S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మట్టిని వండి వడ్డించే రెస్ట్‌రెంట్ ( నమ్మండి.. ఇదినిజం )

మట్టిలో పండిన ఆహార పదార్థాలని తింటూంటాం కాని మట్టిని తినడానికి మనం ఇష్టపడం. కాని కొన్ని సందర్భాలలో మనిషి మట్టిని ఇష్టంగా తినడం జరుగుతుంది. కొందరు చిన్నపిల్లలు మట్టి తింటూంటారు. కొన్ని సంస్కృతుల్లో మట్టిని తినడం సంప్రదాయం కూడా. ఇలా మట్టిని తినడాన్ని జియోఫాజియా అని పిలుస్తారు.
శరీరంలో కొన్ని మినరల్స్, విటమిన్స్ లోపిస్తే మట్టి తినాలని అనిపిస్తుంది. జంతువులు మట్టి తినడం సాధారణం. పారిశ్రామిక విప్లవానికి పూర్వం మనుషులు మట్టిని అధికంగా తినేవారంటే నేడు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫ్రికాలోని జాంబియా, టాంజానియా సరిహద్దుల్లోని కలంబో ఫాల్స్ అనే చోట మనుషులకి వేల ఏళ్ల క్రితం నించే మట్టి తినే అలవాటు ఉందని పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. అక్కడి తెల్లటి మట్టిలో కాల్షియం అధికం. సాధారణంగా ఆటవికుల్లో, గ్రామీణుల్లో జియో ఫాజియా ఉంటుంది. వారు సుద్దముక్కలు, గడ్డి, అనేక రంగుల్లోని మట్టిని తింటారు.
14వ శతాబ్దం దాకా గ్రీస్ ద్వీపం లెమనోస్‌లోని మట్టిని తినడం కోసం గ్రీస్ మెయిన్ లేండ్‌కి ఎగుమతి చేసేవారు.
క్రీ.పూ.460-377లో హిపోక్రైట్స్ రాసిన ప్రఖ్యాత వైద్య పుస్తకం డి మెడిసినాలో జియోఫాజియా ప్రస్తావన ఉంది. ఎనీమియా (రక్తహీనత) దీనికి కారణంగా హిపోక్రైట్స్ పేర్కొన్నాడు. రాతపూర్వకంగా ఇది మొదటగా నమోదైంది. కాని అంతకు వేల సంవత్సరల ముందు నించే జియోఫాజియా ఉండేది.
అమెరికాకి కొత్తల్లో యూరప్ నించి వచ్చిన వలసదారులు అక్కడి స్థానిక అమెరికన్స్‌లో జియోఫాజియా ఉందని గ్రహించారు. ఇలా ఇతర ఖండాల మీద కాలు పెట్టిన యూరోపియన్లు స్థానికులు మట్టి తినడాన్ని కనుగొన్నారు. ఆఫ్రికాలోని జాంజిబార్‌లో బానిసలని అట్లాంటిక్ మహాసముద్రం మీద రవాణా చేసేప్పుడు వారు వెంట తెచ్చుకున్న మట్టిని తినేవారని లివింగ్‌స్టన్ రాశాడు. ఆఫ్రికన్స్‌కి క్లే ఈటర్స్ (మట్టిని తినేవారు) అనే ముద్దు పేరు ఉండేది. సౌత్ అమెరికాలోని ఓ తెగ వారు ఆత్మహత్య కోసం మట్టి తింటారని 1587లో గేబ్రియల్ డిసౌసా అనే వ్యక్తి రాశాడు.
కడుపులో నులి పురుగులు ఉండటం మట్టిని తినాలని అనిపించడానికి ఓ కారణం. క్షామం వచ్చిన సమయాల్లో మనుషులు మట్టిని తినడం సాధారణంగా జరిగే విషయం. క్రితం శతాబ్దంలో రాయలసీమలో తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు చాలామంది పొలంలోని నల్ల మట్టిని తినేవారని నమోదైంది. ఆఫ్రికాలో నేటికీ ప్రజలు మట్టి తినడానికి కారణం అది ఆకలిని చంపేస్తుందని. సౌత్ అమెరికాలోని హైతీ పేద దేశం. అక్కడి బీదల కోసం మట్టి, ఉప్పు, కొద్దిగా కూరగాయలు కలిపి బిస్కెట్స్‌ని తయారుచేసి అమ్ముతున్నారు. వారు ఆకలితో మరణించకుండా ఇవి కాపాడుతాయి కాని పౌష్టికాహారం వారికి అందదు. ఎక్కువ కాలం వీటిని తింటే కడుపునొప్పి వస్తుంది. కారణం మట్టి ఇంటెస్టైన్స్‌లో ఉండిపోవడం.
