆర్ మహానాయకుడు)తో నెల ముగిసిపోయింది. మార్చిలో చిన్నా పెద్దా కలిపి పద్దెనిమిది చిత్రాలొచ్చినా -ఒక్కటీ సరైన ఫలితమివ్వలేదు. విసిగిపోయి -వినోదాత్మక చిత్రం కోసం ఏప్రిల్ వరకూ ఎదురు చూసిన ప్రేక్షకులు మజిలీ, చిత్రలహరితో ఆనందించి మిగిలిన ఆరు చిత్రాలను తిప్పికొట్టారు. మేలో వచ్చిన మహేష్ చిత్రం మహర్షి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం సాధిస్తే, ఫలక్‌నుమాదాస్, సీత, అభినేత్రి 2లాంటి చిత్రాలు మిశ్రమ ఫలితంతో ముందుకెళ్లలేకపోయాయి. జూన్ నెల చిత్ర పరిశ్రమలో కొత్త ఆశలు నింపింది. చిన్న సినిమాలుగా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సినిమాల జాబితాలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం, బ్రోచెవారెవరురా చిత్రాలు నిలిచాయి. వసూళ్లపరంగాను, వినోదాన్ని పంచాయన్న విమర్శకుల ప్రశంసల రూపంలోనూ మూడు చిత్రాలు తమ స్థాయని చూపించాయి. నెలాఖర్లో వచ్చిన రాజశేఖర్ కల్కి తీవ్ర నిరాశ మిగిలిస్తే -మిగిలిన పది సినిమాలు పాస్ కాలేదు. జూలైలో 13 చిత్రాలొస్తే -ఓ బేబీ, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలు అనూహ్య విజయాన్ని అందుకుని బాక్సాఫీస్‌ని దులిపేశాయి. భారీ అంచనాలతో వచ్చిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ మాత్రం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. మిగిలిన పది సినిమాలను ఆడియన్స్ పట్టించుకోలేదు. ఆగస్టులో బాక్సాఫీస్‌ను కళకళలాడించిన సినిమాలొచ్చినా -్భరీ అంచనాలతో వచ్చిన సినిమాలు మెప్పించలేకపోవడంతో చిత్ర పరిశ్రమ కుదుపునకు గురైంది. రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు, చిన్ని సినిమాలుగా వచ్చిన ఎవరు?, కౌసల్యా కృష్ణమూర్తి చిత్రాలు మంచి ఫలితాలనే సాధించాయి. మన్మధుడు 2, రణరంగం, పాన్ ఇండియా సినిమాగా వచ్చిన సాహో పూర్తిగా నిరాశపర్చటంతో -టాలీవుడ్ చిన్నబోయింది. సెప్టెంబర్‌లో పాజిటివ్ అంచనాలతో వచ్చిన ఆది జోడి, నాని గ్యాంగ్‌లీడర్ సినిమాలు నిరాశపరిస్తే, వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మరో ఐదు సినిమాలు ఆడియన్స్‌కి తెలీకుండానే వెళ్లిపోయాయి. అక్టోబర్‌లో వచ్చిన 15 సినిమాల్లో.. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన చిరంజీవి ‘సైరా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మాత్రమే ఓకే అనిపించుకుంది. గోపీచంద్ ‘చాణక్య’, ‘రాజుగారిగది 3’ చిత్రాలూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయలేదు. మిగిలిన పనె్నండు చిత్రాల పరిస్థితీ చెప్పక్కర్లేదు. ఇక నవంబర్‌లో నిఖిల్ సిద్ధార్థ ‘అర్జున్ సురవరం’ చిత్రం ఓకే అనిపించుకుంటే -మీకుమాత్రమే చెప్తా, తెనాలి రామకృష్ణ, మిస్‌మ్యాచ్, భాగ్యనగరవీధుల్లో, తోలుబొమ్మ, జార్జిరెడ్డిలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మెప్పించలేకపోయాయి. డిసెంబర్‌లో కార్తికేయ 90ఎంఎల్ నిరాశపరిస్తే, బాలకృష్ణ రూలర్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాదిలోనే ‘చిత్రలహరి’ ఫలితంతో ఊపిరి తీసుకున్న సాయితేజ్, రెండో హిట్టుగా ‘ప్రతిరోజూ పండగే’తో మంచి ఫలితం అందుకున్నాడు. అలాగే వెంకీమామతో వెంకటేష్ తన స్టామినా చూపిస్తే, మిగిలిన చిత్రాలు ఆడియన్స్‌కి రుచించలేదు.
