S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కామన్‌ఫండ్

పోటీలో మూడవ బహుమతి రూ.3,000 పొందిన కథ

---

‘కంగ్రాట్యులేషన్స్’ అంది డాక్టర్ లలితమ్మ.
అర్థమైంది నాకు. తల్లిని కాబోతున్నాను. నా ముఖం పాలిపోయింది.
‘అదేంటమ్మాయ్! పెళ్లికాని అమ్మాయిలా ముఖం పెట్టావ్?’ అంది లలితమ్మ.
నాకు పెళ్లైందా? అసలు పెళ్లంటే ఏమిటి?
నేను తల్లినైతే ఎవరికి లాభం? నాకా, నా భర్త వికాస్‌కా?
లాభమనేది వికాస్‌కి ఉండొచ్చేమో - నాకు మాత్రం ఎటు చూసినా నష్టమే!
వికాస్ టూర్లో ఉండటం మంచిదే అయింది. హాస్పిటల్‌కి ఒకత్తెనే వచ్చాను. ఇప్పుడు ఏదో కారణం చెప్పి అమ్మచేత అబార్షన్‌కి ఏర్పాట్లు చేయించాలని మనసులో అనుకుంటూ డాక్టర్ వద్ద సెలవు తీసుకున్నాను.
సరిగ్గా వారం రోజుల క్రితం...
‘ఏడాదిలో నాన్న రిటైరౌతున్నాడు. షష్టిపూర్తి వేడుక ఘనంగా చెయ్యాలి’ అన్నాను.
వికాస్ వెంటనే ‘లిలియన్స్‌లో మార్కెటింగ్ మేనేజర్‌వి. నెలకి లక్షన్నర జీతం. మీ నాన్న కోసం ఎంత ఖర్చు పెట్టినా నీకు అడ్డేంటి?’ అన్నాడు. లిలియన్స్ ఓ మల్టీ నేషనల్ కంపెనీ. తనూ అందులోనే నెలకి లక్షా ఎనభై వేల జీతం తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
భార్యాభర్తలం కాబట్టి జీతాల వివరాలు ఇద్దరికీ కచ్చితంగా తెలుసు.
‘నా సంగతి సరే. మా నాన్న నీకు మామగారు. ఖర్చెంతైనా సగం నీది. అందుకే చెప్పాను’ అన్నాను.
వికాస్ అడ్డంగా తలూపి ‘ఈ షష్టిపూర్తి బాధ్యత నాదీ, నీదీ కాదు. నా బావ అంటే నీ అన్నది’ అన్నాడు.
తను అలాగనడంలో ఆశ్చర్యం లేదు. ఉద్యోగంలో చేరక ముందే వికాస్ నాన్న షష్టిపూర్తి మహోత్సవం జరిగింది. ఖర్చు వికాస్ అక్క పెట్టింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలో అతడు అక్కకి బాకీ తీర్చేశాడు.
నా అన్నయ్య విషయానికొస్తే - చదువుకునే రోజుల్నించే వాడికి తన లోకమేదో తనది. పెళ్లయ్యాక వదిన లోకమే తనదైంది. నా పెళ్లికే ముహూర్తం టైంకొచ్చి, అంటీ ముట్టనట్లుండి, మర్నాడు వెళ్లిపోయాడు. వాడు సరైన వాడైతే ఈ షష్టిపూర్తి గురించి నేను మాట్లాడే అవసరముండేది కాదు.
‘అల్లుడంటే కొడుకుతో సమానం. అన్నయ్య ప్రసక్తెందుకూ? వాడి గురించి నీకు తెలియదా?’ అన్నాను నిష్ఠూరంగా.
‘కోడలంటే కూతురితో సమానమని నేనన్నప్పుడు నువ్వొప్పుకునుంటే ఏమో కానీ, అల్లుడంటే కొడుకని ఒప్పుకోలేనిప్పుడు!’ అన్నాడు వికాస్ వెంటనే.
వికాస్ తల్లికి వడ్డాణం కొనుక్కోవాలని మనసుట. అది తండ్రి తీర్చలేదు. పెళ్లైన ఆర్నెల్లకి అనుకోకుండా మాకు బోనసులొచ్చాయి. తనకి లక్షా ఏభై, నాకు లక్షా పాతిక. ఇంకాస్త పడినా వేసి, తల్లికి వడ్డాణం కొందామన్నాడు.