చాలా సంపన్న దేశాల్లో మట్టిని రెస్ట్‌రెంట్స్‌లో సర్వ్ చేయడం చిత్రమైన విషయం. జపాన్‌లోని టోక్యోలో నీక్వయజ్ తాస్ అనే ఫ్రెంచ్ రెస్ట్‌రెంట్‌లో వంటకాలకి వాడే ప్రధాన దినుసు మట్టే! ఐతే ఇది సాధారణ మట్టి కాదు. టొచుగి పర్‌ఫెక్చర్‌లోని కనుమ అనే ప్రదేశం నించి ప్రత్యేకంగా తెప్పించే నల్ల మట్టిని ఇక్కడ వాడుతారు. బేక్టీరియా పోయేలా దీన్ని శుభ్రం చేసి వంటల్లో ప్రధాన దినుసుగా వినియోగిస్తారు. అక్కడి వంటవాడు టోషియో తనాబె ఓసారి వంటల పోటీలో మట్టితో తయారుచేసిన సాస్‌ని వడ్డించి గెలిచాడు. అతను చెప్పేదాకా ఆ రుచికరమైన వంటకం మట్టితో చేశారని ఎవరూ గ్రహించలేకపోయారు. దాంతో ఈ రెస్ట్‌రెంట్ యజమాని అతన్ని వంటవాడిగా తీసుకున్నాడు. ఈ అసాధారణ దినుసుని వంటల్లో రుచికరంగా ఉపయోగించడంలో టోషియో తనాబె నిపుణుడు. భోజనంలో మట్టితో చేసిన సూప్‌ని, కూరగాయల మీద మట్టిని చల్లి వెజ్ సలాడ్‌ని సర్వ్ చేస్తాడు. ఇలా ఇక్కడ దొరికే ప్రతీ వంటకంలో మట్టి ఉంటుంది. చివర్లో డిజర్ట్‌గా సర్వ్‌చేసే ఐస్‌క్రీం కూడా మట్టితో చేసిందే!
యూరప్‌కి చెందిన రాక్‌న్యూస్ 24 అనే దినపత్రిక ప్రత్యేకంగా తమ ఫుడ్ జర్నలిస్ట్‌ని ఈ రెస్ట్‌రెంట్‌కి పంపింది. అన్ని పదార్థాలని తిన్నాక అతను అవి అత్యంత రుచికరంగా ఉన్నాయని, మట్టివాసన చాలా స్వల్పంగా వేసిందని రాశాడు. ఇక్కడ భోజనం ధర 10,000 ఎన్స్. (రూ.5,000)
‘ఇంతదాకా మట్టిని ఇలా భోజనానికి అనువైన పదార్థంగా భావించి ఎవరూ ఉపయోగించలేదు. కాని మట్టిలో కూడా పదార్థాలతోపాటు రుచి ఉంటుందంటే నమ్మడం కష్టం. వర్షం మొదలైనప్పుడు వచ్చే మట్టివాసనని అంతా ఆస్వాదిస్తారు. అలాగే నాలికకి కూడా మట్టి చక్కని రుచిని ఇస్తుంది. కాకపోతే ఏ వంటకంలో ఎంత పాళ్లు మట్టిని వాడాలి అన్నది తెలిసి ఉండటం ముఖ్యం. ఇది అనేకసార్లు మట్టిని వివిధ పరిమాణాల్లో వండటం వల్లే నిర్ణయించగలం’ ఆ రెస్ట్‌రెంట్ వంటవాడు టోషియో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘మట్టి చాక్లెట్‌లా నోట్లో కరుగుతుంది. దానిలా మృదువుగా కూడా ఉంటుంది. వైద్యులు కూడా కొన్ని రోగాలకి మట్టి చక్కటి చికిత్స అని చెప్తున్నారు. నేను గర్భవతి అయ్యాక మట్టి తినాలని అనిపించి ఈ రెస్ట్‌రెంట్‌కి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడి వంటకాల్లోని మట్టికి బానిసని అయ్యాను’ ఓ కస్టమర్ చెప్పింది.