ఈ ఏడాది అనువాద చిత్రాలనూ తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. కథాబలమున్న చిత్రాలకు మంచి ఫలితాన్నిచ్చారు. ఆ కోణంలోనే ఏడాది ఆరంభంలో ‘పేట’తో రజనీకాంత్ విజయాన్ని అందుకుంటే, చివరిలో విజిల్, ఖైదీ, దొంగలాంటి చిత్రాలతో తమిళ అగ్రహీరోలు విజయ్, కార్తిలను అక్కున చేర్చుకున్నారు. మణికర్ణిక, లూసిఫర్, ఆమె లాంటి చిత్రాలకూ ఆడియన్స్, విమర్శకుల నుంచి ప్రశంసలందాయి.
అగ్రహీరోలు హ్యాపీ
ఈ ఏడాది స్టార్ హీరోలు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షానే్న కురిపించాయి. సంక్రాంతి చిత్రంగా వెంకటేష్ -వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం భారీ విజయం సాధించింది. కుటుంబ బంధాలను వినోద సమ్మిళితంగా తెరకెక్కించి దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తే, నిర్మాత దిల్‌రాజు భారీ లాభాలే ఆర్జించారు. ఏడాది ముగింపులో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి చేసిన ‘వెంకీమామ’ సైతం -ఇద్దరికీ సంతృప్తికరమైన విజయానే్న ఇచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాతో కుర్ర హీరోలతో కాంబో సినిమాలకు వెంకటేష్ ఏకైక ఆప్షన్‌గా మిగిలితే -మజిలీ హిట్టుతోవున్న నాగచైతన్య ‘వెంకీమామ’తో మరో మెట్టెక్కాడు. ఈ ఏడాది సెనే్సషన్ క్రియేట్ చేసిన చిత్రంగా ‘ఇస్మార్ట్ శంకర్’ను చెప్పాలి. కెరీర్ క్రైసిస్‌లో పడిందన్న కసితో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి చేసిన చిత్రం ఇద్దరికీ పూర్వ వైభవాన్నిచ్చింది. ఇక ‘మహర్షి’ చిత్రంతో అద్వితీయ విజయం అందుకున్నాడు మహేష్‌బాబు. స్నేహం, ప్రేమ అంశాలే కథాబీజంగా రూపొందిన చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమైంది. బాహుబలి తరువాత టాలీవుడ్‌లో ఈ ఏడాదే వచ్చిన పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ ‘సాహో’. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించి -టాలీవుడ్ వినా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మంచి ఫలితం అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘ప్రభాస్’ ఇమేజ్‌ను పెంచిన ఈ సినిమా -టాలీవుడ్ ఆడియన్స్‌ని మాత్రం సంతృప్తిపర్చలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుజీత్ తీర్చిదిద్దినప్పటికీ, అతని కెరీర్‌కూ సినిమా ఏమాత్రం ఉపయుక్తం కాలేదు. ఇక చారిత్రక కథాంశంతో టాలీవుడ్‌లో తెరకెక్కిన మరో పాన్ ఇండియా చిత్రం -సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ అన్న ప్రచారంతో వచ్చిన చిరంజీవి సినిమా మంచి కలెక్షన్లు సాధించి నిర్మాతలకు లాభాలే ఆర్జించింది. సైరా నరసింహారెడ్డిగా చిరు ఫ్యాన్స్‌ని మెప్పించాడు. తొలితరం స్వాతంత్య్ర సమరయోథుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు తనదైన స్టయిల్లో ప్రాణంపోశాడు. మన్మథుడు 2 చిత్రంతో నాగార్జున అపజయాన్ని చవిచూడక తప్పలేదు. ప్రచార చిత్రాలతో అంచనాలను రేకెత్తించిన సినిమా కథ, కథనాల్లో నవ్యత కరవై చతికిలపడింది. జెర్సీతో క్రికెటర్‌గా నాని అభిమానుల హృదయాలు గెలుచుకున్నాడు. ఇదే ఏడాది వచ్చిన నాని సినిమా గ్యాంగ్‌లీడర్ ఆకట్టుకోలేకపోయినా -జెర్సీ ఇమేజ్ మాత్రం నానిని ముందుకే నడిపించింది. కెరీర్ గ్రాఫ్ కిందపడి సతమతమవుతున్న సాయితేజ్‌కు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలు కొత్త ఊపిరినిస్తే, రాక్షసుడు రీమేక్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్‌లోనే భారీ హిట్టందుకున్నాడు. నినువీడని నీడను నేనేతో సందీప్ కిషన్, 118తో కల్యాణరామ్ ఓకే అనిపించుకున్నారు. సంక్రాంతి చిత్రంగా వచ్చిన వినయ విధేయ రామ హీరోగా రామ్‌చరణ్‌ను నిరాశపరిస్తే, నిర్మాతగా సైరా నరసింహారెడ్డి కొత్త ఊపునిచ్చింది. అఖిల్ మిస్టర్ మజ్ను, రాజశేఖర్ కల్కి చిత్రాలు సోదిలో లేవు.