‘మీ అమ్మ కోరిక తీర్చడానికి, నేనెందుకు డబ్బివ్వాలి? కావాలంటే మీ అక్కనడుగు’ అన్నాను.
‘కోడలంటే కూతురితో సమానమంటారు కదా అని నీకు చెప్పాను’ అన్నాడు వికాస్.
‘అన్నీ ఉత్త మాటలు. కోడలు కూతురూ కాదు. అత్త తల్లీ కాలేదు’ అన్నాను. నా మాటకి బదులివ్వలేక ముఖం వేలాడేస్తే జాలేసి, ‘కావాలంటే అప్పిస్తాను. ఆరు నెలల్లో తీర్చేయాలి’ అన్నాను.
ఒప్పుకోడని నాకు తెలుసు. ఆస్తిలో ఒకర్నొకరు మించిపోవాలని ఇద్దరం పోటీ పడుతున్నాం. తన డబ్బంతా వడ్డాణానికి పోతే, బ్యాంకు నిల్వల్లో నాకంటే బాగా వెనకబడిపోడూ!
‘అప్పుగా కాదు, ప్రేమతో ఇవ్వాలి’ అని సెంటిమెంటుతో ట్రీట్‌మెంటివ్వబోయాడు వికాస్.
ప్రేమ అనగానే నవ్వొచ్చింది. అదేమిటో తనకీ తెలియదు. నాకూ తెలియదు.
నేను లిలియన్స్‌లో చేరి ఆరేళ్లయింది. అప్పటికి వికాస్ అక్కడ రెండేళ్ల నించి ఉన్నాడు. ఇద్దరిదీ ఒకే టీం. కలిసి రెండేళ్లు పని చేశాం. మా ఇద్దరిలో ప్రేమ అన్న భావనే లేదు.
జీవితంలో బాగా ఎదగాలి. డబ్బు బాగా కూడబెట్టాలి. ఇద్దరిదీ అదే ధ్యాస. ఇక ప్రేమకి తావెక్కడిది?
ఒకసారి క్యాబ్స్ వాళ్లు సమ్మె చేశారు. వికాస్‌కి బైకుంది. ఆఫీసు వాళ్లు ఫోన్ చేశారు. నన్ను పిక్ చేసుకోమని. అలా మా ఇంటికొచ్చి అమ్మానాన్నల కళ్లల్లో పడ్డాడు. వాళ్లు జంటగా మమ్మల్ని చూసి ముచ్చటపడ్డారు. వికాస్ తల్లిదండ్రుల్ని కలిస్తే వాళ్లూ ముచ్చట పడ్డారు. అప్పుడు మమ్మల్ని చూసి మేం ముచ్చట పడాల్సొచ్చింది.
మా జీవితాశయాలొక్కటేనని ఇద్దరికీ తెలుసు. కానీ ఇద్దరం ఒకటవాలన్న ఆలోచనే మాకు రాలేదు. అమ్మానాన్నలు చెప్పినప్పుడు కూడా మాకు ప్రేమ
స్ఫురించలేదు. పెళ్లి గురించి ఓ రోజంతా ఆలోచించుకున్నాం. తర్వాత ఆఫీసు క్యాంటీన్లో జంటగా కూర్చుని మాట్లాడుకున్నాం.
పెళ్లయిన తర్వాత ఉద్యోగస్థురాలైన ఆడదానిక్కూడా తన డబ్బు తాను ఖర్చు పెట్టుకునే స్వతంత్రముండదట. ఫ్రెండ్స్ చెప్పారు. ఎవరి సంపాదన వారికున్నప్పుడు ఎవరి స్వేచ్ఛ వారికుండాలన్నది నా మాట.
పెళ్లయ్యాక మగాడి సంపాదనంతా భార్య బట్టలు, నగలు, షోకులకే చాలదంటారుట వికాస్ ఫ్రెండ్స్. ఎవరి సంపాదన వారికున్నప్పుడు ఒకరికొకరు భారం కాకూడదని వికాస్ మాట.
