తెలివైన మృగం
Published Sunday, 1 March 2020ప్రకృతి పంచభూతాలను
ప్రాణకోటికి వరాలగా ప్రసాదించి
తన సమతౌల్యం వాటి
బాధ్యతగా విధించి
జీవనాన్ని సుఖమయం
చేయాలని భావిస్తే
మేథ సంపన్నమై
తెలివైన మృగంగా ఖ్యాతినొందిన వేళ
ఏ దుష్టశక్తి దృక్కు పడిందో
వివేకం స్వార్థంగా పరిణామమొంది
మేథస్సు వక్రమార్గం పట్టి
విజ్ఞానం వెర్రితలలేసి
పంచవరాల దాతతో పరిహాసమాడే!
దాత కనె్నర్రజేసి
అతినీలలోహిత కిరణాలు
మేనులో మేకుల్లా దిగుతున్నా
వరుణుడు వరదై
మహానగరాలను సైతం
ముంచెత్తుతున్నా
ధరణి శృతిమించి కంపిస్తున్నా
ప్రాణవాయువు విషవాయువుతో స్థానభ్రంశమవుతున్న
అంబరంలో పావురం స్థానంలో
యుద్ధ విమానం విహరిస్తున్నా
మేల్కొనని తెలివైన జంతువు
మేథస్సుతో అద్భుతాలను సృష్టిస్తున్నానన్న
భ్రమలో మునిగితేలుతోంది
భావి జీవనాన్ని శూన్యం చేస్తున్నానన్న
ఇంగితం కోల్పోతోంది
సంతానానికి కృత్రిమ సంపద తప్ప
జీవించగల ప్రకృతిని మిగల్చలేని
అమాయిక జీవి పాపం తెలివైన మృగం