బాలయ్య బ్యాడ్‌లక్
ఈ ఏడాది సీనియర్ హీరో బాలకృష్ణకు ఏమాత్రం కలిసి రాలేదు. సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ‘కథానాయకుడు’గా వచ్చి విఫలమైతే, మరుసటి నెలలోనే రెండోభాగం ‘మహానాయకుడు’తోనూ బాలయ్య మెప్పించలేకపోయాడు. భారీ వైఫల్య చిత్రాలు ఈ రెండూ నిలిస్తే -ఇదే ఏడాది కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన ‘రూలర్’ సైతం బాలయ్యను నిలబెట్టలేకపోయింది. వచ్చే ఏడాదిలో హిట్ కాంబినేషన్ దర్శకుడు బోయపాటితో చేస్తున్న చిత్రం -బాలయ్యను ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.
కనిపించని హీరోలు
ఈ ఏడాది కొంతమంది స్టార్ హీరోల సినిమాలు లేకుండానే గడిచిపోయింది. అభిమాన హీరోలను వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ కోరిక నెరవేర్చేలేకపోయారు. గత ఏడాది ‘అరవింద సమేత’ చిత్రంతో సెనే్సషన్ సృష్టించిన జూ.ఎన్టీఆర్ -ఈ ఏడాది స్క్రీన్‌పైనే కనిపించలేదు. ఆయన చేసిన సినిమాలేవీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఈ ఏడాది మొత్తం దర్శకుడు రాజవౌళి ‘ట్రిపుల్ ఆర్’తో బిజీగావున్న ఎన్టీఆర్ -్ఫ్యన్స్‌కూ బయటా అందుబాటులో లేకుండాపోయారు. పైగా కుటుంబానికి ఎక్కువ సమయం వెచ్చించటంతో -ఎన్టీఆర్ స్క్రీన్‌కు దూరంగానే ఉన్నట్టయ్యింది. మరో ఇద్దరు హీరోలు అల్లు అర్జున్, రవితేజ సైతం ఈ ఏడాది స్క్రీన్‌కు దూరంగానే ఉండిపోయారు. గతేడాది వచ్చిన నాపేరు సూర్య.. భారీ వైఫల్యంతో కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన అల్లు అర్జున్ -చివరకు హ్యాట్రిక్ దర్శకుడికే ప్రాజెక్టు అప్పగించాడు. దర్శకుడు త్రివిక్రమ్‌తో చేస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. కొత్త ఏడాది బన్నీ కెరీర్‌కు ఎలాంటి ఊపునిస్తుందో చూడాలి. ఇక మాస్‌రాజా రవితేజ సైతం వరుస వైఫల్యాలతో సతమతమవుతూ -ఈ ఏడాది సినిమా చేయలేకపోయాడు. కొత్త ఏడాదిలో విడుదలవుతున్న ‘డిస్కోరాజా’ చిత్రంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు.

