S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక లక్ష తెలుగు సామెతలు

చాలా ఆసక్తి కలిగిస్తున్నది కదూ ఈ ప్రసక్తి. చిలుకూరి నారాయణరావు (1890 - 1952) గూర్చి విన్న వారికి ఆయన లక్ష తెలుగు సామెతలు సేకరించాడనీ, తన జీవిత కాలంలో వాటిని ప్రచురించలేక పోయాడనీ తెలిసి ఉంటుంది. భారతీయ భాషలలో ఇటువంటి ప్రయత్నం మరెక్కడా జరగలేదు.
ఇప్పుడు గుంటూరులో నెలకొన్న బొమ్మిడాల శ్రీకృష్ణ మూర్తి ప్రతిష్ఠానం (ట్రస్టు) ఈ లక్ష సామెతలను సంపుటాలుగా తెస్తున్నారు. ఇది తెలుగు వారందరికీ అత్యంత ప్రమోదావహమైన విషయం. ఈ సంపుటాలు ఎప్పుడు వెలువడతాయా అని తెలుగు సాహిత్య పరులంతా నిర్నిమేషంగా ఎదురు చూస్తున్నారనటం అతిశయోక్తి అనుకోవద్దు.
బొమ్మిడాల ట్రస్టుకు ఈ సామెతల రాత ప్రతులు శిథిల రూపం దాల్చిన ఎక్సర్‌సైజు నోట్ పుస్తకాలు (సుమారు నూరు) చేరటం వెనుక ఒక నేపథ్య గాథ ఉంది. ఈ రాత ప్రతులను గూర్చి అందరూ ఈ నోటా, ఆ నోటా చెప్పుకోవటమే కాని వీరిని చూసిన వారెవరూ లేరు. ఇవి చిలుకూరి నారాయణరావు గారి కుమారుడు రాంబాబు గారి దగ్గర (అప్పటికి 90 ఏళ్లు, అసహాయుడు. సాహిత్య పరిచయం లేనివాడు) ఉన్నవని ఇటీవలే కీర్తిశేషులైన కైపా నాగరాజు తరచు ప్రస్తావిస్తూ ఉండటంతో వాటిని ప్రచురించే ప్రయత్నం చేదామని అక్కిరాజు రమాపతిరావు కుతూహలం చూపగా, చిలుకూరి వారి కుమారుడు రాంబాబుగారు అవేవో బంగారు గని అని భ్రమిస్తున్నాడని, అతడు దిక్కుమొక్కు లేని వొంటరితనం, అందునా వృద్ధాప్యపు బాధలు, వ్యాధి బాధిత కష్టాలు అనుభవిస్తున్నాడనీ, ధనరూపేణ ఏదో తగిన సహాయం ఆశిస్తున్నాడనీ వెల్లడించడంతో రమాపతిరావు రెండు మూడు దఫాలుగా నాగరాజా గారి ద్వారా రాంబాబు గారికి 30 వేల రూపాయలు పంపించటం జరిగింది.
కుక్క చెవులు (డాగ్ ఇయర్స్) పడిన ఆ పాత రాతప్రతులను నాగరాజా ఎంతో శ్రమకోర్చి దఫదఫాలుగా రిజిస్టర్డ్ పోస్టులో అక్కిరాజుకు వాటిని పంపించారు. అక్కిరాజు వీటిని ఏం చేయగలడు? ఆయన అదృష్టం వల్ల బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి పరిచయం ఆ సమయానికి లభించటంతో, వీటిని ప్రచురించవలసిందిగా అక్కిరాజు అభ్యర్థించాడు వారిని.)
బొమ్మిడాల ట్రస్టు సంగతి సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక పరిశోధన, సమగ్ర విశిష్ట సామాజిక సేవా సంస్థ భారతదేశపు ఇతర ప్రాంతాలలో ఇంకొకటి ఉన్నట్లు తెలియదు. వారు చేస్తున్న నిర్మాణాత్మక ఉత్తమ సమాజ పునరుజ్జీవనోద్యమిత కృషి, వారు ఆనువత్సరం ఐదు శ్రేణులలో ఏర్పాటు చేసిన మూడు లక్షల ద్రవ్య పురస్కారాలు సాక్ష్యం పలకవా?
