S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కళ అంటే ఏమిటి?

నాకు శాస్ర్తియ సంగీతం అంటే ముక్క కూడా తెలియదు. కానీ జీవితంలో చాలా భాగం సంగీతం వింటూ గడిపాను. త్యాగరాజస్వామికి తిరువైయారులో ఉత్సవాలు జరుగుతాయి. ముత్తుస్వామి దీక్షితులకు ఎక్కడ ఉత్సవాలు చేయాలో తెలియదు. ఆయన ఒక చోట ఉండలేదు. ఉన్న ఎట్టయాపురంలో చాలాసార్లు అఖండగానం జరుగుతుంది. ఒకసారి నేను కూడా అక్కడికి వెళ్లాను. ఇక శ్యామశాస్ర్తీ వారికి కాంచీపురంలో ఉత్సవాలు చేయడం మొదలైంది. ఈ ఉత్సవాలు మొదలైన మొదటి కొన్ని సంవత్సరాల పాటు నిర్వాహకులలో మొదటి ముగ్గురిలో నేను ఒకడిని. స్థానికుడైన ఒక పండితుడు నన్ను అక్కడ ఒక ప్రశ్న అడిగాడు. మిగతా ఇద్దరు నిర్వాహకులు సంగీత విద్వాంసులు. నీకు ఆ వాసన కూడా తెలియదు. కనీసం తమిళం కూడా తెలియదు. మరి ఎందుకని నీవు ఇంత శ్రమ పడి నిర్వహణలో పాల్గొంటున్నావు అన్నాడాయన. నేను తొడ మీద గోక్కున్నాను. నా జవాబు అర్థమై ఉంటుంది.
నాకు బొమ్మలు గీయడం రాదు. కానీ నేను వేసిన ఒక వర్ణ చిత్రం నా ఒకానొక పుస్తకం ముఖచిత్రం మీద అచ్చయింది. శాస్ర్తియ నృత్యం గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కానీ కొందరు పెద్ద కళాకారులతో పాటు ఆ రంగంలో పని చేశాను. శిల్పం విషయంలో కూడా అంతే. భారతీయ శిల్పకళ గురించి ఎంతో చదివాను. రాశాను.
రేడియో, టెలివిజన్, సినిమా అన్నీ కళా స్వరూపాలే. వాటిలో నేను చాలా లోతుగా కలిగా చేసుకున్నాను.
ఇంత జరిగిన తర్వాత నాకు ఇప్పుడు ఒక ప్రశ్న మొదలైంది. ఇంతకూ కళ అంటే ఏమిటి? అది ఎట్లా మొదలైంది? దాని వల్ల ఎవరికెంత ప్రయోజనం ఉంది? మనిషి అనడం కన్నా మానవజాతి చరిత్ర గురించి చదవడం రాయడం ఈ మధ్యన ఒక వ్యసనంగా మొదలైంది. మానవుడు గుహలలో గోడల మీద బొమ్మలు వేశాడు. తన చేతిని గోడ మీద పెట్టి దాని మీద రంగులు చిలకరించాడు. చిత్రమైన చేతి బొమ్మ అక్కడ కనబడుతుంది. జంతువుల బొమ్మలు గీశాడు. మరెన్నో రకరకాల చిత్తరువులు వేశాడు.
ఇవన్నీ అందరికీ తెలిసిన సంగతులు అనుకుంటున్నాను. కనీసం నాకు తెలియని కొన్ని సంగతులను గురించి ప్రశ్నలు అడగాలని ఉంది. అన్నింటి కన్నా మొదటి ప్రశ్న కళ ఒక్క మానవ జాతికి మాత్రమే తెలుసునా? అన్నది. ఏనుగుకు కుంచె ఇస్తే అది కాగితం మీద బొమ్మలు గీసిందని నేనే ఒక చోట రాశాను. జీవజాలం చరిత్ర మొత్తం పరిణామ క్రమంతో ముడిపడి ఉంది. పరిణామంలో సహజ వరం అది ఒక పద్దతి ఉంది. ఒక జాతిమానవుల మీదికి మరొక జాతి వారు దాడికి వస్తారు. దాడికి గురవుతున్న జాతి వారి గుడిసెలు, ఆయుధాలు, దుస్తులు మొదలైనవన్నీ కళాత్మకంగా ఉంటే వారిని చంపకూడదు అన్న భావం దాడి చేస్తున్న వారికి ఎప్పుడైనా కలిగి ఉంటుందా? ఇది వెర్రి అభిమానంగా కనిపించినా వెనుక కొంచెం సత్యం ఉందేమో అనిపిస్తుంది.
