S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సౌందర్య రస స్రవంతి మకర సంక్రాంతి

‘సూర్యో మరీచి మాదత్తె సర్వస్మాద్భువనాదధి, తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణమ్’
సూర్యుడు సర్వ ప్రపంచమునకు పై భాగము నందుండి, కిరణములను ప్రసరింపజేస్తున్నాడు. సర్వ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. సూర్య కిరణముల పరిపాక విశేషము చేత సంవత్సరము, ఆయనములు ఋతువులు, మాసములు పక్షములు దినములు, రాత్రింబవళ్లు మొదలగు కాల భేదములు ఏర్పడుతున్నాయని యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం చెప్పింది.
కాలాన్ని ఏర్పరచి భాగ విభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత యిచ్చి, హేమంతము శిశిరము ఒక ఋతువుగా చెపితే అయిదు ఋతువులుగా, ఏడు చక్రాల రథముతో, ఏడు గుఱ్ఱములుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో పనె్నండు రూపాలు - ద్వాదశాదిత్యులు అనగా పనె్నండు నెలలుగా అన్నిటికీ నియామకుడుగా తండ్రిగా వ్యవహరిస్తున్నాడు - సూర్య భగవానుడని ఋగ్వేదం చెప్పింది.
సంక్రాంతి అంటే ఏమిటి?
నక్షత్రములు, అశ్వని నుండి రేవతి వరకు, ఇరువది ఏడు నక్షత్రములు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదములు, వెరసి 108 పాదములు. మేషాది మీన రాశులు పనె్నండు. ఈ 108 పాదములు పనె్నండు రాశులలో, ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదముల చొప్పున ఉంటాయి. నవ గ్రహములు అనగా రవ్వాది గ్రహములు తొమ్మిది నవగ్రహములూ పనె్నండు రాశులలో, ఒక రాశిలో నుండి మరొక రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటాయి. దీనే్న గ్రహ సంచారము అని అంటారు. ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి, కొన్ని గ్రహములు తక్కువ, కొన్ని గ్రహములు ఎక్కువ సమయం తీసికుంటారు. శక్తి రూపంలో అంతటా అంతర్లీనంగా ఉండే సూర్యుడు - మేషాది మీన రాశులలో నెలకొక రాశిలో చేరతాడు. ఒక్కొక్క రాశిలో సంక్రమించే సమయాన్ని ‘సంక్రాంతి’ అని పిలుస్తారు. సంక్రాంతి అంటే ‘చేరుట’ అని అర్థం. కనుక, సంవత్సరంలో పనె్నండు సంక్రాంతులు వస్తాయి. సంక్రాంతినే సంక్రమణము అని కూడా పిలుస్తారు. పనె్నండు సంక్రాంతులు లేక సంక్రమణములు వచ్చినా, వాటిలో ప్రధానమైనవి: మేష, కర్కాటక, తుల, ధనుస్సు, మకర సంక్రాంతులు. వీటిలో అతి ముఖ్యమయినవి: కర్కాటక, మకర సంక్రాంతులు. ఈ రెండింటిలో అతి విశిష్టమైనది - మకర సంక్రాంతి. సూర్య గమన, కాల సంబంధిత పండుగ మకర సంక్రాంతి.
సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలో ప్రవేశించేవరకు చీకటి మార్గం, అదే దక్షిణాయనం. రవి మకర రాశి నుండి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ, కర్కాటక రాశి ప్రవేశము వరకు ఉత్తరాయణం - వెలుగు మార్గం, అత్యంత పుణ్యప్రదమైనది. కనుక సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ‘మకర’ సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి?