టాప్ హీరోయిన్ల టేస్ట్
2019లో ప్రయోగాత్మక పాత్రల్లో టాప్ హీరోయిన్లు మెరుపులే మెరిపించారు. నటనకు ఆస్కారమున్న పాత్రలతో మురిపించి -ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. ఓ బేబీ, మజిలీ చిత్రాల్లో విలక్షణ నటనతో ‘సూపర్ స్టామినా’ చూపించింది సమంత. భావోద్వేగభరిత పాత్రల్లో ఒదిగిపోయి స్టార్ హీరోయిజాన్ని కంటిన్యూ చేస్తోంది. మహేష్ మహర్షి, వరుణ్ గద్దలకొండ గణేష్ చిత్రాలతో అందం, అభినయాన్ని ఆడియన్స్‌కి పంచి మెప్పించింది పూజా హెగ్డే. వరుస విజయాలతో కెరీర్‌ను నడిపిస్తున్న పూజ టాప్ హరోయిన్ ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఎఫ్-2, సైరా నరసింహారెడ్డి చిత్రాలతో తమన్నా ఈ ఏడాది రెండు హిట్లు అందుకున్నా, కెరీర్‌ను మాత్రం టాప్‌గేర్‌లోకి తీసుకెళ్లలేకపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో మెప్పించి, మిస్టర్ మజ్నుతో చతికిలపడింది నిధి అగర్వాల్. బ్రొచేవారెవరురా, 118 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించింది నివేదా ధామస్. హుషారైన నటన, గ్లామర్‌తో ‘స్పైసీగాళ్’గా అవతరించింది నభానటేష్. అనుష్క, నయనతార, శృతిహాసన్, సాయిపల్లవి, కీర్తిసురేష్‌లాంటి హీరోయిన్లు ఈ ఏడాది స్క్రీన్‌కు దూరంగానే ఉన్నారు. కాజల్ చేసిన ‘సీత’ ఆమె కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ కాలేదు.
టాలీవుడ్‌లో కొత్తందాలూ తమ సత్తా చూపాయి. దొరసాని చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది జీవితా రాజశేఖర్‌ల తనయ శివాత్మిక. దొరసాని దేవకి పాత్రలో సహజ నటనతో ఆకట్టుకుంది. జెర్సీతో తెలుగులో తొలి అడుగు వేసిన కన్నడ సోయగం శ్రద్ధా శ్రీనాథ్ పరిణితితో కూడిన అభినయాన్ని కనబర్చింది. మజిలీ సినిమాతో దివ్యాంశ కౌశిక్, మల్లేశం చిత్రంతో అనన్య, కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో ఐశర్యా రాజేష్ మంచి గుర్తింపు సాధించారు. మంజిమా మోహన్, అనుపమా పరమేశ్వరన్, మెహ్రీన్ పీర్జాదా, అను ఇమ్మాన్యుయేల్, మడొన్నా సెబాస్టియన్‌లాంటి బ్యూటీలంతా టాలీవుడ్‌లో మరో మెట్టేందుకు ప్రయత్నాలు చేసినవాళ్లే.
దర్శకులకు అటూ ఇటూ
ఈ ఏడాది సీనియర్ దర్శకులు కొందరికి కలిసొస్తే, కొందరు వెనకపడ్డారు. ముఖ్యంగా ‘ఇస్మార్ట్ శంకర్’తో పూరి పూర్తిగా ఫాంలోకి వచ్చేయడమే కాదు, తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమే చెప్పాడు. అలాగే స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా మహేష్ ‘మహర్షి’ని తెరకెక్కించి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఎఫ్-2తో కామెడీ పండించటంలో తన బలాన్ని మరోసారి చాటిచెప్పాడు అనిల్ రావిపూడి. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగానే కాకుండా చారిత్రక కథాంశాల్ని సమర్థంగా తెరకెక్కించగలనని సైరా నరసింహారెడ్డితో సురేందర్ రెడ్డి నిరూపించాడు. మజిలీతో శివనిర్వాణ, జెర్సీతో గౌతమ్ తిన్ననూరి ప్రేక్షకుల మనుసల్ని గెలిచారు. గద్దలకొండ గణేష్‌తో హరీశ్ శంకర్ తన ఫాంని మరోసారి చూపించాడు.
