S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్వర్ల రహస్యం (కథ)

..............
పోటీలో మూడవ బహుమతి రూ.3,000
పొందిన కథ
.............

శ్రీసతీ నువ్వూ మాతృ గయకు వచ్చారు.
* * *
గతించిన నీ తల్లిదండ్రుల తాలూకు పితృదేవతలూ, పై లోకాలూ వగైరాల మీద నీకు నమ్మకం లేదు. కానీ నీ భార్య శ్రీసతికి మాత్రం ఆ నమ్మకాలు పుష్కలంగా వున్నాయి!
ఈ మాతృగయ యాత్ర విషయం ఆమె ఎత్తగానే నువ్వు ఏమన్నావు. ‘ఆ.. సింగినాదం, మనం పెట్టే ఈ శ్రాద్ధాలన్నీ కాకులు తినటానికే గాని, నిజంగా ఆ పై వాళ్లకు వెళతాయా? ఎట్లా వెళతాయి?’- అని కదూ!
శ్రీసతి చటుక్కున అంది, ‘మీరు పంపే ఈ-మెయిళ్లలోని అక్షరాలన్నీ మీకు కనిపిస్తూ గెంతుకుంటూ వెళుతున్నాయా? అయినా సరే రిప్లైస్ వస్తున్నాయి కాబట్టి మీరు నమ్ముతున్నారు. ఇక్కడా అంతే, ఫలితాలు వస్తున్నాయి కాబట్టే, ఇన్ని వేల ఏళ్ల బట్టి నానా రకాల జనమూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు!’
‘ఏడ్చినట్లు ఉంది నీ పోలిక!... ఈ-మెయిళ్లకి సర్వర్లు ఉన్నాయి. అవ్వి అందిస్తున్నాయి’
‘ఆ, ఇక్కడా సర్వర్లు ఉన్నాయి బాబూ!... అగ్ని, ఆవూ, కాకులు, గద్దలు, జలచరాలూ, వగైరా!... వాదన అనవసరం. మన ఇద్దరి పిల్లలూ చదువుల్లో పైకి వస్తే చూసి ఆనందించాలని మీ అమ్మగారు అలమటించి, అలమటించి పైకెళ్లిపోయారు. ఇక్కడ మనం ఆవిడ్ని తలుచుకొని ఆహారం వదిలితే దానితో బలం పుంజుకొని ఏవో సర్వర్ల ద్వారా ఆవిడ వీళ్లకి మంచి భవిష్యత్తు అందిస్తారు. ఇక్కడ ఇంకో రహస్యముంది. అసలా సర్వర్లు వాటికవ్వే, ఇక్కడే, ఈ భూమి మీదనే మీకు శాంతినిస్తాయి కూడా!... పోనీ అది వద్దులెండి. మీరు, మీ తమ్ముడు పంతాలకు పోయారు. ఒక్కరూ ఆమెను మీ దగ్గర ఉంచుకోలేదు. మీకు మాటలూ లేవు. ఇప్పుడు ఈ రకంగా ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికైనా వెళదాం పదండి!’
అంతే, ఆమె వెనకాల నువ్వు ఈ మాతృగయకు వచ్చి పడ్డావు!
* * *
పురోహితుడు - పండిట్‌జీ జ్యోతీభాయి, మనూభాయి ఆచార్య - మిమ్మల్ని ఆహ్వానించాడు. నీతో అన్నాడు, ‘బాబు ఈ మాతృగయ స్థలం అంతా సుమారు మూడు ఫుట్‌బాల్ స్థలాలు కలిసినంత చోటులో విశాలంగా ఉంది. ఇక్కడే భూమి కింద గంగా, సరస్వతి నదుల సంగమం ఉంది. పైకి బిందు సరోవర్ అన్న పేరుతో, అదుగో ఆ కనిపిస్తున్నదే ఆ కోనేరు, అందులోకి ఆ నీరు వస్తుంది. దాని చుట్టూ ఉన్నవన్నీ చిన్నచిన్న దేవాలయాలు, ఆ చుట్టూ ఖాళీ స్థలంలో ఉన్నవన్నీ దాతలు కట్టించి ఇచ్చిన అధునాతన శాలలు. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు... మీరు ముందర ఆ కోనేరులో స్నానం చేసి రండి. అక్కడే ఉన్న కర్దముడు, కపిలుడు ఆలయాల్లో నమస్కారం పెట్టుకొని రండి. స్నానం చేసే ఉంటే నీళ్లు చల్లుకుని రండి’
నానా రాష్ట్రాల జనము ఆ శాలల్లో కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. ఒక హాల్లో అయితే నల్ల బురఖాలు ధరించిన ముస్లిం మహిళలు తమ కుటుంబాలతో కూర్చుని కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. చక్కని స్నానాల గదులు అందరికీ సౌకర్యాలిస్తున్నాయి.