ఇద్దరి అభిప్రాయాలూ ఇంచుమించు ఒకటే కావడంతో కామన్ ఫండ్ ప్రతిపాదన వచ్చింది.
ప్రతి నెలా ఇద్దరం చెరిసమంగా జీతంలోంచీ కొంత డబ్బుని కామన్ ఫండ్‌కి ఇవ్వాలి. ఇల్లు, భోజనం, సరదాలు, షికార్లు వగైరాలకి దాంట్లోంచే ఖర్చు పెట్టాలి. పరస్పరం ఒప్పుకుంటే కామన్ ఫండ్ అంశాల్లో కొత్తవి చేర్చొచ్చు. పాతవి తొలగించొచ్చు. జీతంలో మిగతాది ఎవరికి వారు తమ ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవచ్చు.
కలిసుండడం కంటే, జీవితాశయాలకి సహకరిస్తుందన్న ఆశతో పెళ్లి చేసుకున్నాం. ఆఫీసుకి దగ్గరని చెప్పి వేరే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాం. మా అసలుద్దేశం, కామన్ ఫండ్ ఆచరణకి ఇబ్బంది ఉండకూడదని.
పెళ్లైనా నా స్వతంత్రానికే లోటూ లేదని తెలియాలని, అమ్మానాన్నలకి తరచుగా డబ్బో, కానుకలో పంపేదాన్ని. వికాస్ మగాడు. తన స్వేచ్ఛని నిరూపించుకోవాల్సిన అవసరం లేదుగా. తన వాళ్లకి ఏమీ ఇచ్చేవాడు కాదు. నన్ను చూసి చిన్నతనం అనిపించేదేమో, ‘నాన్నకి పెన్షనొస్తుంది. డిపాజిట్ల మీద వడ్డీ వస్తుంది. ఇంటద్దె వస్తుంది. ఊళ్లో పొలాల మీంచి సాలుసరి ఆదాయముంది. మాకెందుకురా నీ డబ్బు - అంటాడు నాన్న’ అని అడక్కుండానే సంజాయిషీ కూడా ఇచ్చాడు.
ఇంచుమించు మా నాన్నదీ అదే పరిస్థితి. మాకెందుకమ్మా, నీ డబ్బని ఆయనా అన్నాడు. కానీ అడిగామనే వాళ్లు మాకు అన్నీ చేశారా? ఇప్పటికీ ఏదో వంకన ఏదో ఒకటి మా కోసం చేస్తూనే ఉంటారు వాళ్లు.
ఐతే నా ఆలోచన ఇలా ఎన్నాళ్లో సాగలేదు. అవతల వికాస్ నిల్వలు నా నిల్వల్ని మించిపోతున్నాయి. అందుకని క్రమంగా అమ్మానాన్నల విషయంలో నా ధోరణి మార్చుకున్నాను. అంతేకాదు, ఆడదాన్ని కదా - కాస్మెటిక్సుకీ, బట్టలకీ, నగలకీ నా ఖర్చెక్కువే. పెళ్లి రోజున కూడా ఆ ఖర్చుకి కామన్ ఫండ్ ఉపయోగించడానికి ఒప్పుకోడు వికాస్. తనమీదయ్యే ఖర్చు నా డ్రెస్సు కుట్టుకూలంత ఉండదు. అతడి నిల్వలు పెరిగిపోవూ? పోనీ అంటే వికాస్ బార్లకెళ్లడు. క్లబ్బులకెళ్లడు. ఇల్లు, ఆఫీసు అంతే! సినిమాలకీ, హోటల్స్‌కీ, ప్రయాణాలకీ - ఖర్చు కామన్ ఫండ్ నించే. అతడి నిల్వలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
నగల మీదా, బట్టల మీదా మోజు తగ్గింది. సంపాదన పెంచుకుందుకు ఆన్‌లైన్లో ట్రేడింగ్ మొదలెట్టాను. అదీ వికాస్‌కి తెలియకుండా. తెలిస్తే, తనూ మొదలెట్టి - ఆదాయంలో నన్ను మించిపోతాడని భయం!