2019లో ప్రయోగాత్మక సినిమాలనూ ఆడియన్స్ ఆదరించారు. ఎస్‌జె స్వరూప్ తెరకెక్కించిన -ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే రాజ్ ఆర్ తెరకెక్కించిన మల్లేశం దర్శకుడి ప్రతిభా పాటవాల్ని చాటింది. ఆసు యంత్రం రూపకల్పనలో తెలంగాణ చేనేతకారుడు చింతకింది మల్లేశం ఎదుర్కొన్న ఇబ్బందులను దర్శకుడు చూపించిన విధానం అద్భుతం. 118 చిత్రంతో మెగాఫోన్ పట్టిన సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఒకే అనిపించుకున్నాడు. అడవి శేష్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలుగా దర్శకుడు వెంకట్ రామ్‌జీ తెరకెక్కించిన ఎవరు? చిత్రం ఆడియన్స్‌కి బాగా కనెక్టైంది. నిను వీడని నీడను నేనే చిత్రంతో కార్తీక్ రాజు, అర్జున్ సురవరం చిత్రంతో టి సంతోష్ అరగేట్రంలోనే విజయాలు అందుకున్నారు.
బయోపిక్‌ల జోరు
ఈ ఏడాది తెలుగులో పలు బయోపిక్‌లు స్క్రీన్‌పైకి వచ్చాయి. ఏడాది ఆరంభంలోనే మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తెరకెక్కించారు. సినీ జీవితం, రాజ జీవితంగా బయోపిక్‌నుంచి రెండు భాగాలొచ్చాయి. తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఎన్టీఆర్ పాత్రను పోషించటంలో బాలకృష్ణ కష్టం కనిపించిందే తప్ప, సినిమా రెండు భాగాలూ ఆదరణకు నోచుకోకుండాపోయాయి. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా వచ్చిన రెండు చిత్రాలూ డిజాస్టర్లుగా మిగిలాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవన్ రూపొందించిన యాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో సీనియర్ నటుడు మమ్ముట్టి పూర్తిగా ఒదిగిపోయారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆసుయంత్రం రూపర్త చింతకింది మల్లేశం జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేస్తూ తెరకెక్కిన మల్లేశం చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాదు, పాత్ర పోషించిన ప్రియదర్శికి మంచి పేరు తెచ్చింది. విద్యార్థి ఉద్యమ నాయుకుడు జార్జిరెడ్డి జీవితంతో తెరకెక్కిన ‘జార్జిరెడ్డి’ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకున్నా, ఆ పాత్ర చేసిన సందీప్ మాధవ్‌కు మంచి పేరు తెచ్చింది. జార్జిరెడ్డి ఇతివృత్తాన్ని స్ఫూర్తిదాయకంగా తెరకెక్కించి ప్రతిభ చాటుకున్నాడు దర్శకుడు జీవన్‌రెడ్డి. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘సైరా’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినా, ఇతర భాషలవారిని ఆకట్టుకోలేదు. ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చిరంజీవి సినిమాగా చూశారే తప్ప, బయోపిక్‌గా రిసీవ్ చేసుకోలేకపోయారు.
రాలిన తారలు
ఈ ఏడాది తెలుగు చిత్రసీమ నుంచి చాలా తారలే రాలిపోయాయి. నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, కమెడియన్లు కన్నుమూయటంతో చిత్ర పరిశ్రమ తీవ్ర వేదనకు గురైంది. లంకేశ్వరుడు, ఘరానాబుల్లోడు చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన విలక్షణ నటుడు మహేష్ ఆనంద్ ఈ ఏడాదే కన్నుమూశాడు. అలాగే గ్యాంగ్‌లీడర్, మగధీరుడులాంటి చిత్రాలను తెరకెక్కించిన విజయబాపినీడు; మురారి, అతడు లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన దీక్షితులు; అరుంధతి, అమ్మోరులాంటి చిత్రాలను తెరకెక్కించిన కోడి రామకృష్ణ, ఊరుమ్మడి బతుకులు, అనే్వషణ, లేడీస్‌టైలర్‌లాంటి చిత్రాల్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్న రాళ్లపల్లి ఈ ఏడాది కనుమరుగయ్యారు. గిన్నిస్ రికార్డు దర్శకురాలు విజయనిర్మల; సినీ సాహితీ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ; విలక్షణ నటుడు దేవదాస్ కనకాల; కమెడియన్ వేణుమాధవ్; అలనాటి తార గీతాంజలి; కథా స్క్రీన్‌ప్లే రచయిత; నటుడు గొల్లపూడి మారుతీరావు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. *

-రాణీప్రసాద్