‘ఆగ్నేనయ సుపధారాయే అస్మాన్..’ అని అరుణ మంత్రం, ఈశావాక్యపనిషత్, భగవద్గీత అష్టమాధ్యాయం, ఛాందోగ్యోపనిషత్‌లు, ఉత్తరాయణం, మకర సంక్రమణం గురించి వివరించాయి. ‘ఓ అగ్నిదేవుడా, మాకు మంచి మార్గాన్ని చూపించు’ అని ప్రార్థిస్తున్నారు, అగ్నిదేవుణ్ణి. జీవులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి ప్రయాణించే రెండు రకములైన మార్గాలను చెప్తూ, మొదటిది దేవయానం, అంటే కాంతి, వెలుగు మార్గం, అర్చిర్మార్గం, అనగా సక్రమ మార్గం - అదే ఉత్తరాయణం. రెండవది పితృయానం - చీకటి మార్గం - ధూమ మార్గం. అదే దక్షిణాయనం. వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్య పొందుతారు. సూర్య చంద్ర సంబంధిత విషయాల్ని తెలిసికొని, దర్శించిన ఉపాసకులు, పరబ్రహ్మ తత్త్వంలో తాదాత్మ్యం చెందుతారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణం అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేవరకు వేచి ఉండి, తనువు చాలించి, పరబ్రహ్మ తత్త్వంలో లీనమయినాడు. ఇదే హేమంత ఋతు నవ్య భవ్య దివ్య కాంతితో వచ్చే మకర సంక్రాంతి పుణ్యకాల వైశిష్ట్యం.
హేమంత ఋతువు విశిష్టత: ధనుర్మాసం
కాల విభాగాలేర్పడిన ఆరు ఋతువులలో హేమంత ఋతువు విశిష్టమై, ప్రకృతికే రమణీయంగా నిలుస్తుంది. పచ్చని పంట పొలాలతో, ఆహ్లాదకరమయిన గ్రామీణ వాతావరణంతో శోభాయమానంగా ఉంటుంది. అందుకే శ్రీమద్రామాయణంలో వాల్మీకి మహర్షి హేమంతాన్ని అత్యంత హృద్యంగా వర్ణించాడు. ముఖ్యంగా హేమంత ఋతువులో, ధనుర్మాసాంతంలో మకర మాసంలో, చాంద్రమాన పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి విశేషాల్ని పొందుపరుస్తూ
‘రవి సంక్రాంతి సౌభాగ్యః తుషారారుణ మండలః
విశ్వానంద ఇవా ధర్మః చంద్ర ప్రకాశతే’
జీవన స్రవంతిని నయనానందకరం చేసే సౌందర్య రస స్రవంతిగా సంక్రాంతిని వర్ణించిన మహనీయులెందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఆధునికులలో పేర్కొనదగిన వారు - కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు. తట్టలో కూర్చోబెట్టిన వధువులాగా, గుమ్మడి పూవులో కులికే మంచు బిందువులతో రాబోయే శిశిర భయంతో ప్రకృతి కాంతి జమిలి దుప్పటి కప్పుకొన్నదా అన్నట్లు తెలుగు నేల నాల్గు దెసల మంచు కురుస్తుండగా, హేమంత ఋతువు వచ్చిందంటారు - విశ్వనాథ. వేకువ ఝామున మ్రుగ్గుపెట్టే కనె్న, మంచుకొండ కనక శిఖరములాగా, తడిపాటి మట్టి గోడను, చిఱుకొమ్మలతో గీరాడు గిత్త - నందీశ్వరుడు లాగా కనపడుట వలన, నిత్యము మంచు పడుతూ ఉండటం వలన హిమాచలము పరివార సమేతముగా ఉత్తరము నుండి దక్షిణాపథమునకు వచ్చినట్లుగా, హేమంత ఋతువు తెలుగునాట ప్రవేశించిందని, హేమంత ఋతు శోభను, విశేషంగా విశిష్టంగా అందించాడు విశ్వనాథ.
అటువంటి విశేషమయిన హేమంత ఋతువులో వచ్చేది ధనుర్మాసం. ధనుర్మాసం చివరి రోజు బోగి పండుగ. సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు - బోగి, రెండవ రోజు - రరవి ధనూరాశి నుండి మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతి, మూడవ రోజు కనుము. మూడు రోజుల ముఖ్య పండుగలలో, బోగి పండుగ ధనుర్మాసాంతంలో వస్తుంది.
