S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వసిస్తేనే రహస్యం వెల్లడయ్యేది

మన జీవితం సకల గుణ శోభితం. సకల గుణాలంటే అన్నీ సగుణాలే అని కాదు... అన్ని గుణాల సమాహారం. గుణాలు అన్నంత మాత్రాన అన్నీ సద్గుణాలే అనుకుంటే ఎలా? నిజానికి మనం సద్గుణాలకు పుట్టిల్లే అయితే మన మానవ జన్మ ఇలా ఎందుకు సాగుతుంది? కాబట్టి ఎన్నో కొన్ని దుర్గుణాలు మన వ్యక్తిత్వంలో, మన వర్తనంలో దొర్లకపోవు. అయితే మన సద్గుణ సంపన్నత ముందు అవి లెక్కలోకి రావు. చేటలో పోసిన బియ్యానికి ఇచ్చిన ప్రాముఖ్యం వాటి మధ్యనున్న మట్టిబెడ్డల కివ్వం. ఇంకా చెప్పాలంటే ఆ మట్టిబెడ్డల్ని ఏరేస్తాం... మనం సద్గుణ సంపన్నులం కావాలన్న ఆరాటంతో.
ఇంతకీ సద్గుణ శోభితం అంటే దోష దృష్టి లేకపోవటం... అంటే అసూయాపరులం కాకుండటం.
‘ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే
జ్ఞానం విజ్ఞానసహితం యద్జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్’
అన్న గీతా శ్లోకం అర్జునుడ్ని ‘అనసూయవే’ అని అంటుంది. అంటే అర్జునుడు అసూయాపరుడు కాదని. అన్నంత మాత్రాన అర్జునుడికి అసలు అసూయ అనేది లేనే లేదని కాదు. ఎప్పుడో కనిపించే దుర్గుణాలను కాక ఎల్లప్పుడు ఆకర్షించే సద్గుణాలను లెక్కించటం అనసూయుల లక్షణం. ఒక విధంగా దోషాలను లెక్కలోకి తీసుకోకపోవటం, పరులను నిందించకపోవటం అనసూయత. అటువంటి వారికే దుఃఖరూప సంసారం నుండి ‘ముక్తి’ లభిస్తుంది.
ముక్తి అన్న వెంటనే మన మనసులలో మెదిలేది పరలోక ప్రాప్తి. అంటే మన మానవాత్మను సదా చైతన్యదీప్తం చేస్తున్న పరమాత్మపై ఏకతా దృష్టి... ఆ పారలౌకిక జగత్తును చేరుకునే మార్గానే్వషణ.. ఆ పరలక్ష్యాన్ని చేరుకునేందుకు సాగించే సాధన. ఆ సాధన భక్తిరూపం కావచ్చు... కర్మ రూపం కావచ్చు... యోగ ధ్యాన రూపం కావచ్చు. మొత్తానికి మానవత్వాన్ని ఆధ్యాత్మికత్వంతో మిళితం చేయటం ముఖ్యం. మానవ తత్వమే ఆధ్యాత్మికత్వంగా గుభాళించటం లక్ష్యం. ఈ పరమ పరీమళానికి కావలసింది దోష దృష్టి లేకుండటం. అనసూయత వొంటపట్టటం. అప్పుడే మన సాధన శ్రద్ధతో సాగుతుంది. అంటే మనం ఆధ్యాత్మికులం కావాలంటే మొదటగా శ్రద్ధాళువులం కావాలి.
నిజానికి భగవద్గీత ఈ ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానాన్ని మనకు ఉపదేశ రూపంలో అందిస్తోంది కాబట్టే కృష్ణోపదేశాన్ని ‘గుహ్యతమం’ అంటున్నాం. అంటే మానవాత్మ, పరమాత్మగా ప్రవర్తిల్లే మార్గం గుహ్యతమం. మొత్తానికి ‘విజ్ఞాన సహిత’మైందే గీతా జ్ఞానం. మనం దుఃఖ జీవులం కాకుండటానికి, సద్గుణ కర్మాచరణ మన ప్రవృత్తి కావటానికి, సాంసారిక బాంధవ్యాన్ని బాధ్యతగా సాగిస్తూ ఆత్మదర్శనంతో పారలౌకిక ప్రాప్తి కోసం సాధన సాగించటమే ‘ముక్తి’మార్గం.
