S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇబిసిలకు 10 శాతం కోటా

గాంధీనగర్, ఏప్రిల్ 29: రిజర్వేషన్ల కోసం గత కొంతకాలంగా పటేళ్లు సాగిస్తున్న ఉద్యమం దెబ్బకు దిగి వచ్చిన గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. ఆరులక్షలకన్నా తక్కువ కుటుంబ వార్షికాదాయం కలిగిన వారికి పది శాతం రిర్వేషన్లను కల్పిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే రిజర్వేషన్లకోసం ఆందోళన చేస్తున్న హార్దిక్ పటేల్ నేతృత్వంలోని సంస్థ ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బ తగలడం, మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్ణయించిన 50 శాతాన్ని దాటిపోనున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎస్సీలు, ఎస్టీలు, ఒబిసిలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. అయితే రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మోసపూరితమైదని, పటేళ్ల వర్గాన్ని బుజ్జగించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.శుక్రవారం జరిగిన బిజెపి కోర్‌గ్రూపు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు పొందడానికి కుటుంబం వార్షికాదాయాన్ని ఆరులక్షల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిజర్వేషన్లకోసం ఆందోళన చేస్తున్న హార్దిక్ పటేల్ నేతృత్వంలోని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి తమ వర్గం వారిని తప్పుదోవ పట్టించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి నాయకత్వం ప్రకటించిన మరో తాయిలం (లాలీపాప్)గా అభివర్ణించింది. అయితే ఆందోళన చేస్తున్న మరో సంస్థ సర్దార్ పటేల్ గ్రూపు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. ‘జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో జరిగిన కోర్‌గ్రూపు సమావేశంలో నిర్ణయించడం జరిగింది’ అని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, మరో సీనియర్ మంత్రి నితిన్ పటేల్‌తోకలిసి విలేఖరులతో మాట్లాడిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్ రూపాని చెప్పారు. గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన మే 1నాడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయడం జరుగుతుందని, జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు(ఇబిసి) వచ్చే విద్యా సంవత్సరంనుంచి విద్య, ఉపాధి రంగాల్లో ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారని కూడా ఆయన చెప్పారు. ఏడాదికి ఆరులక్షలు, అంతకన్నా తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలు రిజర్వేషన్లు పొందడానికి అర్హులని ఆయన చెప్పారు. అయితే రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఈ రిజర్వేషన్లతో రాష్ట్రంలో రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్ణయించిన 50 శాతం పరిమితిని మించి పోనున్నాయి. ఫలితం గా ఈ నిర్ణయానికి న్యాయపరమైన ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం న్యాయస్థానాల సమీక్షకు నిలుస్తుందా అని అడగ్గా, ప్రభుత్వం ఈ విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉందని, జనరల్ కేటగిరీలో ఇబిసిలకు రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు వరకు కూడా పోరాడుతామని విజయ్ రూపాని చెప్పారు. అంతేకాక తాము ఎస్సీ, ఎస్టీ, ఒబిసిల కోటాలను ముట్టుకోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సిఫార్సుపై ఈ రిజర్వేషన్లను ప్రకటించారా అని అడగ్గా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా పాల్గొన్న కోర్‌గ్రూపు సమావేశంలో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, అంటే పార్టీలోని అందరినుంచి దీనికి అనుమతి లభించినట్లేనని రూపాని చెప్పారు.