మీరు ఇద్దరూ వచ్చేటప్పటికి ఇక్కడి శాలలో వసారాలో పండిట్‌జీ - ముగ్గులు, యవధాన్యం పిండి, నువ్వులు, దర్భలూ, పూలూ - సిద్ధం చేసుంచారు.
పండిట్‌జీ అన్నారు ‘ఇక్కడ బాబుగారి అమ్మగారు, ఆవిడ అత్తగారు, ఆవిడ అత్తగారు - ఈ ముగ్గురి పేర్లు మాత్రమే అవసరం... ఎందుకంటే పూర్వం కర్దముడు అనే ఋషీశ్వరుడు ఇక్కడ గొప్ప తపస్సు చేశాడు. దాని ఫలితంగా ఆయనకూ ఆయన భార్య అయిన దేవహూతికీ కపిలుడు అనే కొడుకు పుట్టాడు. వెంటనే కర్దముడు తపస్సుకు వెళ్లిపోయాడు. కపిలుడు పుడుతూనే మహాజ్ఞానిగా వికసించాడు. తర్వాత ఆయన తన తల్లికి మోక్షజ్ఞానం ఉపదేశించాడు! ఆమె ప్రశాంతంగా పై లోకాలకు వెళ్లిపోయింది. ఆ చోటు ఇదే! కనుకనే ఇక్కడ తల్లికి మాత్రమే గుర్తింపు!... రండి బాబూ, ఇట్లా ఈ పట్టా మీద తూర్పుకు తిరిగి కూర్చోండి. మూడుసార్లు నీళ్లు చేతిలో పోసుకొని తాగండి. నేను చెప్పే సంకల్పం మీరూ అనండి...’
మీ దంపతులు కూర్చున్నారు. సంకల్పం అయ్యింది.
క్రమంగా పండిట్‌జీ నీ చేత మూడు పిండాలు దక్షిణం వైపు పెట్టించాడు. అవి, నీకు కుడివైపు, పడమర నుంచి తూర్పుగా, వరుసగా సాగాయి.
నీ భార్య ఉత్సాహంగా పిండాలు చేసి ఇస్తూంటే నువ్వు సణుక్కుంటూ, గొణుక్కుంటూ ఎట్లాగో పెట్టావు!
ఆ మూడింటి మీద మీరు నువ్వులు, పసుపు, కుంకుమ, పూలు చల్లారు.
స్వచ్ఛమైన హిందీలో సంభాషణ సాగుతోంది.
పండిట్‌జీ అన్నాడు. ‘బాబూ... మీరు మీ అమ్మగారినీ, మీ మామగారినీ, మీ ముత్తవ్వగారినీ ఆహ్వానించారు. వారు వచ్చి ఈ పిండాలను ఆవహించి ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు మీ అమ్మగారికి గతంలో కలిగించిన కష్టాలకు, ఆమెను తలచుకొని, ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనే పని మిగిలుంది... అమ్మగారూ, ఇంకో పదహారు పిండాలు చెయ్యండి. ఒక్కొక్క పిండం నేను చెప్పినప్పుడల్లా మీ వారి చేతికిస్తూ ఉండండి. నేను మంత్రం చెప్పి అర్థం చెబుతూ ఉంటాను... గర్భస్య ధారణే దుఃఖం, విషమే భూమ్ని వర్త్మని, తస్య నిష్క్రమణార్థాయ, మాతృపిండం దదామ్యహం... అయ్యా, దీనర్థం ఏమిటంటే - అమ్మా, గర్భధారణ కోసం నువ్వు పరితపించావు. తీరా గర్భం ధరించాక, ఆ కొత్త బాధలు నీకు తప్పలేదు. దీనికి తోడు నన్ను మోస్తూ ఎత్తు పల్లాల్లో నడిచావు. ఎంత బాధపడ్డావో గదా! ఆ బాధ నా వల్ల నీకు కలిగినందుకు గాను ఈ పిండం తీసుకొని నన్ను క్షమించమ్మా!- అని... అమ్మగారు బాబుగారి చేతిలో పిండం ఉంచండి’
నీ భార్య నీకు అందించిన పిండం అందుకొని నువ్వు నీకు ఎదురుగా నేల మీద పెట్టావు.