ఇలాంటి పరిస్థితుల్లో నాన్న షష్టిపూర్తి మాటొచ్చింది. అన్నయ్య చెయ్యడు. నేనే చెయ్యగలను కానీ - నిల్వల్లో వికాస్‌కి ఇంకా ఇంకా వెనకబడిపోతాను. కామన్‌ఫండ్ గురించి కదిపితే వికాస్ - నా మాట నాకే అప్పజెప్పాడు.
ఏం చేస్తాను? ఐడియా డ్రాప్డ్.
ఇంతలో నేను తల్లినౌతున్నానని ఈ వార్త!
పది నెల్లు కడుపులో బిడ్డని మొయ్యాలి. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఖరీదైన మందులు వాడాలి. ఆఫీసుకి కూడా తరచుగా సెలవులు పెట్టాల్సి రావచ్చు. లాస్ ఆఫ్ పే కూడా అవసరపడొచ్చు. వికాస్ వీటిని కామన్ ఫండ్‌లో చేర్చడానికి ఒప్పుకోవచ్చు. కానీ మునుపటిలా ట్రేడింగ్ చెయ్యగలనా?
బిడ్డ పుట్టేక నాకెన్ని అదనపు బాధ్యతలు? పదినెల్లు మొయ్యడం, ఆ తర్వాత ఆలనా, పాలనా...
కెరీర్‌లో వెనకబడిపోనూ? వికాస్‌కి ఇంక్రిమెంట్ పెరిగిపోతుంది. నా ఇంక్రిమెంట్ ఆగిపోవచ్చు.
ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి.
తల్లిని కాబోతున్నానని వికాస్‌కి చెబితే, మురిసిపోతాడు - నిల్వల్లో నేనింకా ఇంకా వెనకబడిపోతానని! అబార్షన్‌కి ఒప్పుకోను కాక ఒప్పుకోడు. తనదేం పోయింది - శ్రమంతా నాది, ఫలితం తనది!
అతడికి చెప్పకుండానే అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను. ఇప్పుడిప్పుడే ట్రేడింగ్‌లో పిక్ చేస్తున్నాను. అబార్షన్‌కి అయిన ఖర్చునీ, సమయాన్నీ కూడదీసుకోవడం కష్టమేం కాదు.
ఫోన్లో మాట్లాడే విషయం కాదిది. ఆఫీసు టైంలో వెడితే నాన్న ఇంట్లో ఉండడు. అందుకని మర్నాడు మా ఆఫీసులో పెర్మిషన్ తీసుకుని మా ఇంటికెళ్లాను. నెమ్మదిగా అమ్మకి విషయం చెప్పాను.
నేను తల్లినౌతున్నానని తెలియగానే అమ్మ మురిసిపోయింది. అబార్షన్ మాటెత్తగానే షాక్ తింది. తేరుకున్నాక నెమ్మదిగా లాలించి మా కాపురం గురించీ, మా మధ్య ఒప్పందం గురించీ మొత్తం విషయాలు రాబట్టింది.
‘నాన్న షష్టిపూర్తి గురించి నువ్వెందుకింత ఆలోచించావో అర్థంకాదు. అదెలాగూ యధావిధిగా జరుగుతుంది. అన్నయ్య పూనుకోకపోతే, వాడి పేరున మేమే ఆ వేడుక జరిపించుకుంటాం. మా సరదాకోసం కాదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించలేదన్న చెడ్డ పేరు వాడికి రానివ్వం’ అంది అమ్మ ముందుగా.
ఇది నేనూహించలేదు. ‘మీరు ఖర్చు పెట్టి క్రెడిట్ వాడికిస్తారా? నేనొప్పుకోను’ అన్నాను.
‘నువ్వొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ విషయంలోనూ నేనొకటనుకుంటున్నా. కాదనకు’ అంది అమ్మ.
చురుగ్గా చూశాను. ‘మేం ఇరవయ్యొకటో శతాబ్దపు దంపతులం. ఏం చేసినా ఆలోచించే చేస్తాం. మీ కాలం వాళ్లకి ఏవేవో అర్థంలేని సెంటిమెంట్లుంటాయి. అవకాశమొస్తే చాలు, వాటిని మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. నువ్వలా చెయ్యవనే నీకు అన్నీ చెప్పుకున్నాను. చేతనైన సాయం చెయ్యి. సలహాలివ్వద్దు’ అన్నాను దృఢంగా.
