S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

హరి, విశాఖపట్నం
చాలామంది రాజకీయ నాయకులు వాళ్ల వాళ్ల పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల వల్లే ఆ రాష్ట్రంగానీ దేశం గానీ అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటూంటారు. వాళ్లే తిరిగి కుల సంఘ వేదికలపైన తమ కులం వారందరూ చాలా వెనుకబడిపోయారని, విద్యాలయాలలో, ఉద్యోగాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించి తమ కులం వారికి చేయూత నివ్వాలని పోరాటం చేస్తుంటారు. ఇందుకు ఏ కులం వారూ మినహాయింపు కాదు. తాము చాలా వెనుకబడిపోయామని, రిజర్వేషన్ కావాలని అన్ని కులాల వారూ కోరుతుంటారు. ఇంతకీ ఇలా అన్ని కులాల వారు వెనుకబడిపోతూ ఉంటే దేశం మాత్రం ఎలా అభివృద్ధిలో దూసుకుపోతోందో కాస్త మీరైనా మాకు వివరించండి.
వెనకబడేది కులాలు. అభివృద్ధి చెందేది వాటి నేతలు.

సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
దేశంలో విధి నిర్వహణలో నిజాయితీగా పని చేస్తున్న అధికారులకు రక్షణ లేకుండా పోతోంది. తమ కార్యకలాపాలకు అడ్డుగా వున్నవారిని తొలగించుకునేందుకు మాఫియాలు ఎంతకైనా తెగిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వాధికారులపై దూషణలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వపరంగా రక్షణ, ప్రోత్సాహం లేకుంటే అధికారులకు నీతి, నిజాయితీ నిబద్ధతలతో పని చేయడం ఎలా సాధ్యం?
దేవుడే దిక్కు.

ఎ.నాగేశ్వరరావు, పలాస
మన దేశంలో హెల్మెట్ నిబంధన చాలా వరకు మంచిదే. ద్విచక్ర వాహనదారులకే కాకుండా ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నిబంధన చాలావరకు మంచిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం ఏం జరిగిందో చెప్పడానికి మనం ఉండాలి. బడిపిల్లలకు, రోడ్డు మీద నడిచేవాళ్లకి, రైళ్లలో, బస్సుల్లో, విమాన ప్రయాణీకులకు ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిచేసే మంచిది అని అనిపిస్తుంది. మీకేమీ అనిపిస్తుంది సార్?
మంచిదే. కొట్టుకున్నా తలలు పగలవు. దొంగల పని సులువు. అప్పుల వాళ్లను తప్పించుకోవచ్చు.

సి.మనస్విని, విజయవాడ
ఈ దేశాన్ని అరవయ్యేళ్లు వంశానుగతికంగా పాలించిన పార్టీని కాదని - ప్రజాస్వామ్యయుతంగా - మరో పార్టీని ఎన్నుకుంటే- తమను తాము మేధావి వర్గంగా భావించుకునే ఈ ప్రబుద్ధులు ఇంత ‘అసహనం’ ప్రదర్శిస్తున్నారెందుకు. అంటువ్యాధిని వ్యాపింపజేసే బాక్టీరియాలాగా ప్రవర్తిస్తూ అవార్డులను తిరిగిచ్చేస్తున్నారెందుకు? ‘అసహనం’ తమలో ఉంచుకుని - దేశంలో ఉందని బుకాయిస్తున్నారెందుకు?
ఈ ప్రశ్న సదరు తోలుబొమ్మలను తెర వెనక నుంచి ఆడించే వాళ్లను అడగాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు ధరలు పెరిగితే టిడిపి, బిజెపిలు ఓవర్ యాక్షన్ చేసేవి కదా! ఇప్పుడు కందిపప్పుతోపాటు టమోటా, ఉల్లిపాయలు (మరోసారి) ధరలు పెరుగుతుంటే వారికి చీమ కుట్టినట్టయినా లేదేమిటి?
పాత్రనుబట్టి డైలాగులు

ఎం.కనకదుర్గ, తెనాలి
సరిగ్గా బీహార్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు, గోహత్య, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత హత్య, పరమత విద్వేషం వంటి అంశాలను రేకెత్తించి, కొన్ని వర్గాలకు దూరమై, ఎన్నికలలో దారుణంగా పరాజయం పొంది బిజెపి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయ్యింది. వచ్చే ఎన్నికలకైనా తమ తప్పులను దిద్దుకుంటుందని ఆశించవచ్చా?
బిజెపి తప్పులూ తక్కువకావు. కాని అనవసరపు వివాదాలను కెలికి గోల చేసింది మోదీ విరోధులు.