పండిట్‌జీ అన్నాడు, ‘పాదాభ్యాం తాడయతి పుత్రః, జనన్యాః, పరివేదనం, తస్య నిష్క్రమణార్థాయ, మాతృపిండం దదామ్యహం - అమ్మా, గర్భవతులను చూసినప్పుడల్లా నువ్వు భయపడేదానివి. కానీ నేను నీ గర్భంలో పడ్డాక నీకు ఆ భయం పోయింది. నేనెప్పుడు బయటకు వస్తానా, నీ పక్కలో పడుకుంటానా, అందంగా ఉంటానా, ఉండనా అని నువ్వు ఆవేదన పడటం మొదలుపెట్టావు. కానీ నేను నీ లోపల అప్పుడు ఏం చేశాను? అటు ఇటు తిరుగుతూ నా కాళ్లతో నిన్ను తన్నుతూ నీకు కొత్త కష్టం కలిగించాను. ఆ తరువాత పక్కలోకి వచ్చాక కూడా నిన్ను తన్నాను. అందుకు నన్ను క్షమించమ్మా!... ప్రాయశ్చిత్తంగా ఈ పిండం తీసుకోమ్మా! - అయ్యా ఈ ఐదు పిండాల వరుసలోనే ఉత్తరంగా ఈ ఆరో పిండం ఉంచండి...’
హఠాత్తుగా నీకు నీ బాల్యం గుర్తుకొచ్చింది! నువ్వు నాలుగేళ్ల వాడివి. నీ పల్లెటూరులో మీ దొడ్లో మీ అమ్మ నూతి దగ్గర బట్టలు ఉతుకుతోంది. ఆమె వెనకాల బాదం చెట్టు ఉంది. నువ్వు దూరం నుంచి ఆ చెట్టుకు గురి చూసి రాళ్లు బౌలింగ్ చేస్తున్నావు. ఒక పెద్ద రాయి ఆవిడ తలకు తగిలింది. ఆమె పరిగెత్తుకొచ్చి నిన్ను పట్టుకుంది. నువ్వు ఆమెను తన్నావు. ‘అబ్బా’ అంటూ ఆవిడ కూలబడిపోయింది. నువ్వు పారిపోయావు... ‘అయ్యయ్యో, తన్నకుండా ఉండాల్సింది! ప్చ్’- అదుగో ఇప్పుడనుకుంటున్నావుకదూ! టూ, లేట్!
పండిట్‌జీ అంటున్నాడు: ‘అమ్మా, కానరాని ఆ మహాశిల్పి ఎవరో నేను పుట్టీ పుట్టగానే ఆఖరికి ఏడుస్తానని ముందుగానే నిప్పు, చక్కెర అక్కర్లేని వెచ్చని తియ్యని పాలు నీ దగ్గర ఉంచాడు. నేను బయటకు రాగానే నువ్వు ఆ పాలు నాకందించావు. ఎంత రుచిగా ఉన్నాయమ్మా! అమృతం! ఆ తర్వాత నన్ను చూస్తే చాలు అవి నీకు పొంగి పొర్లుతూ ఉండేవి. నాకేమో పొద్దస్తమానమూ వాటిని నోట్లో పెట్టుకుని పీలుస్తూ ఆడుకోవాలనిపించేది. జారిపోతూ ఉన్నా నీ యవ్వనాన్ని కూడా లెక్కచేయకుండా నా పీడని నువ్వు ఓర్చుకుంటూ ఉండేదానివి. దాని పరిష్కారంగా ఈ పిండమందుకొని నన్ను క్షమించవూ!...’