సినీ నిర్మాత ఏడం ఫాస్టర్ మట్టి తినే వారి మీద నాలుగేళ్ల పరిశోధన చేసి ఈట్ వైట్ డస్ట్ అనే డాక్యుమెంటరీని తీశాడు. జార్జియా రాష్ట్రంలోని ఓ పర్వత ప్రాంతం నించి వర్షంతోపాటు కొట్టుకు వచ్చే మట్టిని రంగులు, కాస్మొటిక్స్ మొదలైన వాటిలో వాడతారు. ఈ మట్టి పేరు కావోలిన్. ఆ తెల్లటి ఇసుక రేణువుల్లాంటి మట్టిని శుద్ధి చేసి వ్యాపార సంస్థలు అమ్ముతున్నాయి. అట్లాంటా నగరంలో వాల్‌మార్ట్‌లో, చాలా పచారీ దుకాణాల్లో వీటిని కొని తింటున్నారు. ఈ మట్టిని ముఖ్యంగా నల్లజాతి గర్భవతులు తింటారు. వారిలో మట్టి తినాలనే కోరిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. తెల్ల బలపాలు తినే గర్భవతులు తెలుగునాట ఉండేవారు. మట్టి తినేవారంతా బయటికి చెప్పుకోడానికి సిగ్గు పడతారు. జపాన్‌లోని ఓ పాటలో గర్భవతికి అన్నిటికన్నా మట్టే రుచికరమైంది అనే పల్లవి ఉంది. గర్భవతులు మట్టిని తినే కోరికని ఇంగ్లీష్‌లో ‘పికా’ అంటారు.
కెయోపెక్టైట్ అనే కడుపునొప్పి మందులో అమెరికాలో కావోలిన్ మట్టిని వాడుతారు. అధిక ఏసిడ్ వల్ల కడుపులోని లైనింగ్ పోతే మట్టి లైనింగ్‌గా ఉపయోగిస్తుంది. కొందరు దీన్ని మానసిక జబ్బుగా కూడా పరిగణిస్తున్నారు. శారీరక అందానికి వంటికి ఒండ్రు మట్టిని పూసుకుంటే చర్మం ఎలా నిగనిగలాడుతుందో అలా మట్టిని తింటే అది కడుపులోని లైనింగ్‌కి రాయబడి, చాలా బాక్టీరియాలని చంపేస్తుంది. మట్టి తినే అలవాటు చలి ప్రాంతాల కంటే ఏషియా, ఆఫ్రికా లాంటి వేడి ప్రాంతాల్లో అధికం.
అమెరికాలో దీని మీద చేసిన పరిశోధనలో, పోషకాహార పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ అవసరం అయిన నలభై శాతం మందికి మట్టిని తినాలనే కోరిక కలుగుతుందని తెలిసింది. కుందేళ్లు, ఎలుకల మీద చేసిన పరిశోధనలో కడుపులోని మట్టి వైరస్‌లకి, బాక్టీరియాలకి అడ్డుతెరగా ఉపయోగిస్తుందని, ఆహారంలోని పోషక పదార్థాలని శరీరం అధికంగా గ్రహిస్తుందని కనుగొన్నారు. మట్టికి ఉపరితలంలో కాక మట్టిలో పెరిగే బంగాళా దుంపలు లాంటి ఆహార పదార్థాలు టాక్సిక్ ఆల్‌కలాయిడ్స్ నించి రక్షణ ఇవ్వడానికి కారణం మట్టిలోని గ్లైకోల్ కలాయిడ్స్ అనే పదార్థాన్ని అవి అధికంగా గ్రహించడమే. ఆధునిక అమెరికన్ వైద్య పరిశోధకుల దృష్టి మట్టి మీద పడింది. దాన్ని ఉపయోగించి మందులని చవకగా తయారుచేయడానికి అనేక పరిశోధనలని చేస్తున్నారు. ఆఫ్రికాలోని ఓ తెగ వారు చెద పురుగుల పుట్ట మట్టిని తింటారు. ఇందులో మినరల్స్ అత్యధికగా ఉంటాయని పరిశోధకులు కనిపెట్టారు. పుట్ట మన్ను చెవినొప్పికి పని చేస్తుందని మన నమ్మకం.
‘మట్టి రుచుల్లో కూడా తేడా ఉంది. ఒకో ప్రాంతం మట్టికి ఒకో రుచి. మట్టిని తినేవారు బీదవారని, అజ్ఞానులని లేదా పౌష్టికాహారం లేనివారని ఉన్న అభిప్రాయం కొంతకాలానికి మాయమై అంతా మట్టితినే రోజు తప్పకుండా వస్తుందని నా నమ్మకం. మట్టి కోట్ల డాలర్ల వ్యాపారంగా మారబోతోంది’ ఓ పరిశోధకుడు చెప్పాడు.

పద్మజ