బాక్సైట్ జీవో విషయంలో అసలు తనకా విషయమే తెలీదని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ పెద్దకు తెలియకుండా జీవోలు విడుదలయ్యే అవకాశం ఉందా? ఇందుకు కొందరు క్రింద అధికారులను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు?
అది రాజకీయ నాటకం.

తాళాబత్తుల సత్యనారాయణ, మల్కాపురం
రూ.300 పెట్టి కొరియర్ పార్సిల్ విడిపించుకోండి. 4 కాసుల బంగారం సొంతం చేసుకోండి అని ఢిల్లీ నుంచి స్పష్టంగా సెల్‌కి ఫోన్లు చేస్తున్నారు. ధైర్యంగా అడ్రస్‌లు అడుగుతున్నారు. దరిమిలా నా సెల్‌కి రెండు కాల్స్ వచ్చాయి. ఈ ఘరానా కాలర్స్‌ని ట్రేస్ చేసి పట్టుకొనేవారెవరు మనకి? పి.ఎస్.లో పట్టించుకోరు.
ఢిల్లీ నుంచి వచ్చే మోసపు ఫోన్లకు స్థానిక పోలీసులు ఏమీ చేయలేరు. కావాలనుకుంటే మనమే పట్టువదలక వెంటపడాలి. కనీసం మోసపోకుండా అయినా ఉండాలి.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
‘ఉగ్రవాదంపై ఉక్కుపాదం’ - ఏళ్ల తరబడి వింటున్న మాట - ఎప్పటికయినా సాధ్యపడేనా?
అది ఉత్తుత్తి పాదం.

గోవధ నిషేధం అని రాజ్యాంగంలోనే ఉన్నప్పుడు దీన్ని ప్రత్యేక చట్టం చేయాలని రాష్ట్రాలకు అధికారమివ్వడమేమిటి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే నిషేధించాయి.
రాజ్యాంగంలో పొందుపరిచింది శాసనం కాదు. కంటితుడుపు సుభాషితం.

షిర్డీ సాయిబాబా దేవాలయాలు బాగా పెరిగిపోతున్నాయి. పాత శివాలయాలు, ఇతర దేముళ్ల గుడి ప్రాంగణంలో కూడా ఆ విగ్రహాలు పెడుతున్నారు...
బాబా గుడులవల్ల హిందూ మతానికి నష్టంలేదు.

పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
కాంగ్రెసు ప్రధానులలో నిష్కళంక చరితుడు, త్యాగమూర్తి లాల్‌బహదూర్ శాస్ర్తీగారు. వారి చరిత్ర విపులంగానూ ఆయన మరణం వెనుక ఇమిడిన లోగుట్టు బయటపెట్టే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది.
దానికి చాలా సమాచారం కావాలి. ఆధారాలూ దొరకాలి. వట్టి అనుమానాలను ఏకరవు పెట్టి ప్రయోజనం ఉండదు. చూద్దాం.

ధర్మ, రాజమండ్రి
దినపత్రికలు నష్టాలలో ఉన్నాయంటారు. మరి సంక్రాంతి, దశమి, దీపావళి సెలవు రోజుల్లో అన్ని పత్రికలూ వెలువడవు కదండి, కనీసం ఆ రోజున ఆంధ్రభూమి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తే అప్పుడు ఆ రోజున అందరూ ఈ పత్రిక వీక్షించి.. మరింత మంది చేరువై ఆదరిస్తారేమో?
ఆ మూడు రోజులు మాత్రమే ఆదరిస్తారు. అదైనా కొందరు.

*
====================
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com
====================