అప్పట్లో ఒక కళాకారుడికి ఆడతోడు దొరకడం సులభంగా వీలు అయింది? ఇది అంతకన్నా వేరే ప్రశ్న. కానీ ఇప్పటికీ కూడా కండలు తిరిగిన వారిని కాక కళాకారులను ఇష్టపడే ఆడపిల్లలు చాలామంది ఉన్నట్లు తెలుసు.
ఒక చిత్రమైన విషయం చదివాను. ప్రాచీన కాలంలో ఒక అబ్బాయి పడుకుని ఉన్నాడు. కనుచూపు మేరలో అతనికి ఒక పాము కనిపించింది. అంతకు ముందు రాత్రి వాళ్ల నాన్న ఆ అబ్బాయికి ఒక కథ చెప్పాడు. కథలో అబ్బాయికి కూడా పాము కనిపించింది. అతను నిద్రపోతున్నట్లు నటించాడు. పాము దగ్గరగా వచ్చింది. అబ్బాయి చటుక్కున దాన్ని పట్టుకుని బలంగా నేలకేసి కొట్టాడు. పాము చచ్చింది. అబ్బాయి తన కత్తితో దాని చర్మం వలిచాడు. ఇప్పుడు పడుకున్న అబ్బాయికి ఆ సంగతి గుర్తుకు వచ్చింది. అతను ఏం చేశాడు అన్నది నేను చదివిన చోట రాయలేదు. మొత్తం కథలు ఎక్కడైన ఒక కళ, దానికి సంబంధించిన అంశం కనిపించిందా? కనీసం కథ చెప్పడం కళ కదా?
పాతకాలంలో మానవులు దరువులు వేస్తూ నాట్యం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అట్లా ఆడి పాడిన వారు ఎక్కువగా కలిసిమెలిసి ఉండగలిగారా? ఆటపాటలు లేని వారిలో అంతటి సంఘీభావం కనిపించలేదా? ఎన్నో ప్రశ్నలు!
మళ్లీ ఒకసారి మొదటికి వస్తే అసలు కళ అంటే ఏమిటి అన్నది అన్నిటి కన్నా పెద్ద ప్రశ్న! కళని నిర్వచించడం చాలా కష్టం. మన వాళ్లు 64 కళల్లో వంట, దొంగతనం అన్నవాటిని కూడా చేర్చారు. తిండి కోసం తిప్పలు పడుతున్న వారికి కళ గురించి గుర్తుకు రాకపోవచ్చు. కష్టించి పనిచేసే వాళ్లు శ్రమ తెలియకుండా ఉండటానికి వాడడం మామూలు. అంటే పనికివచ్చే పనులు అన్నీ జరిగిన తరువాత, ఎప్పుడో ఆట పాట గుర్తుకు వచ్చి ఉంటాయా? ఒక మనిషి ఒక బల్ల తయారుచేశాడు. దాని వల్ల ఉపయోగం ఉంది. దాని మీద కూర్చున్నాడు. ఇది ఇంకొంచెం అనుకూలంగా ఉంటే బాగుండును అనిపించింది. అప్పుడు దానికీ ఒక దిండు ఏర్పాటు చేశాడు. అది రంగురంగులతో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దిండు అవసరమైన వస్తువు గాక, అందమైన వస్తువుగా కూడా నిలబడింది. ఇందులో కళ ఎక్కడ ఉంది?
తిండి, బట్ట, వసతి అందరికీ మొట్టమొదట అవసరం. ఇది కొంతకాలానికి దోతీ, లోటా, ఔర్ చౌపాటీగా మారింది. ఈ కొత్త పద్దతి కళాత్మకంగా వినిపిస్తున్నది కదూ? అంటే వౌలిక అవసరాలు తీరిన తరువాత మామూలుగా కళలు, మనసులోకి, మనిషి ముందుకు వచ్చి నిలబడ్డాయి అని చెప్పవచ్చా? కడుపునిండా తిండి దొరికిన తరువాత కాలక్షేపం కోసం సినిమాకు, సంగీతానికి, చిత్రకళా ప్రదర్శనకు అందరూ పోతారు అన్నది కొత్తగా చెప్పుకోవలసిన విషయం కాదు.