నీకు మళ్లీ జ్ఞాపకాల పొరలు పైకి లేచాయి. మూడేళ్ల వరకూ నువ్వు పాలు తాగుతూనే ఉన్నావు. ఒకరోజు మీ అమ్మ నిన్ను చంకలో ఎత్తుకొని ఉంది. నువ్వు అట్లాగే పాలు తాగుతున్నావు. మీ బంధువు ఒకావిడ వచ్చి తను కొత్తగా చేయించుకున్న గొలుసు ముచ్చట కోసం మీ అమ్మ మెడలో వేసింది. అద్దంలో చూసుకోవడం కోసం మీ అమ్మ నిన్ను కిందికి దింపబోయింది. నీకు కోపం వచ్చింది. అంతే, ఆ గొలుసు లాగావు. ఫట్‌మని అది తెగింది. మీ నాన్న కోపంతో నిన్ను ఊడలాక్కొని పిర్ర మీద ఒక దెబ్బ వేసి తీసుకెళ్లి బాదం చెట్టుకి తాడుతో కట్టేశాడు. ఇంతలో ఆయన కోసం ఎవరో వస్తే బయటకు వెళ్లాడు. గబగబా మీ అమ్మ వచ్చి నిన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు గడియ పెట్టి రహస్యంగా నీకు పాలిచ్చింది!-
అదుగో, అదుగో నీ కళ్లు చెమరుస్తున్నాయేమిటి?
పండిట్‌జీ అంటున్నాడు, ‘అమ్మా అతి పొడవైన చలి రాత్రులలో, నువ్వే ఆ చలికి వణికిపోతూ ఉంటే, నేను నా మల మూత్రాదులు వదిలి నీ పక్క తడిపాను. లెక్కలేనన్ని సార్లు ఎంత చికాకు భరించావమ్మా - బాబూ ఈ పదకొండో పిండాన్ని అదే వరుసలో ఉంచండి...’
నీకు జ్ఞాపకాలు తన్నుకొచ్చాయి. నీకు ఎనిమిదేళ్ల వయసు. నవంబర్ నెల. చలి విపరీతంగా ఉంది. పైగా వర్షాలు. మీ నాన్న ఊళ్లో లేడు. ఒక రాత్రివేళ నీకు జ్వరం వచ్చి వణకడం మొదలుపెట్టావు. అప్పుడు మీ అమ్మ వణుకుతూ, తడుస్తూ వెళ్లి డాక్టర్‌ను పిలుచుకొచ్చింది. ఆయన ఇంజక్షన్లు, మందు ఇచ్చాడు. తెల్లవారేటప్పటికి నీ జ్వరం పోయింది. కానీ ఆ రాత్రికి ఇదే జ్వరం మీ అమ్మకు వచ్చింది. నువ్వు ఏం చేసావు? ఇల్లు కదిలితే ఒట్టు! ఆ తల్లి అట్లా రెండు రోజులు మూలిగి మూలిగి, మూడో రోజుకు ఎట్లాగో తేరుకుంది... అదుగో నీకేదో అనిపిస్తోంది. ‘నా రోగాన్ని ఆవిడకి ఎక్కించి నేను కులుకుతూ తిరిగాను. ఎంత దుర్మార్గుడిని!’ - ఈ మాటలు ఇప్పుడనుకుంటున్నావా!... అదిగో నీకు కన్నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు కారి ఏమి ప్రయోజనం!
పండిట్‌జీ అంటున్నాడు, ‘అమ్మా నేను వ్యాధితో పీడించబడుతూ ఉన్నప్పుడు బాధపడే వ్యక్తి నేను కాదు నువ్వే, అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను - అయ్యా పదమూడో పిండాన్ని ఉంచండి...’
-నీకు షుగర్ వ్యాధి వచ్చింది. ఒక కిడ్నీ దెబ్బతింది. నువ్వు అడగకుండానే తన కిడ్నీ ఇచ్చింది ఆ తల్లి!... అదిగో ఏదో అనుకుంటున్నావు. ‘అమ్మా నా మూత్రపిండాల బాధ నీకు బదిలీ చేయించుకున్నావు. ఒక కిడ్నీతో ఎలా బ్రతికావమ్మా!... నన్ను క్షమించమ్మా!’ - ఇప్పుడేడిస్తే ప్రయోజనమేంటయ్యా!
