S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దైవ ప్రేరణతో

ఒక చినుకు ఎన్నడూ వరదకి బాధ్యత తనది అనుకోదు. కాని స్పెయిన్‌లో ఓ చిన్న కెథడ్రిల్ అతని జీవితంలోని ప్రతీ క్షణం బాధ్యతని వహిస్తోంది. అతని పేరు డాన్ జెస్టోగవేవో మార్టినెజ్. స్పెయిన్‌లో మేడ్రిడ్‌కి 12 మైళ్ల దూరంలోని మెజోరరా డెల్-కెంపో అనే చిన్న గ్రామంలో ఇతను వొంటరిగా ఓ కెథడ్రిల్ నిర్మాణాన్ని చేపట్టాడు. తను క్రిస్టియానిటీకి ఇచ్చే కానుకగా అతను దాన్ని భావిస్తున్నాడు. ఇతను పిచ్చివాడా లేక భక్తుడా అనే మీమాంస చాలా మందిలో ఉంది.
జెస్టో రైతు కుటుంబానికి చెందిన బిడ్డ. తల్లిదండ్రులు రోమన్ కేథలిక్స్. ఆ కుటుంబ సభ్యులు బాగా దైవభక్తులు. ఇతని పదో ఏట జరిగిన స్పేనిష్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్ట్ శక్తులు అనేకమంది ప్రీస్ట్‌లని కాల్చి చంపి, చర్చ్‌లని దోచుకోవడం చూశాడు. స్పేనిష్ అంతర్యుద్ధం వల్ల అతని చదువు కూడా ఆగిపోయింది. దాంతో ఇతనికి ప్రభుత్వం అంటే అపనమ్మకం ఏర్పడింది. కేథలిక్ చర్చ్‌కి సేవ చేయాలనే తలంపు కూడా కలిగింది.
1950లలో 27వ ఏట ఇతను క్రైస్తవ సన్యాసిగా చేరి, శాంటా మేరియా డి లా క్యుయెస్టా అనే మోనాస్ట్రీలో చేరి, తరచు ఉపవాసం ఉంటూ, కష్టపడి పనిచేసేవాడు. 8 ఏళ్లు అలా గడిపాక అతనికి క్షయవ్యాధి సోకింది. దాంతో మోనాస్ట్రీ వారు జెస్టోని మోనాస్ట్రీని వదిలి వెళ్లిపొమ్మని కోరారు. అతని మనసు తీవ్రంగా గాయపడింది. తన మిగిలిన జీవితాన్ని దేవుడి సేవలో గడపాలని నిర్ణయించుకున్నాడు. తనకి క్షయవ్యాధి తగ్గితే అవర్ లేడీ ఆఫ్ ది పిల్లర్ గౌరవార్థం ఓ నిర్మాణాన్ని చేపడుతానని మొక్కుకున్నాడు. బ్లెస్డ్ వర్జిన్ మేరీ అంటే జీసస్ తల్లిని అవర్ లేడీ ఆఫ్ ది పిల్లర్ అని కూడా వ్యవహరిస్తారు. వ్యాధి నయమైంది. దాంతో ఏ నిర్మాణం చేపట్టాలో నిర్ణయించుకునేందుకు కేథడ్రిల్స్, కోటలు లాంటి పుస్తకాలని చదివి, వాటితో ప్రభావితం చెందాడు. ఐతే అతనికి తాపీ పని తెలీదు. ఎలాంటి నిర్మాణ నైపుణ్యం లేదు.
చివరికి 1961లో తన తల్లిదండ్రుల నించి సంక్రమించిన స్థలంలో ఓ పెద్ద కేథడ్రిల్‌ని నిర్మించాలని అనుకున్నాడు. 12-10-1961 అవర్ లేడీ ఆఫ్ పిల్లర్‌కి ఉత్సవ దినం. కాగితం మీద ఎలాంటి ప్లాన్ గీసుకోకుండా ఆ రోజున నిర్మాణాన్ని ఆరంభించాడు. అది అతని మనసులోనే ఉంది. ముందు నేలని లెవెల్ చేసి తర్వాత పునాదులకి ముగ్గుని పోశాడు. దైవ ప్రభావంతో గత 55 ఏళ్లుగా డాన్ జెస్టో ఈ కేథడ్రిల్‌ని పునాదుల నించి కప్పు దాకా అంతా స్వయంకృషితో నిర్మిస్తున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక ఇది వేటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికాని పోలిన కేథడ్రిల్‌గా మారుతుంది. కాని ఇతను ఎన్నడూ రోమ్ వెళ్లి ఆ బసిలికాని చూడనే లేదు. అమెరికాలోని వైట్‌హౌస్, రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికాలని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాన్ని ఆరంభించాడు.
ఈ చర్చ్ మొత్తం విస్తీర్ణం 86 వేల చదరపు అడుగులు! క్రేన్‌ని ఉపయోగించకుండా దీన్ని నిర్మిస్తున్నాడు. ఆ చర్చ్ కిటికీలకి రంగుల అద్దాల ముక్కలని జిగురుతో అతికించి క్రీస్తు రూపాన్ని ఏర్పరిచాడు. ప్లాస్టిక్ ఫుడ్ టబ్స్‌తో దీని పెద్ద డోమ్‌ని నిర్మించాడు. ఆయిల్ డ్రమ్స్‌ని స్తంభాల నిర్మాణానికి వాడాడు. వాటిలో కాంక్రీట్‌ని పోసి స్తంభాలని పెంచుకుంటూ వెళ్లాడు. 131 అడుగుల ఎత్తున్న దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. (వేటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలిక డోమ్ ఎత్తు 138 అడుగులు) దీని లోపలి భాగం పుట్‌బాల్ ఫీల్డ్‌లో సగం ఉంటుంది. దీని కింద ఓ లైబ్రరీ, నివాస స్థలం, చిన్న ఛాపెల్స్, సమాధులని నిర్మించాడు. దైవకృపతోనే అది రూపుదిద్దుకుంటోందని ఆయన నమ్మకం. కేథడ్రిల్ బయటి కొలతలు 20 బై 50 మీటర్లు. అంటే 8 వేల చదరపు మీటర్లు. డోమ్ సెయింట్ పీటర్స్ బసిలిక డోంని పోలి ఉండి, 12 మీటర్ల చుట్టుకొలత, 40 మీటర్ల ఎత్తు ఉంటుంది.