ఏమనుకుందో ‘సరేలే, ధైర్యంగా ఉండు. ఈ రాత్రికే తగిన ఏర్పాటు చేస్తాను. అది అబార్షనే కావచ్చు. మరేదైనా కావచ్చు. గత శతాబ్దపు తల్లినే అయినా ఈ శతాబ్దపు కూతుర్ని సంతోషంగా ఉంచే తెలివి, శక్తి నాకున్నాయనే అనుకుంటున్నా’ అంది అమ్మ నా అంత దృఢంగానూ.
నాకు సంతోషంగా అనిపించింది. పిల్లల్ని సంతోషంగా ఉంచడంలో అమ్మకి సాటి ఎవరుంటారు?
ఆ రాత్రి అమ్మ నుంచి ఫోన్. ఫోనెత్తగానే ‘నిన్నో ప్రశ్న అడుగుతాను. సూటిగా బదులివ్వు’ అంది.
సెంటిమెంటుతో కొట్టదు కదా అని
అనుమానిస్తూనే, ‘అడుగు’ అన్నాను.
‘మీ సంతోషం కోసం ఇంతవరకూ మీ మీద చాలా ఖర్చు చేశాం. అది తప్పా, ఒప్పా?’ అంది అమ్మ.
‘ఈ ప్రశ్న నన్ను కాదు. నిన్ను నువ్వే వేసుకోవాలి’ అన్నాను.
‘వేసుకున్నాను. ఒప్పే అనిపించింది. ఇప్పుడు మా సంతోషం కోసం మళ్లీ నీ మీద డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒప్పేనని నాకనిపించింది. నాకు నేనే ఇచ్చుకున్న సమాధానం. నీకు ఓకే కదా!’ అంది అమ్మ.
‘గజిబిజిగా ఉంది. అర్థమయ్యేలా చెప్పు’ అన్నాను చిరాగ్గా.
‘తల్లి కావడానికి నీకున్న అభ్యంతరం ఒక్కటే - నిల్వల్లో వికాస్ కంటే వెనకబడిపోతానని. అలా జరక్కుండా మేము నీ నిల్వల్ని ఆదుకుంటాం. మేమంటే నీ అత్తమామలు కూడా. వాళ్లయితే, ఇక మీదట నీ డబ్బు నిల్వలు వికాస్ కంటే ఎక్కువుండేలా చూడాలన్నారు. అందుకో కామన్ ఫండ్ ఓపెన్ చేద్దామన్నారు’ అంది అమ్మ.
తెల్లబోయాను. ఎవరి కోసమని మేము విడిగా కామన్ ఫండ్ మొదలెట్టామో, వాళ్లు మా కోసం ఒకటై కామన్ ఫండ్ మొదలెడతారుట. ‘ఈ విషయంలో వాళ్లు మీతో కలిశారా?’ అన్నాను అపనమ్మకంగా.
‘పెళ్లనేది వంశం ముందుకెళ్లడానికే కదమ్మా! మీరిద్దరూ ఒకటి కాలేకపోయినా, వంశోద్ధారణ కోసం మా రెండు కుటుంబాలూ ఒకటై పోవడంలో ఆశ్చర్యమేముంది? మేము గత శతాబ్దపు వాళ్లం’ అంది అమ్మ.
కాసేపు నాకు నోట మాట రాలేదు. తేరుకున్నాక, ‘ఇలా ఎంతకాలం చెయ్యగలరు?’ అన్నాను.
‘మా రెండు కుటుంబాల్నీ ఒక్కటి చెయ్యగల బిడ్డ, తల్లిదండ్రుల్ని ఒకటి చెయ్యదా అని మా నమ్మకం. అందుకెంత కాలం పడుతుందో నాకు తెలిసినా చెప్పను’ అని ఫోన్ పెట్టేసింది అమ్మ.
అమ్మ మాటలు నా ఆలోచనల్ని మార్చేసాయి.
నా కడుపులో రూపుదిద్దుకుంటున్న బిడ్డ. అది కేవలం నా బిడ్డ కాదు.
