S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు!

కర్నూలు, ఏప్రిల్ 29 : జిల్లాలోని 14 నియోజకవర్గ కేంద్రాల్లో 100 ఎకరాల చొప్పున భూమి సేకరించాలని ప్రభుత్వం కలెక్టర్ విజయమోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనిని తక్షణం పూర్తి చేసి మే 2వ తేదీ జరగనున్న మంత్రివర్గ సమావేశానికి నివేదిక పంపాలని సూచించింది. ఈ భూమిని ఏపిఐఐసికి కేటాయించి ఆ సంస్థ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య(ఎంఎస్‌ఎంఇ) తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో యంత్రాల విలువ రూ. 25లక్షల లోపు ఉంటే సూక్ష్మ, రూ. 5కోట్ల లోపు ఉంటే చిన్న, రూ. 10కోట్ల లోపు ఉంటే మధ్య తరహా పరిశ్రమలుగా గుర్తిస్తారు. ఈ సంస్థల ఏర్పాటుకు యువత, ఔత్సాహికులను ప్రోత్సహించాలన్న నిర్ణయం మేరకు ప్రతి నియోజకవర్గంలో వంద ఎకరాల భూమిని సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో యువత పరిశ్రమల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నా పెట్టుబడి, పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలం, నీటి సరఫరా వంటి సమస్యలు ఎక్కువగా ఉండటంతో పాటు కాలుష్య నివారణ సంస్థల నుంచి అనుమతులు పొందటం కూడా కష్టంగా ఉందని ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో తేలినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన ముద్ర బ్యాంకు తరహా పథకాలు రుణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా యువతకు బాసటగా నిలుస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భూమి, నీరు, ఇతర అనుమతులు ఇవ్వగలిగితే యువతలో దాగి ఉన్న నైపుణ్యానికి మరింత పదును పెట్టవచ్చని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల యువతకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు మరి కొంతమంది నైపుణ్యం లేని యువతకు ఉపాధి కల్పించేందుకు వీలు ఏర్పడుతుందని ప్రభుత్వానికి అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఆయా పట్టణాల్లో ఉన్న పరిశ్రమలన్నింటినీ ఒక చోట చేర్చడం ద్వారా కాలుష్య నివారణ సులభం అవుతుందని కూడా వారు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. సర్వే నివేదిక, అధికారుల సూచనలతో ఏకీభవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాల భూమిని సేకరించి అమలు చేసి సత్ఫలితాలు వస్తే అదనంగా అవసరమైన చర్యలు తీసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. దీంతో వీలైనంత త్వరితగతిన భూమిని సేకరించి యువత నైపుణ్యానికి ప్రోత్సాహం అందించాలన్న భావనతో తక్కువ సమయంలో భూ సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 2వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఏపిఐఐసికి భూమిని బదలాయించే కార్యక్రమం చేపట్టి దసరా నాటికి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పారిశ్రామికవాడలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.