చాంద్రమానం ప్రకారం వచ్చే మార్గశిర, పుష్య మాసములు హేమంత ఋతువు. అందులో సౌరమానం ప్రకారం, రవి ధనుస్సు రాశిలో ప్రవేశించగా వచ్చే ధనుర్మాసము, కొంత మార్గశిర మాసము, కొంత పుష్యమాసం కలిసి వస్తుంది. మనకి సంవత్సరం - దేవతలకు ఒక రోజు. అంటే పగలు, రాత్రి. మనకి ఉత్తరాయణం ఆరు నెలలు వారికి పగలు. మన దక్షిణాయనం ఆరు నెలలు వారికి రాత్రి. మన ధనుర్మాసం, వారికి ఉషఃకాలము, సంధికాలము. సంధికాలము ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే దేవతలకు ప్రాతఃకాలమైన ధనుర్మాసంలో, మనం బ్రాహ్మీ ముహూర్తంలో పాల్గొని, కాలకృత్యాలు తీర్చుకుని, విష్ణు సహస్ర నామ పారాయణ, గోదాదేవి పాడిన ముప్పది పాశురములను, రోజుకొక్కటి చొప్పున పారాయణ చేయటం జరుగుతుంది. ధనుర్మాసం చివరి రోజున బోగి పండుగనాడు, గోదారంగనాథ స్వామి వార్ల కల్యాణం చేయటం జరుగుతుంది. ఆ మరునాడే మకర ‘సంక్రాంతి’ పెద్ద పండుగ.
బోగి పండుగ: ఈ పండుగను మకర సంక్రాంతి పండుగకు, వెనక రోజు జరుపుకుంటారు. ‘్ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతా దమః’ అన్నది విష్ణు సహస్ర నామం. ధనుస్సే వేదము, ధనుస్సనే వేదము. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు సహస్ర నామములు. సీతాకల్యాం - ధనుర్భంగం జరిగితే గాని జరుగదు. కనుక ధనుర్మాస భంగము జరిగితే, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ‘కోటినదులు ధనుష్కోటిలో నుండగా ఏటికి తిరిగేవే మనసా’ అన్న తోడిరాగ కీర్తనలో అద్భుతంగా, ధనురాకారముగా నున్న కనుబొమల మధ్య స్థానమునే ధనుష్కోటియని, నదుల వలె ప్రవహించు నాడీ ద్వారములకు, అది కేంద్రమని ధ్యాన యోగ లక్ష్యమని, వర్ణించాడు నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి.
శ్రీరాముడు, శివధనుర్భంగము చేశాడంటే, ఓంకార రూపమైన ధనుస్సును, రాముడు భగ్నం చేయగా, ఓం అ+ఉ=మ్ అనే మూడు వేదములుగా లోకంలో ప్రసారమయి ప్రసిద్ధి చెందినాయి. భంగమంటే తరంగమని మరొక అర్థం ఉన్నది. వేదములు, శబ్ద తరంగములుగా ప్రసారమయినవని అర్థము. ఇదే సీతా కల్యాణము - లోక కళ్యాణమునకు దోహదపడింది.
ఇదే విధముగా, ధనుర్మాసములోని ధనుర్భంగము వలన శీతము భగ్నమై ఉష్ణము ప్రసరిస్తుంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ధనుర్మాసమంటే వేదమాసం. మా, ఆస ‘మాస’ అనగా లక్ష్మి నిండియున్న మాసమని అర్థము. వేదలక్ష్మి, వేదమాత యొక్క శోభతో నిండియున్న మాసమని అర్థము.