కళల్లో చాలా వరకు మనిషికి చేతనైనవి మాత్రమే ఉన్నాయి. రజనీకాంతారావుగారి కుక్క సీజర్ పాడుతుంది అని ఆయన చెప్పేవాడు. కోకిల పాడింది అంటారు కానీ, అది నిజానికి పాట కాదు. కొత్త విషయాలను సృష్టించడం, అందునా ఆలోచనలో నుంచి మాత్రమే సృష్టించడం ఒక మనిషికి మాత్రమే చేతనైన పని అనిపిస్తుంది. గొట్టంలో ఊదితే కమ్మని ధ్వని వస్తుంది అని మనిషికి పాత కాలంలోనే తెలిసింది. సహజంగా వెదురు గొట్టాలకు రంధ్రాలు పడి వాటిలో గాలి దూరి పిల్లనగ్రోవి పాట వినిపించింది. తీగెలను మీటినప్పుడు నాదం పలకుతుంది అన్న సంగతి నాగరికత వచ్చిన తర్వాత మాత్రమే తెలిసి ఉంటుందని నా అనుమానం!
జంతువుల కథలు సృష్టించడం గురించి పక్కన పెట్టవచ్చు! కనీసం వాటికి కళను గుర్తించడం తెలుసా? నిజంగా మనుషులు అనే మనకు కళ అవసరం ఏమిటి? బాగా ఆలోచించండి! మీకేమైనా జవాబు తోస్తే నాకు కూడా చెప్పండి! కళ వల్ల మెదడు చురుకు అవుతుంది అని ఎవరికైనా అనిపించిందా? జంతువులు ప్రకృతిలోని అందాలను చూస్తున్నట్టు, వాటిని అనుభవిస్తున్నట్లు ఎవరికైనా అనుమానం కలిగిందా? సైన్స్ పాఠాలు, చరిత్ర పాఠాలు అందరూ చదువుకుంటారు. సంగీత పాఠాలు కొందరు మాత్రమే ఎందుకు చదువుకుంటారు? అందరూ తమ తమ పిల్లలకు ఏదో ఒక కళను నేర్పించే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందా? లేక అది దండగమారి ఖర్చు కింద లెక్కలోకి వస్తుందా? ఇటువంటి ప్రశ్నలు ఎవరు అడిగినట్టు నాకు కనిపించలేదు! ఇప్పుడు కనీసం నేను అడుగుతున్నాను! ఇప్పుడే ఇటువంటి ప్రశ్నలకు కొంతమంది జవాబు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ముందు కళ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి. ఆ దృష్టిని అలవాటు చేసుకోవాలి. అప్పుడు గానీ ఆ పాట, ఆట, చిత్తరువు అందంగా కనబడుతుంది.
నేను మా ఇంట్లో గోడల మీద రకరకాల పెయింటింగ్‌లు అమర్చుకుంటాను. తరుచుగా వాటిని మారుస్తుంటాను కూడా! కానీ ఎవరూ వాటి గురించి ఒక మాట అన్న పాపాన పోలేదు! మినరల్ వాటర్ సప్లై చేసి రవి మాత్రం, కొత్త పెయింటింగ్ కనిపించగానే దాని గురించి వ్యాఖ్యానించేవాడు. అంటే అతను అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తి అని నేను భావించాల్సిన అవసరం ఉందా? కళాకారుల మెదడు గురించి పరిశోధనలు జరిగాయి. పరిణామ సిద్ధాంతం గురించి పరిశీలించిన వారు కూడా కళ గురించి వ్యాఖ్యానాలు చేశారు. కొత్త రకం పరికరాలు వచ్చిన తర్వాత కూడా మనిషి మెదడు మీద కళ ప్రభావం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి! కళ ఇప్పుడు సైన్స్‌లో భాగంగా నిలబడింది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తి ఉంది? ఎంత మందికి కళా హృదయం ఉంది? ఎంతమందికి వైజ్ఞానిక దృక్పథం ఉంది? కళ, వైజ్ఞానిక దృక్పథం రెండూ కలిస్తే వచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి? వాటిని ఏమనాలి? ఈవారం అన్నీ ప్రశ్నలే? జవాబులు అంతా కలిసి వెతుకుదాం? నాకు తెలిసిన అంశాలను వీలైనప్పుడు మరొకసారి తప్పకుండా మీ ముందు ఉంచుతాను!