నేడు జెస్టో వయసు 95. నిత్యం ఉదయం ఆరుకి కేథడ్రిల్ పనిని ఆరంభించి సాయంత్రం నాలుగు దాకా పది గంటలపాటు కష్టపడి పని చేస్తాడు. ఆదివారాలు మాత్రం క్రిస్టియన్ మత నియమం ప్రకారం పని చేయడు. ప్రతీ ఆదివారం చర్చ్‌లోని మాస్‌కి హాజరవుతాడు. మొదటి 20 ఏళ్లు, అంటే 1981 దాకా ఇతను వొంటరిగా దీన్ని నిర్మించాడు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు కూడా ముందుకి వచ్చి నిర్మాణంలో సహాయం చేస్తున్నారు. ఇతని ఆరుగురు మనవలు డోమ్‌కి ఇనుప దూలాలని ఎత్తడానికి సహకరించారు. దీని నిర్మాణ సామాగ్రిని చెత్త డబ్బాల నించి ఏరి తెచ్చాడు. అనేక నిర్మాణ కంపెనీలు తమకి పనికిరాని కొంత నిర్మాణ సామాగ్రిని విరాళాలుగా కూడా ఇచ్చారు. సమీపంలోని ఇటుక రాళ్ల ఫేక్టరీ కూడా సహకరిస్తోంది. దీన్ని సందర్శించే వారు కూడా తమకి తోచింది ఇచ్చి వెళ్తూంటారు. లోపల సందర్శకులకి ఇటుకలు, కాంక్రీట్, వైర్ల చుట్టలు, ప్లాస్టిక్ బకెట్స్ మొదలైనవి చిందరవందరగా కనిపిస్తాయి. పైకి ఎక్కే మెట్ల మీద పంపు గొట్టాలని నిలవ చేశాడు. వాటి మీంచి కేథడ్రిల్ పైభాగానికి ఎక్కి మెజోరరా డెల్-కెంపోని చుట్టూ చూడచ్చు.
ఆ కేథడ్రిల్ నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుంది. 2017కల్లా పూర్తవవచ్చని ఆయన ఆశపడుతున్నా, 95 ఏళ్ల డాన్ జెస్టో జీవితకాలంలో ఇది పూర్తవకపోవచ్చు. ఇతని మరణానంతరం దీని పరిస్థితి ఏమవుతుందన్నది ఇంకా ప్రశ్నార్థకమే. తాము ఈ ప్రాజెక్ట్‌ని కొనసాగిస్తామని ఇంతదాకా ఎవరూ ముందుకి రాలేదు. జెస్టో ఇలా చెప్పాడు.
‘నా జీవితం మొత్తం ఈ పెద్ద కేథడ్రిల్ ద్వారా నాకు జన్మని ఇచ్చిన వారికి అంకితం ఇచ్చాను. నేను మళ్లీ పుడితే ఇంకో కేథడ్రిల్‌ని దీనికి రెట్టింపు సైజులో నిర్మిస్తాను’
నగర పురపాలక సంస్థ ఈ కేథడ్రిల్ ఉన్న వీధికి ఏంటోనియో గౌడి అనే పేరు పెట్టింది. నిజానికి దీని పేరే పెట్టాలి. కాని దీని నిర్మాణానికి అతను అనుమతులు కాని, ఈ కేథడ్రిల్ నిర్మాణానికి పోప్ అనుమతి కాని తీసుకోలేదు. కేథలిక్ చర్చ్ అనుమతి కానీ, ఆశీర్వాదం కాని ఈ కేథడ్రిల్‌కి లేవు. ఓ ఆర్కిటెక్ట్ ఈ నిర్మాణాన్ని చట్టం గుర్తించేందుకు సహకారాన్ని అందిస్తున్నాడు. 2005లో అక్వేరియర్ అనే సాఫ్ట్‌డ్రింక్ కంపెనీ ప్రకటనలో ఈ కేథడ్రిల్‌కి పబ్లిసిటీ రావటంతో స్పెయిన్ వాసులందరికీ దీని గురించి తెలిసింది. ఆ ప్రకటనలలో ఈయన పాల్గొన్నాడు.
ఇది పర్యాటక కేంద్రం అయ్యే అవకాశం ఉందని కొందరు స్థానికులు భావిస్తూంటే, మరి కొందరు అనుమతి లేని దీన్ని కూలగొట్టాలని వాదిస్తున్నారు. 2006లో డిస్కవరీ ఛానల్ దీని మీద ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. మళ్లీ 2009లో కేథడ్రిల్ అనే డాక్యుమెంటరీ సినిమాని ఓ ఫ్రెంచ్ - ఇటాలియన్ సినిమా దర్శకుడు తీశాడు. ఆయన మేడ్రిడ్‌కి ఓ సినిమా స్క్రిప్ట్ రాసుకోడానికి వచ్చినప్పుడు ఈ కేథడ్రిల్ గురించి తెలిసి దీన్ని సందర్శించాక దీని మీద డాక్యుమెంటరీని తీయాలని సంకల్పించాడు. దీంట్లో జెస్టో పాత్రని అతనే నటించడం విశేషం.

పద్మజ