బోగిపండుగ నాడు, బోగిమంటలు వేస్తారు. ‘అగ్ని’ సూర్యునికి ప్రతీక. ఋగ్వేదంలో అగ్ని ఆరాధన విశేషంగా చెప్పబడింది. బోగిమంటల్లో సంకటాలు దగ్ధమవుతాయి. ఆ మంటలు, మానవాళి కల్మషాన్ని పటాపంచలు చేస్తాయి. మనలోని పాత దుష్ట్భావాల్ని, దుర్గుణాలను, జ్ఞానమనే మంటల్లో వేసి దహించాలి. బోగి రోజున ఉదయానే్న అభ్యంగన స్నానం చేస్తారు. చిన్నపిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి, బోగిరోజు సాయంత్రం వరుసగా కూర్చోబెట్టి వారి శిరస్సుపై రేగి పండ్లు, బంతిపూల రెక్కలు దిష్టితీసి పోస్తారు. పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. రేగి పండ్లలో సౌరశక్తి ఉంటుంది. శిరస్సు మీద పడితే, ఆ శక్తి, తేజస్సు పిల్లలకి వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ, బోగిపండ్లని పిల్లలకు శిరస్సుపై పోసే అద్భుతమయిన ఆచారం అనాదిగా వస్తోంది.
గోదారంగ నాథుల కల్యాణం
బోగిపండుగ అనగానే జ్ఞప్తికి వచ్చేది గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం. శ్రీవిల్లిపుత్తూరు నివాసియైన పెరియాళ్వార్ - విష్ణుచిత్తుడు, ఆ ఊరులోనే వేంచేసిన వటపత్రశాయిని, నిత్యం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ, తులసి, పూలమాలలు కట్టి ఆ స్వామికి సమర్పిస్తూ, ఆ కైంకర్యంలో ఆత్మానందాన్ని పొందుతూ సంపూర్ణ శరణాగతి భావంతో, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఒకనాడు తులసీ వనంలో, చెట్లను కుదురులు చేస్తుంటే, ఒక అయోనిజ శిశుప్రాయంలో భగవదత్తంగా లభించింది. బిడ్డలు లేని తనకు, ఆ వటపత్రశాయి, ఆ లోటును తీర్చాడని సంతోషించి, పరమాత్మకు కృతజ్ఞతా భావాన్ని సర్వదా చెప్పుకుంటూ, ఆ బిడ్డకు ‘కోదై’ అనగా పూలమాల అని పేరు పెట్టుకున్నాడు. ‘గో’ అంటే వేదవాక్కులు, భూదేవి అనే అర్థాలున్నాయి. భూదేవి ఆ శిశువును తనకు ప్రసాదించిందని, ‘గోదా’ అని నామకరణం చేశాడు. పూలమాలలను తను మొదటగా ధరించి, తరువాత స్వామి అలంకారానికి పంపించేది కనుక, గోదాదేవికి ‘ఆముక్తమాల్యద’ అని పేరు వచ్చింది. అందరినీ రక్షించే తల్లిగా ‘ఆండాళ్’ అని పిలిచేవారు. తమిళులు ‘శూడిక్కొడుత్తాళ్’ అని పిలుస్తూ పూజిస్తారు. అన్ని పేర్లలోకి ‘గోదాదేవి’ ‘ఆండాళ్’ అనే నామములు ప్రసిద్ధములు.
భక్తి జ్ఞాన వైరాగ్యాలను సహజసిద్ధంగా పొందిన గోదాదేవి, శ్రీరంగనాథుని పతిగా తలంచి, భక్తిశ్రద్ధలతో ఆరాధించి స్వామి అనుగ్రహమును పొంది, మకర సంక్రమణం, సంక్రాంతి పండుగకు వెనుక రోజైన బోగిపండుగ నాడు శ్రీరంగనాథుని వివాహమాడుతుంది. ముప్పది రోజులపాటు మార్గళీ వ్రతాన్ని ఆచరించి, సంపూర్ణ శరణాగతితో గోదాదేవి కీర్తించిన ముప్పది పాశురముల రూపమే ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధము. ‘తిరు’ అంటే శుభప్రదమైన, శ్రీప్రదమైన, ‘పావై’ అంటే నోము (లేక) వ్రతం - అదే మేలినోము, సిరినోము.
బోగిపండుగ - బలి చక్రవర్తి: వామనావతారం
బలిచక్రవర్తిని, శ్రీమహావిష్ణువు వామన రూపంలో, పాతాళానికి పంపిన పర్వదినమే బోగి పండుగ, అని చెప్తారు పెద్దలు. మూడడుగుల స్థలం ఇవ్వవలసినదిగా కోరుతాడు, వామనావతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు. మూడడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను, జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థలను, సత్వ రజ తమోగుణములను, దారేషణ పుత్రేషణ ధనేషణలను హరింప చేసికొన్నాడు - బలిచక్రవర్తి. ఇది బోగి పండుగకు దీప్తినిస్తుంది.