ఈ ప్రపంచంలోని చెట్లు, జంతువులు, ఇతర పదార్థాలు కొన్ని ఆకర్షిణీయమైన హంగులను కలిగి ఉంటాయి. వాటిని అందం అనవచ్చు. అయితే అందాన్ని అందరూ ఒకే రకంగా చూడలేరు అన్నది అనుభవం మీద మనిషి తెలుసుకున్న సత్యం. లైలాను చూచి ప్రభువు ఈమె ఏమంత అర్థం కాలేదు కదా అన్నాడట! మజ్ఞూ మాత్రం నా కళ్లతో చూడండి ప్రభువా! అన్నాడట! అందుకే మరి అందం అన్నది చూసేవాళ్ల కళ్లలో, కొన్ని సందర్భాలలో చెవులలో ఉంటుంది అని చెబుతుంటారు.
చిత్రకళా ప్రదర్శనకు వెళ్లిన వారు అందరూ అన్ని చిత్రాలను ఒకే రకంగా మెచ్చుకునే ఈ పరిస్థితిని మనం ఊహించలేము. నైరూప్య చిత్రకళ అని ఒక పద్ధతి వచ్చింది. అవి చాలామందికి అర్థం కాదు అన్నారు. అప్పుడా కళ్లలో ఆనందం ఉందా? లేదా? గొప్ప ప్రశ్న! ఏం పాట ఇది? ఇంతకన్నా నేను బాగా పాడగలను! అన్న వ్యాఖ్యానం చాలాసార్లు విని ఉంటాము. ప్రపంచమంతా చిత్రకళ ఉంది. ఆర్కిటెక్చర్ అనే నిర్మాణ కళ ఉంది. సంగీతం ఉంది. అయితే వివిధ ప్రాంతాలలో విస్తృతంగా తేడాలు ఉన్నాయి. నాకు ఇవాల్టి వరకు పాశ్చాత్య శాస్ర్తియ సంగీతంలో లోతుపాతులు అర్థం కాలేదు. అంటే లోపం నాలోనే ఉంది అన్న భావం మాత్రం నాకు మిగిలి ఉంది. అందరికీ గొప్పగా వినిపించిన రచనలు నాకు అర్థం కావడం లేదు అంటే, అక్కడ కావల్సింది ఏదో నాకు లోపించింది అనుకుంటున్నాను. మన శాస్ర్తియ సంగీతం కూడా చాలామందికి పట్టదు. అక్కడ కూడా ఇదే సమస్య ఉందని, కేవలం చాలా కాలంగా వింటున్నాను కనుక నాకు అందులో రుచి పుట్టిందని, బహుశా నాకు తెలుసు.
ఒక పద్ధతి కళను అభిమానిస్తున్న వారు, అందుకు భిన్నంగా ఉన్న మరొక కళా పద్ధతిని నిరసించడం కూడా ప్రపంచం అంతటా ఉంది. స్టీవెన్ పింకర్ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతను కనిపించిన అన్ని విషయాలను గురించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. కళారంగం విషయానికి వచ్చేసరికి అతను ఇది కేవలం మనసుకు సంబంధించిన సంగతి మాత్రమే కాదు. ఇందులో జేబు ప్రమేయం చాలా ఉంది అన్నాడు. అంటే కడుపు నిండిన వారికి మాత్రమే కళలు తలకు ఎక్కుతాయి అని మొదట్లో మనం అనుకున్న సంగతిని, ఈయన మరొక రకంగా చెప్పాడు అనుకోవచ్చు! మా ఇంట్లో గోడ మీద రవివర్మ చిత్రపటం ఒకటి ఉండేది. అయితే అది నకలు! అసలు రవివర్మ చిత్రం నాకు దొరకాలంటే నిజంగానే జేబు ప్రమేయం ఉండాలి!

-కె.బి.గోపాలం