ముక్తి మార్గాన్ని ఎరుకపరిచే భగవద్గీత జ్ఞాన విజ్ఞాన పొత్తం. అందుకే గీతాచార్యుడు-
‘రాజ విద్యా రాజగుహ్యం పవిత్ర మిదముత్తమమ్
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మ వ్యయమ్’
అని అంటాడు. రాజ విద్య అంటే రాచరిక వ్యవస్థను ఉపకరించే జ్ఞాన ప్రబంధం అని కాదు... విద్యలలో సాటిరానిదని... అన్ని రహస్యాల సంకలనం అని. ఇలా ‘రాజవిద్యా రాజగుహ్యం’ కాబట్టే కృష్ణ గీతను ‘పవిత్రమ్, ఉత్తమమ్, ప్రత్యక్షావగమమ్, ధర్మ్యమ్, సుసుఖమ్, కర్తుమ వ్యయమ్’ అని అంటున్నాం. అంటే భగవద్గీత మనల్ని పవిత్రపరుస్తుంది, ధర్మజీవుల్ని చేస్తుంది.. పైగా ఆత్మసాధనకు సుఖమైంది. ఇలా అన్ని విధాల శాశ్వత మార్గదర్శిని గీత. అయితే మనం శ్రద్ధాళువులం అయితేనే కృష్ణ గీత మనకు మార్గదర్శకం అవుతుంది.
శ్రద్ధలేని మానవ జీవితం తనకు తెలీకుండానే మృత్యువుతో సహవాసం చేస్తూ సంసార బంధంతో పరిభ్రమిస్తుంటుంది. పైగా అది ‘పర’మ ‘ప్రాప్తి’కి అవకాశమివ్వదు. ఇక్కడ పరమ ప్రాప్తి అంటే ‘ముక్తి’ అనే! ముక్తి అంటే మరో జన్మలేకుండటం. దాదాపుగా మన ఆత్మ ఎనభై నాలుగు లక్షల మార్లు ‘జీవ’ ‘ప్రాణ’ స్పందనలతో మృత్యువును చవిచూస్తుంది. ఎనభై నాలుగు లక్షలమార్లు ఆత్మ పరమాత్మ తత్వ ఎరుక లేకుండా చరించి మానవ జన్మకొచ్చి పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా అందుకుంటుంది. అదే ప్రాపంచికం నుండి విముక్తి... పారలౌకిక ‘ప్రాప్తి’.
పరలోక ప్రాప్తికి మన అంతరంగం నుండే అడుగులు పడాలి... కారణం అంతరంగం గుప్త రహస్యాల నెలవు కాబట్టి. అంతఃకరణతో ఆత్మ ప్రయాణమైతే తప్ప ఒక్కో రహస్యం విడివడదు. భృక్తం రహితమైతే తప్ప పరలోక వాకిళ్లు తెరచుకోవు. ఆ వాకిళ్లను చేరాలంటే - మన మానవతత్వం విశ్వాసంతో వికసించాలి.. విశ్వసించనిదే ఏ రహస్యమూ వెల్లడికాదు.. ఏ సాధనా ముందుకు సాగదు. ఉన్నతిని సాధించాలంటే విశ్వసించాల్సిందే! విశ్వాసం పరమాత్మను మానవ తత్వానికి చేరువ చేస్తుంది. అప్పుడే మన మానవ తత్వం పరమాత్మ తత్వంగా పరిణమిస్తుంది.
ఇంతకీ పరమాత్మ అంటే అవ్యక్తం నిరాకారం. ఆ అవ్యక్త, నిరాకారాల మయంగా ఈ సృష్టి పరిపూర్ణంగా సాగుతోంది. సంకల్పం పరమాత్మదైతే ఆచరణ ఆత్మది. అంటే పరమాత్మ అంతర్గత తత్వమే ఆత్మ. అంతమాత్రాన ఆత్మలో పరమాత్మ స్థితంగా ఉన్నట్లా! కాదంటుంది కృష్ణగీత. నీటితో మంచు పరిపూర్ణమై ఉన్నట్లుగా సర్వం నిరాకార పరమాత్మతో పరిపూర్ణమై ఉంది. అలాగే సర్వభూతాలు పరమాత్మ సంకల్పంతో ఆ పరమాత్మలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ అంతర్గతమే ఈ సృష్టి అని. అలాగని సకల ప్రాణికోటి పరమాత్మలోనే స్థిరంగా ఉన్నాయా అంటే కాదు అంటుంది ఆ పరమాత్మ.

---
నిజానికి సకల ప్రాణికోటిని సృష్టించేది, పోషించేది ఆ
పరమాత్మనే అయినప్పటికీ ఆ పరమాత్మ సకల ప్రాణికోటిలో స్థితంగా ఉండటం లేదు. అంటే సృష్టిలోని సకల ప్రాణికోటికీ
అతీతంగా ఉన్నట్లే పరిగణించాలి.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946