సూర్యగమనం
సూర్యగమనాన్ని ‘బోగి’మంటారు. ధనూరాశి నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు, ప్రకృతిలో మార్పు స్పష్టంగా దృశ్యమవుతుంది. చండ మార్తాండ మండలములో ప్రచండ తేజస్కుడైన సూర్యుడు, నవ్యకాంతిని ప్రజ్వలింపజేస్తూ ప్రకాశిస్తాడు. రాత్రి సమయం తక్కువయి, క్రమేపీ పగటి కాలం ఎక్కువవుతుంది. నూతన తేజోత్సాహాన్నిస్తుంది - మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. ‘షూణీ ప్రేరణే సువతి ప్రేరయతి వ్యాపారేషు ఇతి సూర్యః’ మనం చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని జ్ఞప్తి చేస్తూ, ప్రేరణ నిచ్చి మనచేత ఆ కార్యాన్ని చేయించటానికి శక్తినిచ్చేవాడు - సూర్యభగవానుడు. నవ్యతకు నాంది పలికేది - మకర సంక్రాంతి.
సంక్రాంతి పండుగ శోభ
సమ్యక్ క్రాంతిః సంక్రాంతి. ‘సమ్యక్’ అనగా పవిత్రమైన, ‘క్రాంతి’ అనగా మార్పు. అదే ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యభగవానుడు, దక్షిణాయనము నుండి ఉత్తరాభిముఖంగా పయనించే రోజు. మకర రాశిలో ప్రవేశించే రోజు - మకర సంక్రాంతి. దీనినే పెద్ద పండుగగా జరుపుకొంటాం. ఎన్నో పండుగలు మనకి వస్తాయి. అయితే, అందులో ‘కాల’ సంబంధమైన ముఖ్య పండుగలు: ఉగాది, మకర సంక్రాంతి, తమిళ సంవత్సరాది. కనుక సంక్రాంతి- ‘కాల’ సంబంధిత పండుగ. దైవ సంబంధ ఆధ్యాత్మిక సాధనలకు, స్వాధ్యాయమునకు, తీర్థయాత్రలకు, వేదవిహిత సంస్కారములకు, సత్సంకల్పముతో చేసే ఏ కార్యానికైనా అనుకూలమయిన కాలము.
ఉత్తర దిక్కున హిమాచలమున్నది. పరమేశ్వర సన్నిధి - కైలాసము. హిమము అంటే మంచు, అనగా చల్లదనము, నిర్మలము, ప్రశాంతతకు సంకేతము. అచలము అంటే చలము లేనిది అనగా సుస్థిరమైనది, నిశ్చలమైనది. ఏదీ అది? ఆత్మ తత్త్వం - హృదయం. అదే పరమేశ్వర వాసము. చంద్రుడు మనస్సుకు, సూర్యుడు దృష్టికి అధిదేవతలు. మనస్సు ఎప్పుడూ ఇంద్రియాల వైపు పరుగిడుతుంది. మనస్సుకు అధిపతియైన బుద్ధిచేత మనం, మన మనస్సును నియంత్రించి హృదయము - ఆత్మ తత్త్వం వైపు మరల్చుకోవాలని హెచ్చరించేది మకర సంక్రాంతి. ‘చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయతః’ అన్న వేద వాక్యమే, మకర సంక్రాంతికి స్ఫూర్తినిస్తుంది.
వ్యవసాయ ప్రధానమైన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ ప్రస్ఫుటంగా కనపడుతుంది. సంక్రాంతికి నాటికి ధాన్యం ఇంటికి చేరుతుంది. ఇళ్లూ వాకిళ్లూ కళకళలాడుతూ ఉంటాయి. వారం రోజుల ముందు నుండే పండుగ పనులు ప్రారంభమవుతాయి. క్రొత్త బియ్యం, నువ్వులు, బెల్లంతో పిండివంటలు తయారుచేస్తారు. సంప్రదాయాలు, సంబరాలు, వేడుకలతో సంక్రాంతి పండుగను, పిల్లలు, కొత్త అల్లుళ్లతో ఉత్సాహంగా
జరుపుకొంటారు. ‘రాశి చక్రమ్ము దీరించి రంగవల్లి నిన్ను బూజింప, భక్తియై నిలిచినారు, ఉత్తరాయణ పుణ్యకాలోదయమున, రా, రమ్ము మకర సంక్రాంతి లక్ష్మి’ అని వర్ణించిన, కవి సమ్రాట్ పైడిపాటి సుబ్బరామశాస్ర్తీ గీతం, సంక్రాంతి పండుగకు దీప్తినిస్తుంది.
గొబ్బిళ్లు, రంగవల్లులు
నెల పొడుగునా వాకిళ్లలో చిత్రవిచిత్రమైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. ప్రాచీన కాలం నుండీ హైందవ సంప్రదాయంలో రంగవల్లులు (ముగ్గులు) పేర్కొనబడ్డాయి. స్కాంద పురాణం, రామాయణం, మహాభారతంలో ముగ్గుల ప్రస్తావన వుంది. ఆంధ్ర సంస్కృతికి అద్దం పడుతూ, నెల రోజులూ వాకిళ్లలో రకరకాల ముగ్గులు వేస్తారు. ముగ్గులలోని బియ్యపు పిండిని క్రిమి కీటకాదులు భుజిస్తాయి. ఇది ఒక విధమైన భూత యజ్ఞం. గోమయంతో చేసిన ముద్దలను గొబ్బిళ్లు అంటారు. ప్రధానంగా మూడు గొబ్బిళ్లు పెడతారు. ఒకటి, తన విశ్వ మోహన మురళీ గానంతో అందరినీ ఆకర్షించి ఆనందపరిచే గోపాలునికి, రెండవది గోపాలుని అనంత శక్తితో ఎత్తబడిన గోవర్ధన గిరికి, మూడవది నిత్య జీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోవులకు ప్రతీకగా పెడతారు.
పితృ తర్పణాలు
ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రాంతి నాడు, పితృదేవతలకు తర్పణములు అర్పిస్తే, వారు సంతసించి, వంశవృద్ధిని చేస్తారు. శుభాలను కూర్చిపెట్టి, గృహంలో శుభ కార్యములు నిర్విఘ్నంగా జరిగేటట్లు ఆశీర్వదిస్తారు. పితృదేవతలకూ, ఉత్తమ గతి లభిస్తుంది.
బొమ్మల కొలువు
పురాణేతిహాసములు, చరిత్ర, సాంఘిక జీవన స్థితిగతులను ప్రతిబింబించేటట్లుగా బొమ్మల కొలువు పెడతారు. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయములకు స్ఫూర్తినిస్తాయి. బొమ్మల కొలువులు అత్యంత విజ్ఞానదాయకం.
హరిదాసుల నగర సంకీర్తన
ఈ పండుగ రోజుల్లో హరిదాసు వీధి వీధిన తిరుగుతూ పాడుతూ హరినామ స్మరణ చేస్తూ, సంచరిస్తాడు. నగర సంకీర్తన మన ప్రాచీన సంప్రదాయము. తెల్లవారక మునుపే జనులను, హరిలోరంగ హరి, గోవిందా హరి గోవిందా హరి అంటూ హరినామ స్మరణతో నిద్ర అనే తమస్సు నుండి మేల్కొలుపుతాడు. హరిదాసు గృహ ప్రాంగణమునకు వచ్చినపుడు, గృహిణి అతని తలపైనున్న రాగి పాత్రలో బియ్యం పోస్తుంది. ఇది దానగుణానికి సంకేతం. ‘త్యాగేనైవౌ అమృతత్త్వమానసుః’ అన్నది శ్రుతి.
గంగిరెద్దులాట
గ్రామీణ ఆటపాటలకు, కళా నైపుణ్యముల ప్రదర్శనకు ఆలవాలమయిన పెద్ద పండుగ - సంక్రాంతి. గంగిరెద్దులను ఆడించేవారు, గంగిరెద్దులను రమ్యంగా అలంకరించి పురాణాలలోని అనేక అంశాలను ఆసక్తికరమైన సంభాషణలతో హృద్యంగా అందించే కనువిందైన కళారూపం గంగిరెద్దులాట. గజాసుర సంహారానికి, గంగిరెద్దు నాడించిన శ్రీమహావిష్ణువే మా కుల దైవం అంటారు, వారు. పండుగనాడు అందరూ ఉత్సాహంగా గుంపులు గుంపులుగా చేరి చూచి ఆనందిస్తారు.
అయ్యప్పస్వామి: జ్యోతి దర్శనం
హరిహరాంశగా అవతరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ శరణు ఘోషతో శబరిమలకు వచ్చే భక్తులను కటాక్షించే స్వామి - అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి నాడే అయ్యప్పస్వామి జయంతి. పందల రాజు కిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం, మకర సంక్రాంతికి స్వామిని జ్యోతి స్వరూపంగా దర్శించుకొని, జ్ఞానోదయాన్ని పొందుతారు. ఇది మకర సంక్రాంతి పండుగకు ఒక విశేషం.
కనుము పండుగ
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అని ఏరువాక పౌర్ణమితో సేద్య యజ్ఞానికి నాంది పలికి, శ్రమకోర్చి, విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి, దైవానుగ్రహంతో పంటను ఇంటికి తీసుకువస్తారు - కృషీవలురు. కనుకనే మకర సంక్రాంతిని వైభవోపేతంగా జరుపుకుంటారు. వ్యవసాయ వృత్తికి చేదోడు వాదోడుగా నిలిచే గోజాతికి కృతజ్ఞత చూపుతూ కనుము పండుగ రోజున పశువుల్ని, గోజాతిని పూజిస్తారు. ‘కృషియున్న నెపుడు దుర్భిక్షమే యుండదు, గోజాతి కృషికిని కుదురు కాక, కనుము పండుగనాడు కర్షక జనులెల్ల గోవుల పసుపులన్ కుంకుమలన్ పూజించి, వారికి పుష్కలమ్ముగ పుష్టి కలుగు ఆహారము లొలయజేసి మకర సంక్రాంతిలో మనోహరంగా వర్ణించిన విషయం కనుము పండుగకు స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది.
గాలి పటములు
సంక్రాంతి సంబరాలలో పశువుల పరుగు పందాలు, గాలి పటాలు ఎగురవేసే పందాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ప్రపంచమంతటా గాలి పటాలను ఎగురవేసే సంప్రదాయం నెలకొన్నది. గాలి పటాలను ఎగురవేయడంలోనూ, గాలిపటాల పందాలలో గెలిచి అవార్డులు, ప్రశంసలు అందుకున్న వారిలో జయపూర్‌లోని బాబూ భాయ్‌ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే, ఇటీవల గాలి పటాలను ఎగురవేయటానికి చైనా దేశం నుండి దిగుమతి అవుతున్న ‘మాంజా’ పక్షులకు ప్రాణహాని కలిగిస్తోంది, కొందరు చిన్నపిల్లలు, యువకులకు కూడా హాని కలిగిస్తోందని వింటున్నాం. వాటికి దూరంగా ఉండి, హానికరము కాని దారములు వాడితే, సంక్రాంతి సంబరాన్నిస్తుంది.
సంక్రాంతి మనకిచ్చే సందేశం
దీక్షతో దక్షతగా ధర్మబద్ధంగా ఋజుమార్గంగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఉత్తేజ ఉత్సాహ స్ఫూర్తితో, ముందు వచ్చే మార్పునకు స్వాగతం పలుకుతూ, సమన్వయ భావంతో జీవన యాత్ర సల్పుతూ, సర్వ మానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షించే నవ్యతేజస్సును పొందాలని చెప్తోంది ‘మకర సంక్రాంతి’. *

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464