S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారత ఔన్నత్యాన్ని చాటిన లబ్దప్రతిష్ఠుడు

నేడు వివేకానంద జయంతి
*
భారత దేశ ఔన్నత్యాన్ని విదేశాలలకు చాటి చెప్పిన తొలి హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహామనీషి ఆయన. స్వదేశంలోనే కాక, విదేశాలలోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేసిన ప్రాసంగికుడు వివేకానందుడు. పాశ్యాత్య దేశాలలో అడుగిడి, హిందూమత ప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన మొట్టమొదటి హిందూ సన్యాసి వివేకానందుడు. 1863 జనవరి 12న బ్రిటిష్ బెంగాలు ప్రెసిడెన్సీలోని పశ్చిమ బెంగాలు నందలి నేటి కోల్కతాలో జన్మించాడు. నరేంద్రనాథునిగా నామాంకితుడైన వివేకానందుడు బాల్యంనుండీ రోజూ ధ్యానం చేసేవాడు. సన్యాసుల, యోగుల పట్ల అమిత ప్రేమను చూపేవాడు. వారు ఏదడిగినా ఇచ్చేవాడు. పూవుపుట్టగనే పరిమళిస్తుందన్నట్లుగా చిన్ననాటి నుండే నిస్వార్థ గుణం, ఔదార్య గుణం అలవడ్డాయి. నరేంద్రుడు ఆటపాటలలో చదువులో ముందుంటూ, ఏకసంతగ్రాహిగా ఉండేవాడు. ఆయన జ్ఞాపకశక్తి అమోఘం. 1880 వరకు మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, కళాశాలలో చేరాడు. చరిత్ర, సైన్స్‌తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని ఔపోసన పట్టి, రోజురోజుకు జ్ఞానతృష్ణ పెరుగుతూ, దైవం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచేవాడు. మూఢ నమ్మకాలను విడిచి పెట్టినా, సత్యాన్ని కనుగొనలేక పోయాడు. తన సందేహాలకు పండితుల వాదనలు సంతృప్తిని ఇవ్వలేక పోయాయి. రామకృష్ణ పరమహంస తాను భగవంతుని కనుగొని ఉన్నానని చెప్పగా నరేంద్రుడు విన్నాడు. ఒకసారి మిత్రులతోకలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణుడు భగవంతుని సంభాషణలో శిష్యులతో మునిగి ఉన్నారు. నరేంద్రుని దృష్టి ఆయనపై పడి, కొద్దిపాటి మానసిక కల్లోలానికి లోనై, పాత జ్ఞాపకాలేవో తట్టిలేపుతున్న అనుభవానికి గురైనాడు. నరేంద్రుని ఆకర్షణీయ రూపాన్ని చూసిన రామకృష్ణుడు ఆశ్చర్య చకితులై, నీవుపాడగలవా? అని ప్రశ్నించి, నరేంద్రుని నోట రెండు బెంగాలీ పాటలువిని, తదాత్మత చెంది, నరేంద్రుని తన గదికి తీసుకెళ్ళి, భుజం తట్టి, ఇంత ఆలసస్యమైనదేమిటి? ఇన్ని రోజులుగా నీకోసం చూసిచూసి అలసిపోతున్నా. నా అనుభావాలన్ని సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నా. నీవు సామాన్యుడలు కావు. సాక్షాత్తూ దివినుండి భువికి దిగి వచ్చిన దైవ స్వరూపుడవు. అని కళ్ళనీళ్ళ పర్యంతమైనారు రామకృష్ణుడు. తర్వాత మీరు భగవంతుని చూశారా? అని నరేంద్రుడు ప్రశ్నించాడు. అవును చూశాను. అవసరమైతే నీకు చూపించ గలను అన్నారు. నెల దాటాక ఒకనాడు రామకృష్ణుడు మంచంపై విశ్రాంతి తీసుకుంటుండగా, పక్కన కూచోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి, నరేంద్రుని ఒడిలో తమ కాలును ఉంచారు. అంతే... నరేంద్రునికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి. ననే్నమి చేస్తున్నారు. నా తల్లిదండుల వద్దకు వెళ్ళాలి అన్న నరేంద్రుడిని చూసి, ఈరోజుకిది చాలు అని కాలుని తీశారు. రోజులు గడిచే కొద్దీ ఇరువురి మధ్య ఆకర్షణ అధికమై, విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. నరేంద్రుడు, రామకృష్ణుని ప్రియ శిష్యుడైనా, ఆయన చెప్పినవన్నింటితో ఏకీభవించేవాడు కాదు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. ఎప్పటికపుడు నరేంద్రుని రామకృష్ణుడు దారికి తెచ్చేవారు. నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిత్వంవైపు మొగ్గు చూపాడు. తండ్రి మరణించగా, విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. గురువుకు గొంతు క్యాన్సర్ సోకి ఆరోగ్యం క్షీణించింది. ఉద్యోగం మాని గురువు శుశ్రూషలో నిమగ్నమైనాడు. మరణించ బోయే రోజున నరేంద్రుని పిలిచి, మృదువుగా తాకారు. ఆధ్యాత్మిక శక్తులన్నీ శిష్యునికి థారవోసారు. రామకృష్ణుని మరణానంతరం గంగానదీ తీరాన రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. నరేంద్రుడు మిగిలిన శిష్యులతో కలిసి సన్యాసిగా మారి, మఠానికి నాయకుడైనాడు. అలా ‘‘వివేకానందుడు’’ అయినాడు’’. భారతదేశం గృహంగా, ప్రజలు సోదరులుగా భావించాడు. ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రం, కమండలం, శిష్యులు కలిగి, దేశమంతా పర్యటించాడు. పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. నేల మీద నిద్రించాడు. ఆధ్యాత్మిక చర్చలతో కాలం గడిపాడు. మైసూరు మహారాజుతో పరిచయం కలిగి, పండితుల సభలో ఆయన చేసిన సంస్కృత ప్రసంగం మంత్రముగ్ధుల చేసింది. అమెరికా వెళ్ళి వేదాంతాన్ని ప్రచారం గావించేందుకు మహరాజు ఖర్చులు భరిస్తానన్నాడు. భాస్కర సేతుపతి పాలిత రామనాడును సందర్శించాడు. రామేశ్వరానికి వెళ్ళి, చివరకు కన్యాకుమారి చేరాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారత దేశపు ఆధ్యాత్మిక విలువలను వారికి వివరించడం ప్రథమ కర్తవ్యంగా భావించాడు. దేశం నలుమూలల నుండి విరాళాలు సేకరించి, ప్రయాణానికి అవసరమైనవి తీసుకుని, 1893 మే 31న బొంబాయి తీరం నుండి నౌకాయానం చేసి, జూలైలో చికాగో చేరుకున్నాడు. ఒక మహిళ పరిచయం కాగా, ఆమె ఇంట బస చేశాడు. హిందూధర్మం, భారతీయ సంస్కృతిలపై చిన్న సభలలో ప్రసంగాలు చేశాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ గ్రీకు విభాగాచార్యుడు జాన్ హెన్రీ రైట్ పరిచయమైనాడు. 1893 సెప్టెంబర్ 11న చికాగో సదస్సు ప్రారంభమైంది. అక్కడ చేరిన ప్రతినిధులలో ఆయన చిన్నవాడు. ఉపన్యాసానికి ముందు సరస్వతీదేవిని, గురువును ప్రార్థించాడు. అమెరికా దేశపు సోదరులారా! అని మధుర కంఠస్వరంతో ప్రారంభించగానే సభ మూడు నిమిషాలు చప్పట్లతో మారుమోగింది. సమావేశానికి హాజరైన ప్రతివారూ ఆయన ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆరాధ్యుపైనాడు. అనతికాలంలో స్వామీజీకి ప్రపంచఖ్యాతి లభించింది. వాదనలో ఆయనను గెలిచిన వారే లేరు. హిందూ మతాన్ని వివరించగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వంతో హృదయాలను గెలవ గలిగాడు. స్వామీజీ వల్ల అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో భారతదేశం గౌరవం పెరిగింది. ఎందరో శిష్యులైనారు. ముఖ్యంగా మార్గరెట్ నోబుల్ అనే ‘‘సిస్టర్ నివేదిత’’ భారత దేశానికి వచ్చి ఉండిపోయింది. 1897 జనవరి 15న కొలంబోలో దిగి, మద్రాసు చేరాక రథంమీద ఊరేగించారు. ‘‘వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు’’ అనే నినాదంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. భవనాలను నిర్మించాడు. ఆయన నేర్పిన ముఖ్యాంవాలలో ‘‘జీవుడే దేవుడు’’ అనేది మంత్రంగా మారింది. పేదవారికి సేవను ‘‘దరిద్ర నారాయణ సేవ’’గా ప్రతిపాదించాడు. రానురాను అంతర్ముఖుడైనాడు. 1902 జూలై 4న యథావిధిగా శిష్యులకు బోధనలు చేశాడు. ఉల్లాసంగా గడిపి, రాత్రి 9గంటల సమయాన చిన్నగా అరిచి లేచి కూర్చుని, దీర్ఘంగా శ్వాస పీల్చి, నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అందరూ తనవారనుకుంటే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన మహా మనీషి వివేకానందుడు. సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మొదలగు వాటి గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దేదీప్యమానమైన ఆత్మతో పోలిస్తే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. దానిని మొదట సముపార్జించాలి. ప్రతి మతంలో, సిద్ధాంతంలో ఎంతో కొంత మంచి ఉంటుంది. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు. మందలో ఉండకు. వందలో ఉండేందుకు ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు, వారికి మీ సేవలందించాలి. ఇలా ఎనె్నన్నో హితవచనాలు బోధించాడు. భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘‘జాతీయ యువజన దినోత్సవంగా 1994లో ప్రకటించింది. అటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ బోధనలు వినడం మనం చేసుకున్న పుణ్యం అంటూ ఒక ఆంగ్ల పత్రిక వ్యాఖ్యానం స్వామీజీ వైశిష్ఠ్యాన్ని గుర్తు చేస్తుంది.

- సంగనభట్ల రామకిష్టయ్య