S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజనీతిజ్ఞునికి అక్షర నీరాజనం

దేవరపల్లి, ఏప్రిల్ 29: జిల్లా రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించి, రాజకీయ నాయకునిగా కాక, రాజనీతిజ్ఞునిగా పేరొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామికి జిల్లాలో నేడు అక్షర నీరాజనం జరగనుంది. పదవులకు కాక విలువలకు కట్టుబడిన నేతగా యర్రా సమున్నతంగా నిలిచారు.ఎందరో మహామహులు జిల్లా రాజకీయాలను శాసించినా, జిల్లా రాజకీయ చరిత్రలో అజాత శత్రువుగా యర్రాకున్న స్థానం ఆయనదే. ఉన్నత విద్యావేత్తగా, సామాజిక వేత్తగా యర్రా రాణించారు. డెల్టా ప్రాంతంలో జన్మించినా మెట్టప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా రాణించి జిల్లా అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేంట్రంచేసిన యర్రా గొప్ప రాజకీయ వేత్తగా ఎదిగి ప్రజాసేవలో ముందున్నారు. జడ్పీ ఛైర్మన్‌గా జిల్లా అంతటా పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తన అనుచరులను పెంచుకున్నారు. ఒకప్పుడు జిల్లాలో అల్లూరి బాపినీడు, మూర్తిరాజు వర్గాలు రాజకీయాలను శాసించేవి. అయితే రెండు వర్గాలకు దూరంగా, రాజకీయాల్లో రాణించిన నేత యర్రా. అప్పట్లో జలగం వెంగళ్రావు మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించారు. ఎన్నికల్లో అపజయం ఎరుగని యర్రా అనేక పదవుల ద్వారా ప్రజాసేవ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరారు. ప్రతిష్ఠాత్మకమైన జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో నాటి రాజకీయ దిగ్గజం మాగంటి రవీంద్రనాథ్ చౌదరిని ఓడించి, సంచలనం సృష్టించారు. తొలి కాంగ్రెసేతర జడ్పీ ఛైర్మన్‌గా ఆ పదవికి వనె్న తెచ్చారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ హోదాలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంచినీటి పథకాలు, పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. జడ్పీ ఛైర్మన్‌గా యర్రా సేవలను గుర్తించి ఎన్టీఆర్ ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారు. యర్రా నారాయణస్వామి తండ్రి యర్రా చంద్రరావు 125వ జయంతోత్సవాల సందర్భంగా ఆయన అభిమానులు, శిష్యులు యర్రా రాజకీయ చరిత్ర పుస్తకావిష్కరణ ఈ నెల 30న చేయనున్నారు. ప్రస్తుత రాజకీయ రంగంలో యువ రాజకీయ నేతలు యర్రాను ఆదర్శంగా తీసుకోవాలి. దేవరపల్లి మండలంలో కంటిపూడి సుబ్బారావు, ఓరుగంటి లక్ష్మీపతిరాజు, కాట్రు భీమరాజు, కొండపల్లి దొరయ్య, కోలా సత్యనారాయణ, గద్దే వెంకట రామారావు, గెడా మురళీ అజిత్‌కుమార్ ఆయన శిష్యులే. యర్రా ఆశీస్సులతో రాజకీయ ఆరంగేట్రం చేసిన రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి యర్రావారి ఆడపడుచు కావడం విశేషం. యర్రా నారాయణస్వామి 85వ ఏట ఆయన రాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టాలను పుస్తకావిష్కరణ చేయడం గొప్ప అనుభూతిగా శిష్యులు భావిస్తున్నారు. భీమవరంలో శనివారం జరిగే యర్రా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళుతున్నారు.