పండిట్‌జీ అంటున్నాడు, ‘అయ్యా ఈ పదహారు పిండాలకు పూజ చెయ్యండి.. ఇదిగో, వీటికన్నింటికీ ఉద్వాసన చెప్పేశాను. వీటినన్నింటినీ తీసుకెళ్లి ఆ బిందు సరోవరం దగ్గర ఉన్న రావిచెట్టు మొదట్లో పెట్టేయండి. ఆవులు తింటాయి’
మీరిద్దరూ ఆ పిండాలన్నీ తీసుకెళ్లి ఆ రావిచెట్టు మొదట్లో పెట్టీ, పెట్టగానే ఆవులు ఎగబడి వచ్చి వాటినన్నింటినీ తినేసాయి!
నీ మనస్సు అంతా వికలమైపోయింది! మీ అమ్మ బ్రతికుండగా ఆమెను చూడక చాలా పెద్ద తప్పు చేశానన్న క్షోభ నిన్ను ఆవరించిపోయింది! అక్కడ పెట్టే ఉచిత భోజనం మీకు తినబుద్ధి కాలేదు. ఇద్దరూ రైల్వేస్టేషన్‌కు వచ్చారు.
నీ గుండె గుబగబలాడింది. ఆగలేకపోయావు. వెంటనే సెల్‌ఫోన్ నొక్కావు. హైదరాబాద్ నుంచి నీ తమ్ముడు పలికాడు:
‘హలో ఎవరు?’
‘నేనురా తమ్ముడూ, అన్నయ్యని!’
నాలుగు క్షణాలు నిశ్శబ్దం. వెంటనే కంగారుగా వినిపించింది. ‘అన్నయ్యా! నువ్వా! ఎన్నాళ్లకి నీ గొంతు విన్నాను! నువ్వూ, వదినా క్షేమమేనా?... ఎక్కడ్నించి మాట్లాడుతున్నావు?’
‘మాతృగయ నించి - అదే, గుజరాత్‌లో సిద్దపూర్ రైల్వేస్టేషన్ నుంచి... తమ్ముడూ... మనిద్దరం.. పంతాలకి పోయి... అమ్మను.. వృద్ధాశ్రమంలో వదిలేశాం... చాలా ఘోరమైన.. తప్పు.. చేశాంరా! ఆ పాపానికి.. నిష్కృతి లేదురా.. కనీసం అమ్మను.. తలుచుకోడానికైనా.. ఇక్కడికి రావాలిగా.. నేను వచ్చాను. నువ్వు కూడా... రా.. నా గొంతు... పూడుకుపోతోంది.. అదుగో మా.. జోధ్‌పూర్ అహ్మదాబాద్ బండి... వచ్చేస్తోంది’
‘ఎంత మంచి మాట చెప్పావన్నయ్యా! తప్పక వెళ్తాను’
కళ్లు తుడుచుకుంటూ నిశ్శబ్దంగా నువ్వు బండి ఎక్కావు. ఎవరి వెనకాల? - పితృదేవతల సర్వర్ల రహస్యం తెలిసిన నీ భార్య శ్రీసతి వెనకాల!!
*
.............................
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, విదేశీయులు చదివితే మన వ్యవస్థ అర్థమయ్యేలా కథలు రాయడం అంటే ఇష్టమంటున్న గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు.. ‘ సర్వర్ల రహస్యం’ అలాంటి ప్రయత్నమేనన్నారు. గణితంలో అధ్యాపకునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి ప్రిన్స్‌పాల్‌గా పదవీ విరమణ చేసిన ఆయన జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి, వాటినే ఇతివృత్తంగా రచనలు చేయడం అలవాటని అంటున్నారు. ఒక నవల, 250 కథలు రాసిన ఆయన పలు రేడియో కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
.............................
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
శ్రీ షణ్ముఖ నిలయం,
23బి-4-64, ఆంధ్రా బ్యాంక్ ఎదుట
రామచంద్రరావుపేట, ఏలూరు-534 002
9885798556

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు