ఓ మహిళా ఉద్యమించు
Published Sunday, 22 March 2020చిగురాకుల ఎలకోయిల స్వరం తప్పి పాడింది
గుబురాకుల గువ్వపిట్ట పొదచాటుకు చేరింది
పచ్చపచ్చని పైరులపై పిచ్చుకమ్మ బిక్కచచ్చి నక్కింది
నెమలిబాల స్తంభించి గతి తప్పింది నృత్యహేల
మొన్న లేదు నిన్న లేదు నేడెందుకు చిన్నబోయె నీ వదనం
మాయమాయె గుండె గొంతుకలనేకం చేయు నీ హసనం
ఎందులకీ నైరాశ్యం.. ఏమిటి ఈ వైఫల్యం.. ఏం జరిగిందని
ఈ వైరాగ్యం.. ఏమయ్యిందని ఈ వైవిధ్యం
కోయిలమ్మ కూతలో మార్పు.. కూనలమ్మ చూపులో మార్పు
పూవులమ్మ గుండె వేడి నిట్టూర్పు.. తెల్లబోయె తూర్పు..
దేనికి ఓర్పు నశించిన ప్రకృతికాంత ఈ తీర్పు
మగ జాతి దౌష్ట్యానికి.. స్ర్తిల పట్ల పాశవిక ప్రవృత్తికి..
చట్టోల్లంఘన ధోరణికి నిరసనగ నినదిస్తూ..
చరమగీతి పాడేస్తూ.. పరమావధి బోధిస్తూ..
గతి తప్పిన మగజాతిపై.. మితిమీరిన మృగతృష్ణపై..
దుర్దయుల దుర్నీతికి స్వస్తి వచనమాలపిస్తు
కంచే చేను మేయు సంస్కృతిని సమాధి చేస్తు..
ఉవ్వెత్తున ఎగసింది మహిళా ప్రభంజనం
ఉప్పెనలా గళం విప్పి పాడింది ఆశావహ
ప్రగతి సోపానానికి నాందిగా
అసురుల... నరకాసురుల పించమణచడమే
ధ్యేయంగా ఉద్యమించుతోంది.. వరద వాగై ముంచి వేయసాగింది. *