సృజన (పరిశోధన) సాహిత్యం, గ్రంథాలయ సేవ, పత్రికా రంగం, శిశు మనోవికాస పాఠశాల నిర్వహణ, ఉత్తమ గ్రంథ ప్రచురణలకు వారు పురస్కార ప్రోత్సాహాలందజేస్తారు. తమ పుస్తకాలు తామే ప్రచురించుకునే రచయితలకు ఉదారంగా ధన సహాయం చేస్తారు. అక్కిరాజు రమాపతిరావుకు ఆయన వెంటనే 30 వేల రూపాయలు భర్తీ చేశారు. సాలు పొడవునా గ్రంథావిష్కరణలు. నాళం కృష్ణారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి తెలుగు సాహిత్య, చరిత్ర పరిశోధన వారసత్వమనీషుల జయంతులు, ఆ సందర్భంగా గొప్ప విశిష్ట సంచికలు ప్రచురింపచేస్తారు. స్థానికమైన సారస్వత సభలు నిర్వహిస్తారు. వేటపాలెం సారస్వత నికేతనానికి లక్షల ద్రవ్యం భూరి విరాళంగా అందజేశారు.
అసలు తెలుగు సామెతల గూర్చిన జిజ్ఞాస కూడా పాశ్చాత్య విద్వాంసులు, ఆ దేశ భాషాభిమానుల పూనిక వల్లనే మొదటిసారి వెలుగులోకి రావటం జరిగింది. సి.పి.బ్రౌన్, ఎఫ్.డబ్ల్యు. ఎల్లిస్, బిషప్ కాల్క్వెల్, రాబర్ట్ నోబుల్ వంటి వారు తెలుగు భాషా సాహిత్య, సామాజిక పునరవేక్షణ కృషికి పూనుకున్నట్లే. 1872వ సంవత్సరంలో రెవరెండ్ కార్ దొర తెలుగు సామెతల సంపుటీకరణంపై ఆసక్తి కలిగి, రావిపాటి గురుమూర్తి శాస్ర్తీ సహాయంతో తెలుగు సామెతల సంకలనం ప్రచురించాడు. ఈ కార్ దొర ఇంగ్లీషు వారి సైనిక స్థావర అధికారిగా (రెజిమెంట్) పని చేసేవాడు. రెవరెండ్ కార్ దొర సేకరించిన తెలుగు సామెతలను, ఆనాటి తెలుగు పత్రికలు ప్రచురించేవి. మచిలీపట్నం (బందరు) నుంచి ఆ రోజుల్లో ప్రకటితమవుతున్న పురుషార్థ ప్రదాయినిలో (ఈ పత్రిక ఎవరైనా చూడగలిగితే) కార్ దొర ప్రసక్తి కనపడుతుంది. దిగవల్లి వెంకట శివరావుగారి గ్రంథ, పత్రికా, కుంఫిణీ కాలపు రికార్డుల సేకరణలో ఈ పురుషార్థ ప్రదాయిని సంపుటం ఉండేది. దీని గురించి నేను నోట్సు రాసుకున్నాను. శివరావు గారి దగ్గర కొక్కొండ వారి ఆంధ్ర భాషా సంజీవని పత్రిక నుంచి నమోదులుండేవి. చాలా ఆసక్తికరమైన విషయాలనివి తెలియజేసేవి. విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ స్మారక గ్రంథాలయంలో కొమర్రాజు లక్ష్మణరావు గారు భద్రపరచుకొన్న ఆంధ్ర భాషా సంజీవని సంపుటాలు తాము చూసి ‘నోట్సు’ రాసుకున్నట్లు శివరావుగారు చెప్పేవారు. తరువాత కాలంలో ఈ గ్రంథాలయం అగ్ని ప్రమాదం పాలైనట్లు వారే చెప్పేవారు.
ఈ రచన ముగింపులో ఒక విషాదకర వృత్తాంతం స్మరించుకోవలసి ఉంది. ఈ గొప్ప పూనిక కారకుడైన కైప నాగరాజా ఇప్పుడు లేరు. చిలుకూరి వారి కుమారుడు రాంబాబు, మృతుడో, మృతప్రాయుడో అయి లోకవృత్తం ఏమీ తెలియనివాడు.
ఈ లక్ష తెలుగు సామెతల ప్రచురణ ప్రణాళికలో అచ్చులతో ప్రారంభమయ్యే మొదటి సంపుటిని త్వరగా ప్రచురింప చేయవలసిందని నేను శ్రీకృష్ణమూర్తి గారిని అభ్యర్థించాను. సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తి కావటానికి 60 ఏళ్లు పట్టింది. ఆరేళ్లలోనైనా చిలుకూరి వారి లక్ష సామెతల మొదటి సంపుటమైనా ప్రచురణకు నోచుకోకపోవటం బాధాకరం. చింతావహం. టేకుమళ్ల కామేశ్వరరావు గ్రంథం ‘నా వాఙ్మయ మిత్రులలో’ చిలుకూరి వారి సామెతల సేకరణ గూర్చి చిలుకూరి వారే రాసిన రెండు లేఖలున్నాయి.

- అక్కిరాజు రమాపతిరావు