మర్నాడు వికాస్ టూర్నించి వచ్చాడు. నేనేదో చెప్పబోయేలోగా, ‘ముందిది ఎలా ఉందో చెప్పు’ అంటూ తను తెచ్చిన నెక్లెస్ చూపించాడు.
‘నా కోసం నీ డబ్బు ఖర్చు పెట్టావా?’ అన్నాను మొహమాటంగా.
‘నీకోసం కాదు. నా బిడ్డ తల్లి కోసం’ అన్నాడు వికాస్ వెంటనే.
అత్తయ్య ద్వారా అతడికి కబురందేసిందని అర్థమైంది నాకు. ఆమె ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో కానీ - వికాస్ స్పందన నాకు ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించింది. అప్రయత్నంగా అతణ్ని వాటేసుకున్నాను.
వికాస్ విడిపించుకుంటూ, ‘మన కామన్ ఫండ్ జాగ్రత్త!’ అన్నాడు నా కడుపులో బిడ్డని ఉద్దేశించి.
పుట్టబోయే బిడ్డని కామన్ ఫండ్‌గా నేనూహించలేదు. ఎంతో మధురంగా అనిపించింది.
ఔను. మా బిడ్డ మనిషి రూపంలో మా కామన్ ఫండ్. డబ్బు రూపంలో కామన్ ఫండ్ ఇవ్వలేని ఆనందాన్ని ఇవ్వగల కామన్ ఫండ్. ఏ శతాబ్దపు దంపతులకైనా ఒకేలా అపురూపమైన కామన్ ఫండ్.
ఇక మీదట మా ఇంట్లో ఏ ఫండైనా ఆ బిడ్డకోసమే! ఆ బిడ్డ మాత్రమే మా కామన్ ఫండ్!
నాన్న షష్టిపూర్తి వేడుకల్లో మా కామన్ ఫండ్ ఓ ప్రత్యేక ఆకర్షణ అని వేరే చెప్పక్కర్లేదు.
*

సాంఘికంగా, రాజకీయంగా ‘మనం’ పోయి...‘నేను, మేము’ అనే పదాలకు ప్రాబల్యం పెరుగుతున్న పరిస్థితులపట్ల తన తరహా స్పందనే ఈ ఈ ‘కామన్ ఫండ్’ కథ అంటున్న జొన్నలగడ్డ రామలక్ష్మి చెయి తిరిగిన రచయిత్రి. వీణలో పీజీ చేసిన ఆమె, భర్త రాజగోపాలరావు ప్రోత్సాహంతో కథారచనకు పూనుకున్నానని గర్వంగా చెబుతారు. ఎక్కువగా ఇద్దరమూ కలిసే రాస్తామని, అలాంటప్పుడు ‘వసుంధర’గా కలం పేరు వాడతామని, తానే రాస్తే జొన్నలగడ్డ రామలక్ష్మిగా పేర్కొంటానని అంటారామె. పరిచితమైన జీవితంలోని విభిన్న వ్యక్తులు, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, సన్నివేశాలే ఇతివృత్తాలని, వాటిని సమకాలీన సాంఘిక పరిస్థితులతో అన్వయించడం ఇష్టమంటారు. తమ రచనలను వరుసలో చదివితే సమాజాన్ని చదివినట్లుంటుందని అభిమానులంటారన్న ఆమె 1960నుంచి సాహితీవ్యాసంగం మొదలుపెట్టారు. 1600పైగా పిల్లల కథలు, వెయ్యికిపైగా పెద్దల కథలు, 20 పిల్లల నవలలు, 260కి పైగా పెద్దల నవలలు, వందలాది సాహితీవ్యాసాల రచనతోపాటు తీతీతీ.్ప్ఘఒఖశ జ్ద్ఘ్ఘూ.ష్యౄ లోనూ భాగస్వామినని అంటారు. ‘మావారి జోక్యమున్న ప్రతి కథలోనూ ఎక్కడో అక్కడ కొన్ని సాంఘిక, రాజకీయ సంఘటనలపై చురకలుంటాయి. అలా వద్దనుకున్నప్పుడు వచ్చినవే నేను రాసిన కథలు. అవి సంఖ్యలో తక్కువైనా, వాటిలో చాలావరకు బహుమతులు వచ్చాయి’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జొన్నలగడ్డ రామలక్ష్మి 98856 20065